Friday, October 7, 2016

విలువలు ''జీవితంలో నువ్వు తిరిగి తల ఎత్తుకొని బతకాలని సరోజ కోరుకుంది. నువ్వు గతాన్ని వదిలించుకుని జీవితం గెలుచుకోవడానికి నీకు తోడుగా నిలుద్దామనుకుంది. అలాంటి మేడమ్‌ను నువ్వు తప్పు పట్టడం, ఆమెను బాధపెట్టడం నువ్వు చేసిన పెద్ద పొరపాటు. ఆమెను తప్పు పట్టడానికి, విమర్శించడానికి మనకున్న అర్హతలేమిటి? హక్కులేమిటి? యుఎస్‌ఏలో అంతకాలం వుండి ఇండియాకు వెళ్లిపోయాక ఇంత తొందరగా పాత భావాల్లోకి మళ్లీ ఎలా కూరుకుపోయావు? నిన్ను కలిసిన తరువాత సరోజక్క నాకు ఫోన్‌ చేసి బోరున ఏడ్చేసింది. చాలా కాలం తర్వాత సరోజక్క ఏడ్వడం చూశాను. ఆమె ఏడుపును, దుఃఖాన్ని అధిగమించింది. ఆమె దుఃఖమయ జీవితం నుండి తనను తాను విముక్తం చేసుకొని హాయిగా బతుకుతూ పదిమందికి సంతోషాన్ని పంచుతోంది. అలాంటి సరోజక్క భోరున ఏడ్చిందంటే నీవు ఎంతగా బాధపెట్టి వుంటావో నేను ఊహించుకో గలను. నీ వ్యక్తిత్వంలో వున్న ప్రధానమైన లోపం ఇదే. ఇతరుల నుండి సంతోషాన్ని గ్రహించే బదులుగా నీ దుఃఖాన్ని, విషాదాన్ని వాళ్ల మీద రుద్ది వారి సంతోషాన్ని హరింప చేసి దుఃఖాల పాలు చేయడం నీ వ్యక్తిత్వంలో ప్రధానమైన లోపం. అందువల్లే నీవు ఎవరిని కలిసినా ఆనందంగా వుండలేకపోతున్నావు. గతాన్ని తల్చుకుంటూ డిప్రెషన్‌లోనే ఉండిపోతున్నావు. సరోజక్కలో ఉందనుకుంటున్న కన్ఫ్యూజన్‌ నీకు సంబంధించిందే. నీ లోపాలే ఆమెలోని లోపాలుగా భావించావు. నువ్వు వాస్తవాలు చెప్పలేక ఆత్మవంచన, పరవంచనకు గురవుతున్నావు. భ్రమలో బతుకుతున్నావు. ఆ భ్రమలు పటాపంచలు చేయడమే సరోజ చేసిన పని. మనకున్న భావాలు బద్దలు కొట్టే సరోజలాంటి వాళ్లు ఎదురైనప్పుడే భ్రమలు వీడి వాస్తవాలు గ్రహించడం సాధ్యం. నిన్ను నీకు అద్దంలో చూపించడాన్ని నువ్వు భరించలేకపోయావు. నీ ఆత్మవంచన, పరవంచనను బట్టబయలు చేసిన సరోజను నువ్వు క్షమించడం చాలా కష్టం. ఆమె నీ మేలు కోరేదైనప్పటికీ ఆమెను శత్రువుగా చూస్తూ పది మందిలో చులకన చేస్తూ ద్వేషిస్తున్నావు. ఈ కారణంగానే చాలామంది అనేక విషయాలు తెలిసినప్పటికీ, విప్పి చెప్పటానికి, ఒప్పించటానికి వెనుకంజ వేస్తారు. సరోజ అందుకు వెరవక నిన్ను నీకు అర్థం చేయిస్తే ఆమెనే తప్పు పడుతున్నావు. ఆమె జీవితం ఆమెది. ఆమె బాధలు ఆమెవి. ఆమె సమస్యలు ఆమెవి. ఆమె విలువలు ఆమెవి. అవి నీకెందుకు? నాకెందుకు? అవి మనకెందుకు చర్చనీయాంశం కావాలి? నీవు పనిగట్టుకొని అలాంటి విషయాలను సరోజను గుచ్చిగుచ్చి ప్రశ్నించి బాధపెట్టావు. అయితే ఆమెను నువ్వు అడిగిన విషయాలన్నీ నీకు సంబంధించినవే. కానీ వాటిని ఆమెకు సంబంధించిన విషయాలుగా ఆరోపించి అడగడం వల్ల తనను కించపరచడం కోసం, అవమానించడం కోసం అడుగుతున్నావని ఆమె భావించడం వల్ల ఏం చెప్పాలో, ఏ చెప్పకూడదో ఏం చెబితే ఏం జరుగుతుందో అనే సంకోచంతో కన్ఫ్యూజింగ్‌గా మాట్లాడింది. నిజానికి ఆమె నీలాంటి వాళ్ల జీవితాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దింది. అయితే వాళ్లు ఆమెను అపారంగా గౌరవించి ఆమె సూచనలను స్వీకరించారు. గైడ్‌గా ఫిలాసఫర్‌గా గౌరవించారు. ఆమె నుండి నీవు నేర్చుకోవాల్సింది పోయి ఆమె జీవితాన్ని, జీవితంలోని తప్పటడుగులను నిలదీస్తున్నట్లుగా అడగడం నీ అహంకారానికి, ఆధిపత్య భావానికి నిదర్శనం. జీవితంలో ప్రతి విషయమూ సరోజక్కకు గుర్తుంది. అయితే వాటిలో కొన్ని మరిచిపోవాలనుకుంటోంది. అయినా నీలాంటి వాళ్లు గుచ్చిగుచ్చి ప్రశ్నించే సరికి మరిచిపోలేకపోతోంది. మరిచిపోవాలనుకున్న విషయాలను గుచిగుచ్చి ప్రశ్నించి మర్చిపోలేకుండా చేసే వాళ్లు చేసే అపకారం ఇంతాఅంతా కాదు. వాళ్లు సానుభూతి రూపంలో తీవ్రమైన నష్టం చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడతారు. తమ ఆధిపత్యాన్ని సానుభూతి రూపంలో నెలకొల్పుతుంటారు. వాళ్లు మర్చిపోవాలనుకున్న విషయాలను అడగడం నిజానికి ఒక నేరం. సరోజ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఆ సంఘటన గురించి నువ్వు గుచ్చిగుచ్చి అడగడం నీ శాడిజానికి, ఆధిక్యతకు నిదర్శనమే తప్ప సహృదయత అన్పించుకోదు. సరోజక్క తన విషయాలు చెప్పలేదు నిజమే. చెబితే మాత్రం ఏం చేస్తావు? దాన్నుంచి నీవేమైనా నేర్చుకోవడానికి సిద్ధంగా వున్నావా? తప్పు పట్టకుండా నువ్వు వున్నదున్నట్టుగా స్వీకరించడానికి సిద్ధంగా వున్నావా? అయితే విను. సంక్షిప్తంగా సరోజ జీవితంలోని కష్టాలను చెబుతాను. ఆమె ఎందుకు వాటిని మర్చిపోవాలనుకుంటోందో ఆ కారణాలు తెలుసుకుంటే తప్ప వాటి పట్ల సమాజం ఇచ్చిన విలువల రీత్యా ఆలోచించడం నుండి విముక్తం కాలేవు. ఆమె తన జీవితంలోని అన్ని సంఘటనలను యదార్థంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. నీవు, నీలాంటి సమాజమే అందుకు సిద్ధంగా లేదు. జ జ జ జ స్వప్నా! కొందరికి బాల్యచాపల్యం వుంటుంది. బాల్యం, కౌమారం దాటి సరోజలో నూతన యవ్వనం... తన పదహారో ఏట... సత్యానంద్‌ ఆరు నెలలుగా వెంటబడి ప్రేమిస్తున్నానని ఏడ్చాడు. నవ్వాడు. నవ్వించాడు. కవ్వించాడు. ''స్వరూపా! జొన్న చేనులో గువ్వ పిట్టను పట్టుకున్నట్టు పట్టుకోవడానికి కేవలం సత్యానంద్‌ కారణం కాదు. నాలోని యవ్వనపు పొంగు కూడా కారణమే. ఏ సినిమా, టీవీ చూసినా ఆ ఆసక్తినే రెచ్చగొట్టాయి. నేను ఇప్పుడు సిన్మాల్ని కూడా తప్పు పట్టదల్చుకోలేదు. నాలో ఆ విషయం తెల్సుకోవాలనే వయస్సు తెచ్చిన ఉద్వేగం లేకపోతే ఏ సిన్మాలు ఏం చేస్తాయి. పశుపక్ష్యాదులు వాటి లైంగిక ప్రవృత్తి ఏ సినిమాలు చూసి...? లైంగిక సహజాతాలు వయస్సును అనుసరించి కలుగుతూనే వుంటాయి.'' అంది ఒకసారి సరోజ నాతో. ''పెళ్ళి చేసుకుంటాడనుకున్న సత్యానంద్‌ మరో సంబంధం చూసుకున్నాడు. ఏడ్చి అడిగితే రెండో భార్యగా పెళ్ళి లేకుండా ఉంచుకుంటానన్నాడు. ఆడది ఎంత నిస్సహాయురాలో గుర్తొచ్చి వలవలా ఏడ్చేశాను. దాన్నో బలహీనతగా తీసుకుని ప్రేమ పేరిట ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ఒక రకంగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ మరికొన్నాళ్ళు నా జీవితంతో ఆడుకున్నాడు సత్యానంద్‌.'' ''నాకు రెండోనెల పీరియడ్స్‌ రాకపోయే సరికి అమ్మ అనుమానపడింది. వాంతుల్తో నేను ఆయోమయం అయిపోయాను. చెప్పుకుంటే ఇంకా అప్రదిష్ట అని అమ్మ నోరు నొక్కుకుంది. అమ్మమ్మ గారింటికి వెళ్తున్నట్టు చెప్పుకొని జిల్లా కేంద్రంలో ఓ సిస్టర్‌ను ఆశ్రయించింది అమ్మ. ఆ కాలంలో అబార్షన్‌ అనేది చాలా రహస్యంగా చేసే వాళ్లు. సమాజంలో దానికి గౌరవం వుండేది కాదు. ఆ సిస్టర్‌ సరేనని ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పి ఎవరినో గదిలోకి పంపింది. అతడామె తమ్ముడో అన్నో, భర్త, మరెవరో తెలియదు. నేను బిత్తరపోయాను. అమ్మ ఏం చేయలేకపోయింది. అబార్షన్‌ చేశాక ఫీజులో కన్సెషన్‌ ఇచ్చారని ఏడుస్తూ చెప్పింది. అబార్షన్‌ బాధ తెల్సి వచ్చాక యవ్వన చాపల్యం భయంగా మారింది. నాకు జీవితం ఏమిటో తెల్సి రావడం మొదలైంది. అమ్మ నన్ను, నా భవిష్యత్తును ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకున్నాను. నాన్నకు ఈ విషయాలేవీ తెలియనీయలేదు అమ్మ. నేను అలా కొన్నాళ్లు కుమిలిపోయాను. చదువుమీద శ్రద్ధ పెట్టాను. బీ.టెక్‌ పాసయ్యాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యాను. బెంగళూరులో కొన్నాళ్లు పని చేశాను. ఉద్యోగం మారి పెద్ద కంపెనీలో చేరి పూణె వెళ్ళాను.'' అంటూ సరోజ తన జీవితాన్నంత నా ముందు పరిచింది. అలా స్వప్నా! సరోజ తన ఉద్యోగంతో తల్లిదండ్రులకు ఆసరా అయింది. పెళ్లి విషయం వచ్చినప్పుడల్లా వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఎందుకు వాయిదా వేస్తుందో తల్లికి కాస్త తెలుసు. తండ్రికి అసలు తెలియదు. అమ్మ అనసూయ కొద్దిరోజులు పూణెలో కూతురుకు తోడుండాలని వెళ్లింది. కూతురులో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఎంతో సంతోషపడింది. ''సరోజా! పెళ్లి చేసుకోవే... నీకు నచ్చిన పిల్లవాడినైనా సరే... ఏ కులమైనా సరే... పెళ్లి చేసుకోవే... నాన్నను ఒప్పిస్తాను... ఏదో జరిగిందని, పెళ్లి చేసుకుంటే ఏదో జరుగుతుందని భయపడకు... ఆ విషయాలు నీకు నాకు తప్ప ఎవరికీ తెలియవు'' అని అనసూయమ్మ సముదాయించింది. సరోజ మనస్సు ఎందుకో అంగీకరించలేదు. ఆమెకు మగవాళ్ల పట్లే ఒక వ్యతిరేకత, భయం ఏర్పడింది. పదిమందిలో అందరితో కలుపుగోలుగా మాట్లాడేది. కానీ ఏకాంతంగా ఎవరైనా మగవాళ్లు ఎదురైనప్పుడు మౌనంగా చూడనట్టుగా తప్పుకునేది. ఇలా భయం భయంగా కొన్నాళ్లు పూణెలో గడిపింది. ఆ తర్వాత తిరిగి బెంగళూరులో పెద్ద ఉద్యోగంలో చేరింది. ఏడాది తిరక్కుండానే అమెరికాకు వెళ్లిపోయింది. మూడేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసింది. ఇండియాలో, అమెరికాలో ఎన్నో సంబంధాలు వచ్చాయి. అన్నిటినీ ఏదోవంకతో నచ్చలేదని తిరస్కరించింది. తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. సరోజ యూఎస్‌ఏలో కొత్త జీవితం ప్రారంభించింది. ఆమె వ్యక్తిత్వం సంపూర్ణంగా, స్వతంత్రంగా వికసించడం అప్పుడే మొదలైంది. ఇక్కడి స్వేచ్ఛా సమాజం బాగా నచ్చింది. కారు కొనుక్కుంది. అసలిక్కడ కారు లేకుండా గడవదు. తన సంపాదనలో కొంత ఇంటికి పంపింది. తాను కొంత కూడబెట్టుకుంది. ''స్వరూపా! ఇండియాలో శీలం అని పిలిచే విలువలు ఎంత అర్ధరహితమైనవో...! ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అమెరికా సమాజం ఎంత హాయిగా జీవిస్తుందో గమనిస్తే... ప్రపంచమంతా ఇంత స్వేచ్ఛా సమాజంగా మారితే ఎంత బాగుండేదో... ఎన్ని సమస్యలు పరిష్కరించబడేవో... కుటుంబం పేరిట, పెళ్లి పేరిట ఇండియాలో కొనసాగుతున్నది స్త్రీల ఏకపక్ష బానిసత్వమే తప్ప మరొకటి కాదు. ఇండియాలో మగవారికి ఒక నీతి, ఆడవారికి ఒక నీతి. మగవాడు, నాకు పది మంది స్త్రీలతో సంబంధం వుంది అని చెప్పుకోవడం గొప్పగా ఫీలవుతాడు. ఇదే మాట ఆడవాళ్లు చెప్తే తిరుగుబోతు అంటారు. ప్రతి మగవాడు తన భార్య పతివ్రత అంటాడు, అనుకుంటాడు. అందరి భార్యలూ పతివ్రతలైతే, మరి ఈ మగవాళ్లు ఎవరితో తిరిగినట్టు? మగవాళ్లు, చెప్పుకుంటారు, ఆడవాళ్లు చెప్పుకోరు అని కుండ బద్దలు కొట్టినట్టు ఒక ప్రజాకవి ఎప్పుడో చెప్పాడు. ఈ ద్వంద్వ ప్రమాణాలు మగవాళ్లకు గౌరవాన్ని పెంచి, ఆడవాళ్లకు అవమానాన్ని మిగులుస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థ జైలు కన్నా హీనం. యూఎస్‌ఏలో నీ స్వేచ్ఛను అపారంగా గౌరవిస్తారు, వారి స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. స్వేచ్ఛకు స్వాతంత్య్రానికి స్వయం నిర్ణయానికి అపారమైన విలువనిస్తారు. మన సమాజంలోని కుల మత ప్రాంత వైవాహిక, కుటుంబ వ్యవస్థల విలువలు, గౌరవాలు, సంస్కృతికి అతీతంగా మనిషిని గుర్తించడం, గౌరవించడం జరిగినప్పుడే నిజంగా మనిషిని మనిషిగా చూసే చూపు మనకబ్బుతుంది. అంతదాకా మనం మన మీద రుద్ద బడిన విలువల చట్రంలో, ఊహల్లో బతుకుతుంటాము. ఎవరో నిర్ణయించిన విలువల్లో, చట్రాల్లో బందీలుగా జీవితాలు తరాల తరబడి లాగిస్తుంటారు. చివరకు మిగిలేదేమిటి? ఈ సమాజాన్ని విలువలను, సంస్కృతిని యధాతధంగా ఏ మాత్రం మార్చకుండా కొనసాగించడమేనా? అంటే మనం ఈ వ్యవస్థకు, విలువలకు, సంస్కృతికి యంత్రాలుగా మారి కట్టుబానిసలుగా, వెట్టిచాకిరీ వాళ్లుగా, బతుకులీడుస్తున్నామా? మనకు స్వేచ్ఛ ఎక్కడ వుంది? ఇది స్వేచ్ఛ ఎలా అవుతుంది? స్వరూపా! నీకు ఈ విషయం అర్థమవుతుందా?'' అని ఒకసారి చాలా సీరియస్‌గా మాట్లాడింది. ''స్వరూపా! అమెరికాలో టీవీ చూసే ప్రతి ఒక్కరికి 'ఆప్రా విన్‌ఫ్లే' గురించి తెలుసు. నువ్వు ఆప్రా రాసిన పుస్తకాలు చదివే వుంటావు. ఎంత గొప్ప విశ్లేషణ! పెళ్లి గురించి, ప్రేమ గురించి, విడిపోవాల్సి వస్తే ఎలా విడిపోవాలో, మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో... ఎన్ని కోణాల్లో చర్చించిందో... ఆరేడు సార్లు విడిపోయిన తర్వాత కూడా తిరిగి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఆనందంగా, సుఖంగా, ఆత్మీయంగా జీవించడం ఎలాగో అద్భుతంగా వివరించింది. ఎక్కడా జరిగిపోయిన దానికి కుమిలిపోయే తీరు లేదు. ఇన్ఫిరియారిటీ, తప్పు చేశామనే భావన లేకుండా జరిగిపోయినదాని గురించి చింతించకుండా నూతన జీవితాన్ని సాధించుకోవడం గురించి ఆమె ఇచ్చిన సజీవ ఉదాహరణలు, వారి ఫోటోలు... వారి అనుభవాలు ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగింప చేస్తాయో... నిజంగా ఆప్రాకి అమెరికా సమాజం ఎంతో రుణపడి వుంది.'' అంటూ తనలో వస్తున్న మార్పులను చెప్పకనే చెప్పింది సరోజ. నేను మంచి శ్రోతకు మించి ఆమెకు చేసిందేమీ లేదు. ''... రవీంద్ర చాలా స్నేహంగా, ఆత్మీయంగా మెలిగే వాడు. అతనితో అప్పుడప్పుడు కలిసి జీవించడం తప్పుకాదనుకున్నాను. అతడికి పెళ్ళి కాలేదు. కనుక ఇద్దరినీ తప్పు పట్టేవారు కించపరిచే వారు ఎవరూ లేరు. కొన్నాళ్లు అలా హాయిగా గడిచిపోయింది. రవీంద్ర వీసా గడువు తీరిపోయి తిరిగి ఉద్యోగం దొరక్క ఇండియాకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉద్యోగం దొరికే దాకా నా వద్దే వుండమన్నాను. ఇండియాలో పుట్టిన మగమనస్తత్వం ఎక్కడ పోతుంది?... నా మీద ఆధారపడి బతకడాన్ని చిన్నతనంగా ఫీలయ్యాడు రవీంద్ర. రవీంద్ర తనతో పాటు నన్ను ఇండియాకి రమ్మని కోరాడు. ఇండియాలో పెళ్లి చేసుకుందామన్నాడు. ఇండియా అంటే నాకు మహా చిరాకు. అక్కడి విలువలు మనిషిని హింసించడానికే అని బలమైన నమ్మకం. అమెరికా సమాజాన్ని, ఇక్కడి విలువలను, సంస్కృతిని అందులోని గొప్పతనాన్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని గౌరవించాను. ఆచరించాను. నాకు అమెరికా సమాజంలో ఒకరుగా కలిసి పోవాలని ఉంది. అయినా చిన్నప్పటి పెంపకం నాలో ఏదో సంకోచాన్ని చెర్నాకోలలా ప్రవేశపెడుతూనే వుంది. నేను ఇండియాకు వచ్చి తిరిగి ఊబి వంటి ఇండియాలోని కులం, మతం, సామాజిక, సాంస్కృతిక విలువల చట్రంలో కూరుకుపోదల్చు కోలేదని రవీంద్రకు తెలుసు. అదే విషయం రవీంద్రతో చర్చించాను. రవీంద్ర ''మనం అందరికీ దూరంగా ఎక్కడో ఢిల్లీలో వుండిపోదాం'' అని ప్రతిపాదించాడు. ''అదంత సులభం కాదు. ఇండియాలో వున్నాక ఎక్కడ వున్నా సంబంధాలు, స్నేహాలు తిరిగి కలవక తప్పవు. అందువల్ల నేను రాను'' అన్నాను. రవీంద్ర ఆడపిల్లలా సున్నిత మనస్కుడు. సహృదయుడు. నన్ను అమితంగా ప్రేమిస్తాడు. అతనంటే నాకెంతో ఇష్టం. అతను లేకుండా జీవితం గడపడలేనని కూడా ఓ పక్క బాధిస్తోంది. అయినా నాకు ఇండియాకు వెళ్లాలని లేదు. రవీంద్రకు, నా మీద ఆధార పడి వుండాలని లేదు. పైగా ఆయన తన సంపాదనను ఇంటికి పంపాల్సిన అవసరం వుండేది. ''నీతో వుంటే నేను బతకొచ్చు గానీ ఇంటికి పంపలేను కదా!'' అంటూ బాధపడిపోయాడు రవీంద్ర. రవీంద్ర మరో ప్రతిపాదన చేశాడు. ''జెస్సీ! నువ్వు మనసు మార్చుకో! ఇండియాకు వచ్చేసెయ్‌. రెండేళ్ల దాకా ఇండియాలో నీ కోసం ఎదురు చూస్తాను. రెండేళ్ల తర్వాత కూడా నీవు రాకపోతే, నా ప్రేమను తిరస్కరిస్తే నేను నా పెళ్లి ఆలోచన చేస్తాను'' అన్నాడు. జెస్సీ అనేది, రవీంద్ర నాకు పెట్టుకున్న ముద్దు పేరు. నేను రెండేళ్లలో వంటరితనంలో తప్పకుండా మారతాననుకున్నాడు రవీంద్ర. నా అనుభవాలు ఇచ్చిన భయంకర జ్ఞాపకాలు ఆయనకు లేవు. ''రెండేళ్ల తర్వాత కూడా చక్కగా పెళ్లి చేసుకో అని చెప్పేశాను. పెళ్లి చూపుల విశేషాలు, చర్చలు అన్నీ ఫోన్‌ చేసేవాడు. నా గురించి నీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. నీ నిర్ణయమే ఫైనల్‌ అన్నాడు. రవీంద్ర ఇంటర్నెట్‌లో పంపిన పెళ్లికూతురి ఫోటోలు, బయోడేటాలు చూసి అమ్మాయిలతో నేనే ఫోన్‌లో మాట్లాడి ఒక సంబంధాన్ని సజెస్ట్‌ చేశాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు రవీంద్ర. రవీంద్ర అలా నన్ను అపారంగా గౌరవించినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. నన్ను ప్రేమ పేరిట నా అమాయకత్వాన్ని వాడుకొని బ్లాక్‌ మెయిల్‌ చేసిన సత్యానంద్‌ ఎక్కడ? మహోన్నత మానవీయ విలువలతో స్నేహానికి, ప్రేమకు ప్రాణమిచ్చే రవీంద్ర ఎక్కడ? రవీంద్ర పెళ్లికి కొరియర్‌లో గిఫ్ట్‌లు కూడా పంపాను. మా స్నేహం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఒకనాటి ప్రేమ, లైంగిక సంబంధాలు లేకపోయినా స్నేహం అలాగే కొనసాగించడం ఇండియాలో సాధ్యమా?'' ''జెస్సీ! నీవు అక్కడైనా నీకు నచ్చిన అతన్ని పెళ్ళి చేసుకో! మన ప్రేమ పెళ్లిగా మారలేదని బాధపడుతూ అలాగే వుండిపోవద్దు''అని రవీంద్ర ఎన్నో సార్లు కోరాడు. ''నా పెళ్లి విషయం మళ్లీ మళ్లీ గుర్తు చేస్తే నేను ఫోన్‌ ఎత్తనని బెదిరించాను.'' రవీంద్ర నా మాటను గౌరవించాడు. మళ్లీ ఆ విషయం తేలేదు. పెళ్లి విషయం ఎత్తితే నేను ఫోను కూడా ఎత్తను అని అమ్మానాన్నలకు ఎప్పుడో చెప్పేశాను. అందువల్ల పెళ్ళి చేసుకోమని అడిగే వాళ్లు లేకుండా పోయారు. కొన్నాళ్లు నాకు యుఎస్‌ఏలో హాయిగానే గడిచింది. గ్రీన్‌ కార్డ్‌ రాకపోయినా ఉద్యోగానికి ఢోకా లేకుండా కంటిన్యూగా చేస్తూనే వచ్చాను. నాన్నకు ఆరోగ్యం బాగాలేదని అమ్మ ఫోన్‌ చేసింది. ఇదో వంక అని నమ్మలేదు. కానీ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి నాన్నకు కాళ్లు, చేతులు పడిపోయాయని నాలిక సరిగా తిరగడం లేదని చెప్పింతర్వాత, వెబ్‌కెమేరాతో నాన్నతో మాట్లాడించాక నమ్మక తప్పలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ ఫోన్‌ చేస్తూ ఏడ్వడమే ఏడ్వడం. అమ్మ అంటే నాకు అపారమైన గౌరవం. నాకు అమ్మ తప్ప ఈ ప్రపంచంలో తోడు ఎవరున్నారని...? నేను ఇలా స్వేచ్ఛగా ఎదగడానికి, హాయిగా బతకడానికి అమ్మ సపోర్టే కారణం. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోయాను. దీనికి తోడు యుఎస్‌ ఏకాంత జీవితం పట్ల ఏదో వెలితి మొదలైంది. రవీంద్ర పదేపదే గుర్తుకు వచ్చే వాడు. అతను చెప్పినట్టు అప్పుడు ఇండియాకు వెళ్లిపోయి వుంటే బాగుండేదేమో అనిపించింది. ఇండియాకు వెళితే తిరిగి ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి గురించిన చర్చ రాక తప్పదు. అందుకు ఏం చేయాలో ఆలోచనలో పడ్డాను. రకరకాల ఊహలు... కొందరు ఇండియాలో పెళ్లి లేకుండా స్త్రీ పురుషులు సహజీవనం చేస్తున్నారని విన్నాను. సింగిల్‌ పేరెంట్‌ ఫ్యామిలీగా స్త్రీ తన పిల్లలతో ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నదని తెలిసింది. వారిని కూడా సమాజం గౌరవిస్తోందని తెలిసి సంతోషించాను. అవును... ఎవరి జీవితం వారిదే. ఎవరి జీతం వారిదే. జీవితంలో కేవలం స్నేహితులుగా జీవించడం. అప్పుడప్పుడు ప్రేమ పూరితంగా ఇష్టపూర్తిగా కలుసుకోవడం. ఇది సహజీవన దాంపత్యం. ఈ పద్ధతి బాగానే వుంది. ప్రపంచ వ్యాప్త పరిణామాలు ఆలస్యంగానైనా, కొద్దిగానైనా ఇండియాలో నూతన విలువలు, సంస్కృతి వ్యాపించడం చాలా సంతోషం కలిగించింది. అలాంటి సమయంలో ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది.'' ''అలా ఇండియాలో ఉద్యోగం వెతుక్కుని బెంగళూరులో స్థిరపడింది సరోజ. తల్లిదండ్రులను బెంగళూరుకే పిలిపించుకుంది. కొన్నాళ్లకు తండ్రి పోయాడు. బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించింది. తల్లి తనతో పాటే వుండిపోయింది. తల్లీ కూతుళ్లు బెంగళూరులో హాయిగా జీవిస్తున్నారు. సరోజ కోసం శశిధర్‌ వచ్చినప్పుడు సొంత అల్లుడి లాగానే గౌరవించింది అనసూయమ్మ. ఇద్దరూ ఒకటవుతారని సంతోషపడింది. రిజిస్ట్రేషన్‌ పెళ్లయినా చేసుకుంటారని ఆశించింది. ఏమైందో తెలియదు అనసూయమ్మకు. కొన్నాళ్లకు శశిధర్‌ స్థానంలో వివేక్‌ రావడం మొదలైంది. దాన్ని కూడా అనసూయమ్మ ఆమోదించింది. అతడైనా నిలకడగా వుండిపోతాడని ఆశపడింది. వివేక్‌ను కూడా సొంత కొడుకులా, అల్లుడులా గౌరవించింది. వివేక్‌ ప్రేమ కన్నా, పెళ్లి కన్నా తన కెరీర్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రమోషన్‌లు వెతుక్కుని బెంగళూరు వదిలి వెళ్లిపోయాడు. కొంతకాలం సరోజకు ఏకాంత జీవితం... రవీంద్రతో ఫోన్‌లో ఎన్నో విషయాలు కలబోసుకుంది. శశిధర్‌ చేసిన మోసం, వివేక్‌ కెరీరిజమ్‌ గురించి చెప్పుకొని ఏడ్చేసింది. ఊరట మాటలు తప్ప రవీంద్ర నుండి నిజమైన స్నేహితుడిగా స్పందన తగ్గుతూ రావడం గమనించింది. అతని కాపురం అంత ఆదర్శంగా ఏమీ లేదు. చివరకు విడాకులు తీసుకొని ఇద్దరం ఒక్కటవుదామని ప్రపోజల్‌ ఇచ్చాడు. స్నేహానికే పరిమితం కావడం మంచిదనిపించింది. రాజీపడి సంసారం చేసే వాళ్లను నేను విడదీయడం సరైంది కాదనుకుంది. వాళ్లు అప్పటికే విడాకులు తీసుకొని వుంటే ఆలోచించే దాన్ని అనుకుంది. అందుకని నాకు ఆ ప్రపోజల్‌ టైంబార్‌ ప్రపోజల్‌ అనిపించింది అని వాపోయింది సరోజ. కొన్నాళ్లు పోయాక సరోజ ఆలోచనల్లో మార్పు వచ్చింది. జీవితంలో ఏం సాధించాను? ఏం సాధించాలి? ఎందుకోసం జీవించాలి? జీవితం అంటే ఇంతేనా? ఇంకేమీ లేదా? మళ్లీ ఎవరితోనో స్నేహం చేయడమేనా? అతడు కొన్నాళ్లు కలిసి వుండి వెళ్లిపోతే... ఇలా ఎంతకాలం? ఉద్యోగం మార్చినట్లు సహచరులను మార్చుకుంటూ పోవడం వల్ల ఒరిగిందేమిటి? ఈ స్వేచ్ఛ వల్ల తనకు లభించిందేమిటి? వైవాహిక వ్యవస్థలో వున్నదేమిటి? తనకు లేనిదేమిటి? తనకున్న స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛేనా? కుటుంబ వ్యవస్థలో వున్న రక్షణ నిజమైన రక్షణేనా? అయినా మధ్య వయస్సు వచ్చాక ఇండియాలో పెళ్లి సంబంధాలు ఎలా దొరుకుతాయి. అందునా సహజీవనం చేసిన మహిళకు మంచి భర్త, సహృదయుడు దొరకడం అంత సులభమా? అని పరిపరి విధాలుగా ఆలోచించింది. దూరపు కొండలు నునుపు. దగ్గర్నించి చూస్తే అన్నీ ఎత్తుపల్లాలు, లోయలే. రవీంద్రే కాదు తనకు తెలిసిన చాలామంది జీవితాలు నిజంగా సుఖంగా ఏమీ లేవు. నిత్యం కలాహాలతో కాపురాలు. ఎందుకీ బలవంతపు కాపురాలో... అందులో బలవంతంగా ఎవరో కట్టిపడేసి ఇలాగే జీవించాలని కోరినట్టుగా జైల్లో లాగా బతుకుతున్నారు అనిపించేది. అందువల్ల సరోజ ఎటూ తేల్చుకోలేకపోయింది. ఒక బలహీన క్షణంలో, డిప్రెషన్‌లో పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అనసూయమ్మ సకాలంలో గమనించకపోతే సరోజ మనకు ఇలా మిగిలి వుండేది కాదు. ఆ సంస్థకు గొప్ప సీఈవో లభించి వుండేది కాదు. ఆత్మహత్యా ప్రయత్నం నుండి ఆరోగ్యం కుదుట పడి, మానసికంగా కోలుకున్న తర్వాత తాను తన మిగిలిన సమయంలో ఏదైనా మంచి పని చేయాలని భావించింది. తనకు కాలక్షేపంగా వుంటుందని మంచి సహవాసం దొరుకుతుందని ఆశించింది సరోజ. తనకున్న ఆర్థిక వనరులను అందుకు ఉదారంగా వెచ్చించింది. అలా స్నేహంతో ఎందరికో దగ్గరయ్యింది. ఆత్మీయురాలైంది. వారి కుటుంబాల్లోని కలతలకు కారణాలేమిటో ఒక తల్లిలా, ఆప్రాలా వివరిస్తూ కౌన్సెలింగ్‌ చేసి వారు ఆనందంగా జీవించేట్టు చేసింది. అదే సమయంలో తన భర్తను ఎలా ఆకర్షిస్తుందో అని భయపడ్డ మహిళల అభద్రతను కూడా గమనించింది. మనసులో సరోజ నవ్వుకుంది. పెళ్లి కాని మహిళ పట్ల సాటి మహిళకు కూడా అనుమానం వుండడం బాధించింది. ఆ తర్వాత అలాంటివన్నీ అలవాటై పోయాయి. తాను అలాంటి అనుమానాలు రాకుండా వుండే విధంగా తన పరిధులను నిర్ణయించుకుంది. బుద్ధుడు మొదలుకుని జిడ్డు కృష్ణమూర్తి దాకా తత్వవేత్తలు, ధ్యానులు గతాన్ని పట్టుకుని వేలాడకూడదని, గతాన్ని వదిలి వర్తమానంలో జీవించాలని అన్న విషయం సరోజను బాగా ఆకర్షించింది. వాటిని లోతుగా అధ్యయనం చేసింది. అలా ఎదిగిన సరోజ తనలాగా కష్టాలు ఎదుర్కొన్న వారి జీవితాల్లో వెలుగు నింపింది. వారు భయపడకుండా పెళ్ళిళ్లు చేసుకోవడానికి ఆప్రా లాగా ప్రోత్సహించింది. సమస్యలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్‌తో పరిష్కరించింది. ఇప్పుడామె గతం ఎవరికీ తెలియదు. ఎందుకు పెళ్ళి చేసుకోలేదో కూడా ఎవరికీ తెలియదు. ఆమె ఎవరితోనైనా తిరిగిందని ఎవరైనా అన్నా దాన్ని అంత పెద్ద విషయంగా తీసుకోకుండా కట్‌ చేస్తారు. ఆమె ఒక మహోన్నత వ్యక్తిత్వంతో ఎదుగుతూ వచ్చింది. ఇవన్నీ ఆమె మర్చిపోయిన... మర్చిపోదల్చుకున్న జ్ఞాపకాలు. వాటినే నువ్వు గుచ్చి గుచ్చి అడిగి కెలికావు. తేటగా పేరుకున్న నీటిని అడుగంటా తొక్కి బురదమయం చేసి బాధపెట్టావు. ఇప్పుడు ఆమె ఒక సంస్థకు సీఈవోగా పని చేస్తున్న విషయం నీకు తెలుసు. ఆమెను ఇప్పుడు మొదటి సంబంధం చేసుకోవడానికి కూడా ఎంతోమంది మగవాళ్లు ముందుకు వస్తారు. ఆమె ఇప్పుడా ఆలోచనలో లేదు. నీలాంటి వారి జీవితాలను తీర్చిదిద్దడం కన్నా గొప్ప లక్ష్యాలేవీ ఆమెకు లేవు. పిల్లల్ని కనాలనే మాతృత్వ భావనను కూడా ఆమె ఎప్పుడో అమెరికాలో వున్నప్పుడే అధిగమించేసింది. ఆమె కావాలనుకుంటే ఎంతోమంది. కానీ ఆమె తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని సంస్థ ఎదుగుదలకు నీలాంటివారి జీవితాల బాగోగులకు వినియోగిస్తుంది. జీవితం పట్ల ఆమెకున్న వాస్తవిక దృక్పథం నీకు మింగుడు పడ్డం లేదు. అందువల్ల ఆమె విలువలు లేనిదానిగా భావించి కన్ఫ్యూజన్‌గా వక్రీకరిస్తున్నావు. ఆమెను కన్ఫ్యూజ్‌ చేస్తున్నావు. సరోజ లెస్బియన్‌ అని నీవు భయపడ్డం విచిత్రంగా వుంది. నిజానికి నీవే లెస్బియన్‌ ఏమోనని మేడమ్‌ నీ ప్రశ్నలు చూసి భయపడిందట. మనసు విప్పి మాట్లాడుకోకపోతే ఆపార్ధాలు ఎలా ఏర్పడతాయో! స్వరూప ఆంటీ అంటూ నాకు అన్ని విషయాలు చెప్పినట్టు ఆమెకు చెప్పుకోవడానికి నీకు ఏం అడ్డం వచ్చింది? కష్టాలు చెప్పుకోవడం కోసం పిలిచినప్పుడు వాటన్నిటినీ చెప్పుకొని ఊరట పొందడం, పరిష్కారం దిశగా సూచనలు తీసుకోవడం, మేడమ్‌ చేసిన సూచనలను గౌరవించడం నీ బాధ్యత. అసలు నీకు ఆనందంగా జీవించడం తెలుసా! ఆనందంగా జీవించాలని వుందా! నీకు ఆనందంగా జీవించే వారి నుండి స్ఫూర్తి పొందడం కూడా తెలియదు. వారి ఆనందాన్ని దుఃఖంగా మార్చడం మాత్రమే నీకు తెలుసు. అందుకే ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన మేడమ్‌ సరోజ నీ జీవితాన్ని తీర్చిదిద్దే బదులు తానే కష్టాల్లో పడి భోరున ఏడ్చేసింది. నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. నీవిక జీవితంలో బాగు పడవు అనిపించింది. కానీ అలా అని నిన్ను వదిలేసుకోలేను. అలా అని చేరదీయలేను. ఉదాత్త వ్యక్తిత్వంతో నీకేదో మేలు చేద్దామనుకున్న సీఈఓ సరోజ మేడమ్‌నే అంతగా బాధపెట్టిన దానివి నన్ను నిండా దుఃఖంలో ముంచడం ఎంత సేపు? స్వప్నా! ఊహలు వేరు... వాస్తవాలు వేరు. సరోజ మేడమ్‌ ఇప్పటికీ ఊహల్లో జీవిస్తోంది. ఇది నీ అభిప్రాయం. బహుశా నా అభిప్రాయం కూడా. ఆమె ఊహల్లో, భ్రమల్లో లేదా ఆదర్శాల్లో జీవిస్తోంది అనే అభిప్రాయం ఎవరిది? నీది... నాది... కానీ మేడమ్‌ సరోజ గారికి అది ఊహ కాదు. అది ఆదర్శం కాదు. అది వాస్తవిక జీవితం. అందువల్ల ఊహ అనే పదాన్ని మనమే ఆమె మీద ఆపాదిస్తున్నాం. కానీ ఇప్పుడు సరోజ మేడమ్‌ను చూసి వాళ్ల అమ్మ ఎంతో గర్విస్తుంది. ఆమెది తల్లి హృదయం. అమ్మ మనస్సు. అన్ని విలువలకు అతీతంగా ప్రేమించే, క్షమించే మాతృ మమత. ఇప్పుడు అమ్మ సరోజకు గొప్ప వరం. ఎందువల్ల? సరోజను వాళ్ల అమ్మ ఎలా అర్థం చేసుకోగలిగింది? మనమెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడర్ధమైందనుకుంటాను. మన అభిప్రాయాలే సరోజ వ్యక్తిత్వంగా మన విలువలతో ఆలోచిస్తున్నామని! ఇప్పుడు చెప్పు. ఎవరివి ఊహలు? విలువలంటే ఏమిటి? మనిషి కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఎప్పటికప్పుడు గెలుచుకునే అవకాశం వుండే సమాజం, దాని విలువలు గొప్పవా? లేక కాలు జారిందనో, పతనమైందనో జీవితమంతా బాధపడుతూ బతికే విలువలు గొప్పవా? స్వప్నా! మన భావాలను, మనం ఆచరించే గౌరవించే విలువలను ఎదుటి వారిమీద రుద్ది వాటి మూసల్లోంచి వారి వ్యక్తిత్వాలను చూడడం అనేది మన రంగు కళ్లద్దాలతో చూడ్డం కాదా? ఆమె గతం నీ వర్తమానం ఒకటే. మేడమ్‌ నీకు అర్థం కావడం అంటే నిన్ను నీవు అర్థం చేసుకోవడమే. స్వప్నా! గతం గతః... గతాన్ని గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోవడంవల్ల లాభమేమీ లేదు. అవన్నీ మర్చిపో. జీవితాన్ని గెల్చుకో. నీ జీవితం నీది. నీవు తిరిగి అమెరికాకు వచ్చేసెయ్‌! ఇండియా నీకు సరిపడదు. పాత భావాల్నించి, విలువల్నించి మళ్లీ విముక్తమై పునీతమయ్యే అవకాశం నీకు ఇండియాలో దొరకదు. యుఎస్‌లోనే అది సాధ్యం. ఆప్రా లాంటి వారిని కలిస్తే నీ సమస్య నుండి, డిప్రెషన్‌ నుండి బైటపడతావు. అయినా అదంతా నీ వివేచనకు, నిర్ణయానికి వదిలేస్తున్నాను. నీవు ఇండియాలోనే వుండిపోతావో... యూఎస్‌కు తిరిగి వస్తావో నీ ఇష్టం.'' - సాక్షి దినపత్రిక ఆదివారం సంచిక, ఫన్‌ డే బుక్‌, 2011