Friday, October 7, 2016
లక్ష్మమ్మ గెలుపు రహస్యం
రీనా ప్రతిపాదనతో లక్ష్మికాంతమ్మ మూడు రోజులుగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
లక్ష్మమ్మ జీవిత విజయరహస్యం ఏంటో తెలుసుకోవాలనేది తొలుత రీనాకు వచ్చిన ఆలోచన.
ఆ మాటతో అమ్మలక్కలందరికీ కుతూహలం కలిగింది. తన కూతురు సమీరజకు పనికిరాని తన అనుభవాలు అమ్మలక్కలకు ముఖ్యంగా రీనాకు పనికిరావడం ఆమెకు ఎంతో సంతోషం కలిగించింది.
లక్ష్మీకాంతమ్మ అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుంది. లక్ష్మమ్మకు ఈమధ్య డాక్టర్ల చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చుట్టూ ప్రజాసేవకోసం తిరిగి తిరిగి, చూసి చూసి ఫీజు అనే పదం అలవాటుగా మారిపోయింది. ప్రతిదానికి ఫీజు అనే మాట జతచేస్తుంటుంది.
అలా లక్ష్మమ్మ ఫీజు లేకుండా ఏ విషయం చెప్పకూడదని నియమం పెట్టుకుంది. ఫీజు లేకముందు ఏది చెప్పినా అమ్మలక్కల ముచ్చట్ల కింద తేలికగా తీసుకునేవాళ్ళు. ఒక శుభముహూర్తంలో ఫీజు తీసుకోవాలన్న ఆలోచన కలిగింది. దాంతో ఆమె సూచనలకు డిమాండ్ పెరిగింది.
ఈసారి ఫీజు భారీగా ఉంటుందని ముందే చెప్పడంతో అమ్మలక్కలు తర్జన భర్జనలయ్యారు. ''ఆమె స్వభావం తెలిసి కూడా అడగడం మనదే పొరపాటు'' నిష్ఠూరంగా అంది విజయ.
''కాని తెలుసుకోవలసిన అర్జంటు సంగతులు ఆమెవద్ద ఎన్నో ఉన్నాయి.
ఆ మాట మీ అందరికీ తెలుసు'' అంది రీనా.
''అర్జంట్ అవసరం రీనాది కనుక ఆ ఫీజు రీనానే ఇచ్చుకోవాలి'' అంది విజయ కరాఖండిగా.
''ఎప్పుడూ అందరం కలిసే ఫీజు తలా ఇంత వేసుకుంటున్నాం. ఈసారి కూడా అలాగే ఉండాలి తప్ప రీనా మీద వేయడం ఏమిటి?'' అని అంది పెద్దావిడ రీనా తల్లి గాయత్రి.
రీనా హైటెక్ సిటీలో ఉద్యోగం చేస్తోంది. భర్తతో పోట్లాడి తల్లి దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడక ఈ మధ్య వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. రీనాకు ఏదోవిధంగా జీవితం అర్థం చేయించాలని సర్దుకుపోయే స్వభావం అలవర్చుకోవాలని చెప్పాలని గాయత్రి ఆరాటం.
ఆరోజు ముందే అనుకొని సాయంత్రం మహిళామణులు ఒక్కొరొక్కరుగా ఉస్మానియా యూనివర్శిటీ పక్కనగల డిడి కాలనీ పార్కులో మీటయ్యారు. అయిదు పది రౌండ్లు వాకింగ్ పూర్తయ్యాక లాన్‌లో కూలబడ్డారు.
రీనా ప్రతిపాదనమీద లక్ష్మికాంతమ్మ ఫీజు మీద, సూచనల మీద చర్చ ప్రారంభమైంది. తలా ఒక మాట అంటున్నారు.
''అంతగా ఆడిపోసుకోవడానికి ఆమె చేసిన తప్పేమిటి?'' అని పెద్దావిడ గాయత్రి లక్ష్మమ్మను సమర్థించింది. ''నిజమే. ఆమె ఏం తప్పుచేసింది? ఫీజు అడిగింది అంతే''
''ఫీజు ఇవ్వకుండా ఆమె ఏ విషయం చెప్పదు. తెలిసి కూడా కంగారు పడడ మెందుకు? ఆ ఫీజు ఆమె ఉంచుకోదు కూడా. మనచేతే ఖర్చుపెట్టిస్తుంది కదా! మనకే మంచి ప్రోగ్రాం సూచిస్తుంది.''
''ఈసారి ఫీజు చాలా ఎక్కువ చెప్పింది. ఆంటీ మాట్లాడినంతసేపు ఎవరూ ఎదురు మాట్లాడకూడదట. ఎదురు ప్రశ్నించకూడదట. ఇది ఆంటీ అడ్మిషన్ ఫీజట! ఆంటీ కోరిన విధంగా శిల్పారామంలో ఏర్పాట్లుచేయడం అడ్వాన్స్ ఫీజట. చెప్పింది తప్పకుండా వింటామని, ఆచరిస్తామని హామీ ఇవ్వడం ఫైనల్ బిల్ పేమెంటట! ఆరోజు అందరు ఉదయాన్నే శిల్పారామం చేరుకోవాలి. చీకటి పడేదాక అక్కడే పిల్లలతో సహా ఉండాలి. మాటా ముచ్చటా, ఆటపాటలు అన్నీ అక్కడే. భోజనాల ఏర్పాట్లు అన్నీ మీరే చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఐటమ్ వాళ్ళింట్లో చేసుకొని తీసుకురావాలి అంది ఆంటీ'' అని అసలు విషయం చెప్పింది రీనా.
పార్కులో నిటారుగా పెరిగిన చెట్లు చల్లగా ఊగుతున్నాయి. కత్తిరించిన లాన్ గడ్డి పచ్చగా నిగనిగలాడుతోంది. పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతున్నారు.
రీనా ప్రతిపాదించేదాకా తమకా ఆలోచన తట్టనందుకు ఆశ్చర్యపోయారు.
ముందే ఆ విషయం తెలుసుకుంటే తమ సంసారాలు ఎప్పుడో బాగుపడేవి కదా! అనుకున్నారు. అలా అందరికీ లక్ష్మమ్మ గెలుపు రహస్యం తెలుసుకోవాలనే ఆరాటం రోజురోజుకూ పెరిగింది. మరుసటి రోజు పెద్దావిడ గాయత్రి డిడి కాలనీలో ఉన్న లక్ష్మీకాంతమ్మ గారింటికి వెళ్ళింది.
''గాయత్రీ! నా స్వభావం నీకు తెలుసు. ఫీజు తీసుకుంటానన్నమాటే గాని నా చేతినుంచే ఎదురు ఖర్చు అవుతుంటాయని నీకు తెలుసు. ఆ రోజు తీరొక్క వంటలు వంట చేసుకురావాలి. తంబోలా, క్యారమ్స్, పేకాట అన్నీ ఆనందంగా ఆడుకోవాలి. ఆ రోజు ఇంటికి భర్తలకు సెలవు పెట్టి రావాలి. సెల్‌ఫోన్‌లు ఆఫ్ చేయాలి. పిల్లలను మనవెంటే ఉంచుకోవాలి. అంతా మనందరి కోసమే. మన పోగ్రాం ఒక పిక్నిక్‌లా, ఎక్స్‌కర్షన్‌లా చాలా బాగుండాలి'' అంది లక్ష్మమ్మ.
తామందరం ఎప్పట్నించో కోరుకుంటున్న పిక్నిక్కే లక్ష్మమ్మ ఫీజు పేరిట ప్రతిపాదించిందని గాయత్రి సంతోషానికి అంతులేదు.
''మన మొగుళ్ళను వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి కేవలం ఆడవాళ్ళమే వెళ్ళాలని... ఎన్నోసార్లు అనుకున్నాం. గండిపేటకు పోదామనుకున్నాం. గోల్కొండ చూడాలనుకున్నార. మన మొగుళ్ళు, పిల్లలు ఏదీ సాగనివ్వలేదు. వాళ్ళు లేకుండా ప్రోగ్రాంలేంటి అని అన్నీ వ్యతిరేకించారు. ఈసారి సక్సెస్ చేసుకోవాలి.'' అంటూ లక్ష్మమ్మ చేతిలో చేయ్యేసి సెలవు తీసుకుంది గాయత్రి.
జ జ జ జ
ఆదివారం ఉదయమే ఎవరికి వారు డిడి కాలనీ నుండి శిల్పారామానికి కార్లలో బయలుదేరారు. రీనాను అప్పుడప్పుడు కనిపెడుతూనే ఉన్నాడు వాళ్ళాయన దేవేందర్.
''అందరు కలిసి ఎక్కడికి పోతున్నారు?'' ఎవరినో అడిగాడు రీనాను అడగలేక.
''అదంతా మీకనవసరం.'' అంటూ రుసరుసగా చూస్తూ వెళ్ళిపోయింది రీనా.
మహిళా సంఘం వాళ్ళు అందరు కలిసి పోతున్నారు... అంటే ఏదో ఉపద్రవమే... తన గురించి పంచాయితీ పెట్టడంలేదు గదా!... అని లోలోన భయపడ్డాడు దేవేందర్. వీళ్ళకు ఇంత ధైర్యం ఇచ్చింది లక్ష్మమ్మే అయి ఉంటుందని ఉడుక్కున్నాడు.
హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కనగల శిల్పారామంలోకి అరగంట తేడాలో అందరు బిలబిల చేరుకున్నారు. ముందే అనుకున్నచోట వాళ్ళు జమయ్యారు.
చక్కని చెట్లు, కోనసీమ వాతావరణం, చెరువులో బాతులు, కొంగలు... పిల్లలు ఎంత ఎగిరినా ఎవరూ పట్టించుకోని చల్లని వాతావరణం. ఒక పక్కన చిన్న క్యాన్ మీద వాటర్ క్యాన్ బోర్లించి పిల్లలకు ఎలా నీళ్ళు పట్టుకోవాలో క్లాసిచ్చారు. వారికి అవేవీ పట్టినట్టు లేదు. ఏదో టీవీ షూటింగ్ జరుగుతున్నట్టుంది. అదేదో వింతగా కనిపించి పిల్లలంతా అటుకేసి పరిగెత్తారు.
జ జ జ జ
అమ్మలక్కల కథ మొదలైంది.
లక్ష్మమ్మ తన జీవితాన్ని వాళ్ళ ముందు పరిచింది...
''మేము హైదరాబాదు వచ్చి తొలుత చిక్కడపల్లి, నారాయణగూడాలో చిన్న గదిలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాక నాకు జీవితంలో స్వేచ్ఛ అంటే ఏమిటో తెలిసివచ్చింది. ట్యూషన్లు చెప్తూనే చదువులు సాగించాడు మా ఆయన రామకృష్ణ. అలా బి.ఏ., బి.ఇడి., చేశాడు...
ఆ వివరాలు చెప్పి గ్లాసెడు మంచినీళ్ళు గటగటా తాగి మళ్ళీ మొదలుపెట్టింది లక్ష్మమ్మ.
''ఆ తర్వాత మా ఆయన ఎలాగోలా టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఏడాది తర్వాత గవర్నమెంట్ టీచర్‌గా ఉద్యోగంలో చేరాడు. అప్పటికి ఇద్దరు పిల్లలయ్యారు. పల్లెటూరునుండి నగరం చేరిన నాకు మొగడు ఎంత చెపితే అంత. నాకప్పుడు లోకం తెలియదు. రోడ్లు తెలియవు. బస్సు రూట్లు తెలియవు. మా ఆయన రామకృష్ణ అపుడప్పుడు ఆలస్యంగా వస్తుండేవాడు. ట్యూషన్లు చెప్తున్నాననేవాడు. ట్యూషన్ల డబ్బులు తెచ్చేవాడు కాదు. కొంత కాలానికి నాకు అనుమానం వచ్చింది. ఇరుగుపొరుగు వాళ్ళు కూడా అదేమాట అన్నారు. నేను మా ఆయనను కనిపెట్టడం మొదలుపెట్టాను.
రీనా, సమీరజలు ఏదో అనబోయారు.
''ఎవరు మాట్లాడవద్దు. అట్లయితేనే చెప్తాను'' అంటూ నోరూ మూయించింది లక్ష్మమ్మ. చెప్పండి అన్నారు పెద్దావిడ రీనా తల్లి గాయత్రి. లక్ష్మమ్మ కూతురు సమీరజ అసహనంగా చూసి ఎటో మొకం తిప్పుకుంది, దూరం జరిగింది. లక్ష్మమ్మ అదేమీ పట్టించుకోలేదు. మళ్ళీ ప్రారంభించింది లక్ష్మమ్మ.
''రామకృష్ణ ఎవరో పెళ్ళికాని పంతులమ్మతో తిరుగుతున్నాడని చూచాయగా తెలిసింది.
తనకు పెళ్ళికాలేదని, ఇద్దరం పెళ్ళి చేసుకుందామని బొంకాడట! ఆ పిల్ల నిజంగానే నమ్మేసిందట! నాకు ఇరుగుపొరుగువాళ్ళు ఇంటలిజెన్స్ రిపోర్టు అందించారు. అడవిలాంటి నగరంలో ఏం చేయాలో తోచలేదు. అప్పుడు నా మరోజన్మ మొదలైంది.
నాకు నేను ఆలోచించుకోవడం ప్రారంభించాను. పెద్దగా చదువురాని నన్ను మా ఆయన తాను అనుకున్న దానికల్లా ఎలాగోలా ఒప్పించేవాడు.
ఆయనతో మాటలతో గెలవడం నాతో కాని పని అని తేలిపోయింది. ఆయన ప్రతిదాన్ని చక్కగా వాదించేవాడు. నాకు మాటలు రాక ఉక్రోషం వచ్చేది. నా భావాలు చెప్పరాక ఏడ్చేసేదాన్ని. ఏడుస్తుంటే ఆయనకు ఒక్కోసారి జాలి కలిగేది. ఒక్కోసారి తన పంతం నెగ్గిందని సంతోషించేవాడు.
అలా ఎన్ని రోజులో... ఎన్ని నెలలో... ఎన్ని యేళ్ళో... గడిచిపోయాయి.
ఎవరికీ చెప్పుకోలేని బాధ...
చెప్పుకుంటే పరువు తక్కువ. హేళనచేస్తారు. చిన్న చూపు చూస్తారు అని సంకోచం.
ఇప్పట్లాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌లు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఉన్నా నాకు తెలిసేవారు కాదు.
ఒకసారి ససేమిరా వద్దంటూ ఎదురు తిరిగాను. చేయిచేసుకున్నాడు.
ఏడుపొచ్చింది. ఆ రోజు వంట చేయలేదు. ఆయన ఎక్కడో తినివచ్చాడు. నేను ఆరోజంతా ఏడ్చుకుంటూ ఏమి తినలేదు.
నా గురించి ఆయన ఏమీ పట్టించుకోలేదు. అన్నం తిన్నావా? అని కూడా అడగలేదు.
నాకు మరింత దుఖఃం వచ్చింది.
ఇంత పెద్ద నగరంలో నాకంటూ ఎవరూ లేరు. నా బాధ అర్థం చేసుకునేవారు లేరు అని నామీద నాకే జాలి కలిగి మరింతగా ఏడ్చేసాను.
నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.
ఒక దశలో హుస్సేన్ సాగర్‌లో పడి చచ్చిపోవాలనుకున్నాను.
చచ్చిపోయి సాధించేదేమీ లేదనిపించింది.
బతికుండే సాధించాలి. పిల్లలకోసమైనా బతకాలి.
నేను పోతే ఆయనకు మరొకతి దొరుకుతుంది. నా పిల్లలకు తల్లి దొరకదు కదా.
పిల్లలు గుర్తొచ్చి ఏడ్చేసాను.
చచ్చిపోవాలనుకునే ఆలోచనను నా పిల్లల కోసం వదులుకున్నాను.
అప్పుడు చిన్నది సమీరజకు ఏడేళ్ళు. పెద్దోడు సాత్యకికి పదేళ్ళు.
సాత్యకి ఇంగ్లీషు మీడియంలో నాల్గవ తరగతి. సమీరజ రెండో తరగతి.
మా పనిమనిషి దేవమ్మ ఎందుకమ్మా ఊరికే ఏడుస్తుంటావు. మీకేం తక్కువైంది. సార్‌తోని గట్టిగా మాట్లాడున్రి. మీకిష్టం లేనిదాన్ని కరాఖండిగా వద్దని చెప్పున్రి అంటూ హితబోధ చేసింది.
ఆ హితబోధ మెల్లిమెల్లిగా నాలో ధైర్యం పెంచింది...
ఆయన ఉద్యోగం చేస్తూనే ఫ్రెండ్స్‌తో రియల్ ఎస్టేట్, ప్రైవేట్ స్కూల్ వ్యవహారాల్లో పడ్డాడు. సంపాదన పెరిగింది. పిల్లల కోసం నేను దెబ్బలు సహించాను. తిట్లు సహించాను. అవమానాలు సహించాను. ఆకలి సహించాను.
అయినా అతని స్వభావం మారలేదు. నన్ను ఏదైనా స్కూల్‌లో పని చేయమంటాడు. చదువుకొమ్మంటాడు. పరీక్షలు రాయమంటాడు.
పిల్లలను కూర్చోబెట్టి చదివించాలంటాడు. కూరలు బాగా వండాలంటాడు. వచ్చిన స్నేహితులకు టీ, టిఫిన్ మర్యాదలు చేయాలంటాడు.
ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా తయారై ఉండాలంటాడు. ఇల్లు బాగా సర్దాలంటాడు. నీట్‌గా ఉంచాలంటాడు.
అప్పటికి శ్రీనగర్ కాలనీ సమీపంలో 200 గజాల స్థలంలో కట్టుకున్న ఇల్లు అమ్మేసి ఉస్మానియా యూనివర్సిటీ పక్కన మన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలనీలోకి వచ్చేశాం. అలా మనం ఒక వాడ వాళ్లమయ్యాం. అయితే మొదట్లో చాలా బాధేసింది. మన డిడి కాలనీలో మనిషికి, మనిషికి సంబంధమే లేదు. ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేదో ఊహించుకొండి. చచ్చిపోతే... మూడు రోజుల దాకా పనిమనిషి రాకపోతే... శవం మురిగిపోయి వాసన వచ్చేదాకా ఎవరికీ తెలియదు. ప్రశాంతత పేరిట భయంకరమైన నిశ్శబ్ధం.
నాకు కొంత చదువు వచ్చు. ఎందుకు ధైర్యం చెయ్యలేకపోతున్నాను అని అనుకున్నాను.
ఒకరోజు నలుగురు స్నేహితులు ఇంటికి వచ్చారు. వాళ్ళు బాగా కావలసిన వాళ్ళట.
నాకు ఆరోజే పీిరియడ్స్ మొదలయ్యాయి.
దేవమ్మ వెళ్ళిపోయింతర్వాత చూసుకున్నాను. నేనే వేణ్ణీళ్ళు పెట్టుకొని స్నానం చేశాను.
తీవ్రంగా కడుపు నొప్పి...
ఆరోజు ఏమీ తినకుండా, వంట చేయకుండా నీరసంగా పడుకున్నాను.
అదేమీ గమనించకుండానే రామకృష్ణ నన్ను ఇది అది చేయమని తాకీదులిచ్చాడు.
నేను ఏమి చేయలేను. నాకు చాతకాదు అని చెప్పాను.
ఆయనకు ఉగ్రకోపం వచ్చింది. స్నేహితులకు ఎంత మర్యాదలు చేద్దామని అనుకున్నాడో అంత కోపం వచ్చింది.
వాళ్ళను హోటల్‌కు తీసుకెళ్ళి మర్యాద చేసి ఇంటికి వచ్చాక ఇంతెత్తున లేచాడు.
నేను కూడా దుఖఃంతో, నీరసంతో మాటకు మాట అరిచాను.
ఇకనుంచి నన్నడగకుండా ఎవ్వరినీ ఇంటికి తీసుకురావద్దు. నీకు స్నేహితులైతే నాకేంది?
నా కష్టం, సుఖం నువ్వేమైనా పట్టించుకుంటున్నావా?
నేను తిన్నది చూడవు. జ్వరమొచ్చి పన్నది చూడవు. నువ్వనుకున్నది మాత్రం చేసి పెట్టాలి.
నేను మనిషిననుకున్నావా? పశువుననుకున్నావా?
అని మా అమ్మ చిన్నప్పుడు తిట్టే తిట్లన్ని జ్ఞాపకం చేసుకొని ఎదురుతిరిగాను.
వారం పదిరోజులు మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి.
నేను ఆయన కోసం వంట చేయడం... ఆయన తినకపోవడం...
రెండ్రోజులు చూసి మా ముగ్గురికే వంట చేసుకున్నాం. ఆయన వచ్చేసరికి గిన్నెలన్నీ ఖాళీగా కనపడేవి.
అప్పట్నించి నేను కొన్ని మాటలు మరిచిపోయాను. అప్పట్నుండి ఆయన ఏదైనా అడిగితే నేను ''మీ ఇష్టం'' అనడం మానేశాను.
ఏ పనిచెప్పినా, ఏ ముచ్చట చెప్పినా నాకెందుకు? నాకేం అవసరం? నాకేం సంబంధం? నాకేం పట్టింపు? అని అన్నిటినీ విదిలించుకున్నాను.
''అన్ని తెచ్చిపెడితే కూర్చుని తింటావా!'' అని అనరాని మాటలు అన్నాడు.
''పెళ్ళాన్ని సాదలేకపోతే పెండ్లి ఎందుకు చేసుకున్నావు?'' అని ఎదురుతిరిగాను.
ఆయన చెప్పేదేది వినిపించుకోకూడదని నిర్ణయించుకున్నాను.
నేను, నా పిల్లల గురించి తప్ప నాకు ఏ విషయం అఖ్ఖర్లేదన్నాను.
ఆయన ఎన్నో విషయాలు సంతోషంగా నాతో పంచుకోవాలనుకున్నాడు. నేను వినదలుచుకోలేదు.
హతాశుడయ్యాడు. తన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో ఆయనకు తెలియలేదు.
ఆయన అవునన్న ప్రతిదానికి నేను కాదని చెప్పేదాన్ని. ఆయన కాదన్న ప్రతిదాన్ని అవునని చెప్పేదాన్ని.
ఇలా ఆయన చెప్పే ప్రతి మాటను వ్యతిరేకించుకుంటూ వచ్చాను.
క్రమంగా పిల్లలు కూడా నాన్న చెప్పే ప్రతి మాటను వ్యతిరేకించడం నేర్చుకున్నారు.
నాన్నంటే పిల్లల్లో గౌరవం పోయింది. ఏదైనా అమ్మ చెప్పిందే రైటు అని వాళ్ళు నావైపే నిలబడ్డారు.
రామకృష్ణ ఒంటరివాడయిపోయాడు. వాళ్ళ చుట్టాల ఇంటికి ఫంక్షన్లకు, పండుగలకు, చావులకు పోదామని అడిగేవాడు.
నాకేం పని? నేను రాను. నాకనవసరం. పోతే పోయిరా పో. అని వ్యతిరేకించేదానిని.
ఆయన ఇంటికి డబ్బులు పంపిస్తే ఎందుకు పంపిస్తున్నావు? అని ఎదురుతిరిగేదాన్ని.
సంసారం ఎటైనా పోనీ అని అన్ని వదిలేశాను. చాకలిపద్దు, కరెంటు బిల్లు, నల్లా బిల్లు, పేపర్ బిల్లు, ఫోన్ బిల్లు, డిష్ కనెక్షన్ బిల్లు, చెత్త వాడి బిల్లు ఇలా ఏది కట్టమన్నా నాకేం సంబంధం? నాకేం తెల్వదు. నువ్వే చూసుకో అని కరాఖండిగా చెప్పాను. పాలు ఆయన తీసుకు వస్తేనే లెక్క. కూరగాయలు, కిరాణ సామాను ఆయనే తీసుకురావాలి. డబ్బులు ఇచ్చి నన్ను కొనుక్కు రమ్మంటాడు. ఆడదాన్ని నేను బయటకు పోను. తెస్తె వండిపెడతా. లేకపోతే ఉపవాసముంటా అని మొండిగా నిరాకరించాను. ప్రతిదానికి నన్ను సముదాయించే ప్రయత్నం చేశాడు.
నేను కాదన్నప్పుడల్లా నాచేత ఔననిపించడం కోసం ఎన్నో రకాలుగా ఒప్పించే ప్రయత్నం చేసేవాడు.
అలా కాదన్న ప్రతిసారి నేను ఔననే దాకా పట్టు విడవకుండా తన వాద విద్యనంతా, తెలివినంతా ప్రదర్శించేవాడు.
అయినా ఒప్పుకునేదాన్ని కాదు.
అలా అతని ఓటమి మొదలయింది.
నేను గెలువలేకపోయినా, అతణ్ణి ఓడించడమెలాగో ఒక జీవిత రహస్యం అనుభవం మీద తెలుసుకున్నాను.
ఆయన అవునన్నది కాదనాలి.
ఆయన కాదన్నది అవుననాలి.
సినిమా బాగుందని ఆయన అంటే అది చెత్త సినిమా అనేదాన్ని.
అది ఎంత గొప్ప సినిమానో అరగంట ఉపన్యాసం దంచేవాడు.
నీ తెలివికి అంత గొప్ప సినిమా ఏమర్థమవుతుంది అని ఈసడించేవాడు.
నాకు లోలోన నవ్వు వచ్చేది. ఆ సినిమా బాగుందని నాకు, పిల్లలకు కూడా తెలుసు.
అది బాగుందని ఎవరో చెపితేనే ఆయన వెంట వెళ్ళాను.
కాని ఆయనను వ్యతిరేకించడం కోసం ఆ సినిమా చెత్త అని వాదించాను.
ఇలాగే ఎన్నని చెప్పను? అన్నింటికి నేను కాదనడం... ఆయన తెలివి తక్కువ దద్దమ్మ అని తిట్టుకుంటూ అనేక విషయాలు నాకు చెప్పి ఒప్పించాలనుకోవడం చేసేవాడు.
నాకు లోలోన నవ్వు వచ్చేది.
ఇంకా వ్యతిరేకిస్తే మరికొన్ని కొత్త విషయాలు వాదించి ఒప్పిస్తాడని అతని బలహీనత తెలిసిపోయింది.
దాన్ని బాగా వాడుకున్నాను.
అలా అతనికున్న జ్ఞానం, పరిజ్ఞానం అంతా తిట్ల రూపంలో, ఒప్పించే రూపంలో, సముదాయించే రూపంలో మొత్తంగా నాముందు ప్రదర్శించేవాడు.
అలా నేను ఒక్కొక్క విషయం అర్థం చేసుకోవడం ప్రారంభించాను. అలా ఎదిగిన నాకు క్రమంగా అతడ్ని తప్పుపట్టే అవగాహన నిజంగానే పెరుగుతూ వచ్చింది. అలా అతను ఓడిపోయి నేను గెలిచే క్రమం మొదలయింది.
అప్పట్నుండి ఏం చేయాలో అతనికి తోచలేదు. చివరకు నన్నే మొదట ఏం చేయాలో అడగడం ప్రారంభించాడు.
అబ్బే!... నేను చిక్కుతానా! నాకేం తెలుసు. నీ ఇష్టం అనేదాన్ని. ఆయన ప్రతిపాదించే దాకా అడిగేదాన్ని.
ప్రతిపాదించిన తర్వాత వ్యతిరేకించేదాన్ని.
నాకు తోచిందే కరెక్టని చెప్పేదాన్ని.
నన్ను మూర్ఖత్వం అని తిట్టుకుంటూ తనది కరెక్టని ఒప్పించేదాకా అరుస్తూనే ఉండేవాడు.
ఏదో చెపుతూనే ఉండేవాడు. అలా ఆయన చెరువులోని నీళ్ళు, నా చెరువులో పడ్డాయి. ఇద్దరి చెరువుల నీటి మట్టం సుమారుగా సమానమైపోయింది.
అప్పట్నుండి నేను మీ ఇష్టమండి అనడం మొదలుపెట్టాను.
ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు.
అందుకని లేదు నీవే ముందు చెప్పు అనేవాడు.
పిల్లలు పెరిగి కాలేజీకి వచ్చారు. పెద్దాడు ఇంజనీరింగ్‌లో చేరాడు. చిన్నది సమీరజ ఇంటర్ కొచ్చింది. పిల్లలు అర్థం చేసుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది. అప్పట్నుండి నన్ను మెచ్చుకోవడం ప్రారంభించాడు. నేను కూడా ఆయనకు నచ్చిన కూరలు వండేదాన్ని. ఆయనకు నచ్చినట్టు ఇల్లు సర్దేదాన్ని.
అప్పట్నించి మా ఆయన వరుస మార్చుకున్నాడు. ప్రతి చిన్న విషయానికి పొగడడం అలవాటు చేసుకున్నాడు. అది నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చేది. ఇవ్వాళ కూర చాలా బాగుంది అని మెచ్చుకుంటే అలసటంతా ఎగిరిపోయి ఎక్కడలేని సంతోషం కలిగేది. ఈ చీరలో బాగున్నావు అని ప్రశంసించేవాడు. ఇలా ఎన్నోవిధాలుగా మనిషిని ప్రోత్సహిస్తూ, మెచ్చుకోవడంతో నాకు పాత కోపాలన్నీ ఎగిరిపోయాయి. నేను ఆయనను హృదయపూర్వకంగా మళ్ళీ ప్రేమించడం ప్రారంభించాను.
పిల్లలకు డాడిని బాగా గౌరవించాలని, ఎదురు మాట్లాడకూడదని, అడిగేదేదైనా సౌమ్యంగా అడిగి బతిమాలి ఒప్పించి తీసుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చాను. వాళ్ళు కొంతకాలం నామీదకు ఎదురు తిరిగారు. నేను వాళ్ళకు భోజనాల వద్ద నా ప్రతాపం చూపేదాన్ని. వాళ్ళు ఏ టిఫిన్ అడిగినా చేసేదాన్ని కాదు. కొద్దిరోజులకే వాళ్ళు దారికి వచ్చారు. అలా క్రమంగా ఇంట్లో ప్రశాంతత నెలకొంటూ వచ్చింది.
పెద్దోడు చదువు మీద పడ్డాడు. చిన్నది సమీరజ మీటింగ్‌లంటూ, స్నేహాలంటూ నగరం మీద పడ్డది.
నా పని అలా సులువయిపోయింది. సాత్యకి స్టేట్స్‌లో ఉంటున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు. ఇపుడు ఇంట్లో ఇద్దరమే హాయిగా ఉంటున్నాం. మా సంసారం ఇంత హాయిగా మారుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత హాయిగా ఉందో...
ఇదే నా జీవిత విజయరహస్యం'' అంటూ లక్ష్మమ్మ అందరివైపు గంభీరంగా నవ్వుతూ చూసింది.
''ఆంటీ! ఆ పెళ్ళికాని టీచర్ విషయం చెప్పనే లేదు. వాళ్ళ సంబంధం ఏమైంది?'' ఆసక్తిగా అడిగింది రీనా.
''ఏమో! నాకు సరిగా తెలియదు. ఇంట్లోంచి ఎటూ వెళ్ళేదాన్ని కాదు. దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికని పోవడం? ఏమని అడగడం? ఎవరి పాపంలో వారే పోతారని మనసులోనే శపించుకున్నాను... అయితే ఆ తర్వాత రామకృష్ణకు పెళ్ళైందని ఆమెకు తెలిసిందట. నన్నెందుకు మోసం చేసావని నిలదీసిందట. చెప్పుతో కొట్టి నోటికొచ్చిన తిట్లు తిట్టి వెళ్ళిపోయిందట!''
''ఇలా ఆంటీ అమాయకత్వం నుండి క్రమంగా జ్ఞానవంతురాలయిందన్నమాట!'' అని నవ్వుతూ అంది రీనా.
పెద్దావిడ గాయత్రి రీనా మాటతో లక్ష్మమ్మ ఎక్కడ నొచ్చుకుంటుందోనని బాధపడిపోయింది.
''రీనా! వెనుకట ఉపనిషత్తుల్లో నేతినేతి అనే తర్క చర్చ ఉండేదట. ఏది ప్రతిపాదించినా ఇది కాదు ఇదికాదు అని ఎదుటివాళ్ళు వాదించేవాళ్ళట. చెప్పేవాళ్ళకు విసుగొచ్చి ఓడిపోవాల్సిందే తప్ప ఎంతకని జవాబులు చెపుతారు. లక్ష్మమ్మ ఆ తత్వం చదవలేదు. కాని జీవితమే ఆ తత్వాన్ని నేర్పింది.'' అంటూ లక్ష్మమ్మను సమర్థించింది పెద్దావిడ గాయత్రి. ఆమె జీవితం కూడా అదే క్రమంలో సాగినట్టుంది.
''ఏం తత్వమో గాయత్రీ...! నా మాట సమీరజకు పనికి రాకుండా అయిపోయింది. అదిప్పుడు అల్లునితోటి రోజూ ఏదో ఒక కొట్లాట పెట్టుకుంటుంది. ఈమెను కూతురని సమర్థించవద్దు గాని అన్ని తాను చెప్పినట్టే సాగాలని పట్టుపడుతుంది. నేను నావే సాగాలని పట్టు పట్టలేదు. అది ఎంత చెప్పినా వినదు.''
ఆ మాటతో అందరూ గొల్లున నవ్వారు.
అంతా తనమాటే సాగించుకుని ఇప్పుడు కూతురు విషయానికొచ్చేసరికి సర్దుకుపొమ్మని చెప్పడం అమ్మలక్కలకు విచిత్రంగా అనిపించింది.
''రీనా కూడా అంతే. తనదే సాగాలనుకునేవాళ్ళు, తనమాటే సాగించాలనుకునే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోతారు. రాజుకన్నా మొండివాడు బలవంతుడు అనేది పాత సామెత. మొండిగా వ్యతిరేకించేవాళ్ళే గెలుస్తారనే మాట నా పట్ల కూడా నిజమైంది. నా గెలుపు రహస్యం ఇదే'' అంటూ లక్ష్మమ్మ ముక్తాయింపు ఇచ్చింది.
''అంతా చెప్పారు కదా! ఇక ప్రశ్నించవచ్చా?'' అని అడిగింది రీనా.
''లంచ్ అయ్యాక మళ్ళీ కూర్చుందాం'' అంది లక్ష్మమ్మ.
పిల్లలందరూ బిలబిలా పరిగెత్తుకొని వచ్చారు. భోజనాల కార్యక్రమం గంటకు పైగా సాగింది. ఆ తర్వాత ఆయాసంగా కాస్త ఒరిగారు. రీనాకు తన విషయం ఇంకా పరిష్కారం కాలేదని ఆతృతగా ఉంది.
''గంటసేపు రెస్ట్ తీసుకున్నది చాలు'' అంటూ అందరినీ కూడేసింది పెద్దావిడ గాయత్రి. రీనాకు ఇంకా కొన్ని విషయాలు చెప్పించాలని ఆమె ఆరాటం.
లక్ష్మమ్మ తనకు ఇంతకన్నా ఎక్కువ తెలియదని చేతులెత్తేసింది.
''కావాలంటే మీ ఫీజు మీకు వాపసిస్తా'' అంటూ నవ్వింది.
''మీకు చాలా విషయాలు తెలుసు. ఎందుకో సంకోచిస్తున్నారు'' అంది పెద్దావిడ గాయత్రి.
''అట్ల కాదు గాయత్రీ! రీనా అన్ని తాను అనుకున్నట్టే సాగాలని కోరుతున్నది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ కాస్త సర్దుకుపోవాలి. లేదు, కాదు అంటే వాళ్ళాయన చెప్పే ప్రతిదాన్ని నా తీరుగా వ్యతిరేకిస్తుండాలి. అంతేగాని రీనానే అన్ని ఇలా ఉండాలి అని పోట్లాట పెట్టుకుంటే ఓడిపోక తప్పదు. భర్తనే సాగించుకుంటాడు. భర్త సాగించుకోకుండా చూసుకుంటే అంతా మనం సాగించుకున్నట్టే గదా!'' అని అసలు రహస్యం విప్పిచెప్పింది లక్ష్మమ్మ.
అందరూ చప్పట్లతో అభినందించారు. శిల్పారామంలోని షాపులు చూడడానికి కొందరు లేచారు. అమ్మను వెతుక్కుంటూ సమీరజ అప్పుడే శిల్పారామంలో వారున్నచోటుకు చేరవచ్చింది.
రీనాను పలకరించింది సమీరజ. ఇద్దరిదీ ఒకే సమస్య.
''మేం భార్యాభర్తలం ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇద్దరం సమానమే అని, సమానత్వంతో, ఆత్మగౌరవంతో పరస్పరం గౌరవించుకోవాలని భావిస్తున్నాం. ఆంటీ కేవలం డిపెండెంట్‌గా, ఇల్లాలుగా బతికింది. ఆమె అనుభవాలు మగవాళ్ళతో సమానంగా పనిచేసే మాకెలా ఉపయోగం?'' అని నిలదీసింది రీనా.
''ఔను! మా అమ్మదంతా చాదస్తం'' అని కొట్టిపారేసింది సమీరజ.
''ఇంటెనక చెట్టు మందులకు పనికి రాదన్నట్టు చేస్తున్నవు'' అంది పెద్దావిడ గాయత్రి.
సమీరజ ముఖం మాడ్చుకుంది. కోపంగా మమ్మీవైపు చూసింది. లక్ష్మమ్మ ఆ చూపులను తట్టుకోలేక తలవంచుకుంది. ఎటో చూపులు సారించింది.
''మా మమ్మీ మీకు ఏం చెపుతుందో, ఏం చెప్పిందో నాకు తెలుసు. మా మమ్మీ పెద్ద గయ్యాళి. డాడీని రాచి రంపాన పెట్టి నిత్యం నరకం చూపించింది. లేకపోతే డాడీ ఇంతకు పది రెట్లు ఎదిగి వుండేవాడు. వందకోట్లు సంపాయించి ఉండేవాడు. ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసింది'' అంటూ నిప్పులు చిమ్మింది కూతురు సమీరజ.
గాయత్రికి కోపం వచ్చింది. చిన్నా పెద్దా లేకుండా అందరిముందూ అలా పరువు తీయడం చాలా కష్టం కలిగించింది.
''సమీరజా! జీవితమంతా మీకోసం సేవ చేస్తే మమ్మీ గురించి మాట్లాడేది ఇలాగేనా? పెళ్ళయిన తర్వాత దాంతో, దీంతో తిరుగుతుంటే ఎవరికైనా ఎలా వుంటుంది? ఏ స్త్రీ అలాంటి భర్తను భరిస్తుందో, గౌరవిస్తుందో చెప్పు. నువ్వు గౌరవిస్తావా?'' నిలదీసింది గాయత్రి.
''ఆంటీ! మమ్మీ చెప్పిందంతా అబద్ధం. డాడీకి అలాంటి సంబంధాలు ఏవీ లేవు. కావాలని లేని సమస్యను సృష్టించి డాడీని నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇంటిని నరకం చేసింది. మా వ్యక్తిత్వాల మీద దాని ప్రభావం ఎంత పడిందో? మీకేం తెలుసు? మా వ్యక్తిత్వంలో నెగెటివ్ థింకింగ్ పేరుకుపోవడానికి కారణం మమ్మీయే!'' అంది సమీరజ.
అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మమ్మ తన కూతురివైపు తీక్షణంగా చూసింది. గాయత్రి సమీరజ చెప్పేది నిజమేనా అని అన్నట్టు కళ్లతోనే ప్రశ్నించింది.
''మమ్మీ ఏం చెప్తుంది? నన్ను అడగండి చెప్తాను. డాడీ ఫ్రెండ్ ఒకాయన మా చెల్లెలు సాగరిక డైవోర్స్ అయి టీచర్ ఉద్యోగం చేస్తున్నది. నువ్వు లోకల్‌గా వుంటున్నావు గనుక దాని మంచి చెడ్డలు చూడు. ఒంటరి దాన్ని ఎవరైనా ఏమైనా అంటారు. నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్తే డాడీ సాగరిక ఆంటీని రెగ్యులర్‌గా పలకరించే వాడు. అప్పుడప్పుడు సాగరిక ఆంటీ ఇంటికి కూడా వచ్చేది. ఆ ఆంటీ ఎలా వుంటుందో తెలియదని మమ్మీ చెప్పడం పచ్చి అబద్ధం. ఆంటీని, డాడీని ఇక్కడికి పిలిచి అడగండి. ముగ్గురు వున్నప్పుడు అడిగితే విషయం తేలిపోతుంది.'' కుండబద్దలు కొట్టింది సమీరజ. డాడీ గురించి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్న మమ్మీని ఈసడించుకుంటూ ఇక అక్కడ ఉండలేనన్నట్లు రీనాను తీసుకొని వెళ్ళిపోబోతూ మళ్లీ అంది సమీరజ.
''పెళ్ళయిన నుండి ఒక్క పైసా పని చేయకుండా డాడీ మీద గయ్యాలి తనంతో పెత్తనం చేస్తూ మానసికంగా హింసిస్తూ వచ్చావు. అంత కష్టపడి పైకొచ్చిన డాడీకి సమాజంలో, బంధుమిత్రుల్లో విలువలేకుండా చేస్తూ వస్తున్నావు. తద్వారా నీకు విలువ వుంటుందను కుంటున్నావు. డాడీకి విలువ లేనప్పుడు నిన్నెవరు గౌరవిస్తారు. డాడీకి నీడలాగా బతికిన నీకు సొంత జీవిత లక్ష్యం ఏమైనా వుందా?''
లక్ష్మమ్మ కూతుర్ని కొరకొరా చూసింది. నిప్పులు చిమ్ముతున్న కూతురు కళ్లకేసి చూడలేక తలదించుకుంది. అందరిముందు తన పరువు తీసిందని అవమానంతో బాధపడుతోంది. లక్ష్మమ్మను ఏమీ అడగలేక పెద్దవాళ్లను అలా ఎదిరించడం ఇష్టం లేక అందరూ ఆశ్చర్యంతో మౌనంగా వుండిపోయారు.
శిల్పారామంలో ఆహ్లాదంగా, చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అంత చక్కని ప్రకృతి పరిసరాలు, వారి హృదయంలోని వేడిని తగ్గించలేకపోయాయి. ఆనందంగా మొదలైన చర్చ అంత సీరియస్‌గా మారుతుందని ఎవరూ అనుకోలేదు.
అక్కడికి వచ్చేముందు సమీరజ కూడా అలా మాట్లాడాలని అనుకోలేదు. ఎందుకో ఆరోజు హృదయం బద్దలైంది. తన వ్యక్తిత్వంలో భర్తను రాచి రంపాన పెట్టే స్వభావం ఎంత వద్దనుకున్నా పోకపోవడానికి మమ్మీ బాల్యంనుండి వేసిన ప్రభావమే కారణం. ఇంట్లో ఏం జరుగుతుందో అదే తమకు తెలియకుండా వ్యక్తిత్వంలో, జీవితంలో భాగమైపోయింది. దాన్ని ఇప్పుడు ఎలా వదిలించుకోవాలో, సవరించుకోవాలో తెలియక సతమతమౌతోంది సమీరజ. లక్ష్మమ్మకు కూతురు సమీరజలోని సంఘర్షణ ఊహకందలేదు. సమీరజ హృదయంలోని ఆవేశం లావాలా పెల్లుబికింది. అనవసరంగా సంసారంలో కలతలు పెంచుకుంటున్న విషయం తెలిసి వస్తోంది. ఎందుకలా జరుగుతుందో... తననుతాను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతుందో... తనపై తనకే కోపం... ఆవేశం... దీనికంతటికి తనపై చిన్నప్పటినుండి డాడీని రాచిరంపాన పెట్టిన మమ్మీ స్వభావమే కారణం. అని సమీరజకు కోపంగా ఉంది.
శిల్పారామంలో కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లల ఆటల అల్లరి స్పష్టంగా వినిపిస్తోంది.
కొద్ది క్షణాలు అందరు నిశ్శబ్దం.
సమీరజను కంట్రోల్ చేయకపోతే తన కూతురు రీనా కూడా అలాగే తన మీదికి తిరగబడుతుందని తనగురించి అలాగే అందరిముందు పరువుతీస్తుందని భయపడిపోయింది గాయత్రి.
''అయితే మీ భార్యాభర్తలు కొట్లాడుకోవడానికి కూడా మమ్మీయే కారణమా?'' అంటూ నిలదీసింది గాయత్రి.
''అవును. నిజానికి మాకు పోట్లాడుకోవాలని వుండదు. ఆయన మరీ అంత చెడ్డవాడేమీ కాదు. కాని ప్రతిసారి చర్చ పోట్లాటగా మారడానికి మమ్మీ ప్రభావమే కారణం''
''ఏదోనమ్మా! మేము మా కాలంలో అందరం అలాగే సంసారం చేశాము. అదితప్పని మాకు తెలియదు. మా అత్తమామలను చూసి మేము అలాగే ప్రవర్తించాము. మీరు చదువుకున్నవాళ్లు. మా లాగ ఎందుకు ప్రవర్తించాలి?'' మళ్లీ అంది గాయత్రి.
అక్కడ ఉంటే చర్చ ఇంకా పెరిగిపోతుందని, రీనా, సమీరజ కలిసి శిల్పారామంలో అలా చుట్టూ తిరిగి వద్దామనుకొని ముందుకు నడిచారు.
వారికి రీనా వాళ్ళాయన దేవేందర్ అక్కడే తచ్చాడుతూ కనిపించడంతో ముందుకు వెళ్లలేకపోయింది రీనా.
'హాయ్' అంటూ ఇద్దర్నీ పలకరించాడు దేవేందర్.
రీనా తనను కాదన్నట్టు, అపరిచితుడన్నట్టు ఎటో చూస్తోంది.
సమీరజ 'హాయ్' అంటూ ముందుకు సాగింది.
''రీనా! మీ ఆయన నీకోసం వచ్చాడు. మా ఆయన మాత్రం రాలేదు చూడు. మా ఆయన కన్నా మీ ఆయనే నయం'' అంటూ సాభిప్రాయంగా చూసింది సమీరజ.
దేవేందర్‌తో మాట్లాడ్డం ఇష్టం లేక వెనక్కి తిరిగారు. దేవేందర్ వారి వెనుకే నక్కుతూ ఫాలోఅయ్యాడు.
దేవేందర్ ఎదురు కావడంతో రీనా మనసు చెదిరిపోయింది. అల్లకల్లోలమైంది. తాను లక్ష్మమ్మలా దేవేందర్‌ని కష్టపెడుతున్నానని క్షణం ఆలోచనలో పడింది. ఎందుకో ఆమె మూడ్ మారిపోయినట్టుంది.
రీనా మూడ్ మారడం గమనించి అందరివైపు చూసి రీనాకు హితోపదేశం చేస్తున్నట్టుగా అంది సమీరజ.
''వీళ్ళ మాటలు మనలాంటి యువతరం వినుకుంటూ కూర్చుంటే మనం కూడా వారిలాగే వండిపెట్టుకుంటూ, పిల్లలని కనుకుంటూ, ఉద్యోగాలు వదిలేసి వంటిల్లుకు పరిమితం కావలసి వస్తుంది. జీవితంలో ఉన్నత లక్ష్యాలు వదిలేసి సంసారాన్ని నరకం చేసుకోడానికే పనికొస్తుంది.'' అంటూ మమ్మీని ఈసడించింది సమీరజ.
రీనా కూడా ఆ మాటనే సమర్ధించింది.
''వెనకటి బుద్ధులు మారడానికి ఒప్పుకుంటాయా? మనం కోరుతున్నదేమిటి? మాతో సమానంగా ఇంట్లో కూడా పని చేయాలని! పిల్లలను ఎత్తుకొని ఆడించడం, స్నానం చేయించడం చేయాలని. వాళ్లతో సమానంగా మమ్మల్ని కూడా గౌరవించాలని, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు టీ, టిఫిన్‌లు చేసివ్వాలని అంటున్నాం. మా సంపాదన లెక్కలు అడిగినట్టుగానే మీ సంపాదన లెక్కలు చెప్పాలని అంటున్నాం. అందులో తప్పేముంది? ఈ మగ అహంకారం, ఆధిపత్యం తగ్గించుకోకపోతే మేం రాం. మాకీ కాపురాలు అక్కర్లేదు. హాయిగా సింగిల్ పేరెంట్‌గా మా పిల్లలతో మేం బతగ్గలం.'' అంది రీనా.
కూతురు రీనా ఎత్తిపొడుపు మాటలతో మనసు నొచ్చుకుంది గాయత్రి.
తన కూతురు రీనాకి ఇంకా ఎప్పుడు బుద్ధి వస్తుందో... అంటూ ఆవేదనగా లక్ష్మమ్మ మొహంలోకి చూసింది గాయత్రి.
అప్పటికే దేవేందర్ అక్కడికి చేరుకున్నాడు. తప్పు చేసిన వాడిలా తల వంచుకున్నాడు. అమ్మలక్కల ముచ్చట్ల వద్దకు నువ్వెందుకు వచ్చావన్నట్టు కొరకొరా చూసింది రీనా. వాళ్ళ ముచ్చట్లన్నీ చాటుగా విన్నాడేమోనని రీనా సందేహించింది.
''అనుభవమే అన్నీ నేర్పుతుంది. ఉరికి ఉరికి పశువులు కాస్తే పొద్దు గూకుతుందా? అని వెనుకటి పల్లెటూరి సామెత. కొత్తగా పశువులు కాస్తున్న పిల్లవాడు బాగా మేయాలని ఉరుకురికి పశువులు కాశాడట. ఉరికురికి పశువులు కాస్తే పొద్దుగూకుతుందా? పొద్దంతా పశువులు కాయాల్సిందే గదా! నిదానంగా ఉండాలనేదనేది ఆ సామెత అర్థం. రీనా, సమీరజ ఉరుకురికి పశువులు గాసే కొత్త పశువుల కాపరిలాంటి వాళ్ళు'' అంటూ నవ్వింది లక్ష్మమ్మ.
గాయత్రి, లక్ష్మమ్మను సమర్ధించింది. పడుసో పెడుసో అన్నట్టు వుంది వాళ్లకు. నాలుగు రోజులకు వాళ్లకే తెలుస్తుంది అంటూ రీనా, సమీరజలకు వినపడేటట్టుగా అరిచింది గాయత్రి.
''మాకు అన్నీ తెలుసు. హూఁ'' అంది రీనా.
''సారీ రీనా! ఇక నుండి నువ్వు కోరుకున్నట్టే వుంటాను. నువ్వు చెప్పినపని చెప్పకముందే చేస్తాను. ఈ మూడు నెలల్లో నాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. నువ్వు లేని లోటు బాగా తెలిసి వచ్చింది. నన్ను క్షమించు. అందరిముందు మరోసారి నీకు సారీ చెప్తున్నా! ఇవాల్టితో పుల్‌స్టాప్ పెట్టి తిరిగి మనం కలిసి వుండడానికి అంగీకరించాలని కోరుతున్నాను.'' అంటూ అందరి ముందు చేతులెత్తి నమస్కరించాడు దేవేందర్. రీనా కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. రీనా కోపం అంతా ఎక్కడికో ఎగిరిపోయింది. నవ్వు రాబోయింది. బలవంతంగా ఆపుకుంది.
అల్లుడు రీనాని వెతుక్కుంటూ రావడం గాయత్రికి సంతోషంగా వుంది. సమీరజ రీనాను అక్కడ్నుంచి బలవంతంగా శిల్పారామం ఎగ్జిబిషన్‌వైపు లాక్కుపోయింది. దేవేందర్ అమ్మలక్కలందరికీ తన గోడు వినిపించబోయాడు. ఆమెకే చెప్పుకో పో అంటూ గాయత్రి నవ్వుతూ సైగ చేసింది. తమను ఫాలో అవుతున్న దేవేందర్‌ను గమనించి అతనికి వినబడేట్లుగా సమీరజ గట్టిగా మాట్లాడుతోంది.
''రీనా! మనది తప్పైనా వాళ్ళే సారీ చెప్పాలి. ఎందుకంటే పుట్టిపెరిగిన మన కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలి వాళ్ళ ఇంటికి వచ్చాం కదా! వాళ్ళ ఇంటిపేరును, వాళ్ళ వంశాన్ని నిలబెడతాం కదా! అందుకని తప్పు మనదైనా వాళ్ళే సారీ చెప్పాలి. అప్పుడే సంసారంలో అందం. డాడీకి ఈ రహస్యం తెలుసు. మా మమ్మీ గెలుపు రహస్యం మా డాడీయే. డాడీ అన్నిటికీ సర్దుకుపోతూ మమ్మీని గెలిపించాడు. లేకపోతే మమ్మీకి ఎప్పుడో డైవర్స్ అయ్యేవి. మన భర్తలు ఇపుడిప్పుడే తెలుసుకుంటున్నారు.''
''సమీరజకు ఎప్పుడు బుద్ధివస్తుందో!'' అంటూ బాధగా వాపోయింది లక్ష్మమ్మ.
''ఇవాళ గాకపోతే రేపు. దేవేందర్‌లా మీ అల్లుడు చంద్రశేఖర్ కూడా సమీరజను వెతుక్కుంటూ వస్తాడు అంటూ అందరూ నవ్వారు.
''రీనా'' అంటూ గట్టిగా పిలిచాడు దేవేందర్.
రీనా హాయిగా నవ్వుకుంటూ వినబడనట్టు గబగబా ముందుకు నడిచింది.
''రేపు మీ ఆయన చంద్రశేఖర్ కూడా ఇలాగే నీకోసం వస్తాడులేవే'. అంది రీనా.
సమీరజ ఆ సన్నివేశం కళ్లల్లో కదిలాడి కోపం పోయి తనలోతాను నవ్వుకుంది. అలా జరిగితే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంది.
- ఆంధ్రభూమి దినపత్రిక సండే బుక్, 2011