Friday, October 7, 2016
బతుకు నేర్పిన పాఠం
''నీ పేరు?''
''ఎర్రగొల్ల మల్లయ్య సారు...''
''ఏం పని చేస్తావు?''
''మేం గొల్లోల్లం... గొర్లు కాసుకుంటం...''
''జైలుకెందుకొచ్చినవ్?''
''ఎవ్వన్నో సంపినమట. ఎవడో యావజ్జీవ శిక్ష ఏయించిండు...''
''ఎంతమంది పిల్లలు? అసలేం జరిగింది? వివరంగా చెప్పు...''
జ జ జ జ
''ఏం జెప్పాలె. ఎక్కడికెళ్లి మొదలెట్టాలె. మా వూరి పాత సారెదారు సాబుకు అయిదునూర్లిచ్చిన. రెన్నెల్లు గాక ముందె ఈ దొరచ్చిండుదొర. ఆపోయిన దొర ఈ దొరకు చెప్తనన్నడు దొర. ఈ వచ్చిన దొర గదేం తెల్వది ఆరున్నొక్క నూర్లిత్తెనే సరె లేపోతే లేదంటే యిచ్చి మేపుకొంటున్న దొర. అవిచ్చి రెన్నెల్లు గూడ గాలేదు. ఇంక నాల్గు నెల్లదాక ఒక్క పైసడుగద్దు దొర''.
''ఏదీ నీ రసీదు తే''
''రసీదెక్కడిది దొర. రసీదిమ్మంటే యాడాద్దాక మేపుకోనిచ్చె జిమ్మెదారి నాది అన్నడు దొర''
''అంతా అబద్దం సార్''
''అవద్దం అనంగనే నేనిచ్చిన పైసలు ఉత్తగనే కొట్టుక పోతయా? గొల్లరాజడు, కిట్టడు, ఎంకడు అందరం ఒకటే సారిత్తిమి. ఇంకాల్లను పిలిపిచ్చి అడుగున్రి దొర''.
''అరేయి. గవన్ని మాకు జెప్పకు. పన్నెండు వందల రూపాయలు దండుగ గట్టాలె లేపోతె గొర్లన్ని ఛలాన్‌జేత్త ఫో పోయి తీస్కరాపో''
''ఇయ్యాల ఏడ దొరకుతయి బాంచెను! రేపు పొద్దుగాల యిత్త. ఏడుంటరు?''
''దొర గడీల ఉంట. పొద్దున్నె తేవాలె. తిని పన్నెండు గంటలకే పోవాలె''
''అయ్య గొర్లన్ని నాయిగావు. సగం దొరయున్నై. మిగిలిన సగంల సగం ఊరోల్లయి ... సగం నాయి దొర. నా ముప్పయి గొర్ల మందం దండుగ నేనిత్త. దొరయి దొరనడుగున్రి బాంచెను. ఊరోల్లను గూడ మీ దగ్గరికి తోలేత్త. ఎవలయి ఆల్లనడుగున్రి.''
''గవన్ని మాకు తెల్వయి.''
''ఊరోల్లయంటే నేనే అడిగిత్త. నేనే గడ్త. దొరయన్న మీరడుక్కోన్రి''
''మల్ల గట్లనే అంటవు. గదేం తెల్వది మాకు''.
''అయితే గొర్లని ఉంచుకోన్రి. ఏంజేత్తరో... నేను గూడ జూత్త''
''అరేయి బాగ మాట్లాడుతున్నవేందిర''?
''లేక పోతే ఏంది? దొరయింట్ల పంటరు. దొరయింట్ల దింటరు. దొర దండుగు నన్ను గట్టుమంటరు. మీకే సాగచ్చిన మాటలా''?
''ఈలం... కొడుకును కట్టేసి జీపులెయ్యిన్రి...''
''ఏందయ్యో! ఊకున్నాకొద్ది లావు మాట్లాడ్తాన్నవు, నన్ను ఇదువరదాక చెట్టుకు గట్టెయ్యమన్నవు. ఇపుడు కట్టేసి జీపులెయ్యి మంటున్నవు. ల... కొడుకు గింజ కొడుకు అని తిడుతాన్నవు. మంచిగ మాట్లాడరాద?''
చెంప ఛెళ్ ఛెళ్ మన్నది.
''కొట్టున్రి. ఇంకగొట్టున్రి ఒంటిగ జూసి నలుగురు గలిసి కొట్టున్రి. మీకు గింత కన్న ఎక్కొ ఏం సాతనైతది. గొల్లొన్ని దొరికిచ్చుకోని కొడుతాన్రు. ఈ మందల సగం గొర్లు దొరయి. గా దొరను గొట్టున్రి సాతనైతే... నాకు కూలన్న యియ్యడు... ఎట్టి గాయాలె. నేనంటె గరీబోన్ని... ఈ ఊర్లె బతికెటోన్ని. మీకేమైంది అడుగుటానికి? దొరయింట్ల దినుకుంట దొరయింట్ల పండుకుంట ఉండచ్చు గని దొరనడుగ సాతగాద సదువుకున్నొల్లకు మీకు? సర్కారునౌకరీ చేత్తాన్రు? గరీబోన్ని బక్కసక్కటోన్ని గొట్టుడు సాతనైతాది?
ఛెళ్ ఛెళ్.... చేయినొప్పి పుట్టి ఊకున్నడు. పండ్లల్ల కెల్లి నెత్తురు గార్తాంది.
''సాలయిందా! కొట్టి కొట్టి సెయినొత్తందా? ఇంక గొట్టున్రి సంపున్రి. గా దొరనడుగుటానికి కలేజాలేని ఆడిగుల్లముం.. కొడుకుల్లార కొట్టున్రి. ఆడు వెట్టింది దిని సంకలు గొట్టున్రి. దొంగకట్టె తోటి పట్నంల అల్లుని కోటి, కొడుక్కోటి బిల్డింగు కట్టిచ్చిండు. గా దొరనేమనకున్రి. మమ్ములనే తన్నున్రి. అడివిల మేసే గొర్లకు దండుగులెయ్యిన్రి. గొర్లు అడివిల మెయ్యకపోతె ఏడ మేత్తయి. పొలంల మేపన్నా? థు! త్తెరి! సర్కారు కునా మొ... గిదేం సర్కారు?
జ జ జ జ
''అరేయి మల్లిగా తాగిందింక దిగలేదా? నిన్న బాగదాగి ఆల్లనేమో అన్నవట?''
''నేనేడ దాగిన బాంచెను''
''ఛత్! మల్ల ఎదురు మాట్లాడ్తవేందిర? ఊల్లె ఉండబుద్దైత లేదా?''
''ఏదో మీ దయ బాంచెను. నా కేమ్మాట్లాడత్తది. గొల్లెక్కి యిల్లెక్కిరోన్ని''
''పెయిల భయం బెట్టుకోని మెదులు''
''అయ్య...!''
జ జ జ జ
''ఆఁ మీరెటచ్చిన్రు''?
''అయ్య గొల్లోల్లందరు మేమచ్చెదాక ఒకటే పట్టు పట్టిన్రు''
''ఏంటిదట''?
''దండుగ మేమెందుకుగడ్తం? కూలి దీస్కుంటలేడా? ఆన్ని అడివిల ఎవడు మేపమన్నడు''?
''ఆడే గడ్తడు మీరు వోన్రి....మొన్న పోచంపాడు కాల్వకింద వోయిన పొలంపైసలచ్చె గదర. ఏంజేసినవు? ఇక్కడిక్కడోల్లకు సిన్నోల్లకైతే నేను మా జెప్తుగని ఈ చెకింగు పార్టీ వరంగల్ నుంచి వచ్చింది. ఈల్లు చెప్తె యినెటోల్లు గాదు. తే...ఫో...''
''వరంగలోల్లు అచ్చినపుడు పన్నెన్నూర్లు దీస్కోని యిచ్చిన రసీదు యిన్నూరుకే ఉన్నదట దొర! అవిచ్చి గూడ నాల్నెల్లు గాలేదు. మల్ల పైసలనవడ్తిరి?''
''గదంత నాకు దెల్వది. నీకు ముందుగాల్నే జెప్తున్న, చౌకీదారుకిచ్చిన, సారెదారుకిచ్చిన అని ఆఫీసర్లకు చెప్పద్దు. ఆల్ల మామూల్లు వేరే. మల్ల దండుగలు వేరేగట్టాలె. నా కొప్పుకున్నయి నాకియి. నిన్న ఏమన్నవు. యియ్యాల తెత్తనన్లేదా? మల్ల మొదటి కచ్చినవు?''
''రాజిగాని దగ్గరున్నై పిలుసుకత్తాగు... రాజిగో....రాజిగో...రారో...''
''.................''
''ఎయ్‌రా ల.కొడుకును...గొడ్డలి మెత్తగ లేదేమిరా... సంపు...లం...''
''అమ్మో... సత్తి....'' సారెదారు.
జ జ జ జ
''అయితే మీ ఇరువై మందికి జైలు శిక్షలు పడ్డాయా''?
''నలుగురికే పడ్డయి. యిండ్లనే ఉన్నరు''.
''మరియిపుడు మిమ్ములను విడుదల చేస్తే భార్యా పిల్లలతో పని చేసుకొంటూ సుఖంగా ఉంటారా?''
''నా పెండ్లాం సచ్చిపోయింది. పోరగాన్లు పట్నంల వోటల్ల సిప్పలు గడుగుతాన్రట. ఆడిపోర్ని మేనమామలు సాదుతాన్రట''
''మరేంజేస్తావు''?
''మమ్ముల యింటిగ్గాకుంట, కాటిగ్గాకుంట జేసిన దొరను జంపినంక మాట...''
''దొరేమన్నడు''?
''అన్నిటికి అసలు కారణం దొర! దొర పొలంలకెల్లి పోచంపాడు కాల్వ వోతాంటె దాన్ని వంకర దిప్పిచ్చి నా పొలం మునుగొట్టిండు. దొరగొర్ల కోసం నా తోటి దండుగులు గట్టెచ్చి బాకీలపాలు జేసిండు. అడివిల సంపుతె ఎవడు జూత్తడని... అనుకుంటే... గిదే సందని దొర అడివిల కట్టెంత అమ్ముకోని అది మేం జారగొట్టినమని... దాన్ని పట్టు కుంటె సారెదార్ను మేం సంపినమని దొంగ గవాలు (సాక్ష్యాలు) పెట్టి మమ్ముల పోలీసులకు వట్టిచ్చి జేల్లేపిచ్చిండు దొర.''
''జరిగిందేదో జరిగిపోయింది. మేం నీకు సహాయం చేయడం కోసం వచ్చినం. నీ అభిప్రాయం మార్చుకుంటే నిన్ను ప్రభుత్వం విడుదల చేసేట్టు చేస్తాం. ప్రభుత్వం ఏదన్న ఆర్థిక సాయం చేస్తుంది. నీ బ్రతుకు నువ్వు బతుకొచ్చుగద?''
''గీ సర్కారా! నాబతుకు నన్ను బతుకనియ్యలేదు. మల్ల నా బతుక్కు సాయం జేత్తదా! కల్ల...''
''మేం వచ్చింది అందుకే. అఖిల భారత మానవతావాదుల సంఘం, జీవకారుణ్య సంఘం తరఫున వచ్చాం. సాయం చేయిస్తాం. పునరావాసం చూపిస్తాం''.
''అయితే ముందుగాల సర్కారు జేసిన తప్పు సరిదిద్దున్రి... నా యెకురం భూమి నాకిప్పియ్యిన్రి. నా పెండ్లాన్ని నాకు బతికిచ్చియ్యిన్రి... నా పోరగాన్లను మీ పొలగాండ్ల తీరుగ సదువియ్యిన్రి. మా పొలగాండ్లను మీ తరీక సదువుకున్నొల్లు జేసే మంచి నౌకర్ల వెట్టియిన్రి.... గప్పుడు సర్కారు జేసే సాయం సంగతి మాట్లాడుకొందాం.''
''కాలాన్ని వెనక్కి తిప్పడం ఎవరితోని కాని పని. ఏ దేవుడు కూడా కాలాన్ని వెనక్కి తిప్పలేడు. ఇంకేమన్నా అడుగు.''
''అంతగనం నేను ఏమడిగిన? నా బతుకు నాకు ఇమ్మన్న! ఇది సాతగానోల్లు మాకెట్ల సాయం చేత్తరు? ఏమనుకొని వచ్చిన్రు? ఇగ ఎందుకచ్చిన్రు మరి?''
''ఏదో పాపం సాయం చేద్దామని వస్తే చాలా మాట్లాడుతున్నావ్!... నీ ఆశకు అంతులేనట్టుంది...''
''లావు కోపమత్తాంది మీకు? ఏమి అడిగిన్నయ్యా?... ఏదో పాపం అని అంటున్నరు?... మేం ఏం తప్పు చేసినం?... ఏం మాట్లాడుతున్నారయ్యా.... గొల్ల కులం ఇయ్యాల్ల పుట్టలే... గొర్లు ఇయ్యాల్లనే పుట్టలే... శ్రీకృష్ణుడు పుట్టక ముందట్నుంచి గొల్లోల్లున్నరు. గొర్లున్నయి. ఎనుకట్నుంచి గొర్లను ఎవల యిండ్లల్ల ఆల్లు మేపలేదు. అందరు అడివిల్నే మేపిన్రు. అట్ల అడివిల మేపినందుకు శ్రీకృష్ణున్ని దేవుడని మొక్కుతాన్లు. నేనదే పనిజేత్తె నన్ను గీ గతికి దెచ్చిన్రు... ఎనుకట్నుంచి అడివిల మేసె గొర్లు యియ్యాల్ల మేపద్దంటే ఏడ మేపుతరు? మరి గంత గుణమున్న సర్కారు గొర్రె కూర దినద్దని... గొర్లను సాదద్దని అనచ్చుగద. నేనుగొర్ల నిడిసిపెట్టె బర్లను సాదుతుంటి. గొర్రె కూర ముద్దేగని గొల్లోడు ముద్దుగాదా? ఆడుఎట్ల జాత్తడు అని ఏమన్న ఉన్నదా సర్కారుకు?''
''నీ తల తిక్క నీదే. అందుకే ఇక్కడ వున్నావు... అసలు ఇవన్నీ నీకు ఎవరో నేర్పుతున్నారు.''
''ఎవరు నేర్పేదేంది? నా బతుకు నాకు కావాలని అడుగుడు తప్పా?''
''నీదేం తప్పులేదు... మాదే పొరపాటు... ఎంతో కష్టపడి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడిదాకా రావడం మాదే బుద్ధితక్కువతనం.''
జ జ జ జ
కథాకాలం 1974 ... రచనాకాలం 1979
'ఇంటర్వ్యూ' పేరుతో 'నూతన' మాసపత్రికలో 1980-81
సవరించిన నూతన ప్రతి. ఆదివారం ఆంధ్రజ్యోతి, 2011