Friday, October 7, 2016
పెన్షనర్ - హోంమేకర్
గురువారం షిర్డీ సాయిబాబా గుడికి వెళ్లి పూజ చేసుకొని అప్పుడే వచ్చింది మాధవి. మాధవి తలంటు పోసుకొని కాళ్లకు పారాణి రాసుకొని, చెంపలకు పసుపు, గంధం పూసుకొని, తలలో పూలు పెట్టుకొంది. పూలు, పత్రి, విభూది భర్తకు పెట్టి కాళ్లకు దండం పెట్టింది. పుస్తెలను కళ్లకు అద్దుకుంది. తలపై చేతులు పెట్టి లేవనెత్తుతూ ఆశీర్వదించాడు రామచంద్రయ్య.
మాధవి ఇంట్లోకి వచ్చేసరికి రామచంద్రయ్య పెన్ను తీసుకొని, ఏవో కాగితాలు ముందేసుకొని లెక్కలు చేస్తున్నాడు. అవేవో పెన్షన్ లెక్కలు అని వాళ్లాయన మూడ్ చూడగానే అర్థమైనట్టుంది.
''మహబూబ్ అలీ పెన్షన్ ఇంకా ఎప్పుడు వస్తుందంటున్నాడు?'' అంటూ ప్రశ్నించింది మాధవి.
''ఇంకా పెన్షన్ ఫిక్స్ కాలేదు'' అంటూ రామచంద్రయ్య సెల్‌ఫోన్ అందుకొని మహబూబ్ అలీకి ఫోన్ చేశాడు.
''ఒక ఇంక్రిమెంట్ పెరుగుతుందనుకుంటా!'' అంటూ ఫోన్‌లో అడిగాడు.
''ఎక్కడా లెక్క తప్పలేదు. మీకు అది వర్తించదు'' అంటూ క్లారిఫికేషన్ ఇచ్చాడు మహబూబ్ అలీ.
ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రిటైరైన రామచంద్రయ్య తన కాలేజీలో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైరైన మహబూబ్ అలీ అంటే ఎంతో గౌరవం. ఆయనని తన సబార్డినేట్‌గా ఎప్పుడూ చూడలేదు. తనతో సమానంగా గౌరవిస్తాడు. మహబూబ్ అలీ కాలేజీలో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైరయ్యాక పెన్షనర్లకి వాళ్ల లెక్కలు చేసి పెడుతున్నాడు. ఎన్జీవోల సంఘంలో చాలాకాలం ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అనుభవం కూడా తోడై మహబూబ్ అలీకి పెన్షన్, సర్వీస్ మేటర్స్ నిద్రలో కూడా చెప్పగలడని అంటారు.
''ఓ.కే.! షుక్రియా భాయ్...'' అంటూ రామచంద్రయ్య ఫోను పెట్టేశాడు.
మాధవి టిఫిన్ తయారీలో పడి ఒక చెవి ఇటు వేసి వింటోంది.
''మొన్న జీపీఎఫ్, సరెండర్ లీవ్, గ్రాట్యూటీ పైసలు ఎన్ని వచ్చినయ్?'' అకస్మాత్తుగా అడిగింది మాధవి.
మాధవి ఎందుకు అడుగుతుందో అర్థం కాక విస్తుపోయాడు రామచంద్రయ్య.
''మొన్ననే ఇద్దరం కలిసి బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తిమి గదా!'' అన్నాడు రామచంద్రయ్య.
రామచంద్రయ్య 50వేల రూపాయల చొప్పున ఆరు వేర్వేరు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. వాటి వడ్డీని తాను చదువుకున్న, పని చేసిన స్కూళ్లల్లో, కాలేజీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు అవార్డుగా ఇవ్వాలని అలా చేశాడు. తాను గవర్నమెంట్ స్కూళ్లో, కాలేజీలో చదువుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో పేద పిల్లలే చదువుతున్నారు. కనక తానిచ్చే ఈ అవార్డు పేదల ఉన్నత చదువుకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అతని ఉద్దేశ్యం. దీనివల్ల అందే డబ్బు కన్నా ఇచ్చే స్ఫూర్తి ముఖ్యమని అతని భావం. ఆ డిపాజిట్ వడ్డీ తమకు రాదని మాధవికి చెప్పాడో లేదో తెలియదు.
''మీ పెన్షన్ అమ్మితే ఎన్ని పైసలు వస్తయి? ఎప్పుడు వస్తయి?'' నేలకేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ అడిగింది మాధవి.
''పెన్షన్‌లో ఫార్టీ పర్సంట్ అమ్ముకోవచ్చు. రూపాయి పెన్షన్ అమ్మితే 125 రూపాయలిస్తారు. వెయ్యి రూపాయలు అమ్మితే లక్షా ఇరవైఅయిదు వేలు వస్తాయి. మొత్తం పన్నెండున్నర లక్షలు రావచ్చనుకుంటా! ఎన్నడూ లేంది ఎందుకు అడుగుతున్నావ్?'' అన్నాడు నవ్వుతూ.
''ఆఁ ఏంలేదు...'' అంటూ చెప్పాలా, వద్దా అనుకుంటూ తనలో తాను గొణుక్కుంది మాధవి.
రామచంద్రయ్య ఈసారి మాధవికేసి సాభిప్రాయంగా ఎగాదిగా చూశాడు. ఒక చిరునవ్వు నవ్వాడు. ఏంటి మాధవిలో కొత్త భావాలు కలుగుతున్నాయి అని అనుకున్నాడు. వాళ్లాయన నవ్వు చూసి మాధవికి కాస్త ధైర్యం వచ్చింది. మాధవి కూడా నవ్వింది. బాంబినో సేమియాతో చేసిన ఉప్మా ప్లేటు రామచంద్రయ్య చేతికి అందించింది.
మాధవి నవ్వులో ఏదో కొత్తదనం కనిపించింది. మెజంటా కలర్ జరీ అంచు పాలమీగడ వంటి తెల్ల చీరలో మాధవి మెరిసిపోతోంది. ఆరబెట్టుకున్న వెంట్రుకలు ఫ్యాను గాలికి అలలు అలలుగా కదులుతున్నాయి. వెండి తీగల్లాంటి వెంట్రుకలు నల్లని వెంట్రుకల్లో కొత్త అందాన్ని సంతరించుకుంటున్నాయి. నడుం దాకా వేలాడిన తల వెంట్రుకలు, నొసట నిండుగా పెట్టిన పసుపు, చందనం విభూది, కుంకుమ బొట్టు ఆమెను నిండు ముత్తయిదువగా గంభీరతను సంతరింప చేసింది. నడిచి వచ్చిన దేవతలా కనిపించి ఏవో మధురమైన జ్ఞాపకాల్లోకి జారిపోయాడు రామచంద్రయ్య.
వాళ్లాయన చూసే ఆ కొత్త చూపు చూసి కొత్త పెళ్లికూతురులా సిగ్గుతో హొయలు పోయింది మాధవి. సుతారంగా మాధవి చేతి వేళ్లను స్పర్శిస్తూ ఆ స్వర్శానందాన్ని ఏదో జ్ఞాపకాలతో అనుభవిస్తూ టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకున్నాడు రామచంద్రయ్య.
సాధారణంగా మాధవి టిఫిన్ గానీ, టీ గానీ రామచంద్రయ్య చేతికి అందించదు. టీపాయ్ మీద పెట్టి తీసుకోండి అని చెబుతుంది. చేతికి స్వయంగా అందించడం అంటే అందులో ఏదో విశేషం వుంటుందని రామచంద్రయ్యకు తెలుసు. ఏదైనా చీరకొనివ్వాలన్నా, తల్లిగారికి సంబంధించిన బంధువుల ఫంక్షన్లకు వెళ్లాలనుకున్నా మొత్తానికి ఏదైనా టెండర్ వెయ్యాలనుకున్నప్పుడు ముందుగా చాలా ప్లాన్‌గా ఒకటిరెండు రోజులు ఇలా ఆత్మీయంగా కొత్త పెళ్లి కూతురులా వగలు పోతూ ప్రేమ ఒలకపోస్తూ ప్రవర్తిస్తుంది మాధవి.
మాధవి తన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయదు. తన హావభావాలతో, చిరునవ్వుతో, ఆ రోజు కట్టుకున్న చీర ద్వారానో ఆ ప్రేమను గమనించాల్సిందే. వాళ్లాయనకి ఏ చీర బాగా ఇష్టమో టెండరు వేసే ముందు రోజు నుండి ఆయనకు నచ్చే చీరలే కడుతుంది. ఆయనకు నచ్చే కూరలే చేస్తుంది. స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు చాయ్ పెట్టమని అడగక ముందే చక్కని టీ మంచినీళ్లతో సహా టీ పాయ్ మీద పెడుతుంది. వచ్చిన వాళ్లను బాగున్నారా అన్నయ్యా అని ప్రేమ పూరితంగా పలకరిస్తుంది. ఈసారి వదినమ్మని తీసుకురండి అని చెపుతుంది. వారి పిల్లల యోగక్షేమాలు అడుగుతుంది. అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం రెండు రోజుల పాటు ఇంట్లో ఆనందాన్ని పంచుతుంది. చాలామంది ప్రతి రోజు ఇంత హాయిగా వుంటే జీవితం ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. ఆ మాటే అప్పుడప్పుడు మాధవితో అంటుంటాడు రామచంద్రయ్య.
''రోజూ పండగ వుంటే అది పండగ ఎలా అవుతుంది? అప్పుడప్పుడు వస్తేనే పండగ ఆనందం.'' అంటూ అర్థయుక్తంగా నవ్వుతుంది మాధవి.
టిఫిన్ లాగించేసరికి చక్కని చాయ్ చేతికందించింది మాధవి. మాధవి మొఖంపై చిరు చెమటలు చూసి అదో అందం అనుకున్నారు రామచంద్రయ్య. అలాగ తీరికగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటరూం కేసి నడుస్తున్న మాధవి నడకలో ఒక హొయలు, హంస నడకలు కనిపించి రామచంద్రయ్య ఆనంద పరవశుడైపోయాడు. మాధవి సాధారణంగా చరచరా నడుస్తుంది. చిరచిరా మాట్లాడుతుంది. ఇవ్వాళ ఆమె ప్రత్యేకంగా కనిపిస్తోంది. ప్రతిరోజూ ఇలాగే గడిచిపోతే ఎంత బాగుంటుంది అని మరోసారి అనుకోకుండా వుండలేకపోయారు రామచంద్రయ్య.
మాధవి తనకు కూడా టిఫిన్, టీ తెచ్చుకొని టీ మీద చిన్న స్టీలు మూత బోర్లించింది. టిఫిన్ తింటూ ఏదో ఆలోచిస్తోంది. అకస్మాత్తుగా చిరునవ్వు మాయమైపోయింది. మొఖంలో ఏదో బాధ... బాధతో మెలి తిరిగిపోతున్నట్టు, దాన్ని బలవంతంగా అదుపు చేసుకుంటున్నట్టు మాధవి టిఫిన్‌ను కెలుకుతోంది.
రామచంద్రయ్య అదేమీ గమనించినట్టు లేదు. దినపత్రిక తీసుకొని హెడ్డింగ్‌లేవో చూస్తూ పేజీలు తిరగేస్తున్నాడు. కాసేపు షేర్ల మార్కెట్, బిజినెస్ పేజీ దగ్గర ఆగిపోయాడు. ఆ తర్వాత పేపరు మడత వేసి టీ పాయ్ కింద చెక్క మీద చక్కగా పాత పేపర్లతో పాటు పేర్చాడు.
రామచంద్రయ్య దినపత్రికలను తేదీల వారీగా చక్కగా అమర్చుతాడు. నెల తర్వాత 16వ తేదీ పేపర్ కావాలనుకుంటే 15 పేపర్ల తర్వాత పేపర్‌ను తీసుకుంటే వచ్చేస్తుంది. ఆయన జీవితమంతా ప్రతి విషయంలో ఇలా క్రమశిక్షణ పాటిస్తుంటాడు. ఆ క్రమశిక్షణే ఎస్‌జీబీటీ సెకండరీగ్రేడ్ టీచర్‌గా ఉద్యోగంలోకి ఎక్కిన రామచంద్రయ్య డిగ్రీ, బీఈడీ, ఎమ్‌ఏ, ఎమ్‌ఈడీ, పీహెచ్‌డీ పాసవుతూ స్కూల్ అసిస్టెంట్‌గా, క్రమంగా జూనియర్ లెక్చరర్‌గా, డిగ్రీ లెక్చరర్‌గా రిటైరయ్యే ముందు కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్లు రావడానికి కారణమైంది. తనతో పని చేసే సిబ్బంది, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, స్కూలు, కాలేజీ విద్యార్థులు తన పట్ల గొప్ప గౌరవంతో అభిమానించడానికి, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలకు అదే ఉపయోగపడింది.
రామచంద్రయ్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం సిగరెట్టుగానీ, మద్యం కానీ, పేకాట గానీ, పాన్ గానీ ఎన్నడూ ముట్టి ఎరగడు. ఎవరినీ గట్టిగా తిట్టి ఎరగడు. డ్రస్సు కోడ్ కూడా చాలా గంభీరంగా జీవితమంతా కొనసాగించాడు. సమాజంలో నడకకు, నడతకు, డ్రస్సుకు, మాటతీరుకు వున్న గౌరవం మరిదేనికి లేదు. పొదుపు, క్రమశిక్షణ, దయాగుణం, క్షమాగుణం మనిషిని ఉన్నతీకరిస్తాయి అని తాను ఆచరిస్తూ జీవితమంతా విద్యార్థులకు, సహచరులకు వివరిస్తుంటాడు. రామచంద్రయ్య చెప్పిన ఈ సింపుల్ సూత్రాలు ఎంత గొప్పవో కాలం గడిచిన కొద్దీ వాటి ప్రాధాన్యత తెలుసుకున్న సహచరులు, పూర్వ విద్యార్థులు ఎంత ఎదిగినా వినయంగా ఆయనను ఎంతగానో గౌరవిస్తుంటారు.
''నేను అడుగుపెట్టిన ఘడియ. ఇదంతా నా అదృష్టం.'' అంటుంది మాధవి.
''అవును. ఇంట్లో ప్రశాంతంగా వుంటేనే గదా నేను ఇన్ని పరీక్షలు పాసై ప్రమోషన్లు కొట్టింది. పిల్లలను నువ్వు చూసుకోబట్టి నేను నా టెస్ట్‌లన్నీ రాయడం వీలైంది. లేకపోతే నేను నాతోటి వాళ్లలాగా హెడ్మాస్టర్‌గానే రిటైరై వుండే వాన్ని.'' అంటూ మెచ్చుకుంటారు రామచంద్రయ్య.
ఏదో మాట్లాడదామని మాధవికేసి చూశాడు రామచంద్రయ్య. మాధవి చాలా గంభీరంగా ఏడ్వడం ఒక్కటే తరువాయి అన్నట్టుగా వుండడం చూసి చకితుడయ్యాడు రామచంద్రయ్య. ఇంతలోనే ఏమైంది... తాను ఏమీ అనలేదే! ఎవరినుండి ఫోను కూడా రాలేదే! అనుకుంటూ ''ఏంటీ! ఎట్లనో వున్నావు... ఏమైంది...?'' అంటూ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు రామచంద్రయ్య. మాధవిని అనునయించాడు. వెన్నుపై చెయ్యి వేసి ప్రేమగా అక్కున చేర్చుకున్నారు.
మాధవికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. ఆ ప్రేమపూరిత స్పర్శకు ఒక్కసారిగా వెక్కుతూ ఏడ్చేసింది.
''ఏమైంది మాధవి? ఇంతలోనే ఏమైంది?'' కంగారు పడిపోయారు రామచంద్రయ్య.
ఏడుస్తూనే అడిగింది మాధవి. ''మీరు ఏమనుకోరు గదా?''
''రిటైరైన తర్వాత ఇన్నేళ్లు సంసారం చేసినాక ఇంకా నీకు నా మీద డౌటేంటి? నువ్వు చెప్పింది కాదన్నదెప్పుడు?''
''హోం మేకర్ అంటే ఏమిటి?'' కొంగుతో కళ్ళొత్తుకుంటూ అడిగింది మాధవి.
''ఈమధ్య ప్రాచుర్యంలో వస్తున్న నూతన భావాల్లో భాగంగా హోంమేకర్ పదం వచ్చి చేరింది. ఇల్లాలు. ఇంటిని, పిల్లలను చక్కదిద్దుతుంది కనుక ఇల్లాలు, హౌస్‌వైఫ్ అనే పదాలకు బదులుగా ఫెమినిస్టులు హోంమేకర్ అని ప్రచారంలోకి తెచ్చారు.'' అన్నారు రామచంద్రయ్య.
''హోంమేకర్ అనేది ఒక పోస్ట్ పేరా?'' మళ్ళి అడిగింది మాధవి.
ఆ మాటతో నవ్వుతూ రామచంద్రయ్య ''నిజానికి నువ్వన్నట్టు హోం మేకర్ అంటే ఒక పోస్టు లాంటిదే. పెళ్లి చూపులు ఆ పోస్టుకు ఇంటర్వ్యూ అనుకోవచ్చు.'' అంటూ మాధవికేసి మెచ్చుకోలుగా చూశారు.
రామచంద్రయ్య తనదాకా రాకపోతే స్త్రీల పక్షమే. ఎంతైనా ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కదా! ప్రిన్సిపుల్‌గానే వుంటాడు. తనకు తెలిసింది మాధవికి చెప్తూ...
''మాధవీ! ప్రతి ఇల్లాలు రోజూ ఇంట్లోనే 16 కి.మీ.లు నడుస్తుందని ఫెమినిస్టులు లెక్క తీశారు. మహిళలు మాత్రమే పిల్లల్ని కనగలరు. పాలివ్వగలరు. పిల్లల్ని కనడానికి వెల కట్టలేము. పిల్లల్ని కనడానికి, పాలిచ్చి పెంచడానికి డే కేర్ సెంటర్‌లో వలె ఇంత... వంట చేయడానికి ఇంత... భర్తకు రకరకాల సేవలు, సుఖాలు అందించినందుకు ఇంత... బట్టలు ఉతికినందుకు ఇంత... ఇంటి పని చేస్తూ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుతూ కాపలా వున్నందుకు ఇంత... అని అన్ని రకాల సేవలకు మార్కెట్ ప్రకారం జీతం లెక్కగట్టారు. అది భర్త జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైపోయింది. మేం పిల్లల్ని కనం అని మహిళలు అనుకుంటే సమాజమే నశించిపోతుంది. అందుకని స్త్రీల శ్రమశక్తి అనుత్పాదక శ్రమశక్తి కాదని, అది ఉత్పత్తిలో భాగం పంచుకుంటూ సమాజాన్ని పునరుత్పత్తి చేస్తూ అనేక సేవలు అందిస్తుందని ఫెమినిస్టులు చాలాకాలం క్రితం లెక్కలు తీసి చెప్పారు. అందుకని ఇల్లాలు అని పిలవద్దని హోంమేకర్ అనాలని ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఏంటి విశేషం... ప్రత్యేకంగా అడుగుతున్నావు'' ఇంకా చెప్పాలనే ఉత్సాహంతో అడిగారు రామచంద్రయ్య.
మాధవి ఆ ఉత్సాహాన్ని గమనించలేదు. తలవంచుకుంటూ ''ఏం లేదు... చేసి చేసి రెక్కలన్నీ కూలబడ్డయి. ఇంకా మీ అందరికీ ఎంతకాలం చేయాలె?'' అని అడిగి రామచంద్రయ్య కళ్ళల్లోకి చూసింది. రామచంద్రయ్యకు ఆ చూపంటే చాలా ఇష్టం.
''నువ్వన్నది నిజమేనోయ్. పూర్వం తల్లిదండ్రులు ముసలోల్లయితే కొడుకులు, కోడండ్లు చూసుకుందురు. కుటుంబ బాధ్యతల నుంచి, వంట పని నుంచి విముక్తం అవుదురు. అలా ఇంట్లో మనవలు, మనవరాళ్లను ఆడించుకుంటూ పెద్దమనిషి తరహాలో హాయిగా గడుపుదురు. వానప్రస్థాశ్రమంలా బతికేటోళ్లు. ఇప్పుడు ఎదిగిన కొడుకులు, బిడ్డలు దూరమవుతున్నారు. తమ గురించే చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల గురించి, అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల్ల గురించి ఆలోచించడమే లేదు. అందువల్ల రిటైర్మెంట్ వయస్సు వచ్చినా నీలాంటి వాళ్లకు రిటైర్మెంట్ లేకుండా పోయింది. ఇద్దరమే కదా వుంటున్నది. నేను కొద్దిగా వంట పనిలో సాయం చేస్తానోయ్. పని మనిషి ఎలాగూ వుందికదా!'' అంటూ ఊరడించాడు రామచంద్రయ్య.
''మా అన్నయ్య తీసుకున్నట్టు నాకు హోంమేకర్ పోస్టు నుంచి వీఆర్‌ఎస్ ఇప్పించండి.''
రామచంద్రయ్యకు ఆ మాటతో ఏమనాలో తోచలేదు. రిటైర్ అయిన్నుంచి మాధవి ఏదోలా మాట్లాడుతోంది. ఉద్యోగంలో వున్నంత సేపూ ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటే ఇళ్లు కళకళలాడేది. మాధవికి చక్కగా కాలక్షేపం అయ్యేది. ఈ మధ్య మాధవికి ఏమీ తోస్తున్నట్టు లేదు.
''నీకు హోంమేకర్‌గా వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే నాకెవరు చేస్తారోయ్. ఈ వృద్దాప్యంలో నీవు తప్ప జీవితంలో నాకు తోడు ఎవరుంటారు?''
మాధవి భర్తకేసి ఒకసారి చూసి నేలకు మొఖం దించుకొంది.
''మీకు అన్నీ చేసిపెట్టే దాన్ని ఎవరినన్నా వెతుక్కోండ్రి. నేను కొడుకులు, బిడ్డల దగ్గర వుంటూ రామ, కృష్ణ, సాయిరాం అనుకుంటూ గడిపేస్తా.'' అంది మాధవి.
''ఏం మాటలు మాధవీ... నువ్వు అనాల్సిన మాటేనా? ఎక్కడ వున్నా మనం ఇద్దరం కలిసే వుందాం. అసలు ఏం అయింది? ఇవాళ గుడికిపోయి రాగానే అంతా ఏదో కొత్తగా మాట్లాడుతున్నావ్! అసలు విషయం చెప్పు. ఎవరు ఏమన్నారు? నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? చెప్పు...''
''అవును... మీరు ప్రభుత్వానికి ముప్పైఅయిదేళ్లు సేవ చేస్తే మీకు పెన్షన్ ఇస్తున్నది. కృతజ్ఞతగా గ్రాట్యూటీ ఇస్తున్నది. జమ చేసుకున్న జీపీఎఫ్‌కు వడ్డీ కట్టి ఇస్తున్నది. మరి... నేను ముప్పైనాలుగేళ్లుగా హోంమేకర్‌గా మీకు, మీ పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు సేవ చేస్తున్నాను. అందుకు నాకు ఏమిచ్చారు... ఏమిస్తున్నారు? నాకు రిటైర్మెంట్ లేదా?... మీరు నాకు గ్రాట్యూటీ, పెన్షన్, జీపీఎఫ్ ఏదీ ఇవ్వరా?...అంతా మీకేనా?'' మాట పూర్తికాక ముందే మాధవి గొంతు పూడుకుపోయింది.
ఈ మధ్య రిటైరయ్యాక టైంపాస్ కాక మాధవి యువతరం ఆడపిల్లల మీటింగ్‌లకు పోయి ఇవన్నీ నేర్చుకున్నదా ఏంది అని రామచంద్రయ్యకు అడగాలని నోటిదాకా వచ్చి ఆగిపోయారు.
''ఏమైందిప్పుడు? నామినీగా నీ పేరే రాసిన గదా! నా తర్వాత సగం పెన్షన్ నీకే వస్తుంది. పిల్లల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకు బాధపడుతున్నావు?'' ఊరడిస్తున్నట్లుగా అన్నారు రామచంద్రయ్య. ఆ మాటతో మాధవి రామచంద్రయ్యకేసి చురచుర చూసింది.
''పొద్దున్నే అపశకునం మాటలు మాట్లాడకండి. నేనే ముందు పోతా... నేను మీరు పోవాలని కోరుకుంటానా? పుణ్యస్త్రీగా చనిపోవాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది'' అంటూ వెక్కివెక్కి ఏడుస్తోంది మాధవి.
రామచంద్రయ్య ఆమె ఎందుకు ఏడుస్తోందో... ఏమి అడగదల్చుకుందో... ఆమె బాధ ఏమిటో... అర్థం కాక ఎలా ఊరడించాలో తోచక ''ఇప్పుడు ఏమైందని... ఈ ఇల్లు నీ పేరు మీదే వుంది. ఇదంతా నీది కాకపోతే ఎవరిది? నువ్వు లేకపోతే ఈ సంసారం ఎక్కడిది? ఈ సంపద ఎక్కడిది? ఈ ఇంట్లో ఈ ప్రశాంతత ఎక్కడిది? పిల్లలంతా నీ పక్షమే! పిల్లలు చక్కగా చదువుకొని, ఉద్యోగాలు చేసుకొని ఎక్కడివాళ్లక్కడ చక్కగా సంసారం చేసుకుంటున్నారంటే అదంతా నీ చలవే గదా! నా జీవితంలో నీవు సగానికన్నా ఎక్కువ... నా జీవితంలోని విజయాలకు, సౌఖ్యాలకు మూడు పాళ్లు నువ్వే... '' ఇంకా చెప్పేవారే. గోదావరి ప్రవాహంలా సాగే నలభై నిమిషాల పిరియడ్‌లా చెప్పడం రామచంద్రయ్యకు అలవాటయిన ధోరణి మాధవికి తెలుసు. మధ్యలో అడ్డుకుంది మాధవి.
''... అయితే రిటైరైన తర్వాత వచ్చిన డబ్బుల్ని నా పేరుమీద ఎందుకు డిపాజిట్ చేయలేదు? పెన్షన్ అమ్మితే వచ్చే పైసల్లో సగమైనా నా పేరు మీద డిపాజిట్ చేస్తారా? ప్రభుత్వం మీకు పెన్షన్ ఇస్తున్నది. మీకు నేను బతుంతా సేవ చేస్తూనే వున్నా... నాకు మీరు పెన్షన్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు?'' వెక్కుతూనే అడిగింది మాధవి.
ఆ కోరిక రామచంద్రయ్యకి విచిత్రంగా ధ్వనించింది. ఎందుకు అలా కోరుతుందో తొలుత అర్థం కాలేదు.
''ఎవరి పేరు మీద వుంటే ఏంటి?ఈ ఇల్లు నీ పేరు మీదే వుంది కదా?'' అంటూ అనునయించారు రామచంద్రయ్య.
మాధవిలో గూడుకట్టుకున్న నిరాశా, నిస్పృహలు, కోరికలు, ఆవేదనలు ఒక్కొటొక్కటిగా ఏడుస్తూనే బయటపెట్టింది.
''ఇల్లు నేనేమి చేసుకుంటాను? అమ్ముకుతింటానా? అమ్ముకుంటే ఎవరు వూరుకుంటారు? పైసలు మాత్రం నా పేరు మీద వుండవు. అన్నీ మీ పేరు మీదే వుండాలి. పెళ్లయ్యాక నా ఇంటి పేరు మారిపోయింది. మీ ఇంటిపేరే నా ఇంటి పేరయింది. నేను మాధవి అని నాకు సొంత వ్యక్తిత్వం వుంటుందని మర్చిపోయారు. అందరూ మీ మేడమ్‌గానే చూశారు. పిల్లలు కూడా మీ పిల్లలే. నాకంటూ ఏం మిగిలింది? నేను చేసిన సేవలకు నాకు దక్కిన పేరేమిటి? మీకు గొప్ప పేరు. అన్నీ మీకే కావాలి. ఎవరి పేరు మీద వుంటే ఏంటి అంటున్నారు? నా పేరు మీద డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? నాకు ఎంత సంతోషంగా వుండేది? మనవలకు, మనవరాళ్లకు ఏది పెట్టుకోవాలనుకున్నా, ఎవరింటికి పేరంటానికి పోయినా నా అంతట నేను పోవచ్చు...''
ఇన్నేళ్లు సంసారం చేసినా తన భార్య హృదయం అర్థం చేసుకోలేకపోయినందుకు కించిత్తు విస్మయానికి లోనయ్యాడు రామచంద్రయ్య. ఆడవాళ్లు ఇలా కూడా ఆలోచిస్తారా అని తొలిసారిగా ఫీలయ్యాడు. భార్యాభర్తలంతా ఒక్కటే సంసారం అనుకున్నాడు. కానీ భార్య స్వతంత్రంగా ఆలోచిస్తుందని ఆమెకు కొంత ఆర్థిక స్వేచ్ఛ, తన చేతిలో కొంత స్త్రీ ధనం వుండాలని కోరుకుంటారని భర్తను, పిల్లలను కాకుండా తనకంటూ ప్రత్యేకంగా ఆలోచించుకుంటారని రామచంద్రయ్య ఇంతకాలం ఊహించలేకపోయాడు.
''సరే... ఏడ్వకు... నాక్కూడా నీ బాధ చూస్తే ఏడుపొస్తోంది... నిజంగానే ఆడదాని జీవితం ఎంత పరాధీనం!...పెన్షన్ అమ్మినప్పుడు ఒక ఎనిమిది లక్షలు నీ పేరుమీదనే డిపాజిట్ చేద్దాం. నాకెలాగూ పెన్షన్ వస్తుంది గదా! నీకు ఆరేడు వేలు నెలనెలా వడ్డీ రూపంలో పెన్షన్ వస్తుంది సరేనా! ఏడ్వకు'' అంటూ ఊరడించాడు రామచంద్రయ్య.
అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసు, హైదరాబాద్ నుండి పెన్షన్ శాంక్షన్ అయిన కాగితాలు చేతికి వచ్చాయి. బ్యాంకు మేనేజర్ మాధవి పేరిట పాన్‌కార్డ్ తీసుకుంటే ఇన్‌కంటాక్స్ తగ్గించుకోవచ్చు అని సూచించాడు. ముందు అనుకున్నట్టుగా పెన్షన్ అమ్మిన డబ్బుల్లో మిత్రుల సూచనతో విడివిడిగా రెండు లక్షల చొప్పున ఎనిమిది లక్షలు మాధవి పేరిటే డిపాజిట్ చేశారు రామచంద్రయ్య.
నెలనెలా అయిదువేలకు పైగా డిపాజిట్ మీద వడ్డీ తన ఖాతాలో జమవుతుంటే మాధవికి ఎంత ఆనందమో! ప్రతి నెల మొదటి వారంలో పాస్‌బుక్ తీసుకొని బ్యాంకుకు వెళ్లి ఎంత జమయిందో పాస్‌బుక్‌లో ఎంటర్‌చేయించుకొని కళ్లనిండారా చూసుకుంటుంది. అందులోంచి డబ్బులు తియ్యదు. నెలనెలా పెరుగుతున్న బ్యాలెన్స్‌లాగే మాధవి ఆరోగ్యం కూడా పెరుగుతోంది. అన్నిటికీ మళ్లీ రామచంద్రయ్యనే డబ్బులు అడుగుతుంది మాధవి. ఆ వడ్డీ వాడుకోవచ్చు కదా అని గుర్తు చేస్తుంటాడు రామచంద్రయ్య.
''అవి బాగా అవసరం పడ్డప్పుడు ఉపయోగపడతాయండీ... మనవరాలికి చీరకట్టించినప్పుడో... మనవరాలు, మనవడు మెడిసిన్ సీటు సంపాదించుకుంటే... ఫీజులు కట్టాల్సినప్పుడో పనికొస్తాయండి'' అని ఏదో ఒక కారణం చెపుతూ వుంటుంది మాధవి.
చూస్తుండగానే వడ్డీ లక్ష దాటి పోయింది. అలా మరో లక్షను తన పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంది మాధవి. త్వరలో పది లక్షలవుతాయని సంతోష పడుతోంది మాధవి. తన జీవితంలో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు. అది తన సొంత ఆస్తి. తన సొంత పెన్షన్ అంటూ ఎంత సంతోషమో...
కొడుకులు, కూతురు రామచంద్రయ్య రిటైరైన నుండి ఏదో ఒక అర్జెంట్ కారణాలు చూపిస్తూ రిటైరయ్యాక వచ్చిన డబ్బులు కావాలని, మళ్లీ ఇస్తామని అడుగుతూనే వున్నారు. మాధవి రకరకాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చింది.
ఒకసారి పెద్దకొడుకు మనోజ్, కోడలును, మనవలను తీసుకొని వచ్చి తల్లితో లొల్లికి దిగాడు. కచ్చితంగా డబ్బు ఇవ్వాల్సిందే అని నిలదీశాడు. ప్లాటు, అపార్టుమెంటు, పిల్లల ఫీజులు, వగైరా కారణాలు ఎన్నో చెప్పాడు.
వాళ్ళు ఎలాగైనా డబ్బులు గుంజాలని చూస్తున్నారని గమనించింది మాధవి.
ఇక తప్పదని కొడుకును దులిపేసింది తల్లి మాధవి.
''మీరు సంపాదించిందంతా ఏం చేస్తున్నారు? మంది సొమ్ముకు ఆశ పడడానికి బుద్ధి లేదా? మేం చచ్చిం తర్వాత మీకు కాకపోతే ఎవరికి? ప్రాణం ఉండంగనే బొంద పెడతారా?''
అమ్మ అలా మాట్లాడుతుందని మనోజ్ ఊహించలేకపోయాడు. అనుకోని దెబ్బకు ఎదురు తిరిగాడు.
''అమ్మా! లావ్ మాట్లాడుతున్నవ్? ఏ పాటి సంపాదించిన్రు? సిటీలో కనీసం ఒక అపార్ట్‌మెంటైనా కొనలేదు. కనీసం ప్లాట్‌లు కొనైనా పడేయలేదు. ఇప్పుడు అడ్డగోలు ధరలైపోయినై. మీరు కొనిపెడితే మాకెంత సౌకర్యంగా వుండేది? ఇప్పుడు ఇమ్మన్నా కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. మీతోటి వాళ్లు ఎంతో సంపాదించిన్రు. మీరు మాకు ఏం మిగిల్చిన్రు?'' అంటూ విరుచుకు పడ్డాడు మనోజ్.
మాధవి చర్రున కోపంతో అరిచింది.
''అరేయ్! మిమ్మల్ని చదివించుడే తప్పయిపోయింది. లేకపోతే ఎంతో సంపాదిస్తుంటిమి. మాకు సంపాదించుడు చేతకాలేదు. మీరెందుకు సంపాదించుకుంట లేరు? చేతకాని దద్దమ్మల్లా మా పైసలు కావాలంటున్నారేంది?''
''మీకు నెలనెలా జీతం రాంగ కూడా అంత కష్టమైతందారా? నిజానికి మీ జీతాలకెల్లి మూడవ వంతు జీతం కోడలుకు ఇవ్వాలె.
కోడలా! మీరు అట్లా వసూలు చేసుకొని నెలనెలా మీ ఖాతాలో వేసుకొని పొదుపు చేయిండ్రి. ఇప్పుడు మామయ్య నాకు పెన్షన్ కట్టిస్తున్నాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ మీది వడ్డీ కూడా నేనే తీసుకుంటున్నాను. మీరు ముందు ఈ పని చేసి సాధించుకోండ్రి.'' అంటూ కొడుకును, కోడల్ని హెచ్చరించింది తల్లి మాధవి.
కోడలుకు అత్త చెప్పిన మాట బాగా నచ్చింది. భర్తతో వాదనకు దిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అమ్మ తమ మధ్య చిచ్చు పెట్టేట్టు వుందని అరిచి, అరిచి వెళ్లిపోయాడు కోడలితో సహా.
చిన్న కొడుకు, కోడలు రహస్యంగా వచ్చి ఇలాగే తిట్లు పడి వెళ్ళిపోయారు. చిన్న కోడలు కూడా అత్త ప్రతిపాదన బాగుందని తనకు నెలనెలా ఇవ్వాల్సిందేనని భర్తతో పోట్లాటకు దిగింది.
మాధవి భర్తకేసి తిరిగి ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదని వాపసు పంపించేసింది. వాళ్లు వెళ్లిపోయాక ''ఉంటే ఎక్కువ ఖర్చు పెడతారు. లేకపోతే వున్నంతలో సర్దుకుంటారు. ఈ పైసలు మాత్రం వాళ్లకు కాకపోతే ఎవరికండి?'' అంటూ రామచంద్రయ్య కన్నా గట్టిగా పిల్లలకు వీలుకాదని నిర్మొహమాటంగా చెప్పేసింది మాధవి. కొడుకులకు, కోడళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఆనాటినుంచి వాళ్లు ఇంటికి రావడం తగ్గించారు. ఫోన్లు కూడా బాగా తగ్గించారు. మనవలు మనవరాళ్లు వత్తిడి చేయడంతో అప్పుడప్పుడు వచ్చి ఒకపూట వుండి ఉదయాన్నే వెళ్లిపోతుంటారు. కొత్త జీవితంలో పెళ్లయిన కొత్తలో సంతానం కాకముందు ఎలా బతికారో అలా ఇద్దరే ఒకరికొకరు తోడుగా బతుకుతున్నారు.
ఒకరోజు రామచంద్రయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ తమ పెన్షనర్ ఫ్రెండ్స్, వారి విశేషాలు చెపుతూ ఈమధ్య మీటింగుల్లో ఎన్నో విశేషాలు, పత్రికల్లో చదివిన విశేషాలు కొత్తగా వివరిస్తూ మాధవి ఆలోచనలను సమర్థించారు రామచంద్రయ్య.
''మాధవీ! నిజంగానే నువ్వు ఆ రోజు అడిగింది చాలా కరెక్ట్. నువ్వు అడిగే దాకా నాక్కూడా తోచలేదు. అసలు గవర్నమెంట్ భర్త చనిపోయాక భార్యకు సగం పెన్షన్ ఇచ్చే బదులు ఫస్ట్ పెన్షనర్, సెకండ్ పెన్షనర్ అంటూ బతికున్నప్పుడే భార్యభర్తలకు చెరిసగం పెన్షన్ ఎవరిది వారికి శాంక్షన్ చేసి ఎవరి ఖాతాలో వారికి జమ అయ్యే విధంగా రూల్స్ పెట్టి జీవోలు ఇష్యూ చేస్తే ఎంతో బాగుంటుంది. రిటైరయ్యేటప్పుడు వచ్చే పైసలు కూడా భార్యాభర్తలకు చెరిసగం పై నుండే శాంక్షన్ చేస్తే జీవితంలో పొదుపు, క్రమశిక్షణ పెరుగుతుంది. హోంమేకర్‌లకు సరైన న్యాయం జరుగుతుందోయ్. ఆర్థిక స్వాతంత్య్రం కాస్త పెరుగుతుంది. మీ మహిళా మండలి ఇందుకు పూనుకోవాలె. కోడండ్లకు నీ మాట బాగా నచ్చింది. కొడుకులకు నీ మీద పీకల్లోతు కోపం వచ్చింది. మంచి పని చేశావ్'' అంటూ అభినందించాడు రామచంద్రయ్య.
''అంతే కాదండీ! అసలు జీతం ఇచ్చే పద్ధతే మార్చాలి. భర్త జీతంలో కనీసం నాలుగో వంతు నెలనెలా భార్యకు డైరెక్ట్‌గా ఖాతాలో వేసే పద్ధతి పెట్టడం చాలా అవసరం. సిగరెట్లు, తాగుడు, పేకాట, నైట్ పార్టీలు మొదలైనవన్నీ తగ్గిపోతాయి. భార్యలు చక్కగా పొదుపు చేస్తారు. పిల్లల్ని చక్కగా చదివిస్తారు. అప్పుడే హోంమేకర్ అనే పోస్టుకు విలువ వుంటుంది. గౌరవం వుంటుంది. ఏమంటారు?'' అంటూ నవ్వింది మాధవి.
''నువ్వన్న దాంట్లో పాయింటుందోయ్! జీవితమంత కాచివడపోసిన జీవన సత్యమే నీ నోటి నుంచి వచ్చింది. అయితే ఇప్పటికే చాలామంది పెళ్ళాలు నరకం చూపిస్తున్నారు. అది కూడా గమనించాలి. పావు జీతమో, సగం జీతమో భార్య పేరిటే డైరెక్ట్‌గా ఇచ్చేస్తే ఈ కుటుంబాలన్నీ ఏం కావాలె? ఎక్కడికక్కడ మీ బతుకు మీది. నా బతుకు నాది అని ప్రతి కొట్లాటకు అలిగి వెళ్లిపోరా? మన విషయం వేరు అనుకో... అందరు మన తీరుగా వుండరు కదా!''
''వుండనీ, వుండకపోనీ! మీ జీతాలు ఎలా ఖర్చు పెడుతున్నారో, గవర్నమెంట్ ఏమైనా ప్రతినెల రిపోర్టు ఏమైన అడుగుతున్నదా? మీ ఇష్టారాజ్యం నడుస్తున్నది. భర్తలు బాగుంటే భార్యలు కూడా బాగుంటారు. అయినా పూర్వం భూములకు సీలింగ్ పెట్టినప్పుడు సీలింగ్‌లో పోవద్దని కోర్టులో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్టు చూపించి భార్య పేరు మీద కొంత, భర్త పేరు మీద కొంత రాయించుకొని కాపాడుకోలేదా? అట్లనే భార్యాభర్తలు విడాకులు తీసుకొన్నట్టు, నెలనెల మనోవర్తి ఇస్తున్నట్టు శాంక్షన్ చేయించుకోరాదా? మళ్లా కలిసి సంసారం చేయరాదా?'' అంటూ వాదించింది మాధవి.
''ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావ్? ఆడోళ్లకు జీతాలు ఇవ్వడానికి విడాకులు తీసుకొని కాపురం చెయ్యమంటావా? అలా ఆడోళ్లకు జీతాలు ఇచ్చినాక భర్తతో కలిసి వుండాలని ఎందుకనుకుంటారు? కుటుంబాలన్నీ సర్వనాశనం అవుతాయి.'' అంటూ రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. మాధవికి ఎక్కిస్తున్న ఫెమినిస్టులు ఎవరోగానీ వారిని ఎవరో పీక పట్టుకుంటారని ఆవేశంగా హెచ్చరించాడు.
మాధవి అంతకు ఎక్కువగా రెచ్చిపోయింది. ''విడాకులు తీసుకున్నట్టు రాసుకుని మనోవర్తిలాగా ఆడోళ్లకు జీతాలు ఇస్తే కుటుంబాలు విచ్ఛిన్న మవుతాయా? నాడు భూముల సీలింగ్ కోసం విడాకులు తీసుకున్నోళ్లు కలిసి వుండలేదా? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయా? జీతం అంతా మీ దగ్గర పెట్టుకొని ఆడోళ్లను, పిలగాండ్లను మీ ఇష్టం వున్నట్లు ఆడిస్తారా? మీకు బానిసలుగా బతకాల్నా? ప్రభుత్వం కూడా మీ గురించి ఇట్లనే ఆలోచిస్తే అప్పుడు మీరు ఎక్కడ వుంటారు?''
మాధవి ఆవేశం చూసి ఆలోనలో పడ్డారు రామచంద్రయ్య. కాసేపాగి అన్నారు...
''ఏమో మాధవి... నువ్వన్నదాంట్లో పాయింటుంది గానీ ప్రభుత్వంగానీ, భర్తలుగానీ, ఉద్యోగులు గానీ దీన్ని ఆమోదించడం అసంభవం.''
''ఆడవాళ్లు సమ్మెలు చేస్తే ఎందుకు సంభవం కాదు?'' అంటూ నిలదీసింది మాధవి.
''నీతో నెగ్గడం అసంభవమోయ్! ఎంతైనా రిటైరయ్యాక పెళ్లాలకు భర్తలు బాగా అలుసైపోతారోయ్'' అంటూ నవ్వాడు రామచంద్రయ్య.
ఏడాదిన్నర తర్వాత దసరా సెలవులకు కొడుకులు, కోడండ్లు, బిడ్డ, అల్లుడు, మనవలు, మనవరాండ్లు ఒక్కసారిగా ఊడిపడ్డారు. రాకపోకలు బందయితే తమకే నష్టమని అర్థమైందో ఏమో... మరెందుకో...
రెండు రోజులు ఇళ్లంతా సందడి... ఇళ్లంతా జాతరలాగా... లొల్లి... లొల్లి... రామచంద్రయ్య, మాధవిల సంతోషానికి అంతేలేదు...
''రోజూ మన పిల్లలు, మనం ఇలా కలిసి వుంటే ఎంత బాగుంటుందండి...!'' అంటూ గాలిలో తేలిపోతూ అంది మాధవి.
''ఇలా నాలుగు రోజులు వుంటే చాలు పది కొట్లాటలు అవుతాయి. మొఖం చూసుకోకుండా అవుతారు. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటేనే ఆనందం'' అన్నారు రామచంద్రయ్య.
''పూర్వం పల్లెల్లో అందరూ ఇలాగే మూడు, నాలుగు తరాలు ఒకే ఇంట్లో, ఒకే వంటతో ఉమ్మడి కుటుంబంగా బతక లేదా?'' అంది మాధవి.
''అప్పుడు వేరోయ్... అందరూ వ్యవసాయమో, కులవృత్తో ఒకే కాడ వుండి పని చేసుకొని బతికే వారు. ఇప్పుడు ఉద్యోగాలు వేరైపోయినై... ఎక్కడెక్కడో పని చేస్తున్నారు... ఈ కాస్త కలుసుకోవడం కూడా సాధ్యం కావడం లేదోయ్''
కూరగాయలు, పళ్లు మనవలు, మనవరాళ్లకు ఏమైనా తీసుకొద్దామని సాయంత్రం షాపింగ్‌కు బయల్దేరారు రామచంద్రయ్య, మాధవి. అదే సమయం కోసం కాచుకున్నట్టుగా వాళ్లు వచ్చిన ఎజెండా విప్పారు. నాన్న ఆస్తులు, డబ్బులు ఎక్కడెక్కడ, ఎంతెంత వున్నాయో... తామిద్దరం ఎలా పంచుకోవాలో చర్చించుకుంటున్నారు. అన్నా, చెల్లెళ్లు మాట్లాడు కుంటున్నారని కోడళ్లు, అల్లుళ్లు వేరే పనిమీద పడ్డారు. చర్చ మధ్యలో చెల్లెలు మానస నవ్వుతూనే అన్నయ్యలకు చురక అంటించింది.
''అన్నీ మీ ఇద్దరికేనా? అమ్మ ఆస్తి ఎప్పుడూ బిడ్దలకే చెందుతుంది. అమ్మ పేరు మీద వున్న డిపాజిట్, దాని మీద వడ్డీ కూడా నాకే చెందుతుంది. అమ్మ తన మనవరాలికే పెట్టుకుంటుంది.'' అంది మానస. ఆ మాటతో అన్నలు గంభీరమైపోయారు.
చెల్లెలి స్వార్థాన్ని విమర్శిస్తూ అసహనంగా నాలుగు మాటలు జారవిడిచారు.
మానసకి చాలా బాధ కలిగింది. కోపం వచ్చింది.
''ఎవరిది స్వార్థం... మీదా... నాదా?'' అంటూ గెయ్యన లేచి తరువాత ఏడుపు అందుకుంది. అయినా తన వాదన చేస్తూనే వుంది.
''ఆ మాటకొస్తే ఈ ఇల్లు కూడా అమ్మ పేరిటే వుంది. నాక్కూడా మీతో సమానంగా వాటా వస్తుంది. కొడుకులతో సమానంగా బిడ్డలకు కూడా ఆస్తిలో సమాన వాటా వస్తుందని ఎన్టీ రామారావు ఎప్పుడో చట్టం చేశాడు. రిటైరైన తర్వాత వచ్చే డబ్బులో కూడా నాకు సమాన వాటా వుంటుంది. ఏదో పోనీ అని అడగకపోవడం వల్ల నేను అలుసైపోయిన. అమ్మా, నాన్నలను మీరు సాదుతలేరు... నేను సాదుతలేను.. మంచాల పడ్డప్పుడు మీతో సమానంగా నేను కూడా సాదుతాను. నాక్కూడా సమానంగా పాలు పెట్టుండ్రి.'' అంటూ ఘాటుగా జవాబిచ్చి అంతలోనే ఏడుపు అందుకుంది మానస.
ఆ మాటతో అంతదాకా వున్న వాతావరణం ఒక్కసారిగా యుద్ధ వాతావరణంగా మారిపోయింది. కోడళ్లు, అల్లుడు కూడా చర్చలోకి దిగారు. మనవలు, మనవరాళ్లు ఆసక్తిగా వింటున్నారు. అరుపులు కేకలు గంటల తరబడి కొనసాగుతూనే వున్నాయి.
రామచంద్రయ్య, మాధవి ఆటోదిగి సామానుతో సహా ఇంటికి చేరే సరికి గేటు బయటికే గందరగోళం వినిపిస్తోంది. ఏమైందా అని ఆశ్చర్యపోయారు. ఇంట్లోకి వచ్చాక వాతావరణం చూసి తెగ బాధ పడిపోయారు. వాళ్లు వచ్చింది తమను చూడాలని కాదని, కేవలం ఆస్తి పంపకాల కోసమే కట్టకట్టుకొని వచ్చారని తెలిసి అవాక్కయ్యారు.
కూతురు మానస ఏడుస్తూనే అమ్మా, నాన్నలను మీరే చెప్పండని నిలదీస్తోంది.
తండ్రి రామచంద్రయ్యకు తల్లి మాధవికి కూతురు మానస ఆలోచనల్లో ఏదో సరైందే వుందనిపించింది. మానసకు తోచిన విషయం తమకు ఎందుకు తోయలేదో ఆశ్చర్య పోయారు.
''ఈ కాలంలో కోడండ్లు ఎవరు అత్తమామలకు సేవలు చేస్తున్నారు. చేస్తే బిడ్డలే చేయాలి. మానస అన్న దాంట్లో తప్పేముంది?'' అంటూ జోక్యం చేసుకుంది మాధవి. కొడుకులు ఒక్కసారిగా తల్లిదండ్రుల మీదికి తిరగబడ్డారు.
రామచంద్రయ్య నోరు విప్పక తప్పలేదు.
''మానస అన్నదాంట్లో తప్పేముందిరా! మాకు మీరు ముగ్గురు సమానమే. మానసని కూడా నేను ఆడపిల్లలా చూడలేదు. మీతో సమానంగానే దాన్ని పెంచినం.'' అంటూ మానసకి తన ఓటు వేశాడు రామచంద్రయ్య.
మాధవి కొడుకులు, కోడండ్లను గట్టిగా హెచ్చరించింది. ''అరెయ్! మీ తీరుగా మేము సుఖపడాలనుకోలేదు. మేము కడుపు కట్టుకొని కష్టపడి మిమ్మల్నందర్నీ సాదినం. అమెరికాలో 18 ఏండ్ల దాకానే తల్లిదండ్రులు సాదుతరు. ఆ తర్వాత ఎవళ్ల బతుకు వాళ్లదే. ఎవరి సంపాదన వాళ్లదే. మీరు జీవితమంతా మా మీదనే ఇరగబడుతున్నరేందిరా! మంది సంపాదన మీద గింత ఆశ ఎందుకురా! చాతనైతే మీరు సంపాదించుకోన్రి. మా మీద ఆధారపడుడేంది? మా ఆస్తి ఇమ్మనుడేంది? మీకు నిజంగానే కుటుంబాల మీద పట్టింపు ఉంటే నాన్న లాగా జీవితంలో పొదుపు, క్రమశిక్షణ అలవర్చుకోవాలి. మీ జీతంలో మూడవ వంతు జీతం కోడండ్ల పేరిట పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ చేయిన్రి. భవిష్యత్తులో పిల్లల కాలేజీ ఫీజులకు, పెళ్లిల్లకు అవి అక్కరకు వస్తాయి. నాన్న నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీలాగే ఎక్కడి జీతం చాల్తలేదు అని అనుకుంటే మిమ్మల్నందర్నీ చదివించి ఈ స్థాయికి తీసుకురావడం సాధ్యమయ్యేదా? పనికి మాలిన వృధా ఖర్చులు ఎందుకు? పదిచీరలు, ఐదు డ్రెస్సులు చాలవా? ఉన్న సైకిల్ మోటర్ చాలదా? కారే కావాల్నా? ఆశకు, సుఖాలకు అంతు ఎక్కడిదిరా?'' అంటూ మాధవి కొడుకులు, కోడండ్లను దులిపేసింది.
కొడుకులు, కోడండ్లు తల్లి ముందు తలెత్తుకోలేకపోయారు. ఒక పద్ధతిలో బతికిన జీవితం తమదని వారికి తెలుసు. కానీ ఇప్పుడు తాము అలా బతకలేకపోతున్నామని కూడా తెలుసు. అయినా ఆ మాట అంగీకరించడానికి సిద్ధంగా లేరు.
దాంతో అదే రోజు రాత్రి పిల్లలను తీసుకొని కొడుకులు, కోడండ్లు సూట్‌కేసులు సర్దుకొని ఎంత వుండమన్నా లీవ్‌లు లేవు అంటూ వెళ్లిపోయారు. అందరి కోసం అని కొనుక్కుచ్చిన పళ్లు, కూరగాయలు, కోడండ్లకు చీరలు, పిల్లలకు బట్టలు, ప్రెజెంటేషన్స్ అన్నీ ఇంట్లోనే వదిలేసి పోయారు. మానస వాళ్ల ఆయన ఇంకో రెండు రోజులు వుందాం అంటూ వారిని బతిమాలుతూ వారి వెనకే పిల్లల్ని తీసుకొని బయల్దేరాడు. మాధవి మనసు ఉసూరు మంది. మాధవి, మానస ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేశారు. రామచంద్రయ్య కాసేపు బయట తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరాడు. అప్పటికీ తల్లీకూతుళ్లు ఏడుస్తూనే వున్నారు.
''ఎందుకు ఏడుస్తున్నారు? రేపు ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడే జరిగింది. మంచిదైంది. వాళ్లు ఇష్టముంటే వస్తారు... లేకపోతే లేదు... మనం ఎవరిమీద ఆధారపడి బతుకుతలేము. ప్రభుత్వం ప్రజలకు సేవ చేసినందుకు మనకు ఇంత పెన్షన్ ఆధారం కల్పించింది. ఈ పెన్షన్ లేకపోయి వుంటే మన బతుకులు ఏమై వుండేవో... మన కొడుకులు ఎంత నరకం చూపే వాళ్లో... ఇప్పుడే తెలుస్తోంది. నిజానికి మనం దేవుడి కన్నా ముందు ప్రభుత్వానికి... ప్రజలకు నిత్యం పొద్దున్నే లేవగానే దండం పెట్టాలి.'' అంటూ తల్లీబిడ్డలను ఊరడించారు రామచంద్రయ్య.
''నా వల్లనే ఈ కొట్లాట అంతా! అమ్మా... నాకేదీ వద్దే'' అంటూ ఏడ్చేసింది మానస.
''నీదేం తప్పు లేదే... నువ్వు సరిగ్గానే అడిగినవ్... వాళ్లు మళ్లా వచ్చి ఇట్లనే లొల్లి పెడితే చూడు... ఇళ్లు, ఆస్తి అంతా నా పేరు మీదనే వుంది.... మొత్తం ఆస్తంతా నేను నీకే రాసిస్తనే! మేము మంచాన పడ్డప్పుడు నువ్వే చూసుకోవాలె... ఏడ్వకే... అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా... ఎవల బతుకు వాళ్లు బతుకుతరు. ఊరుకోవే..''. అంటూ ఊరడించింది మాధవి.
స్వయంగా మాట్లాడే సొంత గొంతు హోంమేకర్ మాధవి మాటల్లో ధ్వనించింది. రామచంద్రయ్య, మాధవి ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రశంసాత్మకంగా నవ్వాడు. దాంతో మాధవి మరింత ఉత్సాహంగా తన మనసులోని భావాలు బయటపెట్టింది.
''అసలు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు, సంపద కేవలం కూతుళ్లకే చెందాలని, కొడుకులకు చెందవు అని చట్టాలు చెయ్యాలె. వందల సంవత్సరాల నుంచి కొడుకులకే అన్ని హక్కులా...! కనీసం ఇప్పట్నుంచి యాభయ్యేళ్ల పాటైనా బిడ్డలకు మాత్రమే ఈ హక్కులుండాలి.''
''అప్పుడు బిడ్డల్నే కనాలని స్కానింగ్‌లు చేయిస్తారోయ్'' అంటూ నవ్వాడు రిటైర్డ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రామచంద్రయ్య.
- స్వాతి మాసపత్రిక మార్చి, 2012