Friday, October 7, 2016
జిజ్ఞాస
ఒక సభ, సమావేశం ఎంతోమందిని పరిచయం చేస్తుంది. కొందరు సన్నిహితు లౌతారు. పరిచయం స్నేహంగా మారుతుంది. ఒక పరిచయం అనేక పరిచయాలకు దారి తీస్తుంది. అందుకే నాకు సభలు, సమావేశాలంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా పిలవగానే వెళ్ళాలనిపిస్తుంది.
తెలుసుకోవాలనేవారికి చెప్పిన విషయాలన్నీ అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. శ్రద్ధలేనివారు ఒక చెవిలో విని మరో చెవిలోనుండి వదిలేస్తారు. జిజ్ఞాస మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతుంది. జిజ్ఞాసే మనిషి వికాసానికి మూలం.
ఆ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ శ్రద్ధగా విన్నారు. ఆర్గనైజర్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలాకాలం తర్వాత ఒక చక్కని మీటింగ్ జరపగలిగామని ఆనందంగా ఉన్నారు. నేను వారి అభినందనలను స్వీకరిస్తూ మీటింగ్ హాలునుండి బయటకు నడిచాను. ఎవరో నా వెనుకనుండి పిలిచినట్లు అనిపించింది.
''నమస్కారం సార్! నా పేరు కరుణాకర్... టీచర్‌గా పని చేస్తున్నాను.'' అంటూ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. క్షణమాగి అతనివైపు చూసి, ప్రతి నమస్కారం చేశాను.
''మీ ప్రసంగం చాలా బాగుంది సార్!'' అని చొరవగా దగ్గరికి వచ్చాడు. ఆయన మీటింగ్ స్టార్ట్ కాకముందు కలిసిన ఆర్గనైజర్లలో చూసినట్లులేదు. ''థాంక్స్'' అని చెప్పి ముందుకు కదిలాను. మీటింగ్ వాలంటీర్స్ కరుణాకర్‌కేసి కొరకొర చూశారు. నన్ను తొందరగా తీసుకువెళ్ళాలని వారి ఆలోచన.
''మీరు కథలు ఎందుకు రాస్తుంటారు సార్?''
ఆర్గనైజర్స్ వెంట వడివడిగా నడుస్తూనే కరుణాకర్‌తో సంభాషిస్తున్నాను.
''స్వేచ్ఛా సమానత్వం, సమసమాజం కోసం, మానవీయ విలువల అభివృద్ధికోసం, కులరహిత, వర్గరహిత, నూతన సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం... సామాజిక మార్పు కోసం... సామాజిక మార్పులను చిత్రించడం కోసం... ప్రజలు జీవితాలను అర్థం చేసుకోవడం కోసం... సామాజిక పరిణామాల్ని విశ్లేషించడం కోసం... అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం కోసం...కథలు, నవలలు, వ్యాసాలు రాస్తుంటాను. ప్రసంగాలు కూడా ఇస్తుంటాను''.
''ఇన్ని పుస్తకాలు ఎప్పుడు రాసిండ్రు? ఇన్ని ఎలా రాసిండ్రు సార్'' అడిగాడు కరుణాకర్.
''రాత్రి రోజు మూడు గంటలు పుస్తకాలు చదువుతాను. ఉదయం నుండి రాస్తుంటాను.'' అని చెప్పాను.
''రోజు మూడు గంటలు చదువుతుంటారా సార్?'' అని ఆశ్చర్యపోయాడు కరుణాకర్.
''అవును. చదవకపోతే ప్రపంచం ఎలా తెలుస్తుంది? ప్రతి పుస్తకం సామాజిక శాస్త్రవేత్తలు, రచయితలు ఎంతో అధ్యయనం చేసి అనుభవాల సారంతో రాస్తుంటారు. కేవలం చదవడం ద్వారా అదంతా మన సొంతం అవుతుంది. అవి చదివాక మన జ్ఞాన నేత్రం వికసిస్తుంది. మన ఆలోచనలకు స్పష్టత ఏర్పడుతుంది. కొత్త ఆలోచనలు కలుగుతాయి. కొత్త ఆలోచనలను ఉదయం కాగితం మీద పెడుతుంటాను.''
నడక మందగించడంతో ముందుకు సాగిన వాలంటీర్స్ నాకోసం వచ్చారు. తొందరగా బయలుదేరాలని వారి ఆరాటం.
''రండి సార్. భోం చేశాక గెస్ట్‌హౌస్‌కు వెళదాం.''
''నేను ఉంటాను సార్.''
''కరుణాకర్! మీరు కూడా భోజనానికి రండి.'' అని ఆహ్వానించాను. ఇక అంతకన్న ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేకపోయింది. మీటింగ్‌కన్నా ముందు కలిసి ఉంటే కాస్త ఓపికగా మాట్లాడే అవకాశం ఉండేది. ఎవరితొందరలో వారున్నప్పుడు ఏవేవో అడుగుతుంటే అసహనంగా ఉంటుంది. అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. కానీ అవేవీ కన్పించనీయకూడదు. సహనాన్ని తెచ్చిపెట్టుకోవాలి. మనిషి కలిసినప్పుడే అన్నీ అడగాలనుకోవడం, చెప్పాలని ఆశించడం సరైందికాదు. మీటింగ్ పెట్టినవాళ్ళకు టైం ఇవ్వాలి. ఎవరెవరితోనో మాట్లాడితే ఆర్గనైజర్స్‌తో సంబంధాలు, సాన్నిహిత్యం ఎలా పెరుగుతుంది. ఆర్గనైజర్స్ బాగా సంతోషంగా ఉన్నారు.
హోటల్‌లో అందరం సర్దుకొని కూర్చున్నాం. కరుణాకర్‌ను నా పక్కకకు రమ్మని పిలిచాను. ముఖ్య కార్యకర్తలు నాతోపాటు కూర్చున్నారు.
''ఇవాళ సభ చాలా బాగా జరిగింది. మేము ఇంతమంది వస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా వాళ్లు ఇంకా చాలామందికి కమ్యూనికేట్ చేయనే లేదు.'' అన్నారు ప్రశంసాత్మకంగా.
''ఆ ప్రాబ్లమ్ ఎప్పటికీ ఉంటుంది. పెళ్ళి పత్రికలు ఎన్ని కొట్టించినా, ఎంతమందికి ఇచ్చినా ఇంకా కొందరిని మర్చిపోతూనే వుంటాము.'' అని అనేక అనుభవాలను కలిసి పంచుకున్నాము.
''ఈ హోటల్ చాలా బాగుంది.'' అన్నాను టాపిక్ మార్చాలని.
''ఈ టౌన్‌లో ఇదే మంచి హోటల్ సార్.'' ఉత్సాహంగా అన్నాడు అధ్యక్షుడు.
''ఈ రాత్రి ఇక్కడే వుండండి. రేపు ఉదయం వెళ్ళండి. రాత్రి మీతో చాలా మాట్లాడాలి. మావాళ్లు మీ సమయం అడిగారు.'' అన్నారు అధ్యక్షుడు.
ఇలా మర్యాదకు అడగడం పరిపాటి. ఒక మీటింగ్‌కు అటెండ్ కావడం, చూడ్డానికి ఒక్కపూటలాగ కనపడుతుంది. కానీ మీటింగ్‌కన్నా మూడు రోజులు ముందు, మీటింగ్ తర్వాత మూడు రోజులు మొత్తం ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఆమాట పిలిచినవారితో చెప్పడం బాగుండదు.
''నాకు వీలు కాదు. ఉదయమే హైదరాబాద్‌లో వుండాలి. వేరే ప్రోగ్రామ్ వుంది.'' అని నా ఇబ్బందులను చెప్పాను.
''అయితే లాస్ట్ బస్‌కు పంపిస్తాం. అంతదాకా మాకు టైమ్ ఇవ్వాలి సార్.'' అన్నారు.
''అలాగే.'' అని అన్నాను.
భోజనాలు పూర్తయ్యాయి. గెస్ట్ హౌస్‌కు బయలుదేరాము. కరుణాకర్ కూడా వెంట వచ్చాడు. మీటింగ్ గురించి దాని ఏర్పాట్ల గురించి ఎవరెవరు ఎలా సహకరించారో, ఎవరెవరు ఎలా చెయ్యిచ్చారో చెప్తూ వస్తున్నాడు అధ్యక్షుడు. తర్వాత మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారో చర్చిస్తున్నారు. ఏ టాపిక్ మీద పెట్టుకుంటే బాగుంటుందో అని చర్చలు సాగిస్తున్నారు. ఈ టాపిక్‌లమీద కరుణాకర్‌కు ఇంట్రస్ట్ ఉన్నట్టులేదు.
''నేను వెళతాను సార్.'' అన్నాడు కరుణాకర్.
''ఏం? ఈ యిష్టాగోష్టిలో వుండరా? ఇది మీకు అక్కర్లేదా? అనేక విషయాలు చర్చిస్తారు. కథలు రాయడానికి అవి కూడా ఉపయోగపడతాయి కదా?''
''అది కాదు సార్. ఇంటికాడ...''
''ఇంతదాకా టైమ్ ఇమ్మన్నావు. ఇప్పుడేమో ఇంటికాడ... అని అంటున్నావు. నీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. కరుణాకర్! కొత్త విషయాలు తెలుసుకోకపోతే సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? కేవలం పుస్తకాలే సరిపోవు. చుట్టూ వున్న సమాజం ఎలా నడుస్తోంది? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఎవరి వ్యక్తిత్వం ఎలా వుంది? ఎవరి చైతన్య స్థాయి ఏమిటి? అనే విషయాలు నీవు ఏమి మాట్లాడకపోయినా కూర్చుని తెలుసుకునే గొప్ప అవకాశం మిస్సవుతావు.''
''అలాగే సార్.''
జ జ జ జ
''చాలా విషయాలు తెలుసుకున్నాను సార్! గోష్టి మిస్సయి వుంటే ఎన్నో విషయాలు మిస్సయి వుండే వాణ్ణి. ఇవన్నీ సభలో ప్రసంగంలో చెప్తే ఇంకా బాగుండేది సార్.''
''అందుకే నిన్ను వుండమన్నాను. సభలో అన్ని విషయాలు చెప్పడం కుదరదు. అందరి స్థాయి ఒకటి కాదు. అందరికి అర్థం కావు. అందువల్ల జనరలైజ్ చేసి చెప్తుంటాము. ఆర్గనైజర్లు ఒక స్థాయికి ఎదిగిన వాళ్లు కనుక మీటింగ్ అయిపోయాక ఇష్టాగోష్టిలో అనేక విషయాలు లోతుగా చర్చకు వస్తాయి. దాంతో పాటు ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుందో, ఎలా విస్తరించాలో కూడా తెలుస్తుంది.''
''సార్, కథలు ఎలా రాయాలో ఫోన్‌లో అప్పుడప్పుడు అడుగుతుంటాను సార్. మీరు విసుగు అనుకోకుండా కొంత సమయం నాకు కేటాయించాలి సార్.''
''అలా కుదరదు. సెల్‌ఫోన్లు వచ్చాక ఫోన్లు కష్టమైపోయాయి. ఎక్కడ వుంటామో ఫోన్ చేసే వారికి తెలియదు. ట్రాఫిక్‌లో వుండవచ్చు. వేరే పనిమీద వుండవచ్చు. అందువల్ల ఫోన్ ద్వారా అడగడం, చెప్పడం కుదరదు. మూడ్ కూడా వుండక పోవచ్చు. అందుకని మరో పద్ధతి వుంది.''
''చెప్పండి సార్.''
''నీ లాంటి యువకులను, విద్యార్ధులను, సాహిత్యాభిమానులను కొంతమందిని కలిసి చర్చించి కథా వర్క్‌షాప్ పెట్టండి. అప్పుడు అనేక విషయాలు చెపుతాను. తద్వారా చాలా మందికి విషయాలు తెలుస్తాయి. దీనివల్ల నీక్కూడా ఒక సౌకర్యం వుంది. నీ చుట్టూ సాహిత్యాభిమానులు, కథలు రాయాలనుకునే వాళ్లు ఒక బృందంగా వుంటారు. తద్వారా ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతారు. పోటీ పడతారు. సూచనలు చేసుకుంటారు. తద్వారా మీ అవగాహన పెరుగుతుంది. ఒక సాహిత్య వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్య వాతావరణం వున్న చోటే సాహిత్య రచన సుళువుగా వుంటుంది. నేను కూడా ఎక్కడ వున్నా నా చుట్టూ ఒక సాహిత్య వాతావరణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంటాను.''
అందరు కలిసి లాస్ట్ బస్‌కు ఎక్కించి వీడ్కోలు తీసుకున్నారు. అందరితోపాటు కరుణాకర్ కూడా చివరిదాకా వారితోనే ఉన్నట్టున్నాడు.
జ జ జ జ
ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. 'ఇండియానాపొలిస్' అనే నగరంలో మా పెద్ద కొడుకు, కోడలు, మనవలతో ఉంటున్నారు. కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి నేను, మా శ్యామల వెళ్ళాము. అమెరికా ఎలా ఉంటుందో మొత్తం అంతా చూడాలని ఆరాటం. పిల్లలకు వీలు కావడంలేదు. శనివారం, ఆదివారం సెలవు వున్నప్పటికీ ఇంటిపనికి, షాపింగ్‌కు రెండు రోజులు కూడా చాలవు. నా అంచనాలు తప్పాయి. ఇంట్లోనే పొద్దంతా ఉండాల్సి రావడం కొద్దిరోజులకే విసుగు వచ్చింది. సొంతంగా నడిచి తిరుగుదామంటే వీలుకాదు. చివరకు పాణిగ్రాహిని నోరు విడిచి అడిగాను.
''అరె పాణీ!... బయటకు పోతే చలి. మంచుకురుస్తున్నది. శరీరం గడ్డకట్టేట్టు వుంది. నడిచి ఎక్కడికి పోరాదు. ఎటు చూసినా అయిదు కిలోమీటర్లు పోతే తప్ప సిటీలోకి పోలేము. నాకు కంప్యూర్ రాకపోయె... ఇక్కడ లైబ్రరీ దగ్గర లేకపాయె. కనీసం లైబ్రరీకి పోదామన్నా అయిదు కిలోమీటర్లు నడవాలె. ఆటోలు లేవాయె, బస్సులు లేవాయె, నువ్వు కార్లో తీసుకుపోతేనే పోయినట్టు. నీ కారు ఇక్కడ నేను నడపరాదాయె. నా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చెల్లదాయె. ఇండియానా పోలీసు సిటీలో ఫిషర్స్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటివి. అంతా ప్రశాంతంగా చాలా బాగుంది గాని, నాకు ఇక్కడ టైం పాసయితలేదు. ఎట్ల? ఏం చేయాలె, తోస్తలేదు.''
పాణిగ్రాహి అలసిపోయినట్టున్నాడు. అలాంటి ప్రశ్నలు ఎప్పుడో వేస్తానని ముందే జవాబులు రడీ చేసుకున్నట్టున్నాడు. అందుకే శ్యామల ఎక్కడికీ తీసుకుపొమ్మని అడిగినట్లు లేదు. మనవలు ఏదో ఆడుకుంటున్నారు. పెద్ద మనవడు సుశాంత్ టీవీలో 'బార్నీ' అనే పిల్లల ప్రోగ్రామ్ చూస్తున్నాడు. కోడలు, శ్యామల వంట పనిలో పడ్డట్టున్నారు.
''అయితే నేనేం చేయాలె నాన్నా?... ఉద్యోగానికి లీవు పెట్టి ఇంట్లో వుండాల్నా? శనివారం, ఆదివారం మిమ్మల్ని సిటీ తిప్పుతునే వున్నాను కదా! రోజూ తిప్పడం కుదరది. టీవీ చూసుకుంటు కూర్చోండి. కొన్ని డివిడిలు తెస్తాను. సినిమాలు చూస్తుండండి. ఇండియాకు ఫోన్లు చేసుకోండి. కంప్యూటర్ నేర్చుకొని ఇంటర్‌నెట్‌లో పత్రికలు చూడండి.''
పాణిగ్రాహి చెప్పిన మాటలు కోడలు సులేఖ విన్నట్టుంది. టైంపాస్ కాకపోవడం, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెల్లినప్పుడే గమనించినట్లుంది.
''మామయ్యా! కంప్యూటర్లో ఇంటర్‌నెట్ ద్వారా మీరు తెలుగు డైలీ పేపర్లు, అమెరికన్ డైలీ పేపర్లు కూడా చూడవచ్చు. నేను మీకు వాటిని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను... ఈ నాలుగు స్విచ్‌లు జ్ఞాపకం వుంచుకుంటే మీరు ఇంటర్‌నెట్‌లో అన్నీ వెతుక్కోవచ్చు.''
సులేఖ కొద్దిరోజులు క్రితమే కంప్యూటర్‌లో ఎలా చూడవచ్చో కొన్ని నేర్పింది. నాకు కొన్ని స్విచ్‌లే అర్థమయ్యాయి. వాటితోనే అటూ ఇటూ గెలుగుతూ కాలక్షేపం చేస్తున్నాను. చూసిచూసి కళ్ళు గుంజడం తప్పడంలేదు. అదే మాట అన్నాను.
''కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నా మున్నీ...! కానీ గంటల తరబడి ఇంటర్‌నెట్ చూస్తే కండ్లు గుంజుతున్నయి. మాట్లాడ్డానికి మనిషి లేకపోతే ఎంత కష్టం? అత్తమ్మతోటి ఏం మాట్లాడతాం? ఫోన్లు ఎంతకని చేస్తాం? ఇక్కడ పొద్దెక్కితే ఇండియాలో రాత్రయితది. ఇక్కడ రాత్రయితే అక్కడ పొద్దెక్కుతది. ఫోన్ చేయడానికి టైమ్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. రాత్రి ఫోన్లు చేస్తుంటే అమ్మ ఈ రాత్రి ఏందంటది? ఇక్కడ రాత్రికి అక్కడ పగలాయె. అమెరికాలో పుస్తకాలు ఎలా వున్నాయో? ఎలాంటివి రాస్తున్నారో కథలు, నవలలు, ఫిలాసఫీ, సోషియాలజీ, అమెరికా సమాజం ఎలా వుందో తెలుసుకోవాలని వుంది. పుస్తకాల షాపుకు తీసుకపోతే కొన్ని తెలుస్తాయి కదా! మీ ఏరియా లైబ్రెరీలు చూడాలని వుంది.''
''ఇక్కడ ఫిలాసఫీ పుస్తకాలు, సోషియాలజీ పుస్తకాలు తక్కువ. మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ పుస్తకాలు, సబ్జెక్టు పుస్తకాలు ఎక్కువ. ఇక్కడి పుస్తకాలు కొని ఏం చేస్తావ్? మళ్లీ పుస్తకాలు రాస్తావా? నాన్నా'' అన్నాడు.
''ఔను... ఇక్కడివాళ్ళు ఏం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలుసుకోవడం అవసరం. వారికి ఇ-మెయిల్ చేసి మాట్లాడతాను''. ఆ మాటతో పాణిగ్రాహి అదోరకంగా నవ్వాడు. నన్ను బాగా అమాయకుడిగా జమకట్టాడు.
''నాన్నా! నీ అమాయకత్వానికి నవ్వొస్తున్నది. నువ్వు వాళ్ళకు నేర్పుతావా?'' అని ఆశ్చర్యపోయాడు. పాణికి అంత ఆశ్చర్యం కలగాల్సింది ఏముందో నాకర్థం కాలేదు. అమెరికావాళ్ళు ఏం రాస్తున్నారో ఎంతో కొంత చూస్తూనే ఉన్నాను. వారి పరిమితి ఏమిటో నాకు తెలియంది కాదు. అయినా పాణి మనస్సు నొప్పించదలచుకోలేదు.
''పాణీ! జ్ఞానం నీరు వంటిది. అది పల్లానికి ప్రవహిస్తుంది. వారి దగ్గర ఎక్కువుంటే నా వైపుకు, నా వద్ద వుంటే వారి వైపుకి ప్రవహిస్తుంది. ఏదైనా నీరు సమతలం చేస్తుంది కదా!'' అని వివరించాను. నాన్నతో మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తాడని వాడి అభిప్రాయం.
అంతలో శ్యామల, కోడలు సులేఖ భోజనానికి రమ్మని పిలిచారు.
ఆ తర్వాత శనివారం పాణి వాళ్ళ ఏరియాలోని మున్సిపల్ లైబ్రరీకి తీసుకువెళ్ళాడు. పాణికి లైబ్రరీలో మెంబర్‌షిప్ ఉండటం సంతోషం వేసింది. పుస్తకాలపట్ల పాణికి ఇంకా ఆసక్తి ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగించింది.
పాణి చిన్నప్పుడు పిల్లల కథలు, కవితలు, జోక్స్ చాలా రాసేవాడు. పత్రికల్లో బహుమతులు కూడా వచ్చాయి. ఇంజనీరింగ్‌లో చేరాక నేనే వద్దన్నాను... చదువు పాడైపోతుందని!. ఆ తర్వాత బెంగుళూరు, ఆ తర్వాత అమెరికా ఉద్యోగ వేటలో పడ్డాడు. ఇప్పుడు రాయవచ్చుగదా అంటే ఎప్పుడంటే అప్పుడు రాయడం వస్తుందా! అని అన్నాడు. నేను రాయడం మాన్పించినందుకు కోపంగా ఉన్నట్టున్నాడు. దాంతో మాటమార్చాను.
''ఈ లైబ్రెరీ చాలా బాగుందిరా! లైబ్రెరీలో కంప్యూటర్లు, డివిడిలు, ఇంటర్‌నెట్ చూసుకోవడానికి టేబుళ్లు వుండడం, జిరాక్స్ కూడా లైబ్రెరీలో వుండడం బాగుంది.''
''మన ఇండియా ఇలా ఎదగాలంటే ఎంతకాలం పడుతుంది నాన్నా...''
''నేను ప్రధానమంత్రినైతే... పదేళ్ళలో అమెరికాతో సమానంగా అభివృద్ధి పరుస్తాన్రా... ఇప్పుడు బడ్జెట్ అంతా చెత్త చెత్తగా ఖర్చు చేస్తున్నారు... కేరళలోలాగా, మిజోరంలోలాగా బడ్జెట్‌ను అందరూ కనీసం పదహారు సంవత్సరాలు చదివి డిగ్రీ పుచ్చుకునే విధంగా విద్యకోసం బడ్జెట్ కేటాయిస్తాను... మీరు కొంతమంది ఎదిగి అమెరికాకు వస్తేనే అమెరికా బెంబేలెత్తుతున్నది... 'వికినమిక్స్...' 'ద వరల్డ్ ఈజ్ ఫ్లాట్...' పుస్తకాలు చదివితే తెలుస్తుంది నీకు... మొత్తం భారతదేశ ప్రజలను నీలాగే ఎదిగిస్తాను... అప్పుడు ప్రపంచంలో అందరూ ఇండియాతో పోటీపడాల్సి వస్తుంది...'' ''నీతో వచ్చిన చిక్కే ఇది నాన్నా... మొత్తం ప్రపంచం అంతా నా చేతుల్లో వుందన్నట్టు... నేను మార్చగలనన్నట్టు... మాట్లాడుతుంటావు... భ్రమల్లో బతుకుతుంటావు... ''
''ఇవి భ్రమలు కాదురా... భవిష్యత్ స్వప్నాలు...అవకాశాలు...'' అని చెప్పాను.
లైబ్రరీలోని ర్యాక్‌లన్నిటిని ఒకసారి కలియ తిరిగాను. సోషియాలజీ, ఫిలాసఫీ పుస్తకాలు ఎక్కడో ఒక మూలకు పాతపుస్తకాలు పెట్టినట్టు పెట్టారు. అందులో ఎంత వెతికినా నేననుకున్న పుస్తకాలు కనిపించలేదు. ఎన్నో కొత్త పుస్తకాలు కనపడ్డాయి. వాటి ఇండెక్స్‌లు చూస్తూ ఏమేం రాశారో గమనిస్తూ ఉండిపోయాను. వాటిలోంచి ఏయే పుస్తకాలు కొనుక్కుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నాను.
కొన్ని పుస్తకాలు తీసుకొని ఇంటికి వెళ్ళాము. అలా వారం వారం కొన్ని పుస్తకాలు తేవడం, చదవడం ఇచ్చేయడం.... అరవై పుస్తకాల దాకా చదివేశాను. ఇంగ్లీషు రాదనుకున్న నాకు ఇంగ్లీషులో చదవడం బాగానే వచ్చు అని అన్పించింది. ఇంగ్లీషులోనే నోట్స్ రాసుకున్నాను.
మూడు వారాల తర్వాత పుస్తకాల షాపుకు తీసుకువెళ్ళాడు పాణిగ్రాహి. అటూ ఇటూ తిరిగి చాలా పుస్తకాలు సెలెక్ట్ చేశాను. వాటన్నిటినీ చూసి, పాణి ఆశ్చర్యపోయాడు. అవన్నీ కొనాల్సిందేనా అన్నట్టు చూశాడు.
''మళ్ళీ ఇన్ని పుస్తకాలు కొంటావా? ఒక్కొక్కటి ధర ఎంతుందో తెలుసా నాన్నా?'' అని అడిగాడు.
''ఈ పుస్తకాలు ఇండియాలో చాలా అవసరం రా! కథలు, నవలలు రాయడం ఎలా అని వివరంగా చెప్పే ఈ పుస్తకాలు నాకు రిఫరెన్స్‌గా ఎంతో అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ గురించి, అమెరికా అభివృద్ధి చెందిన తీరుగురించి, ఇటీవల వచ్చిన డెవలప్‌మెంట్స్ తెలుసుకోవడం చాలా అవసరం''. అని అన్నాను.
''నాన్నా! నీ ఆలోచనలు చాలా మారాల్సిన అవసరం వుంది. నీ దృక్పథం మిలియనీర్ మైండ్‌గా మారకుండా నువ్వు ఇండియాను ఎలా డెవలప్ చేయగలవు? మిలియనీర్, బిలియనీర్‌ల యుఎస్‌ఏతో ఎలా పోటీపడగలవు? హౌటు బికమ్ మిలియనీర్ పుస్తకాలు చదువు. ఇండియాలోపేదరికం మైండ్ నుండి బైట పడేసి మిలియనీర్ మైండ్‌గా ఎదిగించడానికి పుస్తకాలు రాయి. అందుకోసం ఈ పుస్తకాలు నా వంతుగా నువ్వు అడగకముందే కొనిస్తున్నాను.'' అని కొనిచ్చాడు పాణి.
''నేను మిలియనీర్ కావాలా? ప్రపంచంలో రచయితలు మిలియనీర్ కావాలని కోరుకోరు. అలా కోరుకున్న వాళ్లు మీ అమెరికాలోనైనా ఎవరైనా వుంటే చెప్పు వారి జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తాను.''
''నాన్నా! ఇండియాను అమెరికాతో సమానంగా ఎదిగించాలంటే అమెరికాలో ఎలా ఎదుగుతున్నారో, ఎలా ఎదిగారో అధ్యయనం చేసి అనుసరించకపోతే ఎలా సాధ్యం?'' అని ప్రశ్నించాడు పాణి.
ఆశ్చర్యపోవడం నావంతయింది. ఇండియానుండి అమెరికా వచ్చే ప్రతి ఒక్కరూ మిలియనీర్ కావాలని అనుకుంటారేమో. ఉద్యోగం చేస్తూ, మిలియనీర్ కావడం, ఎక్కడా సాధ్యం కాదు అనే విషయం పాణిలాంటి యువతరానికి తెలిసినట్టు లేదు.
అమెరికాను, యూరప్‌ను అనుసరించకుండా ఇండియా తన పద్ధతిలో సంపన్న దేశంగా ఎదగడం సాధ్యంకాదా? అని ఆలోచనలో పడ్డాను.
పాణి చెప్పిన మాట పదే పదే మనస్సులో తిరుగుతోంది. నా అనుభవాలు, ఉద్యమాల అనుభవాలు, బతుకు నేర్పిన పాఠాలు, నా భావాలు అన్నింటిని పాణి ప్రశ్నిస్తున్నట్లుగా అన్పించింది. మీ అనుభవాలు, భావాలు ఏవీ ఇండియాను అగ్రరాజ్యంగా మార్చలేవు. అని పాణి బలంగా నమ్ముతున్నట్లున్నాడు. అప్పుడప్పుడు అదే విషయం మా ఇద్దరి మధ్య సంభాషణ, సంఘర్షణ దాకా సాగేది.
కొద్దిరోజుల తర్వాత పెద్దకొడుకు పాణి దగ్గరనుంచి రెండవ కొడుకు శ్రీకాంత్ దగ్గరకు బయలుదేరాము. శ్రీకాంత్ న్యూజెర్సిలో ఉంటాడు. హైదరాబాద్‌లోని ఏలె లక్ష్మణ్‌కు ఫోన్ చేశాను. న్యూజెర్సీలో నారాయణస్వామి ఉన్నాడని చెప్పాడు. నారాయణస్వామి కొన్ని మీటింగ్‌లు ఏర్పాటు చేశాడు.
శ్రీకాంత్ ఎంతో కష్టమైనప్పటికీ నన్ను నేను కోరినచోటుకల్లా తీసుకొనివెళ్ళాడు. మా వియ్యంకుడు శ్రీకాంత్ మామ చంద్రమౌళీశ్వర్ కూడా మాతోపాటు వచ్చాడు. అలా ఫిలడెల్ఫియాలో మీటింగ్ చక్కగా జరిగింది. నేను తెచ్చిన ఏడు కొత్త పుస్తకాలను అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇరవై మంది దాకా వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ప్రసంగం తర్వాత చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. అసలు మీటింగే హోటల్‌లో జరిగింది. ఆ హోటల్ తెలుగువారిదే. ఆయన కూడా ఒక ఆర్గనైజర్.
అందరితో ఆత్మీయంగా సెలవు తీసుకొని ఫిలడెల్ఫియానుండి న్యూజెర్సీకి బయలుదేరేసరికి రాత్రి పదయ్యింది. కారు వేగంగా పోనిచ్చాడు శ్రీకాంత్. డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్‌కు నిద్ర రాకుండా ఉండడం కోసం అదీ ఇదీ మాట్లాడిస్తూ వచ్చాను.
''శ్రీకాంత్! ఫిలడెల్ఫియాలో మీటింగ్ చాలా బాగా జరిగింది కదా!'' అని ఉత్సాహంగా అన్నాను.
''అవును నాన్నా!''
''బావా... మీ డిస్కషన్స్ చాలా బాగా జరిగినయి. నేను నా జీవితంలో ఇంత గొప్ప విషయాలు ఎన్నడూ వినలేదు... వాళ్ళు ఎంత ఆసక్తిగా విన్నారో.. వారిలో 1969 నుండి అమెరికాలో వుంటున్న వాళ్లు కూడా వున్నారు. మీరు చెప్పిన విషయాలు అమెరికాలో వున్న మాక్కూడా తెలియవు. మా పనేదో మేం చేసుకొని బతుకుతున్నాం. ఇన్ని విషయాలు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి పుస్తకాలు చదివి మళ్లీ మాకు వాటిని చెప్పడం చాలా ఆనందంగా వుందని అన్నారు. నర్సంపేటలో ఏదో షాపు నడుపుకుంట గిరాకీ చూసుకుంట వుండే నాకు ఇంత గొప్ప అవకాశం దొరికింది... అల్లుడు శ్రీకాంత్, బిడ్డ ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంత గొప్ప అనుభవం... థాంక్స్ బావా...'' అన్నాడు వియ్యంకుడు చంద్రమౌళీశ్వర్.
'ఇండియానాపొలిస్'లో పాణి అన్నమాటలు గుర్తుచేశాను.
''అరె శ్రీకాంత్... పాణి నన్ను నోరు తెరవద్దు అన్నాడు... నీ అమాయకత్వం బైట పడుతుంది అని అన్నాడు...'' అన్నాను.
''నిజమే నాన్నా! అయితే మీదంతా ప్రపంచాన్ని మీరే మార్చేస్తున్నట్టు సోది నాన్నా... వాళ్ళకు అదే కావాలె... మీకు అదే కావాలె... అందుకని మీరు చెప్పింది విన్నారు... అయితే నాన్నా... నీ ఏడు పుస్తకాలు అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఆవిష్కరించడం నాకు చాలా ఆనందం వేసింది...'' అన్నాడు శ్రీకాంత్.
పిల్లలు ఉపాధి వెతుక్కుంటూ అమెరికా రావడంవల్ల మాకు ఈ అవకాశం దొరికింది. జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండలేదు. అదేమాట అన్నాను.
''మీరు అమెరికాకు వస్తే నాకు ఈ అవకాశం దొరికింది రా... న్యూజెర్సీలో కూడా మీటింగ్ చాలా బాగా జరిగింది. నువ్వు చివరిదాకా వుండమంటే వుండకపోతివి.''
''వాళ్ళంతా చాలా పెద్ద వయస్సు వాళ్లు.... బోస్టన్ టెలికాన్ఫరెన్స్ కూడా బాగానే జరిగింది కదా!''
''పాణి నన్ను ఇక్కడ నువ్వు మాట్లాడితే నవ్వుతారు అని అన్నాడు. నేను మాట్లాడింది వాళ్లు ఎలా విన్నారో చూసినవు కదా!''
''అవును నాన్నా! రేపు వాషింగ్టన్ డిసి చూడ్డానికి పోదాం. అమ్మ, నువ్వు రెడీగా వుండండి.''
''న్యూజెర్సీ, న్యూయార్క్ ఎప్పుడు చూపిస్తావు.''
''అవి లోకలే కదా నాన్నా! ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు గాని ముందు దూర ప్రదేశాలు చూపిస్తా.'' అన్నాడు శ్రీకాంత్.
మేము వచ్చింతర్వాతనే అందరికి కలిపి ఒకేసారి చూపిద్దామని మా వియ్యంకుడికి కూడా అంతదాకా ఏమీ చూపించినట్లు లేదు. అందరం కలిసి లిబర్టీ స్టాచ్యు, న్యూయార్క్ సిటీ, ఇంకా ఎన్నో చూశాము. ప్రతిచోటా ఫోటోలు దిగాము. వాషింగ్టన్ డి.సి.లో ఒబామా మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశాన్ని చూశాము. అక్కడి మ్యూజియంలన్నిటిని కలియతిరిగాము. అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్ ముందు నిలబడి చాలాసేపు గడిపాము. న్యూయార్క్‌లోని టైంస్క్వేర్‌లో రోజుకు 120 దేశాల ప్రజలు వస్తుంటారు అని శ్రీకాంత్ చెప్తే ఆశ్చర్యపోయాము. షేర్‌మార్కెట్‌కు చిహ్నంగా వేసే బుల్ బొమ్మవద్ద నిలబడి ఫోటోలు దిగాము.
జ జ జ జ
అలా మూడు నెలలు గడిచాయి. ఇండియాకు బయలుదేరాము. ఇండియాకు వచ్చి కూడా మూడు నెలలు అయిపోయింది. ఆరోజు ఉదయమే కాలింగ్ బెల్ మోగింది.
''నన్ను గుర్తు పట్టారా సార్?.... మీటింగులో మిమ్మల్ని కలిశాను. మీతో మాట్లాడాను. నా పేరు కరుణాకర్ సార్! టీచర్‌గా పని చేస్తున్నాను.''
''గుర్తు లేదు. దా! కూర్చో. రోజూ ఎంతోమంది కలుస్తుంటారు. మూడు నెలలు దాటితే మళ్లీ కలవకపోతే గుర్తుండటం కష్టం. అందువల్ల ఏమనుకోకు. సారీ!''
''నేను కథలు రాద్దామని మీ సూచనలు కావాలని అడిగాను. గుర్తుందా సార్. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు.''
''కొడుకు అమెరికా రమ్మంటే పోయి వచ్చిన. అక్కడ ఇండియా ఫోన్లు పని చేయవు. అయినా ఆ మీటింగ్ జరిగిన తరువాత ఆరు నెలలకు స్టేట్స్‌కు పోయిన. వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు?''
''.............''
''కరుణాకర్! కాలం తిరిగి రాదు. సంవత్సరం తరువాత మళ్ళీ కథలు రాయాలని అడగడం కోసం వస్తే ఎలా? ఏమైనా కథలు చదివావా?''
''కొన్ని చదివాను. ఒక కథ రాశాను. చూస్తారని తెచ్చాను. చూస్తారా సార్.''
''సరేగానీ! ఈ చాయ్ తీసుకో. ఈమె మా ఆవిడ శ్యామల. బీడీలు చేసి పిల్లలను పెంచి పోషించింది. నేను అప్పుడు ఇంట్లో లేను. పదేళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వనవాసం చేశాను. సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం దేశం తిరిగాను. పిల్లలు ఇప్పుడు అమెరికాలో వున్నారంటే ఆమె కృషే.'' అని గతాన్ని వివరించాను.
''నమస్కారం మేడమ్. చాయ్ చాలా బాగుంది.'' అన్నాడు కరుణాకర్.
కొన్ని పుస్తకాలు ఇచ్చాను. అదీ ఇదీ మాట్లాడి ''థాంక్స్ సార్. నా కథ తప్పక చదవండి సార్. పది రోజుల తరువాత ఫోన్ చేస్తా సార్.'' అంటూ వెళ్ళిపోయాడు కరుణాకర్. నెల తర్వాత కరుణాకర్ ఫోన్ చేశాడు.
''కథా వర్క్‌షాపు పెడుతున్నాము. మీరు తప్పక రావాలి సార్''. అని అడిగాడు.
''కథా వర్క్‌షాపుకు రావడానికి నాకు ఫీజు వుంటుంది'' అన్నాను.
''ఫీజా? ఎంత సార్?'' అని ఆశ్చర్యపోయాడు కరుణాకర్.
''నా ప్రసంగాన్ని క్యాసెట్లో, సి.డి.లో రికార్డు చెయ్యాలి. దాన్ని సి.డి. నుండి రాసి రాత ప్రతి ఇవ్వాలి. నేను కరెక్షన్స్ చేస్తాను. వాటిని కూడా సరిచేసి ఫేర్ కాపీ ఇవ్వాలి. ఇదే నా ఫీజు. దాన్ని నేను పత్రికలకు పంపిస్తాను. పుస్తకంలో చేర్చుతాను.''
''అలాగే సార్. తప్పకుండా రావాలి సార్. డేట్ ఫిక్స్ చేసే ముందు మీ అపాయింట్‌మెంట్ తీసుకుంటాను. పది రోజుల్లో ఫోన్ చేస్తాను సార్.''
కరుణాకర్ మళ్ళీ కలవలేదు. అక్కడనుండి ఫోన్‌లేదు.
నేను ఫోన్ చేస్తే ఈ నెంబరుతో ఏ ఫోన్ పనిచేయుటలేదు అని పలికింది.
జ జ జ జ
యేడాది తర్వాత కరుణాకర్ మళ్ళీ ఫోన్ చేశాడు. కథా వర్క్‌షాప్ బాగా జరిగింది. ఆయన ప్రసంగ పాఠాన్ని రాసిస్తానని మాటిచ్చి మరిచిపోయాడు. నేను కొంతకాలం చూసి ఆ విషయమే మరిచిపోయాను. ఒకరోజు ఉదయాన్నే కరుణాకర్, జోత్స్న దంపతులు ఇంటికి వచ్చారు.
''ఇదుగోండి సార్ మీ ఫీజు'' అంటూ ప్రసంగ పాఠం, రాతప్రతి చేతికిచ్చాడు.
''థాంక్యూ... కరుణాకర్! అరె... ఇది నీ హ్యాండ్ రైటింగ్ లాగా లేదు.''
''ఈమె మా ఆవిడ జోత్స్న! ఈమే ఫెయిర్ చేసింది సార్. స్కూల్లో వర్క్‌లోడు ఎక్కువుంది. ఈ మధ్య తెలంగాణ ఉద్యమం కూడా విస్తరించింది. పాల్గొంటున్నాను. సమయం దొరకలేదు. జోత్స్నను రాసిపెట్టమంటే రాసిపెట్టింది.''
''జోత్స్నా! మీ ఆయన ఫీజు నువ్వు కడుతున్నావా? ఒకటికి రెండు సార్లు సి.డి. వినుకుంటు రాస్తుంటే ప్రసంగం విన్న వాళ్లకన్నా ఎక్కువ విషయాలు అర్థమవుతుంటాయి.''
''అవును సార్. ఈ ప్రసంగం పాఠం ఫెయిర్‌కాపీ రాశాక నాకు కూడా కథలు రాయాలని అనిపిస్తున్నది సార్.''
''చాలా మంచి ఆలోచన. కథలు నీలాంటి వాళ్లు బాగారాయగలరు జ్యోత్స్నా!...'' అని అన్నాను.
అలా ఒక సభ అయిపోవడంతో దానిపని అయిపోలేదు. సభ అయిపోయాకే కొత్త సంబంధాలు, అనుబంధాలు ప్రారంభమయ్యాయి. అది సభలో కలిసిన ఆర్గనైజర్స్‌తోనే ఆగిపోలేదు. కరుణాకర్‌తోనే ఆగిపోలేదు. కరుణాకర్ ద్వారా జ్యోత్స్న కూడా పరిచయం అయ్యింది. జ్యోత్స్న ద్వారా ఆమె ఆడపడుచు కరుణాకర్ చెల్లెలు తాను కూడా కథలు రాస్తానని ఇద్దరు కలిసి వచ్చారు.
ఆ తర్వాత ఈ కథ రాసి తెచ్చింది జోత్స్న. సూచనలు అడిగింది. బాగానే ఉందనిపించింది. మీకెలా అనిపించిందో చెప్పండి. జోత్స్నకు చెప్తాను.
''దట్స్ తెలుగు డాట్ కామ్'', వన్ ఇండియా తెలుగు, జూన్ 2013.