Friday, October 7, 2016

కాలం తెచ్చిన మార్పు 'కాలం ఎవరి కోసం ఆగదు. కాలం ఒక ప్రవాహం. చెత్తా చెదారం అన్నీ కలిసి కాలం నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. తన అవసరాలను అనుసరించి మనిషి కాలం తెచ్చే మార్పులను మంచివి, చెడ్డవి అని నిర్వచిస్తుంటాడు. కాలానికి నిర్వచనాలతో పని లేదు. మార్కండేయులు జీవితంలో కాలం తెచ్చిన మార్పులు ఎన్నో!...' తనకు ఆసరా అయిన వారికి తాను ఆసరా అయ్యే అవకాశం వచ్చినా చేయూత నివ్వలేకపోయిన క్రమాన్ని గుర్తు చేసుకున్నాడు మార్కండేయులు. జ జ జ జ అది పల్లెటూరు. పాతకాలం పెంకుటిల్లు. ఇంటి ముందు పాత పందిరి. ఆ ఇంటి వయసును బట్టి ఆ కుటుంబం ఏనాటిదో తెలిసిపోతుంది. కుమ్మరి చేసిన గూనలు అరిచేయికన్నా వెడల్పు. కనీసం ఎనభైఏళ్ళనాటి గూన. అక్కడక్కడ ఊర్పులు సర్దిన కొత్త గూన చిన్నగా చాలిచాలకుండా ఉంది. ఒకవైపు గానుగ కొట్టం పట్టించుకునేవారు లేక శిథిలమౌతున్నది. గానుగ మొద్దు దుమ్ము పట్టి నల్లగా బీడుపడినట్లుగా ఉంది. గానుగ కొట్టంలో ఓ మూలకు చొప్ప, గడ్డి, పాతవి, విరిగినవి అవీఇవీ పడేసి ఉన్నాయి. పందిరికి పారిన కూరగాయల తీగలు ఎండిపోతున్నాయి. పందిరిమీది తాటికమ్మలు ముట్టుకుంటే పొడిపొడి అయ్యేట్టు ఉన్నాయి. వేపాకు పడి పందిరి కూడా పాడుబడినట్టుంది. ఇంటిముందటి వేపచెట్టు చల్లగా అహ్లాదకరంగా గాలివీస్తోంది. ఇంటిపక్కన తుమ్మచెట్టు, దడి అనాధలా కనిపిస్తోంది. గిన్నెలు కడిగే జాలాది దగ్గర కుక్క గతుకుతోంది. పెంటను కోళ్ళు తవ్వుతూ కోడిపిల్లలకు చూపిస్తున్నాయి. భూమయ్య మనుమలు ఇంటిముందు ఆడుకుంటూ అరుస్తున్నారు. చాలా కాలం తర్వాత మార్కండేయులు పెద్దమ్మ ఇంటికి పనిగట్టుకొని వచ్చినట్టున్నాడు. పెదనాన్న భూమయ్యతో అవి ఇవీ మాట్లాడుతున్నాడు. భూమయ్య నులక మంచంలో ఒరిగి వింటున్నాడు. కుక్కి కుర్చీలో కూర్చుని ముందుకు వంగి మార్కండేయులు ఏదో అడుగుతున్నాడు. పశువుల మంద ఇంటిముందునుంచి ఊళ్ళోకి వస్తున్నట్టుంది. నాలుగైదు మేకలు అరుచుకుంటూ వాటివెనుకే పరిగెడుతున్నాయి. గొల్లాయన నిన్నపుట్టిన మేకపిల్లని మెడపై వేసుకొని వాటివెనుక నడుస్తున్నాడు. ''ఏం మామా! మంచిగున్నవా? ఈ కొడుకెప్పుడచ్చిండే? బాగరోజులకచ్చి నట్టుండు'' అంటూ గొల్లాయన భూమయ్యను పలకరించాడు. మార్కండేయులుకు నమస్కరించాడు. ''అవురా... ఆనికి ఎక్కన్నో నౌకరాయె. సెలవులు దొరకయాయె. దొరికినా పెండ్లాం రానిస్తాదిరా. ఈ కాలం కోడండ్లకు సుట్టాలద్దు. బంధువులద్దు. సడేగా ఒంటిగ తినాలని అనుకుంటరు. ఎట్లెట్లనో గింత కాలానికి ఇయ్యాల పొద్దునచ్చిండు వీడు'' అంటూ భూమయ్య తన సడ్డకుని కొడుకైన మార్కండేయులుకేసి సాభిప్రాయంగా చూశాడు. నువ్వు మరిచిపోయినా ఊరువాళ్ళు నిన్ను మరిచిపోరు అన్నట్టు నవ్వాడు భూమయ్య. గొల్లాయన మేకలనదిలించుకుంటూ ముందుకు సాగిపోయాడు. వాడకం కల్లు బింకులు కావడికేసుకుని గౌడు చరచరా నడుస్తున్నాడు. ''చిన్నాయినా! కొడుకచ్చినట్టున్నడు. కోడలుతోటి కల్లు బింకి పంపుమంటవా?'' అంటూ పలకరించాడు గౌడు. ''ఈడు తాగడని నీకు తెల్వదా? కోడలు ఈనడుమ మా ఇంటికి వత్తనేలేదేమిరా? ఎందుకత్తరు గనీ. మునుపటితీరుగ పాలున్నయా? పెరుగున్నదా? మంచినూనె గానుగ నడుస్తున్నదా? ఊరు దూరమైతంది. కాడు దగ్గరయితంది. ఇప్పుడు ఈ ముసలోల్లు ఎవలకు పట్టిరా?'' వేదాంతిలా అన్నాడు భూమయ్య. ''అట్లెందుకే చిన్నాయినా! ఈ కాలం పొలగాండ్లకు ఏమెరుక? ఇప్పటికి నీతీరుగ ఎవుసం ఎవలు చేస్తరే?'' అంటూ నవ్వుకుంటూ సాగిపోయాడు గౌడు. భూమయ్య, మార్కండేయులుతో మళ్ళీ ముచ్చట్లలో పడ్డాడు. ''ఏదో మొహమాటానికి అందరు గట్లనే అంటరు. నువ్వు చూస్తున్నవు గదరా. మా బతుకెట్లయిపోయిందో! ఎవుసం చేసుడంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. ఇప్పుడు బుద్ది వచ్చి ఏం లాభం? మా బతుకులు ఆగమైపాయె. మా కొడుకుల బతుకులు ఆగమైపాయె. మనవల బతుకు మీద ఆశే లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనవల బతుకులు కూడా పురికట్టకుండా అయిపోయింది. ఎవుసం గంగల వోను. అది ఎన్ని భ్రమలు పెట్టింది! మనిషిని ఎటు కదలనీయకపాయె. ఎటు పోనీయకపాయె. పంట పండంగనె ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం కలిగె. ఆఖరుకు సూస్కుంటేముంది? ఎందరో కండ్లముందట పోరగాండ్లు మంచిగైపోయిండ్రు. మాలమాదిగలు కూడా మంచిగ సదువుకునిరి. కొలువులు చెయ్యవట్టిరి. తెల్లబట్టలెయ్యవట్టిరి. మస్కట్‌, దుబాయ్‌ పోవట్టిరి. ఏమిలేనోల్లు ఏపాటిగాళ్ళు అనుకున్నోళ్ళు గూడా సూస్తుండగనే బంగ్లాలు కట్టిరి. మా పొలగాండ్లు గిట్లయిపోయిరి...'' భూమయ్య వేదాంత దోరణిలో వైరాగ్యంతో చెప్పుకపోతూనే ఉన్నాడు. పెద్దనాన్న చెప్తున్నది ఊ కొడుతూ వింటున్నాడు మార్కండేయులు. పాత కుక్కి కుర్చీలో వెనక్కి తలవాల్చిన మార్కండేయులుకు ఆ మాటలు అప్పుడప్పుడు హృదయంలో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. పెదనాన తనను చూసి అసూయ పడుతున్నాడో, తిడుతున్నాడో అని చలించిపోయాడు. పెదనాన్నను ఎదిరించి ఏమి మాట్లాడలేడు. అది తన బలహీనత. అదే తన వినయం. అదే తనను అందరు ఆదరించడానికి, గౌరవించడానికి కారణం కూడా. మార్కండేయులుకు పెదనాన్న మాటలు విన్పించడంలేదు. తన గతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు గడిచి ఈ స్థాయికి చేరుకున్నాడో అన్నీ కళ్ళముందు గిర్రున తిరిగాయి. ఎందుకో కనుకొలుకుల్లో నీరు... బరబర చప్పుడు చేసుకుంటూ ట్రాక్టర్‌ మీదపడ్డట్టే వస్తూ ఇంటిముందు నుంచి వెళ్ళిపోయింది. రెండు ముసలి ఎడ్లను అదిలించుకుంటూ ఎవరో భూమయ్యను పలకరిస్తూ ముందుకు సాగిపోయారు. అకస్మాత్తుగా నిశ్శబ్ధం... పెదనాన్న భూమయ్య వెక్కివెక్కి ఏడవడం వినిపించి ఉలిక్కిపడి చూశాడు మార్కండేయులు. వెల్లికల పాత నులక మంచంలో పడుకున్న పెదనాన్న కళ్ళలోని నీళ్ళు చెవుల వెంట వెచ్చగా కారుతున్నాయి. ''ఇప్పుడేమయిందని పెదనాన్న! పిల్లలు అందరు మంచిగనే ఉన్నారు గదనే. నీకు పానం మంచిగనే ఉంది గద. ఎందుకేడుస్తున్నవే!'' అంటూ ఊరడిస్తూ తన కళ్ళు తుడుచుకుని పెదనాన్న కళ్ళు తుడిచాడు మార్కండేయులు. పెదనాన్న బాధ తనకు తెలుసు. కాలం ఇలాంటి మార్పులు తెస్తుందని ఎవరికి తెలుసు? తాను పెదనాన్న ముందు బరిబాతల తిరిగినోడే. తన చిన్నతనంలో తనకు పెదనాన్న కుటుంబమే ఆదర్శం. స్ఫూర్తి. పెదనాన్న గురించి అమ్మమ్మ ఎన్ని కథలు చెప్పిందో. పెద్దమ్మ అదృష్టవంతురాలని ఎంతగా సంతోషించేదో. అమ్మను చూసి అమ్మమ్మ ఎప్పుడూ బాధ పడేది. అమ్మ బతుకు ఇలా అయిందని ఏడ్చేది. ఏదో దగ్గర సంబంధమని ఇస్తే దాని బతుకు ఇట్లయిపోయిందని ఏడ్చేది. పెద్దమ్మ భర్త పెదనాన్న తనకు నాన్నకన్నా ఎక్కువ. అది ఎలా జరిగిందో... వాళ్ళకు మంచి వ్యవసాయం, పాడి ఉండడం పండుగలకు, చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా పెద్దమ్మ ఆత్మీయంగా పిలిచేది. అమ్మతోపాటు తాను వాళ్ళింటికి సంతోషంగా వెళ్ళేది. నాన్న అలా వెళ్ళడాన్ని విమర్శించేవాడు. అమ్మతో ఆ విషయంలో ఎప్పుడూ పోట్లాట జరిగేది. అయినా అమ్మ తన పంతం నెగ్గించుకునేది. పెద్దమ్మ తనను సొంత కొడుకులా చూసుకునేది. చెల్లెలు కాస్త తక్కువ బతుకుతుందని పెద్దమ్మకు జాలి. అది తనమీద ప్రేమగా ప్రవహించింది. పెద్దమ్మ పెదనాన్నల కుటుంబం, ఇల్లూ, జీవితం తనకొక ఆదర్శంగా ఉండేది. తన నిరాశ నుండి బయటపడటానికి అది ఎన్నిసార్లు తనకు ఉత్తేజాన్నిచ్చిందో. అందుకే పెదనాన్నంటే అపారమైన గౌరవం. అప్పుడప్పుడు చిల్లరకంటూ పైసలిచ్చేవాడు. ఏ పంట వస్తే ఆ పంట ధాన్యం కొంత పంపించేవాడు. అప్పుడప్పుడు తానే స్వయంగా తెచ్చి ఇంట్లో ఇచ్చివెళ్ళేవాడు. పెదనాన్నకు తెలియకుండా పెద్దమ్మ కూడా ఎంతో సాయం చేసేది. పైసల లెక్కలన్నీ పెద్దమ్మే చూసుకునేది. పెదనాన్న బోలా మనిషని ఉద్దెర ఇస్తడని, మళ్ళ అడగడని పెద్దమ్మ పెద్దనోరు చేసుకునేది. పెద్దమ్మ నోటికి పెదనాన్నే కాదు, ఊరోళ్ళు కూడా భయపడతారు. బస్సెక్కితే పెదనాన్నకు కూడా పెద్దమ్మే టికెట్‌ తీసుకునేది. పెదనాన్నకు పైసల లెక్క రాదని ఎక్కువిస్తడని, చిల్లర మరచిపోతడని అంటుండేది. ఎప్పుడూ బొడ్లో సంచి, తాళంచెపులు, నొసట పెద్ద బొట్టుతో నిండుగా ఉండేది. పెద్దమ్మను చూస్తే ఎవరికైనా అపారమైన గౌరవం. పైగా తమను అన్నివిధాల ఆదుకోవడం వల్ల నాన్న కన్నా ఎక్కువ గౌరవం కలిగేది. ఇలాంటి వాటివల్లే తనకు, అమ్మకు నాన్నంటే లెక్కలేకుండా పోయిందేమో. నాన్న ఎప్పుడూ అవమానాలు దిగమింగుతుండేవాడు. గౌరవం లేని ఇంట్లో ఉండలేక ఇతర ప్రాంతాలకు పని వెతుక్కుంటూ రోజుల తరబడి, నెలల తరబడి వెళ్ళేవాడు. అమ్మ పోతేపో అన్నట్టు నిర్లక్య్షంగా మాట్లాడేది. తల్లిగారి బలగం చూసుకుని అమ్మ నాన్నని ఎప్పుడూ కించపరుస్తూ ఉండేది. నన్ను నీకిచ్చి మావోళ్ళు నా బతుకు బండలు చేసిండ్రు అని నాన్నను తిట్టేది. అప్పుడు తనక్కూడా నాన్నమీద కోపం. అమ్మ అభిప్రాయమే తన అభిప్రాయంగా వ్యక్తిత్వం పెరుగుతూ వచ్చిందేమో. నిజానికి పెదనాన్న కన్నా నాన్న ఎంతో కష్టపడేవాడు. అమ్మకన్నా పెద్దమ్మ ఎంతో కష్టపడేది. ఉదయం నాలుగ్గంటలకే లేచి పెరట్లోని పశువుల కసువు తీసి పాలు పిండి, అలుకు చల్లి, ముగ్గులు వేసేది. తెల్లారేసరికి మక్క గడక, జొన్నంబలి, అనుప పప్పు వండేసేది. పెదనాన్న రాత్రి నాలుగ్గంటలకే లేచి నూనె గానుగు కట్టేవాడు. పిల్లలను మసుకులనే నిద్ర లేపి పని పురమాయించేది పెద్దమ్మ. పాలు మందిండ్లల్లో ఇచ్చిరావడం, పొలం కాడికి పోవడం, గడ్డి కోసుకురావడం, బర్లను మేపడం, మందకు కొట్టడం, నీళ్ళు చేదడం వంటి ఎన్నో పన్లు చెప్పేది పెద్దమ్మ. అమ్మ చెప్పిన పనులన్ని వాళ్ళు చేసేవారు. తాను వాళ్ళవెంట వెళ్లేవాడు. అన్నలిద్దరూ మంచి ఆటగాళ్ళు, పాటగాళ్ళు. వాళ్ళు ఎన్నో తత్వాలు పాడేవాళ్ళు. పెరట్లో జానపద, శృంగార పాటలు పాడుతూ నవ్వించేవాళ్ళు. తెలిసిన ఆడపిల్లలు ఎదురైనప్పుడు ఆ పాటలు పాడి పరాచికాలాడేవారు. హేళన చేసేవారు. ఆడవాళ్ళు కూడా అలాగే ప్రవర్తించేవారు. పెదనాన్న, పెద్దమ్మల ముందు ఏమి తెలియని అమాయకుల్లా నటించేవాళ్ళు. నాన్నతో పొలిస్తే అమ్మ ఏ పనీ చాతకాదని పని తప్పించుకునేది. అన్ని నాన్నో, తానో చేసేవాళ్ళు. తమకు వ్యవసాయం లేదు. పాలిచ్చే పశువులు గాని, పాడి గాని లేవు. నాన్న ఒకసారి బర్రెను కొంటానంటే అమ్మ వద్దని ఇంతెత్తు ఎగిరింది. నాన్న మీ అక్క మూడు బర్లు సాదుతున్నది. నీకేమైంది అని తిట్టేవాడు. పొలగాడు పాలు తాగుతడు కదా అని ఎంత చెప్పినా ససేమిరా అంది అమ్మ. అమ్మతో నాన్న జీవితమంతా విసిగిపోయాడేమోనని ఇప్పుడనిపిస్తుంది. అప్పుడు నాన్న అనే గౌరవం ఉండేది కాదు. అమ్మ కల్పించిన ఈ అగౌరవం అలాగే కొనసాగుతూ వచ్చింది. తాను పెదనాన్నను బాగా గౌరవించడం కూడా నాన్నకు గిట్టేది కాదు. సంపద చూసి ఓర్వలేనితనం అని అమ్మ వ్యాఖ్యానిస్తే అది నిజమేనని తన చిన్నతనంలో అనుకున్నాడు. కాని నాన్న అమ్మ వల్ల ఎంత కుమిలిపోయాడో. కొన్ని విషయాలు వయసు పెరిగిన మీదట అనుభవాలు కలిగిన తర్వాత మాత్రమే అర్థమవుతాయేమో. కష్టాలు తీరి తాను సంపాదనపరుడయ్యాక నాన్న ఆ సుఖానికి కూడా ఎక్కువ కాలం నోచుకోలేదు. తనను ఆ విషయం ఇప్పటికీ బాధిస్తుంది. అమ్మకు ఆ బాధ ఉన్నట్టు కూడా లేదు. అమ్మలు కొడుకులను చూసుకొని మురుసుకుంటూ భర్తలను నిర్లక్షం చేస్తారేమో. అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసి చేయగలిగేది లేదు. పెద్దింటి నుంచి సంబంధం చేసుకోవడం ద్వారా నాన్న ఎంత నరకం అనుభవించాడో. తనకు ఇప్పుడు తెలిసి వస్తోంది. చదువుకున్న అమ్మాయి కావాలని పట్టుపట్టి పెళ్ళి చేసుకుంటే తన బతుకు నాన్న బతుకులాగే అయిపోయింది. ఆమె రెండో తరం మధ్యతరగతి నుండి పుట్టిపెరిగిన పిల్ల. తాను మొదటిసారిగా చదువుకుని ఎదిగినవాడు. తమ ఇంట్లో తన తండ్రికి కూడా గౌరవం లేని విషయం ఆమెకు ఎవరు చెప్పాల్సిన పని లేకుండా పోయింది. తమ మీద ఆధారపడే అమ్మంటే ఆమెకు అలుసై పోయింది. నాన్నను అమ్మ ఎలా ఈసడించేదో కోడలుతో అమ్మ తాను అదే ఈసడింపు, అవమానం అనుభవించాల్సి వస్తుందని ఎవరూ ఊహించని విషయం. అది అర్థమయ్యేసరికి కాలం గడిచిపోయింది. ఇద్దరు పిల్లలయ్యారు. తాను అమ్మకన్నా అత్తామామలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన దుస్థితిలో కూరుకుపోయాడు. ఆమెను అదలించే వారే లేరు. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. పెద్దమ్మ, పెదనాన్నలకు చెపితే వాళ్ళు కొన్నిసార్లు చెప్పిచూశారు. చివరకు అనిత వాళ్ళ మీదికి తిరగబడింది. మీరెవరు చెప్పడానికి అని భారతం విప్పింది. మీ పిల్లలను చదివించుకొని ఎదిగించడం చాతకాలేదు కాని ఇతరులకు చెప్పడానికొచ్చారా అని అనరాని మాటలు అంది. వాళ్ళకు మనసు విరిగిపోయింది. అనిత కోరుకున్నది కూడా అదే. ఆమె తన బంధువులందరిని దూరం చేస్తూ వచ్చింది. కాని తాను పెదనాన్నను వదులుకోదల్చుకోలేదు. అనిత రాకపోయినా తాను వారింటికి వస్తూపోతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు తన రాక పెదనాన్నకు సంతోషం కలిగిస్తుందనుకున్నాడు. కాని తన వల్ల వాళ్ళకు లేనిపోని బాధ కలుగుతుందని ఇప్పుడనిపిస్తోంది. మరిచిపోయిన విషయాలను తాను గుర్తుచేస్తున్నాడేమో. ఎవరి బతుకు వారు బతికినప్పుడు హాయిగానే ఉంటుంది. కాని ఇతరులతో పోల్చుకున్నప్పుడే నరకంగా కనిపిస్తుంది. కాని వారిని వదులుకోవడం కృతజ్ఞత లేని వాణ్ణవుతానేమోనని తనకే ఒక కాంప్లెక్స్‌. లేదా వారిని చూడకుండా ఉండలేని బలహీనత. అది తన కలలసౌధం. అదిప్పుడు శిథిలమౌతోంది. డెబ్భై ఏళ్ళు దాటిన పెదనాన్నకు కాయకష్టం తప్పడం లేదు. కొడుకుల మీద, మనమల మీద రంది తప్పలేదు. పరిస్థితులు కూడా అలాగే మారిపోయాయి. అయినా సముదాయించాలనుకున్నాడు మార్కండేయులు. ''అట్లగాదే పెదనాన్న... మీరు నూనె గానుగలు బందు పెట్టిన్నుంచి శని పట్టుకుంది. అటు గానుగ, ఇటు వ్యవసాయం పాడి కలిపి నడిపినప్పుడు మన ఇంటినిండా ఎంత కళ! బర్లు, ఎడ్లు, పాలు, పెరుగు, నూనెకని, తెలక పిండికని ఎంతమంది మన ఇంటికి వచ్చేవాళ్ళో. నూనె బేరం మీరు ఇడ్సిపెట్టుడే తప్పయిందే...'' అంటూ తనకు అసలు కారణాలు తెలిసినప్పటికీ వేరే కారణాలు చూపి ఊరడించాడు. పెదనాన్న భూమయ్యకు వాడు ఏమంటున్నాడో తెలుసు. ఎందుకు అంటున్నాడో కూడా తెలుసు. ఇది కొత్తకాదు. పాత చర్చే. ''ఇడ్సిపెట్టక ఏంజేయమంటవురా! నువ్వుల నూనె పిరమని బందువెట్టి అందరు పల్లినూనెకు ఎగవడిరి. అంత తక్కువ ధరకు గానుగ గట్టిన నువ్వుల నూనె ఎట్ల ఇయ్యస్తదిరా? పల్లి నూనెకు గిర్నీలు పెట్టిరి. కరెంటుతోని, ఇంజన్‌ తోని పల్లిగిర్నీ నడిపి నూనె తీసిరి. మనకేమో ఎడ్లు దున్నపోతుల ఖర్చు ఎక్కువాయె. లారీల కొద్ది పల్లినూనె తీసిరి. అగ్వకు అమ్మిరి. పల్లి నూనె పైత్యం చేస్తది నువ్వుల నూనెనే మంచిదని అనుకుంటనే ఉన్నరు. కాని అందరు పల్లినూనెకు అలువాటయిరి. వాళ్ళు లారీలతోటి నూనె దించితే మనం ఎడ్లబండి మీద నూనె పట్టుకొని ఎన్ని ఊర్లని తిరుగుతం. వాళ్ళతోని పోటీపడుడు ఎట్లయితదిరా!'' భూమయ్య జ్ఞాపకాలు గతంలోకి వెళ్ళాయి. వెనుకటి కాలంలో పల్లి పంట తక్కువ. నువ్వు పంటే ఎక్కువ. వంటకు, తలకు నువ్వుల నూనెనే. తెలకపిండి వేడివేడిది బెల్లం ముద్దతో కలిపి తింటుంటే ఎంత కమ్మగా ఉండేదో. ఆ రుచి దేనికుంటుంది. నూనె గానుగులో నూనె ఊరుతున్నకొద్దీ వేడివేడి ఆవిర్లు ఎంత కమ్మని వాసనో. అన్నం తిన్నంత తృప్తి. ఆ కమ్మటి వాసన కోసం పిల్లలు గానుగ రాట ఎక్కుడు. గానుగ చుట్టూ ఎంతలొల్లి. నూనె పీపాలకు ఎత్తీ ఎత్తక ముందే మెత్తని తెలకపిండి తవ్విపెట్టమని ఎంత అల్లరో. తెలకపిండి తవ్వే ఇనుప గడ్డపార, వెండి గడ్డపారలాగా తళతళా మెరిసేది. తెలకపిండి తిని తమ బర్లు బాగా పాలిస్తున్నాయని నునుపు తేలి ఎడ్లు కూడా మెరుస్తున్నాయని ఊరివాళ్ళకు ఎంత ఈర్ష్యో. ఆ పటాటోపమంతా ఎక్కడవోయిందో. గానుగలతోపాటు పాడి. పాడికి తెలకపిండికి, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం పెనవేసుకుపోయింది. మక్కలు, జొన్నలు పండిస్తే చొప్ప ఎక్కువ వస్తుందని వాటినే పండించేవారు. వ్యాపారపంటలు లాభం వచ్చినా పండించేవారు కాదు. గానుగ తిప్పే ఎడ్లే వ్యవసాయానికి ఉపయోగపడడం వల్ల తమకు ఇతరుల కన్నా అన్ని విధాలుగా ఖర్చు కలిసివచ్చేది. తెలకపిండి, పాలు, పెరుగుతో పిల్లలు ఎంతో నునుపుతేలి నూనె సమరుతో ఎంత అందంగా ఉండేవాళ్ళో. నల్లగా చూడచక్కగా నిగనిగలాడేవారు. ఎనుకట పైసల పుట్టుక తక్కువ. నూనెకు, తెలకపిండికి ధాన్యాలో, నువ్వులో ఇచ్చేవాళ్ళు. దాంతో ఏదీ కొనకుండానే ఏడాదంతా గడిచిపోయేది. ఇప్పుడా రోజులు ఏమైపోయాయి? అన్ని కొనాల్సి వస్తుంది. తాను పిల్లలను చదువుకు పంపించలేదని కాదు. ఇటు వ్యవసాయం, బర్లు, గానుగలు చూసుకుంటూ చదువుకునేసరికి వాళ్ళ చదువు మధ్యలోనే ఆగిపోయింది. చదివి నౌకర్లు చేసేదుందా అని చేసుకునేంత పని ఇంట్లోనే ఉందని చదువుపట్ల అశ్రద్ధ పెరిగిపోయింది. తరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కొడుకులు గల్ఫ్‌ బాట పట్టి అటు ఇంటికి కాకుండా, ఇటు దేనికి కాకుండా పోయారు. మనవలది అయ్యలు లేని ఉయ్యాల. కోడండ్లు అక్కడ్నించి కష్టపడి పంపించిన పైసల్తోటి పనిమీద అశ్రద్ధ. అలా మనవల సదువులు కూడా అంతపూర్తిగానే సాగుతున్నాయి. ఎవర్ని ఏమన్నా కోపమే. ముసలోడా ఉన్నకాడ ఉండక ఎందుకు మాట్లాడుతున్నా వంటారు. నువ్వేదో సంపాదించి పోసినట్టు, మేమేదో కూసుండి తిన్నట్టు, చెడిపోతున్నట్టు లావు మాట్లాడుతున్నవేంది అని ఒకటికి నాలుగు మాటలు అని నోరు మూయిస్తారు. చూస్తూ ఊరుకోబుద్ది కాదు. కాలం గిట్లా ఎందుకు మారిపోయింది. ''పెదనాన్నా! కాలంతో పాటు మారాల్నే. కాలం ఎప్పుడూ ఒక్కతీరుగ ఉండదు. మోటబొక్కెనలు, ఏతాలు, రాటు బొక్కెనలు పోయి కరెంటు మోటర్లు రాలేదా? అందరు వాటికి అలవాటు కాలేదా? హైబ్రిడ్‌ విత్తనాలకు, ఎరువులకు అలవాటు కాలేదా? ఎడ్ల నాగండ్లు పోయి టాక్టర్‌తోటి దున్నించుడే నడువవట్టె. మునుపటి వ్యవసాయం అట్లనే ఉందా? అనుములు పోయి కందులు వచ్చె. ఆముదాలు, నువ్వులు పోయి పల్లి వచ్చె. తోటమిర్చిపోయి గాలి మిర్చివచ్చె. ఎర్రవడ్లు, నల్లవడ్లు, గరుకలు, సాంబ్రాలు పోయి బిపిటీలు, హెచ్చెమ్టీలు, హంసలు, బందర్లు వచ్చె. వ్యవసాయ పంటలు పోయి పత్తి, మిర్చి, వంటి వ్యాపార పంటలు పెరిగె. ఇంట్ల కట్టెల పొయ్యి పోయి గ్యాస్‌ పొయ్యిలు వచ్చె. కంచు ఇత్తడి గిన్నెలు పోయి స్టీలు, అల్యూమినియం గిన్నెలు వచ్చె. అంబలి తాగుడు పోయి చాయ తాగుడు వచ్చె. మునుపు దీపం ముట్టిచ్చి తిని పడుకుందురు. కరెంట్‌ వచ్చినంక రాత్రి దాకా ఉండవట్టిరి. ఇప్పుడు మునుపటి తీరుగ మసుకుల నాలుగ్గంటలకు ఎవలు లేస్తున్నరు. కాటన్‌ బట్టలు పోయి పాలిష్టర్‌ వచ్చె. దోతులు, పంచెలు పోయి ప్యాంట్లు, షర్ట్‌లు వచ్చె. గోచి చీరెలు పోయి ఆరుగజాల చీరెలచ్చె. ఇట్ల ఎప్పటికప్పుడు మారుతనే ఉన్నది. మునుపు రెండు గంటలు కూడా నడుసుకుంట పోయేది. ఇప్పుడు అద్దగంట దూరానికి గంటసేపు బస్సుకోసం చూస్తున్నరు. కాలం మారుతున్నది. దాని వెంట ఉరుకాలె. లేకపోతె వెనుకబడిపోతం''. ''నువ్వన్నది నిజమేరా. అవన్నీ చేసినా మాకేమి గిట్టుబాటయింది? పెట్టుబడి ఎల్లకుంటయితుంది''. ''పెదనాన్నా! మార్పు అన్నిట్లల్ల వస్తున్నది. అది గమనించాలె. కాలి నడక పోయి సైకిళ్ళు వచ్చె. ఎడ్ల బండ్లు వోయి జీబులు కార్లు వచ్చె. సాతాని పంతులు బడిపోయి సర్కారు బడులచ్చె. నైజాం రాజ్యం పోయి స్వాతంత్రం వచ్చె. ఊరూరికి రోడ్లు వచ్చె. ఇట్ల అన్నిట్లల్ల మార్పులు వచ్చినయి. ఎనుకట మనకేం తక్కువైంది, జీతం చేసుటానికి అనుకున్నరు. అప్పుడు జీతం తక్కువుండె. నౌరుజేసుడు పరువు తక్కువ. ఇప్పుడు ఎంతున్నా నౌకరు కోసం ఎగబడుతున్నరు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్న ఊరు, తల్లిదండ్రులను వదిలి అమెరికా పోవట్టిరి. తరాల తరబడి తిన్నా తరగనంత ఆస్తి ఉన్నోళ్ళు కూడా అదే బాట పట్టిరి. ఇట్ల అన్ని మారుతున్నయే''. అనునయించాడు మార్కండేయులు. ''చెరువు నీళ్ళు చెరువెనుక పడ్డంక ఏం లాభం? అయిపోయినంక తెలిస్తే ఏమిటికి వచ్చె. బతుకు గిట్లయిపాయె. ఇవన్ని చూసెటందుకే దేవుడు బతికిస్తుండా?'' ''అట్లెందుకంటవే పెదనాన్నా! ఇరువై మంది బలగం కొడుకులు, కోడండ్లు, మనవలు అందరు కండ్లముంగట ఉండుడు ఎంతదృష్టం? ఇప్పుడు అమెరికా పోయి సంపాయిస్తున్నరు కాని ఒకరికొకరు కలుసుకోవడానికి ఎంత తిప్పలు? ఎంత ఖర్చు? కొడుకొక చోట, కోడలొక చోట, తల్లిదండ్రులు, ఆడబిడ్డలు ఒకచోట... ఇట్ల ఉమ్మడి కుటుంబాలు కనబడకుంటయి పాయె. కష్టాలల్ల ఎవరు దగ్గరుంటరు? ముసలితనంల ఎవరు సేవ చేస్తరు? ఎంత సంపాయించి ఏం లాభం? మిమ్ముల చూస్తే కడుపు నిండుతది. అందరు ఒక్కకాడ ఒకరికొకరు ఆసర అయితరు.'' ''ఆ... గదొక్కటే సంతోషంరా! అంతకు మించి సంపాదించిందేముందిరా'' అంటూ వాపోయాడు. మార్కండేయులు కలిసి జీవించడంలో ఉండే సౌఖ్యం కోల్పోయి ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఒంటరి జీవితం ఎంత భయంకరమో! అమ్మ కూడా తనతో లేదు. ఏ బంధువులూ ఇంటికిరారు. ఎంత సంపాదించినా అనితకు తృప్తిలేదు. జీతం రాగానే లెక్కలడుగుతుంది. పెద్దమ్మ లాగే అన్నిటికీ తానే ముందు పడుతుంది. తన మాట ఏదీ సాగనివ్వదు. పాకెట్‌ మనీ ఇంతే చాలని కట్టడి చేస్తుంది. స్నేహితుల మధ్య చాలా అవమానంగా ఉంటుంది. మీ హోం మినిష్టర్‌ పర్మిషన్‌ ఇయ్యలేదా! అని హేళన చేస్తుంటారు. అమ్మ, అక్క, చెల్లెలు అందరు కలిసి ఎంతకాలమైందో! వాళ్ళు ఇంటికి వస్తే నాలుగు రోజులు నరకం చూపిస్తుంది. అదంతా గుర్తుచేసుకుంటూ అన్నాడు మార్కండేయులు. ''పెదనాన్నా! జీవితం అంటే కలిసి జీవించడం. సంపాదన కోసం జిల్లేడు పత్తి పగిలి గాలికి పోయినట్టు ఎక్కడికెక్కడికో పోయి సంపాదించి ఏం జేస్తరు? ఎవరికి కాని బతుకు ఎందుకు పెదనాన్న. మీకు అన్నీ లేకపోయినా ఎంత హాయిగా ఉన్నరు. పైసలున్నోళ్ళు ఇంత సుఖంగా తృప్తిగా బతుకుతున్నరా?'' ''నువ్వన్నది నిజమేగని, ఈ కాలంల అన్ని కొనుడు గావట్టె. దానికి పైసలు సంపాదించాలెనాయె. పైసల కోసం ఎక్కడికో పోవుడాయె'' అంటూ పెదనాన్న భూమయ్య కళ్ళు మూసుకున్నాడు. మార్కండేయులు వచ్చిన పని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. వేపచెట్టు చల్లగా ఊగుతోంది. మంచం కిందికి చేరిన కోడిపిల్లలు కుక్కురు.. కుక్కురు మంటున్నాయి. కుక్క తోకాడించుకుంటూ పెదనాన్న కాళ్ళదగ్గర చేరింది. పిల్లలు ఆడుకుంటూ అరుస్తున్నారు. బీడీల ఆకు కత్తిరిస్తున్న చప్పుడు వినబడుతున్నది. ఎవరో బర్లు తోలుకుపోతున్నారు. మార్కండేయులు పెదనాన్నకు ఆ విషయం అసలు చెప్పాలా, వద్దా అని ఆలోచనలో పడ్డాడు. ఎటూ తేల్చుకోలేకపోయాడు. తాను సుఖంగా బతుకుతున్నాడని అనుకునే బ్రమలన్నీ తొలగించాలా? అలాగే ఉంచాలా...? అనితకు, తనకు రోజురోజుకు దూరం పెరుగుతున్నది. అమ్మ మనవద్ద ఉండవద్దంటుంది. అంత కష్టపడి పెంచిన అమ్మ ఇంట్లో ఉండవద్దట. ఈ కొట్లాటలు చూసి అమ్మ తన ఊరికి పోయి ఒక్కతే వండుక తింటున్నది. అమ్మను ఏకాస్త సుఖపెట్టలేని ఈ జీవితం ఎందుకు? అనిత అసలే వినదు. విడిపోక తప్పదనిపిస్తోంది. కారణాలు అడిగితే ఏం చెప్పడం? అన్ని చిన్న చిన్న విషయాలు. కాని వాటిమీద పెద్దపెద్ద రాద్ధాంతాలు. అనిత తన జీతం తానే ఉంచుకుంటోంది. ఆమె తనకు ఇష్టమైనట్టుగా జీవిస్తోంది. ఏమైనా అంటే నీ తీరు నేను కూడా ఆఫీసులో పనిచేసి అలసిపోయి వస్తున్నాను. నాకు చాతకాదు. చేసుకో అంటుంది. చివరకు తన చాయ తానే పెట్టుకుంటాడు. తన పక్కబట్టలు తానే వేసుకుంటాడు. తన ప్లేటు తానే తెచ్చుకొని వడ్డించుకొని ఒక్కడే తింటాడు. పిల్లలు సగం కిందామీద పడేస్తూ తింటారు. తన బట్టలు తానే ఉతుక్కోవాలి. ఇస్త్రీ చేసుకోవాలి. ఆమె తన చీరలు ఇస్త్రీకి ఇచ్చుకుంటుంది. స్నేహితులెవర్నీ ఇంటికి తీసుకురావద్దంటుంది. బందువులు ఎప్పుడో బందయిపోయారు. జీవితంలో ఒంటరితనం పేరుకుపోతోంది. ఎందుకోసం బతుకుతున్నామో? అర్థం కావడంలేదు. ఒక్క ఇంట్లో ఉంటూ, ఒక్క మంచంలో పడుకుంటూ మానసికంగా ఎన్ని మైళ్ళ దూరంలో బతుకుతున్నామో ఎవరికి తెలుసు? అసలు గొడవలు రావద్దని అనుకుంటాడు తను. కాని ఆమె తాను రెచ్చిపోయేదాకా ఏదో ఒకటి వాగుతునే ఉంటుంది. చిన్నవిషయం పెద్ద రగడ. ఛీ.. ఛీ... ఏం బతుకు? పైకి అంతా బాగున్నట్టుగా అందరిముందు నటన... ఇవన్నీ ఎలా పెదనాన్నకు వివరించడం? చివరకు చెప్పడానికే నిర్ణయించుకున్నాడు మార్కండేయులు. అంతా విన్నాక భళ్ళున నవ్వాడు పెదనాన్న భూమయ్య. ''ఈ కాస్తదానికే గంత దూరం ఆలోచించుడెందుకురా? మీ పెద్దమ్మ కూడా గట్లే సాగిచ్చుకునేది. పెద్దమ్మ నాకన్న ఎక్కువ ఇల్లు పట్టిచ్చుకున్నది. గందుకనే మొత్తం భారం దానికే ఇడ్సిపెట్టిన. ఏమైందిరా? ఏ రంది లేకుండా హాయిగా ఉన్న! కోడలు అనిత కూడా నీ అంత సంపాదిస్తంది. ఈ కాలంల ఆడోళ్ళు కూడా మొగోళ్ళ తీరుగ ఆలోచిస్తున్నరు... నీకు మీ అమ్మ ఎంత ఇష్టమో ఆమెక్కూడా ఆమె తల్లిదండ్రులు అంతే ఇష్టం. ఆమె సంపాదన ఆమె తల్లిదండ్రులకు పెట్టుకుంటనంటే ఏం జెయ్యస్తది? ఆమెకుండాలె బుద్ధి. ఇది నా సంసారం అని ఆమెకు కడుపుల లేకపోతె ఎవరేం జేస్తరు? ... నువ్వే అంటివి గదరా! కాలంతోటి మారాలని! ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలు మన మాట ఇంటున్రా? ఇంకా కోడలు ఉద్యోగం చెయ్యబట్టె. చేసుకున్నందుకు చెరికొంతసేపు. ఆమె చెప్పినట్టే నడువని. ఆమె మాత్రం సంసారం కూలగొట్టకోవాలని కోరుకుంటదా? తన మాట నెగ్గాలని పంతం కావచ్చు. మీ పెద్దమ్మ కూడా గంతే. నా మాట ఎన్నడన్నా సాగనిత్తదా? మీ అమ్మ మాత్రం మీ నాన్న మాట సాగనిచ్చిందా? నీ కాడికి వచ్చినవోల్లె కష్టమనిపిస్తున్నది. ఆడోళ్ళ రాజ్యం వచ్చెటట్టున్నది. మొగోల్లే వంటచేసి వడ్డించే కాలం వస్తదేమోరా. అయినా ఎవలకు పెడ్తదిరా? పైసమీద పైస ముడేస్తందిగాదురా! నువ్వు, నీ పెండ్లాం, మీ పిల్లగాండ్లకు తప్ప ఎవలకు పెడుతున్నరురా...'' అంటూ నిష్ఠూరమాడాడు భూమయ్య. ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని పెళ్ళాం మీద పెట్టి చెప్పుకొస్తున్నాడని భూమయ్య పెదనాన్న, పెద్దమ్మ చాలా కాలం నుంచి అనుకుంటనే ఉన్నారు. మార్కండేయులు కూడా వీళ్ళు అలా అనుకుంటున్నారని మనసులో తటపటాయిస్తూనే ఉన్నాడు. చివరకు మొహం పట్టుకుని అనడంతో మొహం మాడ్చుకున్నాడు మార్కండేయులు. పెద్దమ్మ ఇద్దరు మనవలను తాత దగ్గరకు పంపింది. ''తాతా! నానమ్మ చికెన్‌ తెమ్మంటుంది. పైసలియ్యి'' అంటూ హుషారుగా చేయి చాపారు. ''నా దగ్గరెక్కడున్నయిరా! ఉద్దెర తీస్కరాపోండ్రి'' అంటూ భూమయ్య పురమాయించాడు. మార్కండేయులు జేబులోంచి పైసలు తీసి ఇవ్వబోయాడు. ''ఎందుకురా వద్దు. ఉద్దెర ఖాతా ఉందిరా'' వారించాడు భూమయ్య. భూమయ్యకు ఈ చిల్లర పైసలకు గతి లేకుండా ఉన్నామా అని మనసులో కోపం వచ్చింది. ఏదైనా ఇస్తే మనవలకు చదువులకు పనికి వచ్చెటట్టు ఇయ్యాలె గని... గీ చిల్లర పైసలు పెట్టడానికి వీనికి సిగ్గులేదా అని మనసులో ఈసడించుకున్నాడు భూమయ్య. మార్కండేయులుకు ఆ భావం అర్థమయినట్టే ఉంది. కాని డబ్బులు ఇవ్వడానికి ధైర్యం చెయ్యలేకపోయాడు. భూమయ్య మళ్ళీ అసలు విషయంలోకి వచ్చాడు. మార్కండేయులును సర్దుకుపోవాలని తెగెదాక కొట్లాడుకోవద్దని సముదాయించాడు. ''నువ్వు చిన్నప్పట్నించి చూస్తలేవారా? పెద్దమ్మ ఎంత సాగించుకునేది. అనద్దు గని అది నాకన్న డబల్‌ పనిచేసేది. అందుకే నేను నోరుమూసుకొని ఉందుంటి. ఇప్పుడు నీ పెండ్లాం గూడా పెద్దమ్మ తీరుగనే అనుకోరాదురా! సంసారం అన్నంక ఎవలదో ఒక్కల చేతిమీదికెల్లే నడవాలె. ఒక్క మాట మీదనే నడవాలె. చెరోమాటయితే సంసారం ఇచ్చుల్లైతది. కోడలుకు పెద్దమ్మ తీర్గనే అన్నీ తానే సాగిచ్చుకోవాలని ఉన్నట్టుంది. సంసారం దానిమీదికెల్లే నడవని. ఏమైతదిరా! వ్యవసాయంల, సంసారంల మొగోళ్ళకన్నా ఆడోళ్లే ఎక్కువ పన్జేస్తున్నరు. పెత్తనం మొగోళ్ళది. ఇప్పుడు మీ పెత్తనమేందని అంటున్నరు. అనరా మరి? కాలం మారిందిరా. సిన్మాలు, టీవీలు ఎట్ల వస్తున్నయో చూస్తలేవా? కోడలు తల్లిగారింటికిపోతే నీకే కష్టం. ఆమెకేం కష్టం. ఇడుపు కాగితం తీసుకునుడు, రెండో పెళ్ళి చేసుకునుడు అంత అలకగా అనుకున్నవా? తాతలు దిగివస్తరు. మీదికెళ్ళి నీది సర్కారు నౌకరి...'' అంటూ అందులోని చిక్కులన్నిటిని గుర్తుచేశాడు. ఎలా సర్దుకుపోవాలో ఎలా దారికి తెచ్చుకోవాలో చిన్నచిన్న చిట్కాలు వివరించాడు. మార్కండేయులుకు పెదనాన్న, పెద్దమ్మ సంసారం సజావుగా సాగిన రహస్యం కొత్తగా అర్థమైనట్టుంది. బస్సులో అనిత ఇద్దరి టిక్కెట్లు తానే తీసుకుంటానని తీసుకున్నప్పుడు తనకు తలకొట్టేసినట్టనిపించింది. ఆ తర్వాత ఒకరిద్దరు ఫ్రెండ్స్‌ తనను ఆటపట్టించడం మరీ బాధించింది. పెదనాన్నకు జీవితమంతా పెద్దమ్మే ఆర్థిక వ్యవహారాలు చూసేది. పెదనాన్న అది సహజమనుకున్నాడు. కాని పెద్దమ్మలాగే ప్రవర్తించే అనితను తాను ఎందుకో క్షమించలేకపోతున్నాడు. పెదనాన్న ఇలాంటి సమస్యలను చాలా తేలికగా తీసుకున్నాడు. పెద్దమ్మతో రాజీ పడిపోయాడు. చిన్నప్పుడు ఎంతో మంచిపని చేస్తోంది అనుకున్న పెద్దమ్మ పని ఇప్పుడు ఎందుకో సరికాదనిపిస్తుంది. అనితతో ఎందుకోగాని తనకు ఇలాంటి రాజీ ఇష్టమని పించడంలేదు. కేవలం తన అహంకారమా? కాదు... పెద్దమ్మ విషయం వేరు. పెద్దమ్మ పెద్దరికం తలకెత్తుకొని అందరినీ సాదింది. ఉమ్మడి కుటుంబం విలువలను కాపాడిన తల్లి మనసు. అనితది స్వార్థం... డబ్బు యావ తప్ప పరోపకారం కించిత్తు లేదు. అలాంటి దానితో సంసారం ఎలా సాధ్యం? అదే మాట పెదనాన్న ముందుంచాడు. ''ఏమోరా! ఏది చెప్పినా చెప్పినోళ్ళే కంటైతరు. మీరు మంచిగనే ఉంటరు'' అంటూ ఇక చర్చ చేయడం ఇష్టం లేనట్టుగా మౌనంగా ఉండిపోయాడు భూమయ్య. రెండు తరాలు గడిచిపోయి తాను కాస్త తెల్లగా బతుకుతున్నప్పటికీ తనకు సాయం చేసిన కుటుంబానికి, కన్నతల్లికి ఏమీ చేయలేని దుస్థితి ఎందుకు వచ్చిందో... నిర్వేదంగా కుర్చీలో కూర్చున్న మార్కండేయులు ఆకాశం కేసి చూశాడు. నానమ్మ పకోడి చేసింది అంటూ మరో మనవడు రెండు ప్లేట్లలో తెచ్చి భూమయ్యకు, మార్కండేయులుకు అందించాడు. ఎంతలేకపోయినా తన పెద్దమ్మ, పెదనాన్న ఎన్ని మర్యాదలు చేస్తున్నారో! ఏ జన్మలో చేసుకున్న పాపమో! అనిత పాలబడ్డాను. ఎవరికి ఏమి చేయలేని దుస్థితి. చెప్పినా ఎవరూ నమ్మలేరు. ఇంట్లో ఫ్రిజ్‌, కూలర్‌, డెకోలం మంచాలు, డైనింగ్‌ టేబుల్‌, డబుల్‌ బెడ్‌రూం, నిలువెత్తు అద్దాలు, రకరకాల పట్టుచీరలు, బైక్‌, స్కూటీ వంటి అన్నీ చూసి ఎవరెందుకు క్షమిస్తారు? కేవలం వస్తువుల్లో సుఖాన్ని వెతుక్కునే ఈ స్వార్థం వల్ల ఏం తృప్తి? పరోపకారం చేయలేని ఈ బతుకెందుకు? కనీసం చేసిన మేలుకు కృతజ్ఞతగా సాయం చేయలేని ఈ బతుకు ఎందుకు? ఇది అనితకు ఏమర్థమవుతుంది? పెదనాన్నకు తన బాధ ఏమర్థమవుతుంది. తన వ్యక్తిత్వం ఎంతగా కుదించబడింది? తనది కాని జీవితాన్ని, తనది కాని వ్యక్తిత్వంతో ఇలా ఎంతకాలం ఆమెతో కలిసి జీవించడం? ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా మార్కండేయులు కుర్చీలోంచి ముందుకు వంగాడు. ''పెదనాన్నా! ఈసారి స్కూళ్ళు స్టార్టయినంక ఒక్కసారి నువ్వు మనవణ్ణి తీసుకునిరా! వీణ్ణి నేనే చదివిస్తా'' ''ఎందుకురా! నీ సంసారంలో చిచ్చు పెట్టుకునుడు. ఎవల బతుకు వాళ్ళది'' అన్నాడు భూమయ్య. ''తాతా! వంటయింది. నానమ్మ రమ్మంటున్నది'' అంటూ మనవడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మంచంలోంచి మెల్లిగా లేచాడు భూమయ్య. యజమాని మీద ప్రేమతో అక్కడే పడుకున్న కుక్క భూమయ్య కాలు తనమీద పడి కుయ్యోమంది. మంచం పక్కనుంచి లేచి తోక ఊపుకుంటూ నిలబడింది. మనిషి పట్ల కుక్కకున్న విశ్వాసం తనకు లేదా? అని ఒక్కసారిగా మనసులో ఎవరో కొరడాతో కొట్టినట్టనిపించింది మార్కండేయులుకు. ''వీణ్ణి నా కొడుకుతోపాటు చదివించడానికి ఒప్పుకోకపోతే అనిత నాకక్కర్లేదే. ఎవల బతుకు వాళ్ళది. ఆమె వెళ్ళిపోతే అమ్మ, పెద్దమ్మ మీరంతా వచ్చి నా దగ్గరే ఉందురు. ఎవరికి ఏమి చేయలేని ఈ బతుకు ఇంకా ఎంతో కాలం బతుకలేనే'' అని కరాఖండిగా అన్నాడు మార్కండేయులు. 'తాను అలా ఎన్నిసార్లు అనుకున్నాడో! ఎన్నిసార్లు రాజీ పడ్డాడో! ఎవరికి తెలుసు?' భూమయ్య తన గతాన్ని నెమరువేసుకున్నాడు. దీర్ఘంగా శ్వాస వదుల్తూ అన్నాడు. ''వద్దురా! కోడలుకు ఇష్టం లేకుండా వీన్ని పెంచుకుంటే పనిమనిషి తీరుగ చూస్తది. నరకం చూపిస్తది. దానికన్నా ఈ బతుకే నయం. ఆడోల్లకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఏదీ సాగది. ఇంటి పేరొక్కటే మనది. మిగిలిందంతా ఆల్ల రాజ్యమేరా... మనం పేరుకే మొగోల్లం రా!'' అంటూ జీవిత సత్యాలను చెప్పుకొచ్చాడు పెదనాన్న భూమయ్య. 'నవ్య' వార పత్రిక, 2011.