Friday, October 7, 2016
అసమర్ధుని జీవయాత్ర
ఆకలిగా వుంది. యింకా లంచ్ అవర్ కాలేదు. ఫైళ్ళు సర్దుతూనే వున్నా వాటి మీదికి మనసు పోవడం లేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. నిమిషాల ముల్లు అసలు కదుతున్నట్టే లేదు.
ఎదుటి సీట్లో అతను ఎవరితోనో సంభాషణ సాగదీస్తున్నట్టున్నాడు. అంటే లంచ్ ఖర్చు ఆ ఆగంతుకుని మీద రుద్దే వాతావరణం క్రియేట్ చేయబడుతోందన్న మాట. వెధవ ఆకలి.
అలా అనుకోవడం ఈ రోజుకు ఇది పదోసారి. ఒంటె ఒకసారి నీళ్ళు తాగితే ఆర్నెల్ల దాకా సంచీలో ఆపుకోగలదట. మనుషులు మాసానికోసారి వారానికోసారి తిన్నా ఆకలి కాకుండా వుండేట్టుంటే ఎంత బాగుండేది?
అలా అయితే ఈ హోటళ్ళూ, ఈ పెళ్లాలూ ఏం కావాలి? అసలు అలా జరిగితే మానవ చరిత్ర ఎలా వుండేదో! అప్పుడు ఆ స్థితిలో మళ్ళీ ఏం కోరిక పుట్టేదో?
వెధవది మూడు పూటలా తిండి తినాల్సిందేనాయె! తిండి తినాలంటే ముప్పొద్దులా యిల్లూ, సంసారమూ, వంట చేయడానికి పెళ్ళామూ, పిల్లలూ, బోళ్ళూ, బోకెలు, స్టవ్వూ, గ్యాసూ, బియ్యమూ, కూరగాయలూ, పప్పులు, ఉప్పులూ, వుద్దెర కాతాలు వడ్డికి పావుసేరు ధరలూ - వెధవ తిండి యిరవై నాలుగ్గంటల్లో ఎంత కాలాన్ని మింగేస్తోందీ!
గ్యాసుక్యూ, చక్కెర క్యూ, బియ్యం క్యూ సైకిల్ మీద కూరగాయలకు పరుగు. బోల్లు తోమడం, యిల్లు వూడ్వడం, నీళ్ళు చేదడం, ప్లేట్లు కడగడం, వంట చేయడం. అబ్బ! ఎంత పనీ!
ఇంత చేస్తూ వెధవది యింకా ఆఫీసు డ్యూటీ చేయాలి!
మళ్ళీ ఆకలి గోకేస్తుంది. ఎవడేనా పార్టీ వస్తే బావుండు.
అసలు ఎదుటి వ్యక్తి గూర్చి పట్టించుకోవడమే తక్కువైపోయింది. (అలా పట్టించుకొనే వాడికి యిలాంటి ఆలోచనలు వస్తాయా!) ఛ ఛ యింతమందిలో కనీసం ఒక్కడు మీల్సుకు రమ్మని పిలువడు.
అసలు యింట్లో పెళ్ళానికి లేనపుడు బయటోళ్ళనంటే ఏమొస్తది? చెల్లెకు సీరియస్‌గా వుందని తెలియంగానే ఆదరబాదర బట్టలు సర్దుకొని ఉరికినంక యిక ఎవరు పట్టించుకొంటారు.
కరువులో అధికమాసం అన్నట్టు అక్కరకురాని చుట్టాలు ఎన్నడు పెండ్లికి పేరంటానికి పిలువని బాపతుగా వచ్చి మూడు రోజులు మెక్కి తినిపోయేసరికి చేసిన బియ్యం గ్లాసెన్నర మిగిలినై.
అవిగూడ తినే పాటిగాల్లే. పూర్తిగా అయిపోతే మల్ల కొనుక్కురావల్సి వత్తదనుకొని అడ్డా వుడాయించినట్టున్నారు. ఆ ఆగంతకుడూ, ఎదుటి సీట్ల అతనూ...
ఛీ ఛీ! వెధవ బుద్ధి! (ఎదుటివానిది) ఎపుడు వాడికి మందికి టోపీ వేయాలనే ధ్యాస. ఆ బతుకు అసలు బతక్కపోతేనేం (ఎవలు?)
వాడి గుణం ఇంతకుముందు తెలియందా? సంస్కారం లేని బ్రూట్! వెళ్తూ వెళ్తూ పిలవనన్నా పిలవడు. వాడి సొమ్మేం పోయిందీ కంపెనీ కోసం రమ్మని పిలిస్తే.
వెధవకి వద్దన్నా వెంట వచ్చి మెక్కి తిని తన పార్టీ పది యివ్వాల్సిన చోట హోటల్ బిల్ మనసులో వుంచుకుని అయిదు యిచ్చేట్టు యితరుల యిన్‌కం మీద దాడి చేయడం మాత్రం తెల్సు.
ఆకలి - ఈర్ష్య - అసూయ - నీరసం - ద్వేషం - కాళ్ళు పీకడం -
''నమస్తే సార్''
వెధవ నమస్తే ఎందుకోసం పెడ్తున్నారో తెల్సులే అన్నట్లుగా ''నమస్తే''.
''రైతు కూలీ సంగం రాష్ట్ర స్థాయి రెండవ మహాసభలు మే నెలలో కరీంనగర్‌లో జరుగుతున్నాయి. విరాళాల కోసం వచ్చాం సార్.''
'ప్రతి వెధవా విరాళాల కోసం వచ్చేవాడే! మీదు మిక్కిలి ఎంతో ప్రజాసేవ చేస్తున్నట్లు పెద్ద ఫోజొకటి!' అని లోపలా.
''హి! హి! ఉద్యోగం కదండీ, మేమేం యివ్వగలం? పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళను, కాంట్రాక్టర్లను అడిగితే బావుంటుంది.'' పైకి మాట్లాడింది మాత్రం యిది.
''వాళ్ళ దేముంది సార్! మనల్ని దోచి మనకిస్తారు. మీరైతే కష్టపడి సంపాదిస్తున్న డబ్బు కాబట్టి మీరెంతిచ్చినా దాని విలువ గొప్పది సార్! ఎందుకంటే రైతు కూలీల గూర్చి మీరు ఆలోచించడం ముఖ్యం సార్. మీ ఉద్యోగ సంఘాల్లాగే వాళ్ళూ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నందుకు చేయూత నివ్వాలి మనం.''
''వెధవ సభలనెవడు పెట్టుకోమన్నాడు? సభలతో ఏం సాధిద్దామనీ! ఊరుమీద పడి దోచుకోవడానికి కాకపోతే!'' మనస్సు.
''ఫస్టు దాటితే మా జేబులు ఖాళీ, మా బతుకే కాలీ! అంతే కదండీ!''
''నిజమేననుకోండి కాదనం. కాని మీరివ్వాలనుకుంటే ఎట్లైన యివ్వగలరుసార్. మీ బాబుకు జ్వరమొస్తే పైసల్లేవని మందులు కొనరా? మనసుంటే మార్గముంటది సార్.''
''వెధవలు వదిలేట్లు లేరే!''
''గీతా యజ్ఞం కోసం తలా యిరవైయైదూ, సీతారామ స్వాముల వారి కళ్యాణం కర్చూ ఈ నెల్లోనే మీద పడ్డాయండి. అదేదో స్విమ్మింగ్ ఫూల్ కట్టించడానికి బెనిఫిట్ షో పెట్టారు. దాని బాపతుకింద ఓ యిరవైయైదు లాక్కుపోయారండీ! ఈ నెలలో లోటు బడ్జటైంది సార్! సారీ''
''సారీ'' యింగ్లీషు పదంలో కొసనాలుక మీంచి ఎంత సారీ చూపించొచ్చూ!
''మనం తినే తిండి గింజలు వాళ్ళ శ్రమ ఫలితం సార్. మీలాంటోల్లు మాలాంటోల్లు లోకంలో అందరు పని చేయడం బందు చేసినా ఏం కాదుగాని వాళ్ళు పని చేయడం బందుజేస్తే మనం ఎంతపని చేసినా మూతి కాడికి మూడు మెతుకులన్నరావు. మనం కాగితాల మీద ఎంత రాసినా ఒక్క గింజను సృష్టించలేం సార్... వాళ్ళు ఎండనక వాననక....'' వెధవలు గీతోపదేశం చేసేట్టున్నారు.
''ఆఫీసుకొచ్చేప్పుడు పైసలు వెంట ఎందుకు తెచ్చుకుంటారు సార్. ఏమనుకోకపోతే గీ పావులా వున్నది.''
పీడా విరగడైంది. ఎవడేనా పార్టీవస్తాడేమో అని చూస్తే ఎదురు పార్టీ వచ్చింది.
ఆకలి దంచేస్తోంది.
లోపలనించి పిలుపు వినబడింది.
''ఏమయ్యా? యిది ఇలాగేనా ఏడ్చేది? పైనించి ఛార్జిమెమో యిచ్చారు. శాంక్షన్ చేసేప్పుడు అన్నీ సరిగ్గా వున్నాయో, లేదో చూసుకోవద్దా? మెమోకు మూడ్రోజుల్లో జవాబు రాసియ్యి. తొందరగా పంపాలి.''
'దొంగవేషాలు వెయ్యకురా! జేబులు నింపుకొని శాంక్షన్ చెయ్యమని చెప్పింది నువ్వు కాదా! పైసలు నీవంతు! మెమోలు నా వంతా' అని మనసంతా వుడుకుతోంది.
'అలాగే సర్' ముఖం జేపురించింది.
ఆ సాయంత్రం మనసేం బావులేదు. మెమో సూటిగా వుంది. జవాబు ఏ కొంచెం ఆ జాగ్రత్తగా ఇచ్చినా మొదటికే ప్రమాదం.
బార్లో యిరవైయైదు రూపాయల చమురు విడిస్తేగాని మెమో మూడ్ వదల్లేదు.
''ధైర్యం వుంటే ఆ మెమోకు సూటి జవాబుగా అధికారి ఆదేశాల మేరకు శాంక్షన్ చేయబడింది అని రాయగలిగితే?''
వాయమ్మో!
అలా అయితే బార్లో ఖర్చయిన పాతికా, అధికార్లు మొహమాట పెట్టి వసూలు చేసిన గీతాయజ్ఞం, సీతారామకల్యాణం, స్విమ్మింగ్‌పూల్ కిచ్చిన విరాళాలు కూడా మిగిలేవి కావూ!
''వెధవ యజ్ఞాలూ, కళ్యాణాలూ స్విమ్మింగ్ పూల్సు ఎవడిక్కావాలీ! ఉన్నొక్క పెళ్ళానికీ మంచి చీర కొందామంటే పైసలు గతిలేవుగానీ!
నిద్దర్లో కలవరింతలు - తెల్లవారి తాగింది కక్కులింతలు, ఆఫీసుకు లీవు పంపడం, మెమో భయానికి జ్వరం అందుకున్నదన్నారు అందరు.
అన్నం తినబోతే పావులబిల్ల గొంతులో అడ్డం తట్టుకున్నట్టుంది. వారం రోజులు మరి లేవలేదు.
ధైర్యం లేని మనిషికి దండుగులెక్కువ.
రచనా కాలం, 1983, మే.
ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, 26-10-1984,