Friday, October 7, 2016

నాగశాల దట్టమైన అడవి, ఏదో పిల్లబాట. దూరంగా వాగు ప్రవహిస్తున్న చప్పుడు, కనుచూపు మేరలో ఏదో గూడెం. రెండు గుర్రాలను జువ్విచెట్టు నీడలో కట్టేసి రావి చెట్టు కింద సేదదీరుతున్న 'నాగశాల'కు అమ్మ, ఇల్లు, ఊరు, తమ రాజ్యం గుర్తొచ్చాయి. అతని సహచరుడు మేనబావ 'ఇలానాగ' రెండు రోజులుగా విరేచనాలతో వడలిపోయి చెట్టు మొదలులో నిస్సత్తువగా నిద్రిస్తున్నాడు. అతని తెల్లబట్టలు కాషాయ రంగులోకి మారి జిడ్డుగా ఉన్నాయి. వాళ్లు ఇల్లు వదిలి దేశాటనకు బయల్దేరి ఏడాదిన్నర దాటింది. ఇంకో ఏడాది రెండేళ్లు దేశాటన చేయాలని ఆరాటం. రాజకుమారుల్లాగే తాము కూడా విద్యలన్నీ నేర్చుకున్నాక దేశాటన చేసి లోకరీతిని, కళలను తెల్సుకోవాలని బయల్దేరారు. రాజపుత్రి అయిన నాగశాల తల్లి నాగపుత్రి చిన్నప్పట్నుంచి అతనికి దేశాటన పట్ల యుద్ధ విద్యల పట్ల ఉత్తేజం కలిగించింది. తండ్రి నాగపాల గొప్ప కళల పట్ల, శాస్త్రాల పట్ల ఆసక్తి పెంచాడు. నాగపాల చెల్లెలి కొడుకైన ఇలానాగకు చెట్లన్నా వ్యవసాయమన్నా ఎనలేని అనురాగం. ఇద్దరిదీ విడదీయరాని మైత్రి. దేశాటనలో ఎదురయ్యే కష్టాల గురించి ముందే ధైర్యం చెప్పాడు తండ్రి నాగపాల. పెద్దవాళ్లు వీడ్కోలిస్తూ చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. పద్దెనిమిది నెలల దేశాటనలో ఇరవై ఏళ్ల జీవితానుభవాలు జతపడ్డాయి. కాలినడకతో బయల్దేరిన వాళ్లు ఇప్పుడు గుర్రాలను సంపాదించుకున్నారు. విస్తారమైన అడవుల గుండా ఎన్నో జంతువులు, వాగులు, నదులు, ఎన్నో తెగలు, జాతుల ప్రజల మధ్య నుండి ప్రయాణం చేశారు. ఇంకా ఎందరో సంచార జీవితంలో ఎడ్లబండ్లతో గమ్యం తెలియని ప్రయాణం సాగిస్తున్నారు. కష్టాల్లో వారికి సంతోషం కలిగించినవి రెండే. ఆనందబుద్ధ పరిచయం ఒకటి. ఎక్కడో ఒక చోట శాతవాహన రాజధాని అయిన 'కోటి లింగాల (కోటిలింగాలు)' నుండి వలస వెళ్లిన వాళ్లు తెలాంగులు, ఎదురై తమ భాషలో మాట్లాడుతూ అక్కడి విశేషాలడగడం చెప్పడం రెండోది. మహా గోదావరి వరదల్లో 'కోటిలింగాల' రాజధాని ఎన్నిసార్లు కొట్టుకపోయిందో! వరదల వల్ల అక్కన్నించి ఎక్కడిక్కడికో వలస పోయి స్థిరపడ్డ తెలాంగులు తమ భాషవారు ఎదురవడం తమ వాళ్లనే కల్సినంత సంతోషం. వారి వద్ద భద్రంగా ఉన్న గ్రీకు రోమన్‌ మగధ గాంధార చైనా శాతవాహన రాజ్యాల నాణాలు వారి గతకీర్తికి సాక్ష్యాలుగా ఉన్నాయి. తమ తల్లీదండ్రి దాచి ఎంతో అక్కర వస్తే తప్ప చూపకూడదు, అమ్మకూడదు అని ఇచ్చిన నాణాలు అవి ఒకే పోలిక. అలసటతో నాగశాల నిర్వేదంగా నిట్టూర్పు విడిచాడు. నిజంగా ఈ లోకం ఎంత విచిత్రమైనది. ఈ మనస్సును అర్థం చేసుకోవడం ఎంత కష్టం! జంతువులో, దొంగలదాడో, ఇతర తెగల యుద్ధమో, విషజ్వరాలో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అయినా సంపదపై, గతంపై సంస్కృతిపై ఇంత పట్టుదల, ఆశ ఎందుకో. భాష తెలియదు. మనుషులు తెలియరు. ఎదురైతే పరస్పరం జంతువుల్లా వేటాడి చంపుతారని భయం. పళ్లు, కాయలు గడ్డలు ఏది తింటే మంచిదో ఏది కడుపునొప్పో తెలియదు. ప్రయోగాల మీద వ్యామోహంతో ఇలానాగ ఏదో తిని ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. ఏ దారి ఎటుపోయి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. దారి చూపినట్టే నమ్మించి ఎవరు ఎక్కడ నరబలి ఇస్తారో తెలియదు. నిత్య సంచారం చేసే బౌద్దులొక్కరే బాసట. స్థిర గ్రామాలు తక్కువ. ఇంత మంచి బౌద్దుల పట్ల తన తండ్రికి అంత ద్వేషం ఎందుకో. తన తండ్రి నాగపాల చేసిన హితబోధలు గుర్తుకొచ్చాయి. ఆయన కోరుకున్నదొకటి. తమకు జరిగిందొకటి. ''అరే నాగసా! మనది పేరెన్నిక గన్న వంశం. ఎందరో రాజులు, రాణులు, వర్తక శ్రేష్ఠులు, బౌద్ధ బిక్షులు, బ్రాహ్మణులు మన పనితనం మెచ్చుకున్నారు. నీ దేశాటనలో ప్రజలతో పాటు వీళ్లను కూడా కలుస్తూ ఉండు. వారి అభిమానం కూడా చూరగొనాలి. అయితే నాగసా! ఎంత గౌరవప్రదమైన ఉన్నతోద్యోగం అయినాసరే రాజాస్థానాల్లో చేరవద్దు. కళాకారులకు స్వేచ్ఛే ప్రాణం. తుచ్చమైన ఆ సుఖాలు ప్రజల్ని పీడించిన సొమ్ముతోనే గదా! అందుకే ఆ రాజభోగాలు, రాజస్థానం వదిలి యువరాణి మీ అమ్మ నన్ను ప్రేమించి మారువేషంలో నాతో వచ్చేసింది. అప్పట్నుంచి మేం ఆ రాజ్యం వదిలి ఎన్నో రాజ్యాలు తిరిగి యిపుడీ వూళ్లో వుంటున్నాం. నీ చిన్నతనంలో అసకరాజు వేటదారిలో ఎదురైన మీ అక్కను ఎత్తుకెళ్లి తన రాణుల్లో ఒక రాణిగా మార్చుకున్నాడు. అప్పుడు ఆ అవమానంతో ఆ రాజ్యం వదిలివేశాం. అసకరాజు మీద ప్రతీకారం తీర్చుకోవాలని మూడేళ్ల క్రితమే మీ అమ్మ ఎటో వెళ్లిపోయింది. నీ దేశాటనలో అమ్మ జాడ కూడా వెతుకుతూ ఉండు. ఎక్కడ స్త్రీ రాజ్యం ఉంటుందో అక్కడ మీ అమ్మ ఉండే అవకాశం ఉంది. అమ్మ వెళ్లిపోయాక నిన్ను తీసుకొని ఈ ఊరు వచ్చాను. నా ఆశలన్నీ నీ మీదనే'' ''నాగసా! మీ అమ్మలా పంతాలకు పోవద్దు. రాజులతో, జ్ఞానులతో తెలియని చోట వాదాలకు, పంతాలకు దిగవద్దు. వాళ్లు ఓడినా గెలిచినా నీ పట్ల అక్కసుగా ఉంటారు. పగపట్టి ప్రాణాలు తీయిస్తారు. సరినేతలో నాడెలాగా ఎక్కడా చిక్కుపడకుండా ముందుకు సాగు. నాగసా! బౌద్ధులకు దూరంగా ఉండు. వాళ్లు ఏవో మాయమాటలు చెప్పి నీ మనసు విరిచేస్తారు. నిన్ను కూడా బౌద్దభిక్షువుగా మారుస్తారు. మాకు పుట్టిన ఎనిమిది మందిలో మీ అక్క అలా అయిపోగా మిగిలింది నీ వొక్కడివే. నీవు బౌద్ధ భిక్షుల్లో కలిస్తే మన వంశం నిర్వంశం అవుతుంది. నేనది ఊహించలేను. నీవు భిక్షువుగా మారితే మనం తరతరాలుగా వృద్ధి చేసిన ఈ కళలు కూడా నీతోనే నశించిపోతాయి. అందుకని బౌద్ధులు కనపడితే తప్పుకొనిపో. మహిమలు, మంత్రాలున్నాయని సిద్ధులు నీకు నేర్పుతామని శిష్యరికం చేయమని మోసం చేస్తారు జాగ్రత్త''. ''నాగసా! ఏ వూరు ఎటువంటిదో! ఆడవాళ్లను తల్లిగా గౌరవించు. మా తాత చనిపోతూ దాచి ఉంచి యిచ్చిన సిముక మహారాజు బంగారు నాణాలు, అమ్మ తెచ్చిన హాలుని నాణాలు, గ్రీకు రోము నాణాలు ఆపదల్లో మాత్రమే బయటకు తీయి''. తన తండ్రి చెప్పినదంతా బాగానే ఉంది గానీ బౌద్ధుల్ని, బౌద్ధాన్ని ఎందుకంత ద్వేషిస్తున్నాడో తెలియదు. పరస్పరం చంపుకునే తెగలు దారుల మధ్య వాళ్లు జ్ఞానాన్నీ వైద్యాన్ని అందిస్తూ తిరగడం ఎంత గొప్ప విషయం. శాంతి ఉంటే ప్రజలు, కళలు ఎంత సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయి! అలాంటి బౌద్ధుల్ని తన తండ్రి ఎందుకు ద్వేషిస్తున్నాడో నాగశాలకు బోధపడలేదు. అదేదో ముందే తేల్చుకుందామని మహా విద్యాలయంగా వెలుగొందుతున్న శ్రీపర్వతం (నాగార్జునకొండ)కేసి దారి తీశారు. అక్కడికి పోవడంతోనే జ్ఞాననేత్రం విప్పారింది. అక్కడ 'ఆనందబుద్ధ' గురువు లభించడం తమ అదృష్టం అనుకున్నారు. ఆనందబుద్ధ వారికి ఎన్నో భాషలను, భావాలను, సంస్కృతులను, స్వభావాలను, కళలను పరిచయం చేశారు. పది నెలలుండి మళ్లీ నాలుగు నెలలు దేశాటన చేసి మరో నాలుగు నెలలు ఆనందబుద్ధ గురువు వద్దే ఉన్నారు. ఆనందబుద్ధ, బుద్ధ భగవానుని బోధనలను, ఆచార్య నాగార్జునుని గొప్పతనాన్ని వివరించాడు. దాంతో ఉత్తేజితుడై నాగశాల బౌద్ధబిక్షు దీక్ష యిమ్మని కోరాడు. ఇలానాగకు ఇంటికెళ్లి తాను తెల్సుకున్నదంతా తనవాళ్లకు అందించాలని కోరిక. ఆనందబుద్ధ నాగశాలను సున్నితంగా వారించాడు. ''నాగశాలా! నీవు ముందుగా మీ తండ్రి నాగపాల చెప్పినట్టుగా నీ దేశాటన పూర్తి చేసి తండ్రి ఆశీస్సులు తీసుకో! కొన్నాళ్లు యింటనే ఉండు. అపుడు నీ నిర్ణయం మీ తండ్రికి చెప్పు. అప్పటికీ బిక్షువు కావాలనిపిస్తే మీ నాన్నను ఒప్పించు. నీ దేశాటనలో బౌద్ధులెక్కడ కనపడ్డా వారితో కల్సి నడువు. నీకు మేలు జరుగుతుంది'' ప్రాకృతం, పాళీ, సంస్కృతం, పైశాచీ, చైనా భాషల్తో పాటు కొన్ని స్థానిక భాషాపదాలను వారు నేర్చుకున్నారు. ముందే శ్రీపర్వతం రావడం ఎంతో మంచిదైంది అనుకున్నారు. రెండవసారి ఉత్తరాది దిశగా ప్రయాణమయ్యారు. జ జ జ జ ఎవరో స్త్రీ నడచి వెళ్తున్న సవ్వడి వినిపించి కళ్లు విప్పాడు నాగశాల, మట్టికుండ తీసికొని ఆమె వాగుకేసి పొతున్నట్టుంది. మళ్లీ కళ్లు మూసుకున్నాడు. రాత్రి దోమల బాధకు నిద్ర లేకపోవడంతో కన్నంటుకుంది. ఏదో అలికిడి విన్పించి లేచి కూర్చున్నాడు నాగశాల. ఇందాకటి స్త్రీ స్నానం చేసి నీళ్లకుండ తీసుకుని వచ్చి ఇలానాగ నోట్లో నీళ్లు పోస్తోంది. ఆమెకు అభివాదం చేశాడు నాగశాల. ఆమె ఏదో అడిగింది. అతనికది అర్థం కాలేదు. కాసేపటికి ఆమె మాట్లాడుతున్నది పైశాచి భాష అని అర్థం కాసాగింది. తమ తాతకు పైశాచీ బాగా వచ్చేదట! తండ్రి చెప్పేవాడు. తండ్రి ఊళ్లు మారడంతో తన భాష మారింది. తమ తల్లికి పైశాచీ భాషతో పరిచయమే లేదు. గుణాఢ్యుడు పైశాచీ భాషలో సమాజ పరిణామాల్ని మానవ సంబందాల్ని కథలు కథలుగా సేకరించి బృహత్కథగా రాసి ఆ భాషకు సాహిత్య గౌరవం కలిగించాడు. అతను వందనీయుడు అన్న ఆనందబుద్ధ మాటలు గుర్తొచ్చి నాగశాల మరోసారి కృతజ్ఞతలు తెలిపాడామెకు. ఆమె తన పేరు ఇలాంగ అని ముద్దుగా ఇలూచి అని పిలుస్తారని తమ యిల్లు దగ్గరే అని తమ యింటికి రమ్మని ఆహ్వానించింది. నాగశాల ఇలనాగను భుజం మీద మోసుకొని ఆమె వెనుక నడిచాడు. తర్వాత వచ్చి గుర్రాలను తీసుకొని వెళ్లాడు. మూడు రోజుల్లో ఇలనాగ కాస్త తేరుకున్నాడు. ఇలూచికి కాస్త చెట్ల వైద్యం కూడా వచ్చు. ఇలూచి మాతాంగ అయిదో సంతానం. ఇలూచి ఒక్కతే మిగిలింది. కళలంటే ఇలూచికి కూడా ఎంతో ఆసక్తి. వాళ్ల అమ్మ, నాన్న గొప్ప కళాకారులని ఆమెకు కాస్త గర్వం కూడా. సహజంగానే వారి చర్చ కళలపైకి మళ్లేది. ''మా అమ్మ చెప్పేది మా నాన్న గొప్ప కళాకారుడట. చర్మాలను చదును చేయడంలో పసర్లతో కళాకృతులు వేయడంలో దిట్టనట. మా తండ్రి వజ్రాలు, బంగారం పొదిగి తయారు చేసే చర్మవస్త్రాల కోసం రాజులు, రాణులు వణిక్‌ ప్రముఖులు పోటీ పడేవారు. తమకు చేసి యిచ్చిన నమూనా మరెవరికి చేయకూడదని చెప్పి ఎంతో డబ్బు యిచ్చేవారు. మా తాత ముత్తాత ఇంకా గొప్ప కళాకారుడు. అజంతా, ఎల్లోరా గుహల్లో వేసిన రంగులు, అలంకరణలు, కళాకృతులు కొన్ని మా ముత్తాత చర్మం మీద నమూనాలు వేసి యిస్తే వేసినవేనట. అందుకే మా ముత్తాత తాను చనిపోయినప్పుడు ఆ గుహల దగ్గరనే సమాధి చేయాలన్నాడట. యిప్పటికీ ఆ సమాధి ఉంది'' అంది ఇలూచి. తల్లి కూడా అదే సమర్థించింది. ''అక్కడికి నడిచిపోతే ఒకరోజు కూడా ఉండదు దూరం'' అంది ఇలూచి తల్లి. నాగశాలతో పాటు ఇలనాగకు ఆ సుందర గుహలు చూడాలనే ఉత్సుకత పెరిగిపోయింది. ''మా నాన్న కూడా మా ముత్తాత వద్ద శిక్షణ తీసుకున్నారని చెప్పేవాడు. అజంతా, ఎల్లోరా గుహల్లో కొన్నిటికి మా ముత్తాత బట్టపై నమూనా వేసి యిస్తే చెక్కారట'' అన్నాడు నాగశాల. వారం రోజుల తర్వాత ఇలూచి, ఆమె తల్లి ఒక గుర్రం మీద, ఇలానాగ, నాగశాల మరో గుర్రం మీద అజంతా గుహల సందర్శనం కోసం బయలుదేరారు. వర్షాలు, చిమ్మ చీకటి వల్ల వారం రోజులు అక్కడే ఆగారు. పదిహేను రోజుల పరిచయంలో ఇలూచికి నాగశాలకు మధ్య స్నేహంతో పాటు ప్రేమ వంటి ఇష్టం ఏర్పడి సన్నిహితం అయ్యారు. ''వీళ్ల నాన్న జంతు చర్మాల కోసం మాటేస్తే నక్కల గుంపు అకస్మాత్తుగా మీద పడి చీరేసింది ఇక్కడే'' అంటూ ఇలూచి తల్లి ఏదో వాగు పక్కనున్న చెట్లపొదను చూపింది. అందులోంచి అలికిడి విని చిరుతపులి ఒల్లు విరుచుకుంది. దాన్ని పసికట్టి ఇలూచి తల్లి సైగ చేసి మా గుర్రాన్ని అదిలించమంది, రెండు గుర్రాలు దౌడు తీశాయి. లేళ్లు కంటపడ్డంతో చిరుత అటుకేసి దారి మళ్లింది. ''ఈ లేళ్ల చర్మం కోసమే మా బావ చిరుతపులి వాతపడ్డాడు'' అంది ఒగరుస్తూ ఇలూచి. ఆమె ముఖంలో విచారం కమ్ముకుంది. కొద్ది రోజులైతే పెళ్లి అవుతుందనుకున్న బావ ''నల్ల జింక చర్మంతో పెళ్లి కానుకగా చక్కని చర్మవస్త్రాలు నాకు ఇస్తాననుకుని ఇలా అయిపోయిండు'' అంది. జ జ జ జ ఎంతో దగ్గరవుతారనుకున్న ఇలూచి నాగశాల వాదాలతో విడిపోవడం తల్లికి బాధనిపించింది. ''మీ తోలు బట్టలు పాత సంస్కృతి, పత్తితో నేసిన నూలు బట్టలు వెచ్చగా ఉండటంతో పాటు ఎంత చెమటైనా పీల్చుకుని గాలి ఆడుతూ హాయినిస్తాయి'' అన్నాడు నాగశాల. ''నూలు బట్టలు వానకు తడుస్తాయి. బట్టసంచిలో నీళ్లు ఆగవు. తొందరగా చిరుగుతుంది. చెదలు పడుతుంది. తోలు వానకు తడువనీయదు. తోలు దుప్పటి కప్పుకుంటే దోమలు కుట్టలేవు. తోలు సంచిలో నీళ్లు పట్టుకోవచ్చు. ఎక్కువ కాలం ఆగుతాయి. వేటాడటం చేతగాని వాళ్లు, చర్మాలు చదును చేయటం రానివాళ్లు నూలు బట్టలు మంచివి అంటారు. అసలు నిన్ను కాదు ఈ బౌద్ధులను, జైనులను అనాలి. అహింస అంటారు మా చర్మవస్త్రాలకు విలువ, గౌరవం లేకుండా చేశారు. వాళ్లు వేసే పట్టుబట్టలు పట్టు పురుగుల హింస కాదా...!'' అంది ఇలూచి. ఇలానాగకు ఇలూచి చెప్పిందే సరైనది అనిపించి సమర్థించాడు. నాగశాల వాళ్లిద్దరూ ఒకటి కావటంతో రెచ్చిపోయాడు. బౌద్ధాన్ని తప్పుపట్టడంతో కోపం తారాస్థాయికి చేరింది. నూలుబట్టలు నాగరికతకు చిహ్నం, రాజులు, రాణులు, వణిక్‌ ప్రముఖులు, బ్రాహ్మణులు, భిక్షులు, శ్రమణులు పత్తిబట్టలు వాడుతారు'' అంటూ ఆమెను కించపరిచాడు నాగశాల. ''మీ బౌద్ధ గ్రంథాలను కాపాడుతున్నది మా తోలుబట్టలే! చర్మం కన్నా బట్ట శ్రేష్టమైనదని నిరూపిస్తే మేం ఈ వృత్తిని, కళల్నే వదిలేస్తాం'' అని ఇలూచి సవాలు చేసింది. ''మా వెంట దేశాటనకు రా! ఏ రాజ్యంలోనైనా నిరూపిస్తా'' అన్నాడు నాగశాల. ఇలూచి సరే అంది. తల్లి కన్నీరుతో వీడ్కోలు పలికింది. గుర్రంపై ఇలూచి ఇలానాగ వెనక కూర్చోవడంతో నాగశాల జీవితంలో మొదటిసారిగా ఓడిపోయినట్టుగా డీలాపడిపోయాడు. జ జ జ జ గాంధార, సప్తసింథు, కాశ్మీరం, హిమాలయ ప్రాంతాల్లో వారికి ఎన్నో కొత్త అనుభవాలు కలిగాయి. చలికి తోలుబట్టలు, ఉన్ని బట్టలు తప్ప నూలు బట్టలు ఎందుకూ పనికిరావని నాగశాలకు ఏ వాదన లేకుండానే అర్థమైపోయింది. గాంధార మహారణ్య కనుమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు గుర్రాలు నడవలేక పోయాయి. ఒకటి అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఒక్కదాన్ని పులి కొట్టేసింది. కాలి నడకలో ఉన్న బాటసారులను, బౌద్ధులను గుర్రాలపై వచ్చి ఉన్నవన్నీ లాక్కొని చావబాది వదిలేసిపోయారు అడవి దొంగలు. గాయాలతో జీర్ణ వస్త్రాలతో రక్తం ఓడుతున్న వారిని బిక్షులు తమ వెంట తక్షశిలకు తీసుకుపోయారు. కాషాయ వస్త్రధారి 'అదీర తెలాంగ' వాళ్లందరిని ఆదరించింది. కొద్ది రోజుల్లో తక్షశిల వదిలి బౌద్ధ బిక్షులు సెలవు తీసుకున్నారు. ఇలూచి నాగశాల మిత్రులక్కడే కొంతకాలం ఆగిపోయారు. కాషాయ వస్త్రాల్లో అదీర తామెర పూవులా మెరిసిపోతుంటే నాగశాల మనసు చెదిరింది. అదీరలో ఎపుడూ చెదిరిపోని చిరునవ్వు. అదంటే నాగశాలకెంతో ఇష్టం. అదీర ఎన్నెన్నో చెప్పింది. తమ పూర్వీకులు తెలాంగులు మీ ప్రాంతం వారేనన్నది. చైనాను ఒకసారైనా చూసి రావాలన్నది. వారిలో ఉత్సాహం పెరిగింది. వారితో పాటు అదీర కూడా ప్రయాణమైంది. జ జ జ జ టిబెట్టు దారిలో పన్నెండు గాడిదల మీద గ్రంథాలు తీసుకొని శిష్యులతో ప్రయాణమై పోతున్న 'ఆనందబుద్ధ' గురువును నాగశాల గుర్తుపట్టాడు. ఇంతలోనే ఎంతో వృద్ధాప్యం పైబడ్డట్టుగా శరీరం ముడుతలు పడి, మనస్సు అలసిపోయినట్టు కనపడ్డాడు. పలకరింపులయ్యాక ఆనందబుద్ధ వారిని గుర్తు పట్టాడు. ''నాగశాలా! శ్రీపర్వత రాజ్యం ఇప్పుడు కళ కోల్పోయింది. అన్యులు ఆక్రమించారు. మహా విద్యాలయాలు మూగపోయాయి. ఎందరో శిష్యులు, బిక్షులు హతులయ్యారు. మీ బావ అస్సక మహారాజుగారి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఫలితమిది. మొత్తం రాజ్యాలన్నీ పరస్పర యుద్ధాలతో ఆక్రమణలతో దోపిడీలతో అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మీరు అటు వెళ్లడం మంచిది కాదు. మాతో పాటు చైనాకు రండి దమ్మపాల భిక్షు మనకాశ్రయమిస్తాడు. ఈ విలువైన గ్రంథాలను కాపాడడం భవిష్యత్తు కోసం ఎంతో అవసరం. దమ్మపాల వీటిని చైనా భాషలోకి అనువదించాలనుకుంటున్నారు'' ఆనందబుద్ధ బిక్షుతో కల్సి అందరు చైనా ప్రయాణమయ్యారు. జ జ జ జ ఆనందబుద్ధ వల్ల తెలాంగుల పట్ల చైనీయులకు అపారమైన గౌరవం కలిగింది. ఆనందబుద్ధ తెచ్చిన గ్రంథాల్లో తమ పైశాచీ భాషలో రాసిన గుణాఢ్యుడి బృహత్కథ కూడా ఉండటం చూసి ఇలూచికి ఎనలేని సంతోషం కలిగింది. చైనా భాష నేర్చుకొని దాన్ని చైనాలోకి అనువదించమని ఆనందబుద్ధ ఇలూచిని కోరాడు. ఇలూచి కన్నా బౌద్ధ భిక్షు అదీర చైనా భాషను తొందరగా నేర్చుకుంది. అదీర నాగశాలకు సన్నిహితమవుతున్న తీరు గమనించి బిక్షు శిష్యులు ఆనందబుద్ధ చెవిలో వేశారు. ఆనందబుద్ధ నాగశాలను ఏకాంతంలో పిలిచి అడిగాడు. ''నాగశాలా! బౌద్ధ బిక్షుగా మారాలనే నీ నిర్ణయం దేశాటనతో మరింత బలపడిందనుకొంటాను. గాంధార తక్షశిల మగధ పాటలీపుత్ర నలంద శ్రీపర్వతం మళ్లీ బౌద్ధంతో కళకళలాడాలి. బౌద్ధాన్ని రక్షించుకొని తిరిగి విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో నీ వంటి బిక్షులు ఎంతో అవసరమిపుడు'' ''భంతే! మీరానాడే నన్ను బౌద్ధ బిక్షువుగా స్వీకరించి వుంటే నా జీవితం వేరుగా ఉండేది. మీరు మన రాజ్యాల అస్థిరత, యుద్ధాల గురించి చెప్పింది విన్నాక ఆనాటి అవగాహనకు దూరం జరగాలనిపిస్తోంది. దేశాటన నాకు ఇతర అనుభవాలనిచ్చింది'' అన్నాడు నాగశాల. అతని మనస్సులో అదీర మెరుస్తోంది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు ఆశయాలు కళ్ల ముందు కదలాడాయి. వెంటనే తన రాజ్యం వెళ్లిపోతే బాగుండు అని కోరిక జనించింది. చల్లని గాలి రివ్వున వీస్తోంది. కాషాయ వస్త్రం ఆనందబుద్ధను చలి నుంచి రక్షించలేకపోతోంది. చీకటి వ్యాపిస్తోంది. ఉన్ని, చర్మవస్త్రాలు ఎంత అవసరమో అనిపిస్తుంది. ''నాగశాలా! కోరికలు అనంతం. దేశాటన వల్ల బుద్ధ భగవానుని లాగే నీకు లోకరీతి అర్థమై బౌద్ధ బిక్షువు కావాలనే నీ నిర్ణయం మరింత గట్టిపడుతుందని ఆ రోజు అలా అన్నాను. నీవు మళ్లీ కోరికల ఉచ్చులో పడుతున్నావా!'' నిర్మలంగా సూటిగా నాగశాల కళ్లలోకి చూశాడు ఆనందబుద్ధ. ఆ కళ్లలో ఏదో వెలుగు తనలో ప్రవేశించి అణువణువు ఉత్తేజమైపోయింది. నీవు బిక్షువు కాకపోగా అదీర బిక్షును సంసారంలోకి లాగుతావా అని ప్రశ్నించినట్టనిపించింది. తప్పు చేసినవాడిలా తలవంచుకున్నాడు నాగశాల. కొంత సేపటికి తేరుకొని తన సందేహ నివృత్తి చేయమని ఆనందబుద్ధని కోరాడు. ''భంతే! ప్రజల కోసం, బౌద్ధం కోసం రాజ్యంలో శాంతి సుస్థిరత కోసం భిక్షులకు మీరిచ్చే కర్తవ్యం ఏమిటి? ఇతర దేశాలకు వలసపోవడమా! ఇది పరిష్కారమా!'' నాగశాల ప్రశ్నలకు ఆనందబుద్ధ విశ్వాసాలు కదిలిపోయాయి. తుఫానుకు మహావృక్షం ఊగిపోతున్నట్టుగా మనస్సులో కల్లోలం. అదీర అటుకేసి వచ్చింది. ''చలిగాలి వీస్తోంది. మంట రాజుకుంది. రండి'' అని ఆనందబుద్ధను కోరింది. ఆ గోష్టి అంతటితో ముగిసింది. మరోసారి మాట్లాడుకుందాం అంటూ నడిచాడు ఆనందబుద్ధ. నాగశాల గురువును అనుసరించాడు. జ జ జ జ నాగశాలకు ఆనందబుద్ధ నుండి ఎలాంటి జవాబు లభించలేదు. అదీరతో నాగశాల పెళ్లి జరిపి ఆశీస్సులందించాడు ఆనందబుద్ధ. భిక్షువుల మధ్య కాపురం. కొంతకాలానికి నాగశాల ఆనందబుద్ధ వద్ద సెలవు తీసుకున్నాడు. అదీర, ఇలానాగ, ఇలూచి అతన్ని అనుసరించారు. ''నీపై నమ్మకం ఉంది. ఎంతో ఆశ ఉంది. నా ఆశీస్సులెపుడూ ఉంటాయి'' అంటూ ఆనందబుద్ధ వీడ్కోలు యిచ్చాడు. భిక్షులు కొంత దూరం దాకా వెంట నడిచి భారంగా సెలవు తీసుకున్నారు. ఏడాదిలోపే నాగశాల అదీర, ఇలూచి ఇలానాగ కల్సి మహారణ్యంలో ఒక నది సమీపాన ఇల్లు నిర్మించుకున్నారు. ఇలానాగ వ్యవసాయంలో తెల్సుకున్నవన్నీ చుట్టూ గూడెల్లో, పల్లెల్లో చెప్తూ తనొక వ్యవసాయ క్షేత్రం నిర్మించాడు. కొద్ది కాలంలోనే అక్కడ ఊరైపోయింది. రాజుల, దోపిడీమూకల దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో నాగశాల రాజుగా గుర్తింపు పొందాడు. పొరుగున ఉన్న స్త్రీ రాజ్యాన్ని ఏలుతున్నది తన తల్లే అని తెల్సి నాగశాలకు ఆశ్చర్యం... సంతోషం కలిగాయి. తల్లి నాగపుత్రికి నాగశాల తన కొడుకే అని అర్థమైనప్పటికీ స్త్రీల రాజ్యంగా రూపొందించిన తన రాజ్యాన్ని అతనికప్పగించడం ఇష్టం లేకపోయింది. యుద్ధం అనివార్యమని తేలిపోయింది. అల్లుడు అస్సక మహారాజు రాజ్య విస్తరణ కాంక్షతో ముంచుకొస్తున్నాడు. అతడు బౌద్ధులను, బౌద్ధ గ్రంథాలను, కళలను, కళాకారులను ప్రథమ శత్రువులుగా సంహరిస్తూ, దహనం చేస్తూ వస్తున్నాడు. దాంతో నాగపుత్రి తన కొడుకు నాగశాలతో సంధి చేసుకొంది. మొదట సైన్యాన్ని మారువేషాల్లో అస్సక రాజ్యంలో దించాడు నాగశాల. వర్షాకాలంలో యుద్ధం మొదలైంది. వర్షాకాలం ముగియక ముందే అస్సక మహారాజు హతుడయ్యాడు. రాజ్యం నాగశాల వశమైంది. ఇలానాగను తన ప్రతినిధిగా నియమించి అస్సక రాజ్యాన్ని అప్పగించాడు నాగశాల. ఇలూచి పట్టపురాణి అయింది. భర్తను కోల్పోయిన నాగశాల అక్క తల్లిని చేరింది. ఏళ్లు గడిచిపోయాయి. యుద్ధాలు కాస్త సద్దుమణిగాయి. నాగశాల ఆనందబుద్ధను రావించి విద్యాలయాలు నెలకొల్పాడు. దేశదేశాల కళాకారులను రావించి సత్కరించి భూములిచ్చి రక్షణ ఇచ్చి తన రాజ్యంలో స్థిరపడుమని కోరాడు. అచిర కాలంలో నాగశాల రాజ్యం దేశదేశాల్ని ఆకర్షించింది. నాగశాల అదీరలకు కలిగిన కొడుక్కు తండ్రి గుర్తుగా 'నాగపాల' అని పేరు పెట్టుకున్నాడు. అదేమిటో గానీ నాగపాలకు తాతలాగే కళల పట్ల ఆసక్తి పెరిగి రాజ్యం పట్ల విముఖత ఏర్పడింది. తండ్రి నాగశాల మనోవ్యధతో కృంగిపోయాడు. యువరాజు పట్టాభిషేకాన్నైనా చేసుకోవాలని అదీర కొడుకును బతిమాలింది. నానమ్మ నాగపుత్రి మనవడికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పింది. నాగపాల విన్పించుకోలేదు. దేశాటనకు బయలుదేరాడు. నాగశాల అవసాన దశలోకొచ్చాడు. అదను చూసి మగధ ప్రాంతం నుండి వచ్చిన శత్రువులు యుద్ధం ప్రకటించారు. యుద్ధంలో క్షతగాత్రుడైన నాగశాలను రాజభవనానికి తరలించారు. బాగా రక్తస్రావం అయిపోయింది. బంధుమిత్ర గణమంతా చుట్టూ చేరారు. ఇలానాగ యుద్ధానికి నాయకత్వం వహించడానికి వెళ్లిపోయాడు. అందరూ కన్నీరు పెట్టారు. ఇలూచి ప్రతిజ్ఞాపూర్వకంగా ఏడుస్తోంది. ఇలూచిని దగ్గరకు పిలిచాడు. నాగశాల ఏదో చెప్పాడు. కళ్లు తుడుచుకొని వెళ్లి కాసేపటికి మళ్లీ వచ్చింది. ఆమె చేతిలో మెత్తని నల్లని జింక చర్మం, పక్షి ఈక, వెండిగిన్నెల్లో పసర్లు. ఏదో రాయమని చెప్పాలనుకున్నాడు నాగశాల. ఎన్నాళ్లుగానో అడగాలనుకుంటూ అడగలేకపోయిన తల్లి నాగపుత్రి నాగశాలను అప్పుడైనా అడగాలనుకుంది. ''కుమారా! నాగసా! మీ నాన్నలా గొప్ప కళాకారుడివి అవ్వాలనుకొని దేశాటనకు బయల్దేరిన నువ్వు రాజ్యాధినేతవయ్యావేమిటి?'' నాగశాల కళ్లలో ఏదో వెలుగు. ఆనందబుద్ధ కళ్లలో మెదిలాడు. ''అమ్మా! ఈ ప్రపంచం గుర్తించాలనే కోరిక ఉన్నప్పుడు అలా అనుకున్నాను. ఆనందబుద్ధ బోధనలతో ఎవరో గుర్తించాలనే కోరికను జయించాను. కాదు అదే అదృశ్యమై పోయింది. గొప్ప కళాకారుడినవ్వాలనే కోరిక కూడా అలాగే అదృశ్యమైపోయింది. నాన్నా నువ్వూ పెళ్లి చేసుకున్నాక రాజ్యాలు మారింది రాజ్యభీతి వల్లనే కదా! అస్సక బావ అక్కని జ్ఞానాన్ని కళల్ని చెరపట్టాడు. అందుకని నేను రాజ్యాన్ని చేపట్టాలనుకున్నాను. అమ్మా! నీకన్నీ తెలుసు ఎక్కడ రాజ్యం శాంతి సుస్థిరత పంటల సమృద్ధితో సుభిక్షంగా ఉంటుందో అక్కడ సమస్త విద్యలు కళలు వికసిస్తాయి. నేను కళాకారుడిని కావడం వల్లే బౌద్ధ బిక్షువును కాకుండా రాజ్యాధినేతను కావాలనుకున్నాను. నేనొక్కడిని ఎదగడం కన్నా ఎంతో మందికి నీడనీయడం నాకు తృప్తినిచ్చింది. నాగపాల కూడా దేశాటనతో రేపెప్పుడో ఇదే నిర్ణయానికొస్తాడనుకుంటానమ్మా!'' ఏదో దగ్గు తెర పొరలు పొరలుగా కమ్మింది. అరగంట పోయాక నాగశాల కళ్లు అలాగే తెరుచుకొని ఉండిపోయాయి. తల్లి నాగపుత్రి, భార్య అదీర అతనిపై వాలిపోయారు. నాగశాల చివరి సంభాషణ తెలంగ పైశాచీ మిశ్రమ భాషలో ఇలూచి చేతిలో నల్లజింక చర్మంపై లిపిబద్దమై నిలిచి మెరుస్తోంది. రాజగృహం శోక సముద్రమైపోయింది. జ జ జ జ జ ఎన్నో అనుభవాలతో దేశాటన నుండి తిరిగి వచ్చిన నాగపాలకు ఇలానాగ రాజ్య బాధ్యతలను అప్పగించాడు. తన తాత నాగపాల పేరిట నాగపాల వంశంగా ప్రసిద్ధికెక్కిన చరిత్ర తూర్పు కనుమల దాడుల్తో అంతరించిపోయింది. అదీర తల్లి వారసులు, గాంధారంలో నాగపాల వంశం గురించి తెలాంగుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆనందబుద్ధ శిష్యులు చైనా భాషలో రాసిన నాగపాల చరిత్ర టిబెట్‌లో మిగిలిపోయిందని కాలక్రమంలో పేర్లు మారి కాశ్మీరు రాజతరంగిణి చరిత్రలో కలిసిపోయిందంటారు. దళిత జ్యోతి మాసపత్రిక, డిసెంబరు 2001 భారతీయ సాహిత్యం తెలుగు కథలు, 2003