Friday, October 7, 2016
మలి యవ్వనం
జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మర్చిపోలేం... ఎన్నటికీ మర్చిపోలేని విషయాలు విశ్వనాథం జీవితంలో ఎన్నో... రిటైరయ్యాక అప్పుడప్పుడు అవన్నీ తీరికగా గుర్తుకొస్తుంటాయి. విశ్వనాథం రిటైరయ్యాక పావని అడిగిన మాటలు, ఏడ్చిన విషయం... తన బాల్యం... తన పెళ్ళి... తన కాలేజీ జీవితం... ఉద్యోగ జీవితం... తొలి సంతానం కలిగిన నాటి ఆనందం... ఆత్మీయ స్నేహాలు, బంధుత్వాలు... అన్నీ అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి... రిటైరయ్యాక మిగిలేవి మధురమైన జ్ఞాపకాలే కదా!
జ జ జ జ
చూస్తుండగానే విశ్వనాథం రిటైరై నాలుగేళ్లవుతోంది. ఇప్పుడు ఏ పనీ లేదు. ముందే ముభావి... చిన్నప్పుడు హుషారుగా అందరితో కలిసి ఆడిపాడిన స్వభావమే... ఉన్నత ఉద్యోగంలో తక్కువ మాట్లాడాలని అనుభవం మీద అలవాటు చేసుకున్నాడు. అలా ఉద్యోగం ఎన్నో అలవాట్లను మార్చింది. కొత్త అలవాట్లను నేర్పింది. వ్యక్తిత్వంలోనే ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పనులు చేయగలిగి వున్నా చిన్నతనంగా ఫీలై చేయడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. పొద్దస్తమానం ఇంట్లో కూర్చోవడం, టీవీ ఛానళ్లు మార్చడం, ఫోన్లు చేయడం, ఎప్పుడు టిఫిన్ టైమ్ అవుతుందో అని ఎదురు చూడ్డం. ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని ఆశ. భోజనవేళ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ సోఫాలో ఒరిగి గోడ గడియారం కేసి చూడ్డం. పావనికి తనలా బోరుకొడుతున్నట్టు ఏమీ లేదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ వుంటుంది.
విశ్వనాథం సగటు సీనియర్ సిటిజన్స్‌లో ఒకడు. ప్రభుత్వోద్యోగంలో చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది పెద్ద పదవితో రిటైరయ్యాడు. ముగ్గురు పిల్లలను కనిపెంచి పోషించి ఒక ఇంటివారిని చేశాడు. ఎవరి బతుకు వాళ్లదై పోయింది. బడిపంతులు సినిమాలో ఎన్టీరామారావు, అంజలీదేవి రిటైరయ్యాక ఇంట్లో ఇద్దరే మిగిలిపోయినట్టు ఒంటరి జంటగా మిగిలిపోయారు. అంతదాకా కొడుకులు, కోడళ్లతో, మనవళ్లతో కళకళలాడిన ఇళ్లు బోసిపోయింది. ''నీ నగుమోమూ కనులారా కననిండు... రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయారు... రెక్కలుడిగి దిక్కులేని పక్షిలాగా వున్నాము...'' అన్న పాటను అంజలీదేవిలాగే పావని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది.
రిటైరయ్యాక జీవితం ఎంత హాయిగా వుందో! ముప్పైయారేళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసీ చేసీ అలసిపోయాడు విశ్వనాథం. రిటైర్‌మెంట్ లైఫ్ ఇంత హాయిగా వుంటుందని ఎప్పుడూ ఊహించలేదు. తాను ఉద్యోగానికి ఎక్కినప్పుడు 1974లో 150 రూపాయలే జీతం. సైకిల్ మీద పల్లెటూరికి పోయి రావడం. ఇప్పుడు అయిదంకెల పెన్షన్ టంచన్‌గా అందుకుంటున్నాడు. మునపటిలా సబ్‌ట్రెజరీ ఆఫీసు దగ్గర లైను కట్టాల్సిన పని లేదు. బ్యాంకులో ఒకటో తారీకుకల్లా పెన్షన్ జమైపోతుంది. అవసరమైనప్పుడు ఏటీఎంకు వెళ్లి అవసరమైనంత విత్‌డ్రా చేసుకొని తెచ్చుకోవడమే.
ఇప్పుడు ఎక్కడెక్కడనో కిరాయికుండాల్సిన పని లేదు. సొంతింట్లో వుంటున్నాడు. కిరాయి కూడా మిగులుతోంది. పిల్లలందరూ ఎక్కడివాళ్లక్కడ బతుకుతుండడంతో తన పెన్షన్ తనకే మిగులుతోంది. ఏ రోగం రాకపోతే తానే పిల్లలకు ఏదైనా బర్త్‌డే సందర్భంగా ప్రెజంటేషన్స్ ఇవ్వవచ్చు. మొన్నీమధ్య మనవరాలికి పది గ్రాముల గోల్డ్‌చైన్ చేయించిపెట్టాడు.
పావనికి ఇరుగుపొరుగుతో ఎంతోకొంత కాలక్షేపం జరుగుతుంది. విశ్వనాథానికి కాలక్షేపం కోసం కాలనిర్ణయ పట్టికను మార్చుకున్నాడు. తనకన్నా ముందు రిటైరైన వారిని కలిసి అనేక విషయాలు తెలుసుకున్నాడు. విశ్వనాథం రిటైరయ్యాక ఎంత ఒంటరినవుతానోనని భయపడ్డాడు. కానీ అందుకు భిన్నంగా కొత్త స్నేహాలు పెరుగుతున్నాయి. పెన్షనర్లతో, వాకర్లతో డబ్బుల గొడవ లేదు. అంతస్తుల, అధికారాల గొడవ లేదు. ఎవరికైనా జబ్బు చేస్తే ఆదుకోవడానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా చనిపోతే వారి భార్యకు నామినీగా పెన్షన్ శాంక్షన్ చేయించడం కోసం చురుకుగా పని చేస్తారు. ఇదంతా ఉత్సాహాన్ని నింపే జీవితం. ఎనభైలో పడ్డ సూర్యనారాయణకు అమ్ముకున్న పెన్షన్ కూడా తిరిగి జమవుతున్నది. రిటైరయ్యాక అమ్ముకున్న పెన్షన్ పదిహేనేళ్లు నిండిన తర్వాత తిరిగి కలిపి పూర్తి పెన్షన్ ఇస్తారు.
అయినా తనకు ఇంకా పొద్దుపోవడం లేదనిపిస్తోంది. ఆనాటి స్నేహితులు, కొలీగ్స్ అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నారు. ఈసారి రాజేశం ఇరవై రోజుల తీర్థయాత్రల టూర్‌ప్రోగ్రాం పెట్టాడట. వెళ్ళాలనిపిస్తోంది. పావని ఏమంటుందో! చాలామంది తీర్ధయాత్రలు చేస్తూ పుణ్యానికి పుణ్యం, ప్రశాంతతకు ప్రశాంతత సంపాదించు కుంటున్నారు.
అన్ని బాధ్యతలనుంచి విముక్తమైన స్వేచ్ఛాయుత జీవితం నిజంగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం ఆయుష్షు తక్కువ. యాభై, అరవై దాటి బతకడమే గగనం. ఇప్పుడు ఎనభై దాకా ఆరోగ్యంగా బతుకుతున్నారు. జీవన ప్రమాణాలు పెరిగాయి. వైద్య సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వం మేజర్ రోగాలకు రీయింబర్స్‌మెంట్ కూడా కొంత ఇస్తోంది. అప్పుడప్పుడు పిల్లలు, మనవళ్లు పలకరిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా సమాజం ఎలా ముందుకు సాగుతున్నదో స్వేచ్ఛగా, హాయిగా గమనిస్తూ వుండవచ్చు. తాము అవసరమైన సలహాలు ఇవ్వవచ్చు.
రిటైర్డ్ లెక్చరర్ గాజుల నారాయణ అన్నట్టు పెన్షన్ అనేది నిజంగానే ఒక గొప్ప వరం. పెన్షన్ లేని జీవితం ఒక నరకం. అమెరికాలో పెన్షనే వుండదట! ఎనభై దాటినా పని చేస్తూనే ఉంటారట. నిజంగా భారతదేశం ఎంత గొప్ప దేశం! ఇంత పేదరికంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. పెన్షనర్లకు ఎంతో చేస్తోంది. అలాంటిది అమెరికా ఎంతో సంపన్న దేశమని అంటారు. కానీ పెన్షన్‌లేని జీవితాలు ఎలా బతుకుతారో పెన్షన్ ఇవ్వలేని ప్రభుత్వం, ప్రైవేటు రంగం అది ఎంత సంపాదిస్తేనేమి? వాళ్లు ఎంత ధనవంతులైతేనేమి? అది ఎంత అగ్రరాజ్యం అయితేనేమి? పిసినారి దగ్గర వున్న బంగారం కథ లాగా... చూసుకొని మురవడానికా? తమ కోసం సేవ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని కఠిన హృదయాలు వారివి. అమెరికా ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు జీవితమంతా ఇంత కఠినంగా వుంటే ఉద్యోగ సంఘాలు అక్కడ ఏం చేస్తున్నట్టు? మనను చూసైనా నేర్చుకోవచ్చుగా అనిపిస్తుంది...
... ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇండియాలో వున్నన్ని సదుపాయాలు, గౌరవాలు ఏ దేశంలో లేవంటారు. అందుకే పెన్షన్ అనేది ఒక వరం. ప్రభుత్వ ఉద్యోగం కోసం అందరూ వెంపర్లాడేది కూడా అందుకోసమే. అయితే ఈ మధ్య పెన్షన్ ఇవ్వం అని ప్రభుత్వం ముందే చెప్పి ఉద్యోగంలోకి తీసుకుంటోంది. తన కొడుకు ఉద్యోగానికెక్కి అయిదేళ్లయింది. సెల్ఫ్ పెన్షన్ స్కీంలో తన జీతమే జమ చేసుకోవాలని అంటుంటాడు. వాళ్లు రిటైరయ్యే నాటికి ఏ ప్రభుత్వం వుంటుందో! మళ్లీ ఎలక్షన్లు రావా! అప్పుడు ఎవరు పెన్షన్ ఇవ్వడానికి హామీ ఇస్తారో వారినే గెలిపిస్తారు. పెన్షన్ నిరాకరించిన ప్రభుత్వాలు ఓడిపోక తప్పదు. చంద్రబాబు కరువు భత్యం ఇవ్వకపోతేనే ఏమైపోయాడో అందరికీ తెలిసిపోయింది గదా! తమకు హాప్ ఏ మిలియన్ జాబ్ స్కీమ్‌లో 1973-74లో ఇలాగే కేవలం కన్సాలిడేటెడ్ జీతం ఇస్తే ఆ తర్వాత అన్నీ ముక్కుపిండి వసూలు చేసుకోలేదా? సర్వీసు సీనియార్టీ కూడా తీసుకోలేదా? అంటూ తాను కొడుకును సముదాయిస్తుంటాడు.
పెన్షన్ లేని డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైరైతే ఎంత కష్టం. పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ కాకుండా తండ్రి మీద ఆధారపడతుంటారు. ఈ కాలంలో ఉద్యోగాలు దొరక్క లక్షలాది మంది తండ్రి సంపాదన మీద ఆధారపడి చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు తమ పెన్షన్‌లో సగంకన్నా తక్కువగా జీతాలు ఇచ్చి పొద్దంతా వెట్టిచాకిరిలా పని తీసుకుంటున్నారు.
సుధాకర్ పెన్షన్‌లేని ఆర్టీసీలో చేరాడు. పెన్షన్ ఉండదని తెలియదు... పెన్షన్ ప్రాధాన్యత తెలియదు. ఏవో ప్రమోషన్లు వస్తాయని ఆశపడ్డాడు. రాకపోయినా బాధపడలేదు. కానీ రిటైరయ్యాక పెన్షన్ లేకపోవడంతో ఎంత క్షోభకు గురయ్యాడో...! సెల్ఫ్ పెన్షన్ స్కీం కింద రెండు వేలు కూడా సరిగ్గా రావు. పెన్షన్ స్కీం పెట్టకుండా ఒకేసారి పెద్దమొత్తం ఇచ్చి పంపించిన వారి బతుకులు ఆగమైపోయాయి.
సింగరేణిలో చేరి వీఆర్‌ఎస్ తీసుకుని రిటైరైన లక్ష్మయ్య బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వడ్డీతో బతకాలనుకుంటే కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలని యాగీ చేసి.. చివరకు నువ్వు ఛస్తే శవం చూడ్డానికి కూడా రాం అని బెదిరించి వున్నదంతా వూడ్చుకు పోయారు. ఇప్పుడు ఎవరూ పెట్టడంలేదు. ఎంత దయనీయమైన బతుకో... రామాచారి బ్యాంకులో రిటైరయ్యాక వచ్చిన డబ్బుతో సినిమా రంగంలో పడ్డ కొడుకు ఇంకా కొట్టుమిట్టాడుతూనే వున్నాడు. ఒక్కొక్కరి బతుకు ఒక్కొక్క తీరు... అనంతం, రాధాకిషన్ ప్రిన్సిపాల్స్‌గా రిటైరై హాయిగా నిజంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు... తనకే ఎందుకో తోచడం లేదు... ఏ పనీ చేయాలనిపించడం లేదు...
పావనికి మనవలు, మనవరాండ్లు, కొడుకులు, కోడళ్లు మూడు రోజులకొకసారైనా ఫోన్ చేయకపోతే తోచదు. బుధవారం ఒకరు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు తప్పకుండా ఫోన్ చేయాలని తాఖీదులిస్తుంటుంది. గురువారం షిర్డీ సాయిబాబా గుడికి వెళ్తుంది కనుక ఆ రోజు చేయవద్దంటుంది. ఫోన్ గంట ఆలస్యమైతే చాలు అన్నం మానేసి ఎవరికో ఆరోగ్యం బాగాలేనట్టు రంధిగా ఫోన్ కోసం ఎదురు చూస్తూనే వుంటుంది. తనతో నిమిషం కూడా మాట్లాడరు. తాను ఫోన్ ఎత్తగానే బాగున్నావా నాన్నా అంటూ అమ్మ ఏం చేస్తోంది అని అడుగుతారు. తాను పావనికి ఫోన్ ఇచ్చేస్తాడు. ఎంతసేపు మాట్లాడుతుందో! పావుగంట మాట్లాడినా ఇవ్వాళ తొందరగా పెట్టేశాడు. కోడలు మాట్లాడనే లేదు అని అంటుంది పావని. పాపం పావని వాళ్ల కోసమే తన జీవితమంతా అర్పించింది. వారి మీదే తన ఆశలు. వారి నుంచి ఏమీ కోరదు పలకరింపు తప్ప. వాళ్లు పలకరిస్తే అన్నం తిన్నంత ఆనందం. వాళ్లు ఫోన్ చేయకపోతే జ్వరం వచ్చినంత నీరసం. ఒక్క రోజు ఆలస్యమైతే వాళ్లు ఎందుకు ఆలస్యమైందో వివరంగా చెప్పేదాకా విడిచిపెట్టదు పావని.
నిజంగా కొత్త జీవితం ఇప్పుడే మొదలైనట్టు అన్పిస్తున్నది. చిన్నప్పుడు తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో చదువులు... తర్వాత కాలేజీ లైఫ్... ఆ తర్వాత ఉద్యోగ వేట... ఆ తర్వాత పెళ్లి... పెళ్లి తర్వాత ఏడాది తిరగకముందే సంతానం... సుఖమెక్కడ? తీరిక ఎక్కడ? ఒకరి వెంట ఒకరు తొమ్మిదేళ్ల దాకా ముగ్గుర్ని కనిపెంచడంతోనే పదేళ్లు గడిచిపోయాయి. పిల్లల్ని పట్టుకొని ఎక్కడికీ రాలేనని పావని ఎప్పుడూ రుసరుసలాడేది. మీ ఆవిడను తీసుకురాలేదేమని చుట్టాలు గుచ్చిగుచ్చి అడగే వాళ్లు. ఎంతైనా కోడలు పరాయిది గదా అని విమర్శించే వాళ్లు. ముగ్గురు పిల్లలు బడికి పోవడం ప్రారంభించాక పావనికి కాస్త తేలికైంది. కానీ పిల్లలు స్కూలుకు పోయేదాకా స్నానాలు, వంట అంటూ యంత్రంలా పని చేసేది. ఆ తర్వాత తన కోసం ప్రత్యేకంగా టిఫిన్. తాను ఆఫీసుకు వెళ్ళాక నడుం వాల్చి ఆ తర్వాత ఇళ్లంతా సర్దుకొని గిన్నెలు కడుక్కోవడం... బట్టలు ఉతుక్కోవడం... పన్నెండింటికే మళ్లీ పిల్లలు ఒకరొకరు పరుగెత్తుకొంటూ రావడం...
పదవ తరగతి దాకా చిన్న పిల్లలతో హాయిగానే గడిచిపోయింది. ఆ తర్వాత కాలేజీ ఫీజులు అంటూ భారం మొదలైంది. అనుకొన్న కోర్సులు చదవాలని ఆరాటం. పిల్లలదొక మాట... తనదొక మాట... పావనిదొకమాట... ఎప్పుడూ గొడవే. కూరగాయల కాడ కూడా నిత్యం గొడవే. ఒకటి వండితే మరొకటి కావాలంటారు. అందరికీ ఏదీ నచ్చదు. ప్రతి ఒక్కడూ తనకిష్టమైంది వండాలని అమ్మను డిమాండ్ చేస్తారు. వంట చేసీచేసీ పావని అలసిపోయేది. పిల్లలు ఆనందంగా తింటుంటే అలసటలోనే ఆనందం అన్నట్టు పావని మొఖం సంతోషంతో విప్పారేది...
గాజుల నారాయణ ఆ మధ్య చక్కని సలహా ఇచ్చాడు. రోజుకు కనీసం మూడు గంటలు ఏదైనా పని చేస్తే పొద్దంతా హాయిగా గడిచిపోతుందన్నాడు. అది కూడా బరువైన పని కాకూడదు. మనకిష్టమైన పనే చేయాలి. జీతం ఎంత వస్తుందనేది ముఖ్యం కాదు. జీతం రాకపోయినా మంచిదే. కానీ మూడు గంటలు మాత్రం ఏదో ఒక పనిలో పడాలి. బట్టల షాపులోనో, కిరాణా షాపులోనో, షోరూంలోనో కూర్చోవచ్చు. ప్రైవేట్ స్కూల్లో మేనేజర్‌గానో, టీచర్‌గానో, హెచ్‌ఎంగానో పార్ట్‌టైమ్‌గా పని చేయవచ్చు. కంప్యూటర్ సెంటర్లో కౌంటర్ కాడ హాయిగా టైం పాసవుతుంది.
కూరగాయలు ఇంటికొచ్చినప్పుడు కొనవద్దంటాడు నారాయణ. సంచి తీసుకొని కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలి. హాయిగా వాకింగ్ చేసినట్టుగా వుంటుంది. ఎవరైనా శిష్యులో, మిత్రులో కలుస్తారు. పలుకరిస్తారు. అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. టైం పాసవుతుంది. ఉదయం ఆరేంటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉచిత యోగా శిక్షణకు వెళ్లవచ్చు. వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ అయ్యాక ఇంటికిపోయి చక్కగా స్నానం చేసి కూరగాయలకు పోవచ్చు. కూరగాయలకు పోయివచ్చే సరికి మేడం చక్కగా టిఫిన్ చేసి పెడుతుంది. ఇలా తొమ్మిది తొమ్మిదిన్నర దాకా గడపవచ్చు. ఆ తర్వాత ఒంటిగంట దాకా పని కల్పించుకోవాలి. ఆ మూడు గంటలే ఏదైనా పని చేస్తే మంచిది. మధ్యాహ్నం రెండు లోపు అన్నం తిని కాస్త ఒరగవచ్చు. మధ్యాహ్నం ఏదైనా పని చేయాలను కుంటే కాస్త ముందే తిని పనికి పోవచ్చు. ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే అక్కడికి పోయి చూసి రావచ్చు. సాయంత్రం ఒక రెండు గంటలు పెన్షనర్స్ భవన్‌లోనో, ఎన్జీవోల భవనంలోనో క్యారమ్స్ ఆడుకోవచ్చు. క్లబ్‌కు పోయి లేదా ఎవరింటి వద్దనైనా హాయిగా పేకాడుకోవచ్చు. ఆరున్నర ఏడు గంటలకు మళ్లీ ఇంటిదారి పట్టవచ్చు. ఇలా టైంటేబుల్ మార్చుకుంటే చక్కగా వుంటుంది అంటాడు నారాయణ. అలవాటుంటే ఒక పెగ్గు విస్కీ కూడా మంచిదే అంటాడు. సీనియర్ సిటిజన్స్‌కు రైళ్లల్లో మూడోవంతు కన్సెషన్స్ ఇస్తున్నారు. పది మంది గ్రూపుగా నార్త్‌ఇండియా ఒకసారి, సౌతిండియా ఒకసారి చూసిరావాలి. తాను హరిద్వార్, ఋషికేష్, మానససరోవరం కూడా చూసి వచ్చానని ఉత్సాహంగా తన అనుభవాలను వివరిస్తుంటాడు.
నారాయణ వాకర్స్ అసోసియేషన్ అంటూ ప్రత్యేకంగా పని కల్పించుకున్నాడు. ఆ మధ్య ఏడాదికి పైగా స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు ఉచితంగా నిర్వహించాడు. ఎంతోమంది విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా ఆ క్లాసుల వల్ల ఎంతో లాభపడ్డారు. కంప్యూటర్ బేసిక్స్ కొంత కాలం ఉచిత శిక్షణ ఇచ్చినట్టున్నాడు. ఈ మధ్య వాకర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊరేగింపు తీశాడు. పెన్షనర్ల సంఘంలో ఆనందం చురుకుగా పని చేస్తూ ఆనందంగా వుంటాడు. అక్కడికి ఎంతో మంది ఏదో పని మీద ఎప్పుడూ వస్తూనే వుంటారు. పెన్షనర్లు అనేక విధాలుగా వారికి సాయం చేస్తుంటారు. అలా వారికి మంచి కాలక్షేపం. సమాజ సేవ.
అన్ని నదులు, ఉపనదులు సముద్రంలో కలిసినట్టుగా విభిన్న డిపార్టమెంట్లలో, వ్యాపార రంగాల్లో, రాజకీయాల్లో పని చేసినవాళ్లంతా పెన్షనర్లుగా, వాకర్లుగా కలిసి నడుస్తుంటారు. అలా వయసులకతీతంగా, గతించిన హోదాలకు అతీతంగా స్నేహితులుగా పరస్పరం పలకరించుకుంటారు. రోగాలకు ఆయుర్వేదం, యోగా, హోమియో, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్, నాటు వైద్యం, వనమూలికల వైద్యం, ఎన్నో రకాల వైద్యాల గురించి, టెస్ట్‌ల గురించి, డాక్టర్ల గురించి అనేక విషయాలు ముచ్చటిస్తుంటారు. అలా అందరూ కలిసి కలబోసుకోవడం చిన్ననాటి క్లాస్‌మేట్ల ఆత్మీయతను గుర్తుకు తెస్తోంది. ఎన్ని అధికారాలు చెలాయించినా, వ్యాపారంలో ఎంత సంపాదించినా పెన్షనర్‌గా, వాకర్‌గా అందరితో హాయిగా ద్వేషాలను వదిలేసి కలిసి నడవడం, ముచ్చటించుకోవడం ఎంత హాయిగా వుందో! ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందడం. ఒకరు మరొకరి సలహాలు తీసుకోవడం. సమాచారం అందించడం...
అన్నట్టు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు... వైకుంఠం 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' ప్రతిపాదన గుర్తు చేశారు. ఆ ఆలోచనే ఎంత బాగుందో! ఎప్పుడో నలభయ్యేళ్ల క్రితం కాలేజీలో చదువుకున్న మొదటి మూడు బ్యాచ్‌ల క్లాస్‌మేట్స్, బ్యాచ్‌మేట్స్‌తో ఇప్పుడు 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' ఆలోచన నిజంగా ఎంత గొప్పది. అందర్నీ నలభయ్యేళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం ఎంత ఆనందం! ఎవరికీ ఊహకందని ప్రతిపాదన తొలుత ఎవరు చేశారో! వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలి...
ఆనాటి మిత్రులంతా ఎక్కడెక్కడ చెల్లా చెదురై వున్నారో! వారంతా ఒకసారి కలుసుకోవడం ఎంత గొప్ప ఆలోచన. ఆనాడు అందరూ విద్యార్థులే. ఈ రోజు అందరూ సుమారుగా రిటైరైన వాళ్లే. అన్ని బాధ్యతలు తీరిన వాళ్లే హెచ్చు. అత్యున్నత పదవుల్లో వున్న వాళ్లు కొందరు. సాదాగా, టీచర్‌గా, వ్యాపారస్తుడిగా గడిపిన వాళ్లు కొందరు. కొందరు మంత్రులయ్యారు. ప్రజాప్రతినిధులయ్యారు. జడ్జీలయ్యారు. కాలేజీ ప్రిన్సిపాళ్లయ్యారు. లెక్చరర్లయ్యారు. వైస్‌ఛాన్సలర్‌లయ్యారు. ఉన్నత విద్యాధికారులయ్యారు. చిన్న కిరాణా షాపులతో జీవితం గడిపిన వారున్నారు. వ్యవసాయంలో, ఫైనాన్సుల్లో నష్టపోయి దివాళా తీసిన వారున్నారు.
ఈనాటి యువతరంలో, విద్యార్థుల్లో తమను తాము చూసుకుంటున్న సీనియర్ సిటిజన్లకు ప్రతీకగా ఎంతమంది మలి యవ్వన వంటి రెండో జన్మ రావాలని కోరుకుంటున్నారో... తమ కొడుకులు, మనవలు ఉద్యమిస్తుంటే వారిలో తమ నూతన యవ్వనాన్ని చూసుకుంటూ తాము కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో... 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'లో అవన్నీ కలబోసుకోవాలి...
ఉత్సాహంగా విశ్వనాథం అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. తనకు అప్పగించిన పనులు వెంటదివెంట చేస్తూ కమిటీకి రిపోర్ట్ ఇస్తున్నాడు. తన వయస్సు మర్చిపోయాడు. యువకుడిలా ఆ మీటింగ్ కోసం రాత్రీ పగలూ తిరుగుతున్నాడు. అందర్నీ కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
చక్కని భోజనాలు పెట్టాలని అందరికీ జ్ఞాపికలు ఇవ్వాలని, ఆ మీట్ కార్యక్రమం వీడియో తీసి సీడీలు తలా ఒకటి ఇవ్వాలని, తమ పిల్లలకు చూపించుకోవాలని అందరికీ ఆరాటం. నలభయ్యేళ్ల స్నేహాలు, పరిణామాలు, ఆనందాలు కలబోసుకొనే రోజు కోసం విశ్వనాథం లాగే చాలామంది ఎదురు చూస్తున్నారు. విశ్వనాథానికి ఇప్పుడు మళ్లీ యవ్వనం వచ్చినట్టుగా హుషారుగా తిరుగుతున్నాడు. ఆ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.
సైలెన్స్ ఈజ్ అన్ నేచర్ టు మ్యాన్. నిశ్శబ్దం, మౌనం మానవ ప్రకృతికి విరుద్ధం అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తుకొచ్చింది. మనిషి సంఘ జీవి. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే సూక్తి వున్నప్పటికీ మౌనం ఎప్పటికీ మంచిదని చెప్పలేం. మంచో, చెడో అందరూ కలిసి మాట్లాడుకోవడమే మానవ స్వభావం అనుకున్నాడు విశ్వనాథం. ఎప్పుడూ తక్కువ మాట్లాడే విశ్వనాథం ఇప్పుడు గలగలా మాట్లాడుతున్నాడు.
రిసెప్షన్ కమిటీ సమావేశంలో ''ఇది పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మాత్రమే కాదు. అది 'పూర్వ జ్ఞాపకాల, అనుభవాల, అనుభూతుల సమ్మేళనం' కూడా'' అంటూ ఆనందాతిరేకాలతో అరిచినంత పని చేశాడు విశ్వనాథం.
''పావనీ! పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పిల్లలతో సహా మనం పాల్గొనాలని నిర్ణయించారు. పిల్లలకు ఫోన్లు చేసి చెప్పు. మా క్లాస్‌మేట్స్, కాలేజీమేట్స్ అందర్నీ చూడొచ్చు. అందర్నీ పరిచయం చేస్తాను.'' అన్నాడు ఉత్సాహంగా విశ్వనాథం.
పావనికి కూడా ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం. తనకు తెలిసిన వాళ్లు ఎందరో కలిసే అవకాశం కోసం ఆ రోజు ఎప్పుడు వస్తుందా ఎదరు చూస్తోంది. ''పిల్లలను, మనవలను ఇలాగైనా చూడొచ్చు. రెండు రోజులు ఇల్లంతా సందడి.'' అనుకుంటూ రాబోయే సందడిని ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతోంది పావని.
పని చేస్తే నిరంతరం యవ్వనమే. పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. విశ్రాంతిలో ఉండేది ఆనందం కాదు, బోర్‌డమ్ మాత్రమే అన్న ఆనాటి ప్రిన్సిపాల్ మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి. ఆ మాట ఎంత నిజమో! ఈ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అయిపోయాక తప్పకుండా రోజూ కనీసం మూడు గంటలు నారాయణ అన్నట్టు ఏదైనా పని చేయాలి. సమాజం కోసం, ఇరుగు పొరుగు కోసం తనకు తోచినంత డబ్బు, సమయం కేటాయించాలి అని నిర్ణయించుకోవడంతో విశ్వనాథం హృదయం యువరక్తంతో ఉరుకులు పరుగులు పెట్టింది. 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' పనుల బిజీలో విశ్వనాథం లాగే ఎందరిలోనో మలి యవ్వనం అను రెండో జన్మ ప్రారంభమయ్యింది.
- నవ్య వార పత్రిక, 2011
ఆధునిక కథా సరిత్సాగరం కరీంగనర్ జిల్లా కథలు నాలుగవ సంపుటి