Friday, October 7, 2016

ఎవరికి వారే ''ప్రతి ఒక్కరికి తనదైన తర్కం ఉంటుంది. తనను తాను సమర్ధించికోవడానికి ఎన్నో తర్కాలు. ఎవరి లాజిక్‌ వారిది. ఎవరి జీవితం వారిది. ఎవరి జీవితాన్ని అనుసరించి వాళ్లు లాజిక్‌ను తయారుచేసుకుంటారు. సమాజంలో బతుకంతా తర్క విద్యతో ముడిపడి ఉంటుంది.'' జ జ జ జ బస్సాగింది. అది బస్సుస్టేషను. అరగంట క్రితం నుంచి చిట్టి ఆకలని గోల చేస్తోంది. నేను దిగాల్సిన స్టేషను కాకపోయినా చిట్టికోసం ఏదయినా కొనుక్కొద్దామని అందరితో బాటు డోర్‌వైపు నడిచాను. చిట్టిని అక్కడే సామాను చూస్తుండమని చెప్పి. దిగుతుంటే డోర్‌కు రెండు ప్రక్కలా నిలబడి మమ్మల్ని దిగకుండా చేసి ముందుకు తోసుకోస్తున్నారు. ఎక్కదలుచుకున్న వాళ్ళంతా కలిసి రెండు బస్సులకు సరిపడా ఉన్నారు. పదిమంది పట్టుకున్నా విదిలించుకు పారిపోయే దొంగలా బట్టలన్నీ నలిగిపోయినా, రిస్టువాచీకి దెబ్బలు తాకినా లెక్కచేయక ఎలాగోలా బయటపడ్డాను. బిస్కట్‌ప్యాకట్‌ తీసుకుని చిల్లరకోసం అవస్థపడేసరికి... కండక్టరు బెల్లు కొట్టినట్టున్నాడు. డ్రైవరు గుర్రుగుర్రుమంటున్నాడు. కొందరు డోర్‌కు గబ్బిలాల్లా వేలాడుతున్నారు. ఆదరాబాదరాగా పరిగెత్తాను. నేను దగ్గరికి చేరుకొనేసరికి డ్రైవరు ఇంజన్‌ ఆఫ్‌ చేసినట్టున్నాడు. కండక్టర్‌ ''స్టాండింగ్‌ ప్యాసింజర్స్‌ దిగండి. మీరు దిగేదాకా బండి కదలదు.'' అని అంటున్నాడు లోపల నిలబడ్డ వాళ్లను ఉద్దేశించి. అందరూ అయిష్టంగానే దిగారు. దిగడం అయిపోగానే నేనో మెట్టెక్కాను. ''మళ్ళి నువ్వెక్కడికయ్యా'' ఆంటూ కండక్టరు నన్ను నెట్టి వేస్తూ అరిచాడు. నేను ఎక్కడి నుండి వస్తున్నానో చెప్పి ఎక్కాను. నేను కూర్చున్న సీట్లో ఎవరో పచ్చి బాలింత పసికందు నెత్తుకొని కూర్చుంది. నావేపు జాలిగా చూసింది. నాకు లేపాలని అనిపించలేదు. ''అయ్యా! నీ బాంచెను. గాంధీ దవాకాన కోవాలె. ఎట్లన్నా చేసి మమ్మల్నిద్దరిని తీసుకోండ్రి'' అంటున్నారెవరో క్రింది నుండి. అటువేపు చూశాను. ఎవరో పాతకాలపు ముసలాయన, నిండా దుప్పటి కప్పుకున్న ఒక ఆడమనిషిని బహుశా కూతురేమో బస్సెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ''దిగు దిగు! చెప్తే నీక్కాదూ!'' అంటూ బలవంతంగా దించేసి గట్టిగా డోర్‌ వేసి టికట్‌ పంచ్‌ ఇనప రాడ్‌కు ఖన్‌ ఖన్‌ మని రెండు సార్లు కొట్టి రైటన్న సిగ్నలిచ్చాడు కండక్టర్‌. చిట్టికి బిస్కట్ల ప్యాకెట్‌ ఇచ్చాను. బస్సు బయల్దేరింది. టైం చూశాను. సాయంత్రం నాలుగూ నలభై అయ్యింది. పరిగెత్తుతోన్న బస్సులోంచి పడమటికి వంగిన సూర్యుడు మబ్బుల్లో దోబూచులాడ్తూ 'మానేర్‌ డ్యాం'లో స్నానమాడుతున్నట్టు కనిపిస్తున్నాడు. బస్సు స్పీడందుకుంది. పది నిమిషాలకే సడెన్‌బ్రేక్‌ పడింది. ప్రయాణీకులంతా వెనక్కి ముందుకు ఊగిసలాడారు. చిట్టికి ముందు సీటుకున్న రాడ్‌ నొసటికి తాకినట్టుంది. ''అమ్మా!'' అని అరిచింది. నా వెనుక పాపనెత్తుకున్నామె నా నడుముకు ఢీ కొట్టింది. చంకలోని పిల్లాడు కేర్‌ మన్నాడు. చిట్టికి చేతి నుంచి క్రింద పడ్డ ప్యాకెట్‌ను ఆమె కందిస్తూ వెనక్కి చూస్తూ కలియజూశాను. అందరూ మహరాజుల్లా కూర్చున్నారు. పాపం ఆమె టికట్లిచ్చేవరకు ఎవరి ప్రక్కనో బ్రతిమిలాడుతూ కూర్చున్నట్టుంది. ఆ తర్వాత లేచి నిలబడ్డట్టుంది. చంటిపాప నెత్తుకొని నిలబడ్డ ఆమెను చూస్తూ కూడా సీటు ఇవ్వని వాళ్ల సంస్కార హీనతకు అసహ్యం వేసింది. అంతలోనే కాకీ దుస్తులు లోపలికి ప్రవేశించాయి. ఒకరు టికట్ల ప్యాడును, ఎస్సారునూ లాక్కున్నారు. మరొకరు టికట్‌ ప్లీజ్‌ అంటూ వాటిపై సంతకాలు పెడుతూ తనిఖీచేస్తున్నారు. టి.టి.ఇ. అడుగుతోంటే వెనకనుంచి 'స్టాఫ్‌, స్టాఫ్‌' అనడం వినబడింది. మళ్లీ వెనక్కి చూశాను. పది పన్నెండు మంది దాకా సీట్ల మీంచి లేచి నిలబడ్డారు. జేబుల్లోంచి అయిడెంటిటీ కార్డు తీస్తున్నట్టున్నారు. ఒకడు నీటైన బెల్‌బాటం వేసికొన్నవాడు జేబులోంచి ఇంత లావుపాటి ఇత్తడి బిళ్ల చూపించి ఏదో గొణుగుతున్నాడు. ఇత్తడి బిళ్ళంటే ఆర్టీసీ లైసెన్సుడు కూలీ అన్నమాట...! ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. అందరి కార్డులు చూశాడతను. ''ఏంటయ్యా! ఎంత మంది స్టాఫ్‌ ఒక్క బస్సులో ఎక్కుతారు. అందులోను ఎక్స్‌ప్రెస్‌లో! టికెట్‌ కొన్న ఆ అమ్మాయి చంకన పాపనెత్తుకొని నిలబడితే టికట్‌ లేని మీరు మహరాజుల్లా కూర్చున్నారు. వింత చూస్తున్నారు. కొంచమైనా మానవత్వం ఉండాలయ్యా! ప్రయాణీకులు నిలబడ్డం, మీరు కూర్చోడం మానవత్వం అనిపించుకుంటుందా? ఇతన్ని చూడండి నాకన్నా నీటుగా డ్రెస్‌ చేసుకొని జేబులోంచి ఆర్టీసీ లైసెన్సుడు కూలీ అని బిళ్ల చూపిస్తున్నాడు... ఇతను కూలీ అట...'' అని దులిపాడు టి.టి.ఇ. వాళ్లను. ఎలాగైతేనేం నా వెనుక నిలబడ్డ ఆమెకు సీటు దొరికింది. నా తల పది నిమిషాలు వెనక్కి నడిచింది. ''బస్టాండులోని రెండు బస్సుల ప్రయాణీకులు... ఆ ఒత్తిడి... ఆ ముసలాయన... మమ్మల్నిద్దరినీ తీసుకొమ్మని బ్రతిమిలాడ్డం... చెప్పేది మీక్కాదా... అంటూ కండక్టర్‌ వాళ్లని దించేయడం... స్టాండింగ్‌ ప్యాసెంజర్స్‌ నందరినీ దించేయడం...'' ''ఇక్కడ బస్సు నిండా మందే! కాని ముప్పయ్యారు టికట్లు మాత్రమే పంచ్‌ అయ్యాయి. ఛీఛీ...!'' ఆ ముసలివాడిపై జాలి. టి.టి.ఇ.పై కృతజ్ఞత, టికట్‌ లేని స్టాఫ్‌ పై అసహ్యం వేసింది. అయినా చాలా మందికి యూనిఫాం లేదే అని మరోసారి చూశాను. ఎవరో ఎవరితోనో అంటున్నారు. ''వాళ్ళంతా కండక్టర్లు, డ్రైవర్లు, కారని మెకానికులు, క్లీనర్లు, ఆర్టీసీ గుమస్తాలు కూడా ఉన్నారని వాళ్లంతా కరీంనగర్‌ వర్క్‌షాప్‌, ఏరియా ఆఫీసు, డి.యం.వొ. మొ|| వాటిలో పనిచేస్తారని వారు ఇలా వరంగల్‌ నించి కరీంనగర్‌కు ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారని... ఆలోచనలు ముసిరాయి. కరీంనగర్‌ నించి వరంగల్‌కు ఒక్క టికట్టు ఆరు రూపాయలు. ప్రతిరోజు రెండుసార్లు అంటే రోజు పన్నెండు రూపాయలన్న మాట. అంటే నెలకు మూడొందల అరవై అంటే వాళ్లు చేసే పనికి జీతం నాలుగువందలైతే మూడొందల అరవై అనగా వాళ్లు జీతం తీసుకొని పని చేస్తున్నంత విలువ గల మేర మొత్తాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నమాట. దాదాపు సగం బస్సు(లు) దుర్వినియోగం అవుతున్నాయన్న మాట...! ఇంకా ఇలా ఎన్ని వేల మంది ఉన్నారో.... ప్రతిరోజు ఇలా ఎంతనష్టం జరుగుతుందో... ఎవరికి తెలుసు... టి.టి.ఇ. వచ్చేదాక ఈ బస్సులోనే 20 మంది స్టాఫ్‌, ఇద్దరు సివిల్‌ డ్రెస్‌ పోలీసులు ఎక్కారని తెలియదు. ఎక్కాల్సిన ప్రయాణీకులు ఉండి కూడా వాళ్ల సమయమూ, పనులూ నాశనం చేసి ఎక్కిన స్టాఫే వారికి శత్రువులు...పైగా వీళ్ల బరువు భారమంతా టికట్లు కొంటున్న మామీదే కదా పడుతున్నది. నిజంగా ఆర్టీసీ ఇలాంటి దుబారా, దుర్వినియోగం తగ్గిస్తే రేట్లు పెంచాల్సిన అవసరం రాదేమో అన్పించింది. వెనకొచ్చిన ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉన్న మా బస్‌ను దాటేసి పోయింది. ''ఎక్స్‌ప్రెసును ఇలా ఎంతసేపు ఆపుతారండీ'' అన్నారెవరో. అంతలోనే కాకీ డ్రెస్సుల వాళ్ళు దిగిపోయారు. మా బస్సు మళ్ళీ కదిలేప్పుడు టైం చూస్తే అయిదున్నరైంది. వరంగల్‌ చేరేసరికి ఏడున్నరయ్యేట్టుంది. వెల్తున్నపని వాయిదా పడేట్టుంది. ముప్పయి నిమిషాల్లోనే బస్సు హుజురాబాద్‌ చేరింది. బస్సాగ్గానే బస్సుకిటికీల వద్దమూగి కొందరు సోడా...సోడా... గోలీ సోడా..., పల్లి... పల్లి... గరం పల్లి..., కంకుల్‌... కంకుల్‌... లాత కంకుల్‌..., బజ్జీ, మిర్చి, గరం చాయ్‌ అంటూ ఒకటే కాకి గోల. ''నా కొడుకు పెండ్లి! రారమ్మని పిలిచిన్నా! అనవసరంగా ఒర్రియ్యకు. రెండు రూపాయలిచ్చెయ్యి.'' అంటూ దబాయిస్తున్న మాటలు చెవిన పడి డ్రైవరు వేపు దృష్టి సారించాను. ''దండం బెడ్త గీ ఆఠాన్నే ఉన్నయి. ఎక్కోలేవు.'' అంటున్నాడతను. డ్రైవరు డోర్‌ నించి సిమెంట్‌ గోతాము మూట దించుకుని. ''అఠానా! నిన్నేమన్నా బిచ్చమడుక్కుంటున్నానా! ఇట్ల కిరి కిరి జరుగుతదని సంచికి మూడున్నరైతదని ముందుగాల్నే జెప్పిన. రూపాయిన్నర లగేజి గొట్టి రెండు రూపాయలు నాకిమ్మన్లేదా! పోనీ నువ్వనలేదను! నిన్నొక్కపైసడుగ'' అంటున్నాడు త్యాగశీలి డ్రైవరు. ''ఏదో బాంచెన్‌, ముందుగాల మాయిత్తనన్న. నేను అన్నమాట దప్పెటోన్ని గాదు. అసలే మైందంటే మీ సీటు కాడ ముల్లె నేను తెచ్చేసుకున్నవోల్లె కరీంనగరంల కూలోడొచ్చి కూలీ పైసలిమ్మని ఉత్తుత్తిగనే రూపాయి గుంజుకపోయిండు. లేకపోతే జొన్నల సంచి టాపు మీద పారేత్త అని బెదిరించిండు. ఆనకాలం మీద వారెత్తెట్ల అని రూపాయిచ్చిన.'' ''ఇది ఎక్సుప్రెస్సని తెలువక ఎక్కి టికెట్లో రూపాయి ఎక్కువ మునిగితిని. లేకపోతే మీకు రెండు రూపాయలు ఇచ్చేటోన్నే. గీ ఆఠాన్నే మిగిలినయి. ఇవి గూడా చిన్న పోరికి ఓ రెండు కేళ పండ్లు కొందామనుకున్న.'' అన్నాడతను. ''ఛీ!ఛీ! మీ జాతే అంత! అందుకే గిట్లున్నారు. ఛీ! ఇగ మాట్లాడకు. నడు నడు. నీ పైసలు వట్టయి గీసలు వట్టయి.'' అంటూ విదిలించాడు తానెంతో త్యాగం చేస్తున్నట్టు డ్రైవరు. ఆ చిన్న మూటకు రూపాయిన్నర లగేజీయే ఎక్కువ. ఇంకా మీదనుంచి డ్రైవరు రెండు రూపాయలు అడగడం. వింటున్న నాకే బాధనిపించింది. ఇక రోజు కూలీ చేసికొనే వాడికెంత బాధనిపించాలి. లగేజీ రూపాయిన్నరైతే డ్రైవరు మాములు రెండ్రూపాయలు... అందులో జబర్దస్తీ... ఆ మూటకు ఆర్టీసీ కూలీకీ రూపాయి కూలీ... మనమే లోపలికి తెచ్చేసుకున్నాక... అదీ జబర్దస్తీగా. నిజాం పాలన పోయినా ఆ మనస్తత్వం మాత్రం పోలేదనిపించింది. ఆలోచనల్లో బస్సు కదిలింది. చేరాల్సిన సమయానికి రెండున్నర గంటల లేటయి బస్సు హన్మకొండ చేరేసరికి వర్షం అందుకొంది. పెట్రోల్‌ పంపు వద్ద దిగి సూటుకేసు పట్టుకొని చిట్టితో సహా గబగబా నడిచి లోకల్‌ బస్‌స్టేజి చేరాను. ఎక్కువ సేపు తడవకుండానే బస్సొచ్చింది. యం.జి.యం. హాస్పిటల్‌ చేరేసరికి రాత్రి ఏడు యాభైతొమ్మిది అయ్యింది. చిట్టి ''అమ్మా! అమ్మా! అంటూ బెంగగా ఏడుస్తోంది. ఇంతా చేసి చిట్టికి ఆ రోజూ అమ్మను చూపించలేకపోయానే అని మనస్సు బెంగపడి పోతోంది. వాచ్‌మెనును బ్రతిమాలాడాను. వీల్లేదన్నాడు. పాస్‌ చూపించమన్నాడు. ఒకవైపు వర్షం... మరోవైపు చిట్టిఏడుపు... ఇంకోవేపు లక్ష్మికి ఎలా ఉందో చూడాలనే తపన... ఎటూ పాలుపోలేదు. కొంచెంసేపు అలా నిలబడి పోయాను. వాచెమెన్‌ను అంతకన్నా బ్రతిమాలడానికి అభిమానం అడ్డొచ్చింది. ''అమ్మా! అమ్మా!'' అంటూ బెంగగా ఏడుస్తున్న చిట్టిని వేగంగా లాక్కొస్తూ రోడ్‌ మీదికొచ్చి వర్షానికి తాళలేక రిక్షా పిలిచాను. ఏదైనా దగ్గరలో ఉన్న లాడ్జింగ్‌ తీసి కెళ్ళమన్నాను. రూపాయిన్నర యివ్వమన్నాడు. ఆ వర్షంలో తడుస్తూ రిక్షా తొక్కూతూన్న అతన్ని చూస్తోంటే, నేను, సూటుకేసూ, చిట్టికూడా ఎదురుగాలి వర్షానికి తడుస్తున్న విషయమే తెలీలేదు. రిక్షా ఆపి లాడ్జింగ్‌ లోకి సూటుకేసు పట్టుకొని నడిచాడు రిక్షా అతను. చలికి వాటేసుకున్న చిట్టితో మెల్లిగా దిగాను నేను. వర్షం హెచ్చింది. రిక్షా అతను అలాగే నిలబడ్డాడు. రోడ్లు అర్దరాత్రిలా నిర్మానుష్యంగా ఉన్నాయి. తడిసిన చేత్తోజేబులోంచి అయిదు నోటు తీసిచ్చాను. చిల్లర లేక. ''చిల్లర లేవు మీరే యివ్వండిసార్‌'' అన్నాడతను. ''ఫర్లేదు ఉంచుకొమ్మన్నాను.'' కృతజ్ఞతగా నావేపు చూశాడు రిక్షా అతను. ''రేపు ఉదయం ఎనిమిది గంటలకే వస్తా సార్‌! యం.జి.యం. కాడ నేనే దిగబెడుతాను'' అన్నాడతను. ఎటు అర్ధం గాని విధంగా తల ఊపాను. ఆ రాత్రి చిట్టి అన్నం క్యారియర్‌ తెప్పిస్తే ''అమ్మా! అమ్మా!'' అని ఏడుస్తూ బెంగగా తిన్లేదు. నాకు తినాలనిపించలేదు. ప్రయాణం మొదలయినప్పటినించీ ఏదోలా ఉంది. మనసేం బావుండలేదు. చిట్టిని తువ్వాల్తో తుడిచి పొడి బట్టలు తొడిగాను. అయినా చలికి వణుకుతూ అమ్మమీది బెంగతో నిద్రపోయింది. ఆలోచిస్తూ పడుకొన్నాను నేను. ఉదయం చూసేసరికి చిట్టి ఒళ్ళు కాలుతోంది. జ్వరం బాగానే అందుకుంది. నిద్ర నుంచి చిట్టి యింకా లేవలేదు. నిన్న బురద నిండిన డ్రెస్సు విడిచేసి స్నానం చేసి పొడి డ్రెస్‌ వేసికొనే సరికి రిక్షా అతను ప్రత్యక్షమయ్యాడు. అతడి నిజాయితీకి నిర్ఘాంతపోయాను. ఏదో మాట వరసకన్నాడనుకొన్నా గానీ యింత ఖచ్చితంగా వస్తాడని ఊహించలేదు. అప్పుడు అతని గురించి తెలుసుకోవాలనిపించింది. ''అతను గిరిజనుడని, వరంగల్‌లోని ఏటూరు నాగారం ప్రాంతానికి చెందినవాడని తొలుత కొద్ది పాటి వ్యవసాయం ఉండేదని, అది తర్వాత అప్పులకింద షావుకారుకే అప్పగించబడిందనీ, ఆ తర్వాత యిక్కడకొచ్చాడనీ, ఇక్కడ కూడ సిటీబస్సులు, ఆటోలు, రిక్షాలతో పోటి ఎక్కువైందనీ, రోజూ పది రూపాయలు గిట్టడం కష్టమని'' మాటల్లో తెలిసింది. చిట్టిని మెల్లిగా అతనే రిక్షాలో కూర్చోబెట్టాడు. చిట్టినెత్తుకొని చిట్టి చేత పట్టుకొని యం.జి.యం. లో అవుట్‌ పేషెంట్‌హాల్‌ గోడ కానుకొని నిలబడ్డాను. లోపల ఎంతమందున్నారని కిటికీ నించి తొంగి చూశాను. ''మంచాలు ఖాళీ లేవయ్యా! రోజూ వచ్చి మందులు తీసుకుఫో'' అంటున్నాడు డాక్టరు. ''అయ్యా! మాది ఈ వూరుగాదు. సానా దూరం నుంచచ్చిన దండంబెడ్త! గరీబోన్ని! ఎట్లన్న జేసిదీన్ని శరీకు జేసికోండ్రి'' అంటూ డాక్టరు కాళ్ళు పట్టుకున్నాడతను. ''అరె కాళ్ళు విడవ్వయ్యా!'' అంటూ విదిలించుకొన్నాడు డాక్టరు. బాగా పరికించి చూశాను. సందేహం లేదు. నిన్న కరీంనగర్‌లో నేనెక్కిన బస్సెక్కబోయి కండక్టర్‌ చేత దించివేయబడ్డ ముసలాయనే అతను. ఆ ముసలాయన వణుకుతున్నాడు. ఆయన కూతురు కూడా వణుకు తున్నట్టుంది. ''ఏం తాతా! పానం మంచిగలేదా!'' అంటూ మాట కలిపాను బయటకి రాగానే. అడవి లాంటి హాస్పటల్లో ఎంతో పరిచయమున్నవాడిలా కుశలమడిగే సరికి ఉక్కరిబిక్కిరి అయ్యాడతను. నాకు నేను పరిచయం చేసుకొని 'రాత్రి ఎక్కడ బసచేశారని' అడిగాను రాత్రి దవాకాన చేరేసరికి సినిమా మొదటాట విడిచి పెట్టారని, వాచ్‌మెన్‌ను బ్రతిమాలి రెండ్రూపాయలిస్తే సైకిల్‌ స్టాండులో పడుకోనిచ్చాడనీ, రాత్రి వర్షానికి సల్లుగొట్టి యిద్దరూ తడిసి పోయారని అతనికి కూడా జ్వరం అందుకుందనీ తెలిపాడు. ఆర్టీసీ... ఆర్టీసీ స్టాఫ్‌ పుణ్యమా అని ఒక రోజుముందుగా హాస్పటలుకు చేరాల్సిన అతను ఒక రోజు లేటుగా చేరి ఒకరికి బదులు ఇద్దరు పేషంట్లయ్యారు. ఎలాగోలా చేరి డాక్టర్ని కలిస్తే నీళ్ళల్లో వ్రేలు పెట్టినాకినట్టయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినా అతనికి డాక్టరు, పుణ్యమా అని నిరాశా, ఒంట్లో జ్వరం మాత్రమే మిగిలాయి. కొద్దిసేపు అక్కడే ఉండమని చెప్పి నేను చిట్టిని డాక్టరుకు చూపించాను. బాగానే పరీక్ష చేశారు. మందులు తీసుకొని వచ్చి ముసలాయనా, ఆయన కూతురూ నేనూ, నాకూతురు చెట్టుకింద కొచ్చాం. ''ఇదిగో తాతా! ఒక అరగంట మీరిక్కడ నిలబడితే ఈ చిట్టిని వాళ్ళమ్మ వద్ద దింపేసి వస్తాను. మీకేమైన సాయంచేయ వీలైతే చూస్తానన్నాను. వాళ్ళు అక్కడే ఉంటామన్నారు. నేను స్త్రీల వార్డు కెళ్లాను. లక్ష్మి పదో నెంబరు బెడ్డుమీద ఒరిగి చూస్తోంది. మా రాక గమనించి సంతోషంతో లేచి కూర్చుంది. అమ్మను చూసే సరికి చిట్టి జ్వరం సగం తగ్గినట్టయింది. అమ్మ తనని వెంట తీసుకొని రాకుండా ఇంటి వద్దే ఉంచినందుకు చిట్టి అలిగి అమ్మను ప్రశ్నిస్తోంది. లక్ష్మి ''ఇపుడు ఒంట్లో బాగానే ఉందని హౌజ్‌ సర్జన్‌ చేస్తున్న మా ఊరి సుధాకర్‌ రోజూ వచ్చి చూసి పోతున్నాడని, ఇంకో రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారు'' అని చెప్పింది. 'హమ్మయ్య' అనుకున్నాను నేను. మళ్లీ వస్తానని చెప్పి చిట్టి నక్కడే ఉంచి ముసలాయన్ని, ఆయన కూతుర్ని కలిసి మళ్లీ డాక్టరు దగ్గరకు వెళ్లాను. పదో నెంబరు బెడ్‌లో ఉంది మా ఆవిడే అని అది ఖాళీ చేస్తామని, ఆ బెడ్‌ ఈ ముసలాయన కూతురికి కేటాయించమని ఇంగ్లీషులో అడిగాను. డాక్టరు నన్ను వింతగా చూశాడు. ''హస్పిటల్‌ బెడ్డంటే స్వంత ఆస్తా! ఒకరిదొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి? చదువుకున్న మీరే ఇలా మాట్లాడితే ఎలా?'' అని అన్నాడు. అవమాన భారంతో లేచి వచ్చేశాను. హాస్పిటలంతా వెదికాను. చిట్టచివరకు సుధాకర్‌ కలిశాడు. ''లక్ష్మిని ఎలాగూ రేపో మాపో డిశ్చార్జి చేస్తామన్నారు కదా! ఇపుడే డిశ్చార్జి చేయించి ఆ బెడ్‌ ముసలాయన కూతురికిచ్చేట్టు చూడు'' అని విషయమంతా వివరించాను. ''సరే మంచిది'' అని ముక్తసరిగా జవాబిచ్చాడు సుధాకర్‌. ఆ మాటతో అపుడే బెడ్‌దొరికినంత సంతోషించాను. సుధాకర్‌ అరగంట సేపు అక్కడే ఉండమన్నాడు. అరగంట తర్వాత ముసలాయన కూతుర్ని మళ్లీ డాక్టరు వద్దకు తీసుకుపోయాడు సుధాకర్‌. ముసలాయన కూతురికి లక్ష్మి బెడ్‌ ప్రక్కనే బెడ్‌ దొరికింది. ఆ బెడ్‌ మీది పేషెంట్‌ అరగంట క్రితమే డిశ్చార్జి అయిందని తెలిపాడు సుధాకర్‌. సుధాకరే అన్నాడు మళ్లీ నాతో, ముసలాయనతో. ''ఈ హాస్పిటల్‌లో నాలాంటి వాళ్లు పరిచయం లేకపోతే బెడ్సు దొరకడం చాలా కష్టం. బెడ్‌లు చాలా వరకు తాలూకా హాస్పిటలు నించి ఇక్కడికి మార్చబడ్డ పేషెంట్సుతోనే నిండిపోతాయి. మిగతా వాటిల్లో సగానికి పైగా పోలీసు కేసులకు సంబంధించిన పేషెంట్లు ఆక్రమిస్తారు. ఇక మిగిలే బెడ్‌ల్లో ఇందులో పని చేసే పెద్ద డాక్టర్లు ఇంటి వద్ద ప్రైవేటు ప్రాక్టీసు చేసి పది నుండి ముప్పయి దాకా పీజు వసూలు చేసి కాంట్రాక్టు మాట్లాడుకొని చేర్చుకుంటారు. ఇతరులకు బెడ్స్‌ దొరకడం చాలా కష్టమయిపోతుంది.'' మూల గుట్టు వివరించాడు సుధాకర్‌. తాను తన సమీప బంధువులని బుకాయించి ఎలా మాకు బెడ్‌ సంపాదించిందీ వివరించాడు సుధాకర్‌. సాయంత్రానికి చిట్టికి జ్వరం తగ్గింది. లక్ష్మిని డిశ్చార్జి చేయమని డాక్టర్ని అడిగాను. లక్ష్మిని మరోసారి పరీక్ష చేసి సరే అన్నాడు డాక్టరు. ముసలాయనతో, కూతురితో ''ధైర్యంగా ఉండండి, సుధాకర్‌తో చెప్పాను'' అని సెలవు తీసుకున్నాను. ముసలాయన కృతజ్ఞతతో రెండు చేతులు జోడించాడు. ఆటోలో లాడ్జింగ్‌ నుండి హన్మకొండ బస్టాండ్‌ చేరాము. బస్సింకా రాలేదు. లక్ష్మికీ, చిట్టికీ బత్తాయి పళ్లు తీసుకొందామని బస్టాండు దాటాను. రోడ్‌ ప్రక్కన సైకిల్‌కు గంప కట్టుకుని ఒకతను బత్తాయి పళ్లు అమ్ముతున్నాడు. రెండు రూపాయలవి తీసుకొన్నాను. అంతలోనే అతని దగ్గరకు ముగ్గురు వచ్చారు. ''ఏంరా! ఊళ్లో బతక బుద్దయితలేదా!'' అని అడుగుతున్నారు వాళ్లు సైకిలాయన్ని. విషయపు పూర్వాపరాలు అర్ధం కాక నిలబడిపోయాను. ''పోతన్న! పోతన్న!'' అంటూ పోతున్నట్టే సర్దుకొంటూ అక్కడే నిలబడి ఉన్నాడు సైకిలతను. ''ఏంటి?'' అడిగానతన్ని. ''ఈ పెద్ద పండ్ల దుకాణపోడు, ఈ నాలుగ్గీరల బండ్లోల్లు సార్‌ వాళ్లు. ఇది వాళ్లయ్య సంపాదించిన అడ్డనట. ఇక్కడ నేను అమ్ముకోవద్దట'' కళ్ళతో చూపిస్తూ నాకొక్కడికే వినబడేట్టు అన్నాడు రోషంగా. చుట్టూ చూశాను. 4,5 నాలుగు చక్రాల తోపుడు బళ్లున్నాయి. సైకిలతను రోడ్‌ ప్రక్కన పళ్లమ్మడం నేరమయితే, అంతకన్నా రెట్టింపు స్థలం ఆక్రమించి రోడ్డంతా అరటి తొక్కలతో పాడు చేస్తూ, పెద్ద రోడ్డును ఇరుకుగా మార్చిన వీళ్లది రెట్టింపు నేరం. ''ఏమయ్యా! మీలాంటివాడే కదా!'' అన్నాను తోపుడు బళ్ళ వాళ్ళను ఉద్దేశించి. ''మీ తోటి ఎవలు మాట్లాడిన్రు సార్‌!'' అన్నాడో బండి అతను. తల తీసేసినట్టయ్యింది కోపం పెల్లుబికింది. కాని బస్సొచ్చినట్టుంది. వడివడిగా బస్టాండు కేసి నడిచాను. ఎలాగోలా మూడు సీట్లు సంపాదించి కూలబడ్డాను. నిన్న ప్రయాణం మొదలెట్టినప్పటి నుండి నా ఎదురుగా జరిగిన సంఘటనలన్నీ జ్ఞప్తికి వస్తున్నాయి. ఆర్టీసీ లేటు... ఆర్టీసీ స్టాఫ్‌... ఆర్టీసీ కూలీ... ఆర్టీసీ డ్రైవరు... ఆర్టీసీ కండక్టరు... హాస్పిటల్‌ వాచ్‌మన్‌... ప్రభుత్వ డాక్టర్లు... పళ్ల దుకాణావాళ్ళు... చదువుకొన్న వాళ్ళు... చదువుకోని వాళ్ళు... నిజంగా వీళ్లంతా ఎంతో అందంగా కన్పించే ప్లాస్టిక్‌ పూవుల్లా ఆకర్షణీయమైన డ్రెస్సుల్లో, చదువుల్తో ఎంతో సంస్కారులుగా కనిపిస్తారు. కాని... ప్లాస్టిక్‌ పూవుల్లా వీళ్ళ సంస్కారమూ... మానవతా... వాసనలేని పూలు. గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఒక టి.టి..., ఒక రిక్షా అతను...., ఒక సుధాకర్‌... బస్సు కదిలింది. కిందా మీద పడి కరీంనగర్‌ చేరింది. ''దయ చేసి అందరూ దిగండి. సెల్ఫు పని చేయడం లేదు. బ్యాటరీ వీకయింది. హెడ్‌లైట్లు బాగా రావడం లేదు. ముందటి టైర్లో గాలి దిగింది బండి రిపేర్‌ అయి వచ్చేసరికి అరగంటయినా పడుతుంది.'' అన్నాడు డ్రైవరు కరీంనగర్‌ బస్టాండులో. చిట్టిని, లక్ష్మిని బస్సులోనే ఉంచి నేను దిగాను. బస్సు బస్టాండ్‌ ప్రక్కనే ఉన్న డిపోలోకి వెల్లిపోయింది. అటూ ఇటూ చూస్తున్నాన్నేను. ''నమస్తే సార్‌'' అంటూ నా దగ్గరకు వచ్చాడతను. అతన్నెప్పుడూ చూసినట్లు గుర్తులేదు. నా మనోభావాల్ని పసిగట్టినట్టున్నాడు. ''నేను గుర్తు లేనా సార్‌! మీరు మా సిస్టర్‌ పెళ్లికి వచ్చారు. మీ ఆఫీసులో పని చేసే రాఘవ మా బావండి. నా పేరు కిషన్‌ అండి. మీరు పెళ్లిలో మా బావ అలగబోయిన కాడ ఫ్యాన్‌ కావాలని పట్టుబట్టి మేమివ్వకపోతే అలిగి గ్రూప్‌ ఫోటో దిగనంటే మీరు మా బావని 'ఒకరు పెట్టే దానికి ఆశపడ్తారటయ్య! సంతోషంగా ఇస్తే తీసుకోవాలి గాని. మనం కొనలేంది ఎవరో కొనివ్వాలనుకోవడం ఇతరుల్ని ఎంత కష్టపెడుతున్నట్లో ఆలోచించు. మీ బావమరిది అంత ఇదిగా ప్రాధేయపడుతున్నపుడు గ్రూప్‌ ఫోటో వద్దంటావేం. ఇలాంటి సందర్భాలు మళ్లీ వస్తాయా!' అని ఒప్పించి గ్రూఫ్‌ ఫోటో తీయించారు మీరు. అందులో మీరు కూడా ఉన్నారు. గుర్తొచ్చానా సార్‌'' అని అడిగాడు అతను. రాఘవ పెళ్ళికి వెళ్లింది వాస్తవమే కాని ఇతనే గుర్తుకు రావడం లేదు. ఆ మాట పైకి అంటే సభ్యతగా ఉండదని ఔనన్నట్టు పొడినవ్వుతో అంతా గుర్తున్నట్టే తల ఉపాను. ఇక్కడేం చేస్తున్నావని అడిగాను మర్యాద కోసం. ఆర్టీసీ డిపోలో క్లీనరుగా పనిచేస్తున్నాని చెప్పాడు. ఇంటర్‌ రెండు సార్లు ఫెయిలయి, ఐ.టి.ఐ. చేసి ఎలాగోలా ఈ ఉద్యోగం సంపాదించినట్టు చెప్పాడు. ఇప్పుడెటు వెళ్తున్నావని అడిగాను. డ్యూటీ అయిపోయిందని రేపు 'ఆఫ్‌' అని, ఒకసారి బావ దగ్గరకు వెళ్ళొద్దామని బస్టాండు వస్తే మీరు కలిశారని అన్నాడు. నిన్నటిదంతా ఇంకా మర్చిపోలేదు నేను. అంటే ఇతడూ 'ఫ్రీ వాలా' యే నన్నమామట. ''మీ ఆర్టీసీ వాళ్ళకు బస్సులు ఫ్రీ కావడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది'' అన్నాను నేను వ్యంగ్యంగా. ''అందరూ అదే మాట అంటారు సార్‌. మా పరిస్థితి ఎవరూ సరిగ్గా చూడరు. ఇపుడు నేను రోజు పెద్దపల్లి నించి వచ్చి పోతున్నాను. చాలా బోర్‌ కొడుతుంది. పని చేసి చేసి అలసిపోయాక మళ్ళీ అంత రష్‌లో బస్సెక్కి ఇంటికి చేరే సరికి ప్రాణం ఉసూరుమంటున్నది. మొదట్లో కొద్దిరోజులు రోజూ పోయి రావడం అంటే కొంత ఉత్సాహమే అన్పించింది. కాని తర్వాత్తర్వాత చాలా విసుగనిపిస్తుంది సార్‌. అసలు మాకు ఇక్కడ క్వార్టర్లు కట్టిస్తే బావుండేది సార్‌. చాలా ఖర్చులు తగ్గేవి. కిరాయకు ఉండమంటారా! కరీంనగర్‌లో కిరాయకు ఉండడమంటే నూర్రూపాయలు అటే! ఈ జీతంలో అంత కిరాయ ఎలా పెట్టగలం సార్‌. రోజూ పోయి రావడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నది సార్‌!'' అని అన్నాడు. మీ యూనియన్‌ను అడగవచ్చు కదా అన్నాన్నేను. ''గీ రివైజుడ్‌ స్కేలు ఇమ్మంటెనే కార్పొరేషన్‌ ఇంకా ఇవ్వడం లేదు. క్వార్టర్లు ఏం గట్టిస్తది సార్‌ ఇంకా! దోచుకొని తినడానికి వాళ్ళకే ఎక్కడి డబ్బూ చాలడంలేదు. తుప్పబుడిల్ల బాడీలు చేయించి లక్షలకు లక్షలు మింగుతున్నరు. ఒక్క బస్సుకు అద్దాలు సక్కగుండయి. కనీసం కాన్వాసన్న ఉండది. ఇక వానగొడ్తే కారమంటె ఎందుగ్గారయి? పాత ఇంజన్లనేకొని కొత్త ఇంజన్లని కమీషన్లు మింగవట్టిరి. పాత బస్సులను రెండు టైర్ల ధర కంటె తక్కువ ధరకు మినిస్టర్లే మంది పేరు మీద కొనవట్టిరి. అయినా ఇంకా ఆశ చావడం లేదు వాళ్ళకు. ''ఆర్టీసీ రూట్ల మీద ప్రయివేటు సర్వీసులు నడిపిస్తున్నారు. మినిస్టర్లు మంది పేరు మీద. ఏమన్నంటే కార్పొరేషన్‌ లాస్‌లో నడుస్తున్నది. బస్సురూట్లను ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తాం అంటున్నారు. ఇంకా మీదికెల్లి మిమ్ములను రిట్రెంచి చేస్తాం, లాస్‌ బాగా వస్తంది అని అంటున్నారు సార్‌! మింగేది మింగుకుంట మొకం మాడ్చే వీళ్ళేం పైకి తెస్తరు సార్‌ కార్పొరేషన్ను నిండా ముంచకపోతే అదే పదివేలు'' అన్నాడు. ''బస్సుల్లో కనీసం బెల్లు, బెల్లుకు తాడన్నా ఉండొద్దా'' అని అడిగాను. ''దాని కోసం మా వాళ్ళు రోజూ అడుగుతూనే ఉన్నారు. సార్‌. ఎన్నో సార్లు పని కూడా బందుపెట్టారు. అయినా ఇవ్వకపోయిరి.'' అన్నాడు కిషన్‌. ''మరి ఆర్టీసీని ఏడుగా విభజిస్తే పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది కదా, మీ యూనియన్‌ ఎందుకు వద్దన్నది?'' అని అడిగాను. ''ఇప్పుడు ఒక్కటిగా ఉంటేనే ఇంత దోస్తున్రు. ఇంక ఏడుగా విభజిస్తే ఏడుగురు రాజులైతరు. ఎక్కడికక్కడ దోచి ఏడాదిలోనే నిండా ముంచుతరు సార్‌, అందుకే వద్దన్నది యూనియన్‌.'' అన్నాడు కిషన్‌. ''మరి మీరు రోజు ఫ్రీగా ఎక్కడం వల్ల వచ్చే నష్టం మాటేమిటి'' అని అడిగాను. ''ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తదా సార్‌'' నా నోరు టప్పున మూత పడింది. ''అయినా ఏ ఒక్కడో నిజాయితీగా ఉంటే ఏమయితది సార్‌! మా ఆర్‌.ఎమ్‌. ఉన్నడు. నిప్పులాంటి మనిషి సార్‌! మరి అవినీతి ఆగుతున్నదా. పైవాడూ, క్రింది వాడు అవినీతి చేస్తూ కిందివానికి దోచిపెట్టమని పైవాడు చెప్పి ఏదన్నయితే ఏం కాకుంట కాపాడుతుంటే ఇంక నిజాయితీకి స్థానం ఎక్కడుంది సార్‌!'' అన్నాడు కిషన్‌ మళ్లీ. ''నేను చెప్పిన మతలబు మరచిపోయేరు. యాత్తో చెప్పున్రి'' అంటున్నాడెవరో కిషన్‌తో దూరం నించి. చెప్తానన్నాడు కిషన్‌. ''ఎవరతను? ఆర్టీసీ కూలీయా?'' అని అడిగాను ''అవును'' అన్నాడు. నాకు పరిచయం చేయమని కోరాను. పరిచయం చేశాడు. అతని పేరు ముస్తాఫ్‌ అన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నావని అడిగాను. పదిహేను సంవత్సరాల నుండి అని చెప్పాడు. ''ఎందరు పిల్లలు'' అని అడిగాను. నలుగురు పిల్లలని, పెద్ద కూతురు పెళ్లి చేసానని, కొడుకు పదోతరగతి నాల్గోసారి ఫెయిలయ్యాడని, ఇపుడు రిక్షా నడిపిస్తున్నాడని, ఇంకో కొడుకు 'లేత్‌ మిషన్‌' పని నేర్చుకుంటున్నాడని, చిన్నోడు వానకాలం పల్లికాయలు, ఎండాకాలం ఐస్‌క్రీమ్‌ అమ్ముతాడని చెప్పాడు ముస్తాఫ్‌. ''చిన్నవాడినయినా చదివించకపోయావా'' అని అడిగాను. ''పెద్దోడు సదువుకోని ఏపాటి నౌకరీ చేస్తాండు? ఇదే నయం. సదివిత్తే వాల్ల గు...లు మీదికి వోతయి. మల్ల పనికి వంగరు. వాని సంపాదన అపుడు వాని బట్టలకే సాలది.'' అన్నాడు ముస్తాఫ్‌. ''పదిహేను సంవత్సరాల్నించి ఎంత సంపాదించారు?'' అని అడిగి వెంటనే మాట జారినందుకు నాలిక కొరుక్కుకున్నాను. ''తప్పుపట్టకున్రి గాని మీరెంత సంపాయించిన్రు సార్‌?'' అన్నాడు టకీమని. ''అహా! నా ఉద్దేశం అది కాదు. మీరు చిన్న మూటకు కూడా రూపాయి, ఆఠానా తీసుకుంటారని, బాగా కష్టపెట్టుకుంటారని విని మరి మీరెంత బాగా బతుకుతున్నారో తెలుసుకుందామని అడిగాను.'' అన్నాను నేను. ''మూటకు రూపాయి తీసుకోక ఏం జెయ్యమంటారు సార్‌! మాకేమన్నా జీతమా! మన్నా! వచ్చిన్నాడు తినుడాయె, లేన్నాడు పండుడాయె. మర్యాదగా అడిగితే వీడు అమాయకుడని బుదిరికిచ్చి ఆఠానిచ్చేది పావలా ఇస్తరు. అందుకోసం మాకు మాట కడక్‌ మాట్లాడుడు అలవాటైంది సార్‌.'' అన్నాడు. ''మీరు బస్సులల్లో నీరు పోస్తారు. సెల్ఫులేనపుడు నెట్టుతారు. డ్రైవర్లకు, కండక్టర్లకు, టి.టి.ఐ.లకు అటెండర్ల లాగా చెప్పిన పని చేస్తుంటారు కదా! మరి మీకుకూడా కొంచెం జీతం ఇమ్మని అడిగితే మంచిది కదా! మీకు యూనియన్‌ లేదా? ప్రయివేటు సర్వీసుల మీద ఉండే క్లీనర్‌ కమ్‌ కూలీలకు ఇచ్చినట్టు కనీసం నెలకు యాభయో, అరవయే ఇస్తే మీరు ప్రయాణీకులకు కష్టపెట్టుకోవడం జరుగదు కదా!'' అని నా ఉద్దేశం వివరించాను. ''మీరన్నది నిజమే సార్‌. మాక్కూడా యూనియన్‌ ఉన్నది. కాని ఏం లాభం? మేం పని చెయ్యం అని పని బందు పెడ్తే పని ఆగుతదా? ఉత్త కూలీలమయిపోతిమి. ఎవల మూట వాల్లే ఎట్లనో కష్టపడి ఏసుకుంటరు. అది కూడా చేసి చూసినం, లాభం లేదు సార్‌?'' అని అన్నాడు ముస్తాఫ్‌. ''మీ సమస్య ప్రజల ముందుకు తీసుకు రావాలంటే మీరు కొన్ని రోజులు కొత్త రకం సమ్మె జెయ్యండి. ఇంగ్లాండ్‌లో జీతాలు పెరగాలని పని బందు పెట్టే బదులు రోజుకు ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలు పని చేశారట. మీరు అలాగే ఒక వారం రోజులు పాటు ఏ మూటకూ పైసలు తీసుకోకుండా చేరవేయండి'' అన్నాన్నేను. ''గీ కాలంల గంత మానవత్వం ఏడున్నది సార్‌! అయ్యో వీడియ్యాల మూట ఉట్టిగనే తెచ్చిండని ఎవరూ పాపం అనరు. ఆఠానా మిగిలిందని సంబరపడతరు గని! అయినా గీ కడుపు ఊకుంటాది సార్‌! ''అంటూ జవాబిచ్చాడు ముస్తాఫ్‌. ''మేము చాలా రోజుల్నించి యూనియన్‌ తరుపున కొట్లాడుతున్నం. మేము పదిహేను, ఇరవై ఏళ్ళనుంచి కూలి పని చేత్తున్నం. మమ్ములను క్లీనర్‌గా తీసుకోకున్నా, మా కొడుకులను తీసుకొమ్మంటె కూడా కార్పొరేషన్‌ ఒప్పుకుంటలేదు సార్‌! ఇగ ఏం జెయ్యమంటరు. ఇంక మీరు యాభై రూపాయలు జీతం అడుగుండ్రి అంటున్నరు. మాకు ఎంత తక్కువ జీతం ఇచ్చినా ప్యాసింజర్ల దగ్గర పైసలు దీసుకోకుండా పని చేత్తం అని ముందుముందు ఏమన్నా లాభం జరుగుతదనుకొని చెప్పినం. కార్పొరేషన్‌ ఇంటలేదు సార్‌! మాలాంటి గరీబులకు వెడితే కార్పొరేషన్‌ లాస్‌ అయితదిగదా సార్‌! అన్నాడు. పెళ్ళయ్యే దాకా పిచ్చికదుదరది. పిచ్చి కుదిరేదాకా పెళ్ళికాదు అన్నట్టు ఉన్నది సార్‌! ఏదన్నా ఒకటి అయ్యేదాకా ఇది గిట్టనే ఉంటది, మేము గిట్లనే ఉంటం'' అన్నాడు. ''మీ అల్లుడు దేవుడు, ఏం పని చేత్తడు'' అని అడిగాను మాట మార్చుతూ. ''మా అల్లునిది మెటుపల్లి దగ్గరి చిన్న పల్లె. వెల్లుల్ల అవతల ఉంటుంది. అయితే ఇపుడు మెటుపల్లిల్నే ఉంటాండు. బండి మీద పండ్లమ్ముతడు'' అన్నాడు ముస్తాఫ్‌. బండి మీద పళ్ళమ్ముతాడనే సరికి నాకు తెలుసుకోవాలని అనిపించింది. ''పళ్ళమ్మే వాళ్లకు అడ్డాలు ఉన్నాయట గదా, అక్కడ ఇంకొకరిని పళ్ళమ్మనీయరట గదా?'' అన్నాను. ''ఒక పళ్లమ్మేటోల్లకనే ఏముంది సార్‌? రిక్షా వాల్లకున్నయి, మోచీ వాళ్లకున్నయి, ఆఖరికి బిచ్చగాళ్లకు గూడా ఉన్నయి. అటు ఇంకోన్ని రానీయరు. రానిస్తే వీడు బతుకుడెట్ల. ఆని కడుపే నిండుతలేదు. ఆడు మంది కడుపు కోసం ఏడ జూత్తడు సార్‌! ఎవల పని వాళ్లు చేస్తొంటె వాళ్ళకు ఏ రంది లేకుండా యాల్లకింత కడుపు నిండెటట్టు చేసే సర్కారుంటె మీరన్నట్టు అందరూ మంచిగనే ఉందురు. గిప్పుడు గట్ల లేదాయె. ఒకన్నొక్కడు సీర్క తినుడాయె'' అన్నాడు ముస్తాఫ్‌. అతను మాట్లాడుతుంటె జీవిత సారం అంతా కాచి వడబోసి తాగి జీర్ణించుకున్నట్లున్నాడు అనిపించింది. మా బస్సు వచ్చింది. కిషన్‌, నేను ఎక్కాం. ''డాక్టర్సు, మినిస్టర్సు లెవల్‌ నుంచి ఫోన్లమీద ఫోన్లు వస్తున్నయి. రిపోర్ట్‌ మార్చి మల్ల రాయాలని... డాక్టరేమో ఉద్యోగం పోతదేమోనని భయపడతాండు. మల్ల మార్చి రాద్దామనుకుంటున్నడట.'' మా పక్కసీట్లో ఎవరో మాట్లడుకుంటున్నారు. మేము మౌనంగా ఉన్నం. ''అగో! గట్లయితే మనం ఊరుకోవద్దు. న్యాయ విచారణ జరిపించాలని డాక్టర్‌ రిపోర్ట్‌ను వెంటనే బహిరంగంగా ప్రకటించాలని స్టూడెంట్స్‌ యూనియన్‌, యూత్‌లీగ్‌, ఎంప్లాయిస్‌ యూనియన్స్‌ అందరం కలిసి 'బంద్‌' నిర్వహించాలె. ఊరేగింపు తీయాలె.'' ''వీడు సర్పంచయితే ఏంది. ఎమ్మెల్యే అయితేంది. ఫోన్‌ చేసెటోల్లు ఏ మినిస్టర్లయితేంది. సెంట్రల్‌ మినిస్టర్లయితేంది. మనం ఊర్కునేది లేదు.'' ''వానికి శిక్ష వేయించాల్సిందే. అట్ల వీలు కాకపోతే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలె అసలు రేప్‌ చేసిన వాన్ని ఉరితీయాలె. రేప్‌ చేసే వానికి మద్దతు ఇచ్చే వాల్లని కూడా శిక్షించాలి. దోపిడి గాల్లకు, దొంగలకు, లంగలకు మద్దతు ఇచ్చేవాళ్ళకు అధికారంలో ఉండే హక్కు లేదు.'' అని వాళ్ళు గట్టిగా చర్చించుకుంటున్నారు. హారన్‌ మోగిస్తూ మా బస్సు కదిలింది. ఖద్దరు డ్రెస్సు అతని వెంట పోలీస్‌ ఆఫీసరు గబగబా వచ్చి బస్సెక్కారు. పక్కవాల్ల సంభాషణ గుసగుసగా మారింది. చీకట్లో తన వెలుతురు కోసం తానే పరిగెత్తుతున్నట్లు మా బస్సు తారు రోడ్డు మీద దూసుకుపోతోంది. తన వెలుతురుకోసం తానే పరిగెడుతున్న బస్సులా ఎవరి జీవితంకోసం వాళ్లు పరుగుతీస్తున్నారు. జీవితమే అందరికి అన్ని రకాల తర్కవిద్యలని నేర్పుతున్నట్టుంది. ఆలోచిస్తూ ఎపుడు నిద్రపోయానో... చిట్టి ''నాన్నా! నాన్నా!'' అని పిలుస్తోంది. గబుక్కున లేచాను. నేను దిగాల్చిన స్టేషన్‌ వచ్చేసింది. కథాకాలం 1979 'వాసనలేని పూలు' పేరుతో జనధర్మ వార పత్రిక, వరంగల్‌, 1980 సవరించిన నూతన ప్రతి 'మా భూమి', వార పత్రిక, 2004