Friday, October 7, 2016

పాలమూరు లేబర్‌ తిరుగుబాటు కరీంనగర్‌ నుండి హుజూరాబాద్‌ నలభై కిలోమీటర్లు. హుజూరాబాద్‌ నుండి హన్మకొండ ముప్పైఐదు కిలోమీటర్లు. వరంగల్‌ దాటి ఖమ్మం దాకా తీసుకెళ్ళాలని కాకతీయ కెనాల్‌ త్రవ్విస్తున్న 1978-79 కాలం. కొత్తగట్టు గ్రామం. కరీంనగర్‌ నుండి హుజూరాబాద్‌ దారిలో హుజూరాబాద్‌కన్నా పది కిలోమీటర్లు ముందే ఉంటది. కొండలపక్కనుండి కెనాల్‌ పని వేగంగా సాగుతాంది. దూరం నుంచి చూసేవారికి గొప్ప దృశ్యం... ''అయ్య ! దేశంగాని దేశం వచ్చినం. రాజ్జెం వచ్చినం. మీరు గాదంటే మాకు దిక్కెవరీడ! దండంబెడ్తం దొర ! ఈ లచ్చిని దావకానకన్న తోల్కపోన్రి, ఎన్ని పైసలయితే అన్ని పైసలు మాకిచ్చెదాంట్ల పట్టుకోన్రి. లేకపోతే గాడి కిరాయి మందమన్న పైసలియ్యిన్రి. దాన్నింటి కాడికి తోలేత్తం'' ఆవేదనగా అడిగిండు అయిలయ్య. ''ఎవరుగూడ సావు రావాలని ఒగలు పెడ్తరు సారు ! అది మూన్నెల్ల పసిదాన్నెత్తుకొని మట్టి మోత్తె, నిన్న కాల్వల జారి అడ్డంబడ్డకాన్నుంచి దాన్నడుమిరిగి నట్టున్నది. కడుపంత పిసుకుతుంది. మీరు సూసుకుంటగూడ గిట్ల దయలేకుంట మాట్లాడ్తున్నరు'' కండ్లల్లో నీళ్ళు తిరుగంగ జాలిగా అడిగిండు సాయిలు. ''అరేయి! బాగా మాట్లాడుతున్నరేందిర ! అది యింతగనం ఏ పాటి పని చేసిందిర. ఇప్పటి దాకా దాని మొగడు అదీ పనిచేసినయి కల్సి వాళ్ళకిచ్చిన అడ్వాన్సు మందం గూడ కాలేదు. అయినా మీతోని వాదన నాకెందుకుర, నేను మిమ్ములతోల్క రాలేదు. నేను మీకు అడ్వాన్సు యియ్యలేదు. మిమ్ముల తోలుక వచ్చిన మేస్త్రి ఎల్లయ్య మీ ఎదురుంగనే ఉన్నడుగదర ఆన్నే అడుక్కోన్రి'' గర్జించిండు ఏజెంటు సుధాకర్‌రావు. అనంతపూర్‌ నుండి హుజూరాబాద్‌ సమీపంలోని కొత్తగట్టుకు ఎలా వచ్చిన్రో వారికి దారి తెలియదు. మేస్త్రి ఎల్లయ్య పట్టుకొచ్చి పనిలో దించిండు. ఎటు పారిపోదామన్నా తెలియకుండైంది. ఎక్కడచూసినా కాంట్రాక్టరు గూండాలు, ఏజెంట్లు, సూపర్‌వైజర్లు కాపలా. ప్రభుత్వ అధికారులు కూడా తమ గోడు వినేబదులుగా అందరూ వాళ్ళకే మద్దతు. అందుకే దీనంగా సూపర్‌వైజర్‌ ఏజెంటుకి మొరపెట్టుకున్నరు. వారిని తీసుకొచ్చిన లేబర్‌ కాంట్రాక్టర్‌ ఎల్లయ్య మేస్త్రి కూడా వారితోపాటే పనిచేస్తుంటడు. యూనిట్‌పనికింత అని పని యిస్తే లాభం వస్తదని ఆశపడ్డడు. అది ఇలా తనమీదకు వస్తదని తెలియదు. సూపర్‌వైజర్‌కు చేతులెత్తి దండం పెట్టిండు, కాళ్ళు పట్టుకోబోయిండు. ''అయ్యా! నీ కాల్మొక్త! నన్నడుగుమంటున్రు. మీకు తెల్వనిదేమున్నది? నేను ఈల్లతోటి ఈల్ల తీర్గనే పనిచెయ్యవడ్తి. గరిబోన్ని దొర. మీరిచ్చిన అడ్మాసు పైసలు ఈల్లకే తోల్కరాంగ యింటికాన్నే యిచ్చేస్తి. ఇగ నాదగ్గరేడున్నయి దండం బెడ్త. జతకు నాల్గు వందలు అడ్మాసిత్తి. ఈడికి తోల్కవచ్చిన బండి కిరాయి నూరాయె. మీరిచ్చిన పదివేల రూపాలు నలుపై మందికి ఆడికాడికే ఆయె. ఇగ నాదగ్గరేడున్నయి పైసలు. ఇపుడు ఆల్లకేమయిన కర్సయితే పెట్టున్రి. నా కాతాల రాసుకోన్రి సారు. నాకు పగారిచ్చేటప్పుడు పట్టుకుందురుగని.'' ఎల్లయ్య మేస్త్రి అశక్తతతో ఉసూరుమన్నడు. సూపర్‌వైజర్‌ సుధాకర్‌రావు కాంట్రాక్టర్‌ తరఫున ఇంజనీర్‌గా సైట్‌మీద పని చూసుకుంటున్నడు. ఆయన కాంట్రాక్టర్‌ దగ్గర జీతగాడు. కని తానే కాంట్రాక్టర్‌ అయినట్టు అంతా తనమీదికెళ్ళే నడుస్తున్నట్టు సర్రున లేచిండు. గట్టిగా అరిచిండు. ''నీకు బియ్యం ఉద్దెర యిప్పించుకుంట, బీడి కాడి లిప్పించుకుంట, అడ్వాన్సు లిచ్చుకుంట జేర్తె యిప్పటికే నువు లేబరుతో చేయించిన పనికంటె ఎక్కువ తీసికొన్నవు. పదిహేను వేల రూపాల దాకా నీ పేరుమీద కాతా అయింది. ఇంత గనం ఎన్ని యూనిట్లు పనిచేయించినవుర నువ్వు? అంతగొడ్తె నువు జేయించింది పన్నెండు వేల రూపాల పనిగాదు. ఈడికే నీ పేరిట మూడువేల రూపాయలెక్కువ ఉన్నట్టు! ఇంకేడికెల్లి వస్తయిర! ఆల్లతోటి పని చేయించు కొంటున్నవు లాభం వచ్చినప్పుడెవరికిస్తవుర? లాభం తినేటోనివి కొద్దిగనన్న స్వంతంగ కర్చుపెట్టు కోవాలె. ఏన్నుంచన్న తీస్కొచ్చి కర్చు పెట్టుకోవాలె. ప్రతిదానికి నన్నడుగుతే యిదేమన్న ఖజాననుకున్నవ?'' అన్నడు ఏజెంటు సుధాకర్‌రావు సూపర్‌వైజర్‌. ఎల్లయ్య మేస్త్రి తనకు తెలిసినవాళ్ళను ఇరుగుపొరుగు పల్లెలనుంచి ఎంతో ఆశచెప్పి తీసుకొని వచ్చిండు. అప్పుడు సూపర్‌వైజర్లు చెప్పింది వేరు. ఇక్కడ జరుగుతున్నది వేరు. గట్టిగా మాట్లాడితే ఇంకెంత కష్టమో తెలిసిపోయింది. ''మీరే గట్లంటే ఎట్ల సారు? మీరు చెప్పింది పెద్దొర కాదనడు. మీరడుగుతె పెద్దొర తప్పక యిస్తడు. మీరు తలుసుకున్నంక పైసలకు కొదువెక్కడిది సారు?'' మళ్ళీ అన్నడు ఎల్లయ్య మీస్త్రి. ''అరేయి మీరు గిట్లనే అనుకుంట కూర్చుండున్రి. నేనీడ మీకు చెప్పుకుంట కూసుంటే ఆడ పనిపంటది, పెద్దొరకు దెలిస్తే అందరి పనైతది. సప్పుడుజేక పని జెయ్యి పొండి'' అంటూ షెడ్డులోపలికి వెళ్ళిపోయిండు సూపర్‌వైజర్‌ సుధాకర్‌రావు. కాల్వ మీద ఇటువంటి ప్రమాదాలు జరగడం, వాళ్ళకేమీ సాయం అందక పోవడం మమూలుగా జరిగే పనే. టిప్పర్‌ డ్రైవరు సురెందర్‌ నిస్సహాయంగా, సానుభూతితో జరుగుతున్నదాన్ని చూస్తున్నడు. జ జ జ జ కొత్తగట్టు కొండఅంచు. నేల ఈనినట్టు... కెనాల్‌ దరిదాపుల్లో వందలాది గుడిసెలు. ఐదడుగుల ఎత్తుతో గుండ్రంగా వంచిన తడికల షెడ్లు. ఏదో యుద్ధానికి వేసుకున్న షెడ్లుకావు. సంసారం చేసుకుంట భార్యపిల్లలతో అందులోనే బతుకటానికి కెనాల్‌ కాంట్రాక్టర్‌ వేయించిన క్వార్టర్లు అవి. పడుకోవడానికి తప్ప మెసులుటానికి, నిలబడుటానికి అవి పనికిరావు. అందరూ చీకట్లో గుడిసెలముందు కూర్చొని ఎత ఎల్లబోసుకుంటున్నరు. నిద్రపట్టడంలేదు. ఒకవైపు దోమలు. ఐలయ్య, సాయిలు కొద్దిగ అందరి గురించి పట్టించుకుంటరు. అందరికి వాల్లే దిక్కు. ఐలయ్య భార్య లచ్చిమి ఇంట్లో జ్వరంతో మూల్గుతున్నది. కడుపునొప్పితో అవ్వో అని ఏడుస్తున్నది. ''ఆడ పన్దొరుకుతలేదని ఈడికత్తె వానియవ్వ కొంగపియి కోసం కాసికచ్చినట్టాయెనేంరా? వానియవ్వ అదేదో సర్కార్‌ వోపిత్తన్న కట్టని కూలెక్కువని ఆరం పది రోజు లెనుకెనుక దిరిగి తోల్కచ్చెగదర మేస్త్రిగాడు. బాకీలు బాగున్నయి అంటె అడ్మాసిత్త బాకీలు గట్టుకోని రాన్రి అని తోల్కచ్చి గిట్ల జేసెనేంర. తోడేలు పంజనుంచి పులిపంజా కిందకచ్చినట్టాయె.'' అన్నడు సాయిలు ఐలయ్యను సంజాయించుకుంట. ''మనూల్లె మట్టిపని కోతె, బాయిలు దవ్వవోతే ఏమన్నయితె ఎట్ల మాట్లాడ్తరో అంతకన్న కడయీనం మాట్లాడెనేంర? ఆడి కంటె జులుం ఎక్వ, మనూల్లె కంటె ఎక్వ దోత్తాన్రు ఈడ'' మనూల్లె బాయి దవ్వవోతె రోజుకార్రూపాలు. ఆడోల్లకు రోజు మూర్రూపాలు. ఈడ రోజెనిమిది మా లెక్క గట్టిత్తరట గని అయితే ఏందె? అక్కన్నేమొ పదిగొట్టంగ పనికోయి నడుమ అర్ధగంట సద్ది దిని అయిదు గొట్టంగనే యింటికత్తిమి. ఈన్నేమొ పొద్దున లెవ్వంగ పని కెక్కుతె పొద్దుగూకె దాక పనిమీదికెల్లి దిగేది లేదాయె! ఈడ ఆడి కంటె గూడ కూలి గిట్టుబాటుగాదు. ఈ మొరం బూములు దవ్వాలె. ఆడ రెండ్రోజులు జేసే పని ఈడ ఒక్క రోజులనే చెయ్య మంటున్రి.'' అన్నడు మాల్యాద్రి. చిన్నపిల్లలు చీకట్లో ఆడుకుంటున్నరు. పండుకపోన్రి అని మాల్యాద్రి వాల్లను సముదాయించిండు. కొందరు ఆడోల్లు ఆ ముచ్చట విందామని దగ్గరకచ్చి కూసున్నరు. ''తిండేమొ తొమ్మిది గొట్టంగోసారి, పగటీలి రెండు గొట్టంగోసారి పొద్దుగూకి పనిమీదికెల్లి దిగినంకోసారి మూడుసార్లు మావెట్టవట్టిరి గని ఏం తిండే అది? పసులుగూడా దినయి. పేరుకు పెట్టేది అన్న మేగని గోదుమల గూడాలోలె మొద్దులకు మొద్దులుంటయి మెతుకులు. అసలు గంత దొడ్డు బియ్యం యాడ పండిత్తరోగని ఈ జన్మల జూల్లేదే. అవి మనకోసం పెతాకం సర్కారు బందర్ల వడ్ల యిత్తునం దీసి నట్టున్నదే'' అన్నది నర్సమ్మ. ''వాని యవ్వ ఈ అన్నం కన్న జొన్నకూడు నయం. థు!'' అన్నడు అయిలయ్య కాల్చిన బీడిముక్క బూమికేసిరాసి కాండ్రిచ్చి తుపుక్కున ఊంచుకుంట. ''మరి యిగ దాంట్లవోసె కూర గొంత కమ్మగుంటందా వానియవ్వ కూరంటే ఏం కూరనే అది బానెడు నీల్లల్ల చింతపండు పులుసు పిసికి ఉప్పు కారంగల్పి రోజదే మూడు పూటలు పొయ్యవట్రి. తాలింపా యేమన్ననా!'' అన్నాడు సాయిలు. ''పదియేను రోజులకోసారి పని బందుపెట్టి ''మానుకం'' అని కల్లు గూడాలు మాంసం మా వెట్టవట్రి. ఈడు ఎల్లయ్యయితే ఆనాడో గొర్రెపిల్ల గొత్తడు గని, అయితే ఏందె. పదిహేనురోజులు పేల్క ఎండుకపోయినంక ఏడ దినత్తది. ఏడ వడ్తది.'' ''అయినా ఆ మాంసం పులుసుగూడ చింతపండు పులుసోలె ఉప్పుకారం వాసనదప్ప మసాల వాసన్నా యేమన్ననా?'' ''గీ తిండికి మనిషికి మూర్రూపాలు కూలిపైసలల్ల కెల్లి కోసుడేంది? రూపాయి తిండిగూడ గాదిది అంటె యింక సూర్రాదు! ఆరానికి రెండుసార్లు కూరగాయలు వెడ్తలేనా అంటడు.'' ''రోజ్జేసే బానెడు చింతపండు పులుసులకిల బీరకాయలో, టమాటలో ఏసి యిదేంది పెడ్తలేనా? అంటడు వానియవ్వ.'' ''ఈడు మనమచ్చెదాక ఎంతమంచిగ బుదిరి కిచ్చిండుర. మంచిగ సారవోపిచ్చె వత్తననెదాక మనెంబడి దిరిగె తోల్కచ్చే. లారి ఆలిసెమైతె ఆ మూర్రోజులు రోజో గొర్రెను గోసి మంచిగ తినవెట్టె. ఈడగూడ గట్లనే తిండవెడ్తననె.'' ''ఆడ మనం సారకు సంకలు గొడ్తె ఆడు ఈడికి దెచ్చి ఆడ వెట్టిందానికి డబలుకు డబలు మనమీద తియ్యవట్టె'' అన్నాడు బాలయ్య. ''ఎహె! అసలు సంగతటువెట్టి పక్క ముచ్చట్లు మాట్లాడుతున్న రేంర. ఆ పసిదాన్ని లచ్చిని ఏంజేత్తామన్నది ముందు మాట్లాడున్రి. పొద్దుగాల ఆడేమొ గట్లనె'' అన్నది కనుకవ్వ. ''అరేయి! మెల్లగ మాట్లాడున్రి. ఎల్లిగాడు గిట్ట, ఏజెంటు బంటుగాల్లు గిట్ట యిని ఆనికి జెప్పితె బొక్క లిరుగదంతరు.'' అంతటితో ఆ గుంపు సంభాషణ గునుసుడుగా మారింది. వెన్నెల గుంకింది. చుక్కలు మినును మినుకు మంటున్నై. వాల్ల ముచ్చట చుక్కలోలె అస్పష్టంగా మారింది. చీకటికి కండ్లున్నట్టు, చెవులున్నట్టు వాల్లకు తెలువది. ఎవలెవలు ఏమేం మాట్లాడిన్రో సుధాకర్‌రావుకు ఎల్లయ్య మేస్త్రి ఉన్నది ఉన్నట్టు చెప్పింది వాల్లకు తెలువది. జ జ జ జ తెల్లారి లేవంగనే సుధాకర్‌రావు సైటుమీదికి వచ్చిండు. ఎల్లయ్య మేస్త్రితోనే సాయిలును పిలిపించిండు. ''ఏందిరా! లం....కొడక! బాగ మాట్లాడుతున్నవట. మంచిగ ఎవలపని వాళ్ళు చేసుకొనేటోళ్లకు ఏమేమొ జెప్పి పని చెడగొడుతున్నవేందిరా కూసేగాడిదచ్చి మేసేగాడిదను చెడగొట్టినట్టు. మంచోల్లను చెడగొడ్తున్న వేందిర. వచ్చి మూన్నెల్లు కాలేదుగని లావు మాట్లాడుతున్నవేందిరా. ఏండ్ల తరబడి మంచిగ గా పాలమూరోల్లు ఎట్ల పనిచేస్తుండ్రో సూడ్ర. ఆల్లుగూడ ఎనుకటి నుంచి మీ తీర్గగిట్ల మాట్లాడ్తె ఇగ కెనాల్సు కట్టిచ్చినట్టె. వాళ్ళు ఏండ్ల తరబడి నుంచి ఎవలు కిక్కురుమనలేదుగని, మీరు నిన్న మొన్నచ్చి బాగ మాట్లాడుతున్న రేందిర? పాలమూరోన్ని ఒక్కొక్కన్ని తన్నుడెగాదు సంపుతెగూడ ఎవడడ్డంరాడు. ఎవరు కిక్కురుమనరు. అని తప్పేలేంది ఆన్నెందుకు సంపుతరని సోంచాయించుకొని సప్పుడు జెయ్యకుంట తప్పు చేసినోని దగ్గరకే పోవద్దని ఊరుకుంటరు. ఇగ మీ తీర్గ ఆల్లుజేత్తె ఈ భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌దాక ఎవరు కడురుర్రా! మీరు గడ్తె అవి యింక నూరేండ్లైన పూర్తిగాకపోవు. పాలమూరు లేబరు ఎక్కువ దొరుకుతలేరని మిమ్ముల పిలిపిస్తే పని తక్కువై మాట లెక్కువైనయి. మీకు! ఎన్నడులేంది ఏందేందో గూడుపుఠాని గడుతున్నరు. మిమ్ములజూచి పాలమూరోల్లు నేర్చుకునేటట్టున్నరు. దానికి గింతంత దెబ్బ తాకిందోగని పార్టీలు గడుతున్నర్ర! లం....కొడుకుల్లారా! బాగదినుకుంట బలిసిపోయిందిర మీకు. అరేయి! మల్లయ్యా ఈ లం...కొడుకును షెడ్డులేసి తన్ను!'' అంటూ సుధాకర్‌రావు పక్కనున్నవాల్లకు సైగ చేసిండు. సుధాకర్‌రావు బంట్లు ఐలయ్యను, సాయిలును చెరొక రెక్క పట్టుకున్నరు. సుధాకర్‌రావు వాల్లను ఈ చెంప ఆ చెంప తన చెయ్యి నొప్పి పుట్టేదాక కొట్టిండు. ఎటు దొరికితే అటు తన్నిండు. వాళ్ళకప్పజెప్పిండు. ముక్తాయింపు విన్నంక తన్నడంలో మజా పొందనేర్చిన బంట్లు షెడ్డులోపలికి తీసుకపోయి పొట్టుపొట్టు గొట్టిన్రు. ఒకరి తర్వాత ఒకరికి వరుసగా అదే శిక్షపడ్డది... అయిదుగురికి. నర్సయ్య పండ్లల్ల కెల్లి, చిదిమిపోయిన చిగుర్లలకెల్లి నెత్తురు కారికారి నోరంతా సార్కలైనయి. కొంరయ్య నడుం బొక్కలిరిగినయి. సాయిలు కడుపునొప్పితోటి గిలగిల తన్నుకున్నడు. గడ్డపారతోటి పురుసోల్ల మీద పొడిసినట్టయి సోయిదప్పి పోయిండు సాయిలు. అయిలయ్య తొంటి కదిలింది. నిలబడలేక అడ్డంబడితే తల పగిలింది. ఇంత జరిగిందానికి సాక్ష్యంగా ప్రకృతితోపాటు టిప్పరు నానుకొని సురెందరూ మవునంగ ఊరుకున్నడు చూసుకుంటగూడ. మేస్త్రి ఎల్లయ్య జైలర్‌లా సైటుకాడ నిలబడి ఒకరి తర్వాత ఒకర్ని షెడ్డువైపు పంపించింది గమనించుకుంటనే ఉన్నడు సురేందరు. కొడుతుంటే ఎవరూ అడ్డం రాకుండా కావలి చూస్తున్నడు ఎల్లయ్య మేస్త్రి. మిగతోల్లను పనిమీదికెల్లి కదిల్తె తంత అన్నట్టు మెలికలు తిరిగిన కండలతో మీసాలు మెలేసి గుడ్లెర్రజేసి సైటుమీద నిలబడితె దోపిడిదారు కావలి కుక్కోలె కనిపించిండు ఎల్లయ్య సురేందరుకు. మిగతా యూనిట్ల లేబరు రోజూవలె తమకేమి పట్టనట్టు పనిచేస్తుండడం చూసి, వాల్లు తెలిసినా మరో కన్నీరుబొట్టు విడవడం తప్ప ఏం చెయ్యలేరుగదా అనుకొన్నడు సురేందరు మళ్ళీ. జ జ జ జ సాయంత్రం ఏడవుతున్నది. టిప్పర్‌ డ్రైవర్‌ సురేందర్‌ టిప్పర్‌ తీసుకొని ఎటో పోతున్నడు. దాన్ని చూసి పరుగుపరుగున ఉరికొచ్చిండు అయిలయ్య. లచ్చిమిని దావఖానాకు తీసుకుపోవుటానికి బతిమిలాడిండు. సురేందర్‌ది జాలి గుండె కరిగింది. సరేనన్నడు. సురేందర్‌ సూపర్‌వైజర్‌ సుధాకర్‌రావుకు తెల్వకుంట తీసుపోవాలె. తెలిస్తే తన నౌకరి పోతది. అందుకని ఎవరికి తెలవకుంట, ఏం తెలువనట్టు ఉంటడు. కెనాల్‌తొవ్వనుండి డాంబర్‌ రోడ్డు చేరడానికి టిప్పర్‌లు నడిచి నడిచి మట్టిరోడ్డు చేసినయి. అక్కడక్కడ చెట్లు..., గుంతలు... ''మీరు కొంచెం తొవ్వ ముంగటికి సాగి గాతుమ్మచెట్టుకాడ నిలబడుండ్రి. అక్కడ మిమ్ముల నెక్కించుకుంట. దావకానకు కూడ తీస్కపోత! ఎట్లన్నజేసి కొంచెం ముంగట నడువున్రి. ఏజెంటుకు తెలిస్తే బాగుండదు. నేను షాకాయిల్‌ కోసం పైసలు దీస్కొని వస్త, ముందుగాల నడుపున్రి మీరు.'' ''సరె మంచిదయ్య!'' అంటూ సాయిలు, ఐలయ్య, లచ్చిమి మరో నలుగురు కలిసి బయలెల్లిన్రు. షాక్‌ ఆయిలు తీసుకొని రాంగా, పొయిలకట్టెలు తీసుకొని వస్తుంటడు సురేందర్‌. వాల్లు హుజూరాబాద్‌కు చేరేసరికి రాత్రయింది. రాత్రిపూట సర్కారు దావకాన బందున్నది. సురేందరు పొయిల కట్టెలు జోకి టిప్పర్ల వేయమని చెప్పి, ఉదయం గాయపడ్డవారిని ప్రయివేటు డాక్టరుకు చూపించిండు. ఇంజక్షన్లు యిచ్చిండు డాక్టరు. బయట కొనుక్కొమ్మని రాసిస్తె మందులకు పైసలు లేవన్నరు లేబరు. తనవద్ద ఉన్న పన్నెండ్రూపాలుగాక యింకా ఎనిమిది రూపాలెక్కువ అయింది మొత్తం బిల్లు. టిప్పరు నడుస్తూనే ఉన్నది. క్యాబిన్లో కూర్చోబెట్టుకొని సురేందర్‌ వాళ్ళతో మాట కలిపిండు. ఏం జెయ్యమంటరు సారు! నిన్న గీ పసిదాన్ని దవాకానకు తొల్కపొమ్మంటే గట్ల మాట్లాడె. యియ్యాల పొద్దుగాల మమ్ముల గిట్ల యిష్టమున్నట్టు గొట్టె. ఇగ యింక మీదికెల్లి దావకానకు తోల్కపోన్రి అని ఎట్లడుగుమంటరు! మీరే జెప్పున్రి. ఏమనలేక నోరు మూసుకున్నం. ఏ జెయ్యత్తది'' ''గిట్ల దెబ్బలకు బయపడ్తె ఎట్ల! కొంచెం ధైర్యం దెచ్చుకోవాలె. ఆడు మీరు గిట్ల భయపడాల్ననే కొట్టె. మీరు భయపడి ఊకుంటె వాడనుకున్నది జరిగినట్టెగద. వాడు మీ మీద యింకింత జులుం చూపిస్తడు గిట్ల ఊకుంటె. అసలు మీరు గీ చుట్టుపక్కల పల్లెలు చూల్లేదా! ఒక్కొక్క పల్లెల ఎట్ల జరుగుతుంది. ఏం జరుగుతాంది, యిన్లేదా. అవన్ని యింటె అయ్యో! మేం పడే కట్టం ఏపాటి అనుకుంటరు గావచ్చు మీరు. ఈ సుట్టుపక్క ఊల్లల్ల దొరలు గిట్లనే జులుం చెలాయించిన్రు మొన్న మొన్నటిదాక. కూలీలు, పాలేర్లు అందరు ఏకమై పనులు బందు వెట్టిన్రు. పనులు బందువెట్టిన్రని కోపంతోటి పెద్ద రైతులు దొరలు, వాళ్ళ గుడిసెలు గాలవెట్టిన్రు.'' అని కరీంనగర్‌ జిల్లాలో పల్లెల్ల జరుగుతున్న ముచ్చట్లన్నీ చెప్పుకచ్చిండు సురేందర్‌. ఇది జరిగినంక వారంరోజులకు రాళ్ళకు బత్తీలు వెట్టుటానికి పొక్కలు గొట్టంగ పాలమూరోల్లిద్దరికి ఎదురు తిరిగిన గడ్డపార పాదంలోకి దిగింది. పైకి లేచిన లావాలా రక్తం విరజిమ్మింది. నిలువెత్తు నల్లని విగ్రహాలు శవాల్లా పడిపోయిన్రు. ఏజంటు సుధాకర్‌రావు తన బంట్లు ఈ వార్త తేంగనే షెడ్డు బయట కుర్చీలో కూర్చుండి ఇంగ్లీషు పత్రిక చూస్తున్నోడు అమాంతం లేసి షెడ్డులోపలికి పోయి మంచంమీద ఏం దెల్వనోనోలె ఒరిగి పన్నడు. ''అరేయ్‌ మల్లయ్యా ! అయిడిన్‌ సీసా అవుతలనే వుంది. నన్ను లేపకు'' అన్నడు. అయిడిన్‌తో రాసి కట్టుకట్టిన్రు. అయిడిన్‌తో ఆగేదా? ఆ గాయం! సుధాకర్‌రావుకు తెల్వకుండ సురేందరు సాయం కోరిన్రు. సురేందరు ప్రభుత్వ దావకాన్ల పట్టిగట్టిపిచ్చి. ఇంజక్షన్లు, కొన్ని తెల్ల గోలీ లిప్పిచ్చి ఏదో పనిమీద వోయిన అదే టిప్పర్ల క్యాబిన్ల కూర్చుండవెట్టుకొని మాట గలిపిండు. అనంతపూర్‌ రాయలసీమవాల్లతో లాగానే వీల్లతోగూడ మాటల్ల కల్సిపోయిండు. ఆహఁ! మీరు గదేం బెట్టుకోకున్రి. నేను వాని చేతికింద పనిచేత్తున్నది నిజమేగాని నన్ను వాని మనిషనుకోకున్రి. నేనుగూడ మీ తీర్గనే కడుపు చేతపట్టుకోని దిక్కులేక ఇక్కడ జీతమున్న.'' అంటూ నమ్మబలికిండు సురేందర్‌. ''మీరు బాగా చదువుకున్నోల్లున్నట్టున్నరు సారు'' అన్నడు సాయిలు. ''ఏం జదువుతె మాత్రం ఏమున్నది. బిఎస్సీ చదివిన. ఎంత చదివినా డబ్బున్నవాని చేతికింద బానిస కొడుకులం. మా నాన్న లారీ డ్రైవరు పనిచేస్తుండె. అప్పుడప్పుడు నాన్న వద్దన్నా ఆటలా గమ్మతుగ నేర్చుకున్న డ్రైవింగు. మా నాన్న లారీబోల్తాపడి చనిపోయినంక మానాన్న వద్దన్న పనే బతుకుటానికి అక్కరకు వచ్చింది'' అన్నడు సురేందర్‌. ఒక కిలోమీటరు కాల్వ దవ్వుటానికి యభైలక్షల రూపాయలకు గుత్త పట్టిండు. గుత్తపట్టిన పని చేయించటానికని ఈ టెక్నికల్‌ ఏజెంటును జీతం బెట్టుకొన్నడు. వీడు యింజనీరు కోర్సు చదివించడని ఎనిమిదివందల జీతమిస్తున్నడు. ఇగ వీడేం జేస్తడంటే! లేబరు గుత్తెవారు మీ మేస్త్రి అటువంటోల్లకు కంట్రాక్టరు తరపున మీలాంటి లేబరును తోల్కరమ్మని కొన్ని వేల రూపాయలు అడ్వాన్సు యిస్తడు.'' ''మరి అడ్వాన్సు పైసలు దీసికొని ఆడు దెంకపోతె ఎట్ల.'' ''అట్లగూడ ఒకోసారి జరుగుతదనుకో - అందుకే అడ్వాన్సు యిచ్చేటప్పుడు వెనకా ముందూ అన్నీ చూస్తరు. ఉత్తుత్తోల్లను నీలాటోల్లను నమ్మడు. ఎట్ల నమ్ముతరంటే మాటవరుసకు నువున్నవు. నువ్వీడపని చెయ్యంగ చెయ్యంగ మంచోనివని నమ్మకం గుదిరితె, నీకు పదిమందిని మెప్పిచ్చే తెలివున్నదని అనుకొంటె నీకు తెల్వకుంటనే నీ ఊరు, చుట్టాలు, పక్కాలు, అన్నీ జాడదీసి తెల్సుకొంటడు. ఈ పనైపోయి యింకో కిలోమీటరు గుత్తవట్టినపుడు నిన్ను పిలిసి యాభయో నూరో లేబర్ను తోలుకురమ్మని గప్పుడు నీకు అడ్వాన్సు పైసలిస్తరు. నువ్వు నీకు తెలిసిన ఊర్లు దిరిగి లేబరును తోలుకవస్తవు. ఆ లేబరుతోటి నువుగూడ పనిజేస్తవు. నీకు ఒక యూనిటు పనికి 150, 160 రూ||లు లెక్కకట్టిస్తడు. ఇగ నువ్వు దాంట్లకెల్లి నీ లేబరుకు కూలిగట్టిస్తవు. గట్ల.'' ''గట్లనా ? ఇగ గదంట్లనే పెద్దొర కొంచెమంత లాభం సూసుకుంటడన్నట్టు'' అన్నడు వీరయ్య. ''కొంచెమంత అనవడ్తిరేందయ్యా! మొత్తానికి మొత్తం వాడేదింటడు. అన్నమంతదిని ఎంగిలి విస్తరిచ్చినట్టు, ఉన్నకాడికి నాకి మీకింత వాసన చూపిస్తున్నట్టు యిస్తడు. వీడు ఈ కిలోమీటర్ను యాభయిలక్షల రూపాలకు గుత్తవట్టిండు గదా! గుత్తెదారు ఈ కిలోమీటరు కాలువను నాలుగైదు రీచులుగ చేసిండు. ఒక్కొక్క రీచుకు భూమిగట్టిదనం, మెత్తదనం మీదికెల్లి యాభయి, అరవైవేలు అని లెక్క గట్టిండు. అంటె మొత్తం కిలోమీటరుకు నాలుగయిదు లక్షల కంటె ఎక్కువకుర్చుగావు. ఇగ యాభయిలక్షల రూపాయల కెల్లి నాలుగయిదు లక్షలు! పోనీ పది లక్షలు కర్చయిన యనుకున్నా నలభై లక్షలు మీదమీదనే మింగుతండు గుత్తెదారు. ఇది ఒక్క కిలోమీటరుకే.'' ''ఇగ ఈ సుధాకర్‌రావు ఈ రీచులల్ల యూనిటుపనికి యింతని కట్టిస్తడు. మీ చిన రాజయ్య వంటి మేస్త్రీలు అయిదారుగురు కల్సి ఒకరీచు పని చేపిస్తరు. ఏజెంటు వీల్లకు లెక్కలుగట్టేటప్పుడు దొంగ లెక్కలు చేస్తడు. అదంత మింగుతడు. యూనిటుకు నూటరవయి అని రాసుకొని పది యిరవై తక్కువ యిస్తడు. ఇట్ల చిన రాజయ్య అటువంటివాల్లు యిరువై మందిదాక ఉన్నరు. వాళ్ళందరి పేరు మీద ఎంతెంత మింగుతండో యిగ లెక్కెయిన్రి.'' ''యూనిట్ల లెక్క చొప్పున పైసలు దీసికొని మేస్త్రి మీకు కూలి గట్టిచ్చి మిగిలింది పని చేయించిందానికింద లాభమని ఉంచుకొంటడు.'' ''మరి పెద్దొరకు నలుపై లచ్చలు ఎట్ల మిగులుతయి.'' ''ఆఁ! కరక్టే! అసలు మీరు ఒక రోజు పనిచేస్తే గుత్తెదారుకు యిరువైదు రూపాయలనుంచి ముప్పయి రూపాయలదాక పనిచేసినట్టు. మీ మేస్త్రి లాభం కింద ఓ రెండు మీ కూలికింద ఎనిమిది కలిసి బలికి పది రూపాయలు కర్చయితే మహా ఎక్కువ. ఇగ పదిహేను రూపాయల నుంచి యిరవై రూపాయలదాక ఒక్కొక్క లేబరు పేరుమీద ఒక్కొక్క రోజుకు సంపాదిస్తడు. ఇపుడు ఈ కిలోమీటరు పనిమీద రోజు నాలుగు వందల మంది లేబరు పనిచేస్తున్నరు. అంటే వాల్లందరి పేరుమీద వాడు ఒక రోజుకే ఎనిమిదివేల రూపాయల దాక సంపాదిస్తాండు. ఇట్ల వాని వర్కు రెండు మూడుచోట్ల నడుస్తాంది. అదేదో మంత్రట ఈ గుత్తెదారుకు చుట్టమట. ఆ మంత్రి వర్కు యిప్పిచ్చే పైరవిచేస్తే ఈ గుత్తెదారు ఎలక్షన్లప్పుడు ఆ మంత్రికి డబ్బుసాయం జేస్తడని వాళ్ళు వీళ్ళు అనుకోంగ విన్న.'' ''అవ్వ....! అసలు పని చేసే మాకు ఆర్రూపాలు! కార్లకెల్లి కాలు కింద వెట్టకుంట అట్లచ్చి యిట్లవోయి టోనికి గన్ని లచ్చల రూపాలు! హవ్వ! గిదేం సర్కారు! గిదేం నాయం!'' ''అదే మాట సివిల్‌ ఇంజనీర్లు సైటుమీదికి వచ్చినప్పుడు అడుగాలె. మీరందరు కలిసికట్టుగ నిలబడాలె. మీరందరు కలిసికట్టుగ నిలబడితే మిమ్ముల నెవడేం బీకలేడు. మీరు పనిజేత్తున్న సైటు దగ్గర ఉన్న పల్లెలల్ల జూడున్రి... ఇంక బొగ్గు బాయిలల్ల జూడున్రి- ఏదన్న అన్యాయం జరిగితే ఎట్ల పనిబందు వెడుతరో. ఆ బొగ్గు బాయిలల్ల మీకు తెలిసినోల్లుగూడ ఎవలన్న పని జేస్తుండొచ్చు. వాల్లనుగూడ యింక అడిగి తెలుసుకోన్రి. మొన్నకొన్ని రోజుల కింద కూలీలు పెంచాలని, బొగ్గు గూలి బాయిల చనిపోయినోల్లకు నష్టపరిహారం పెంచాలని పని బందు వెట్టిన్రు? అట్లా వారంరోజులు పని బందువెట్టిన్రో లేదో ప్రభుత్వం దిగివచ్చి వాల్లు అడిగిన వాటికన్నిటికి సరేనని ఒప్పుకున్నది. అటు మొకాన బీడి కార్మికులుగూడ కూలీలు పెరుగాలె అని బందు వెట్టిన్రు. బీడి కార్మికులైతే చాలవరకు ఆడోల్లే ఉంటరు. వాల్లుగూడ కొట్లాడి సాధించు కొన్నరు. అయిదురూపాయలున్న కూలి యిప్పుడు వెయ్యి బీడిలకు ఆర్రూపాల డెబ్బై పైసలకు పెంచుకున్నరు. ఇంకా ప్రావిడెంటు పండూ, బోనసూ ఎన్నో సాధించుకొన్నరు. అడుగంది అమ్మైన పెట్టదని సామెతనే ఉండె. ఈ కాలంల అడిగినా ఎవడు పెడుతడు. అందుకే కొట్టాడాలె. పని బందు వెట్టాలె. అప్పుడు వాల్లే దేవుడానుకుంట దిగివస్తరు. మీదే గనుక పని బందువెడ్తె గుత్తెదారు నోట్లె మన్ను వడ్డటేవాయె.'' ''పూటకు గతిలేనోల్లం పని బందువెడ్తె ఎట్ల! రాజ్యంగాని రాజ్యంల దేశంగాని దేశంల దిక్కులేని సావు జావమా! అదీగాక గిట్ల జరమత్తెనే తన్ని పని జేపిత్తున్రి. గీ దెబ్బలకు మందులిమ్మని అడుగుతేనేగా రాయలసీమోల్లను ఎట్ల గొట్టిన్రో మీకు తెల్వదా!'' అన్నరు వాల్లు. జ జ జ జ చీకటైంది. చుట్టలంటుకున్నయి. అవి రాయలసీమవాల్ల ఐదడుగుల ఎత్తున్న గుడిసెల గుంపులు. ఏడుస్తున్న పిల్లలను తల్లులు సముదాయిస్తున్నరు. ఎవరో అప్పుడే అన్నం తింటున్నరు. ఎవరో గుడిసెల జ్వరంతో మూలుగుతున్నరు. గాలి విసురుగా వీస్తున్నది. ''వారం రోజులాయెనే జరమచ్చి !.... అసలే సాతనైతలేదు. తిండిగుడ సయిపుత లేదు. సక్కగ పన్జేత్తలేరని మేస్త్రి ఎల్లయ్య బండబూతులు తిట్టవట్టె. అని బండబూతులకు బయపడి పనిజేత్తున్న గని, సలీరంల ఈసమెత్తు తాకదులేదే'' నర్సయ్య అన్నడు. ''నర్సన్నా ! యింటిమీదికి పానం గొట్టుకుంటాందే. ఇల్లిడిసచ్చి నాల్నెల్లాయె. మందుమాకులు లేకుంట ఇంక గిట్లనే యింకో ఆరం పదిరోజులు ఈన్నే ఉంటె, యిక్కన్నుంచి మన పీన్గులే ఎల్లెటట్టున్నయే. మనం మన ఊరికోదామే.'' ''ఔనే! ఈడన్నది నిజమేనే అని తిట్లకు బయపడి పనిజేత్తన్నంగని ఎవల సలీరంల ఈసమెత్తన్న తాకతున్నాదే? నిన్న చక్కరచ్చి అడ్డంబడితే నాగరీకం దొబ్బుతున్నవేందిర అని తిట్టలేదె? పనిజెయ్యకుంటె తిండి నీ తాతవెడ్తడా అనవట్టె.'' అదిగాక మనం బోతున్నట్టు దెలిత్తె బొక్కలిరుగదంతరు. మనం బోయేది పురుగుకుగూడ తెల్వద్దు.'' ''అవునె! రేపు రాత్రికి ఉన్నకాడికి అన్ని సదురుకొని పోదాం.'' ''మనం ఈడ సామాను సదురుకుంట జేర్తె ఆ లోపల ఆల్లచ్చి మెత్తగ దంతరు. అదిగాక మనకున్న సామానేందె రెండన్నందినే గిన్నెలే గదనే! పీకితె పీకని! అంతగొడ్తె అయిదుర్రూపాల సామానుగాదు.'' ''పానం కన్న ఎక్కువనా ! సామాను ఈన్నే పారేసిపోదాం.'' ''అవు ! నువు జెప్పింది మంచిగున్నది.'' కనుకవ్వ అన్నది. జ జ జ జ అందరూ నిద్రవోయిన యాల్ల. గడియారంల ఎంతైతాందో తెలిసినట్టు లేదు ఆల్లకు. మెల్లగా బయలుదేరిన్రు... ఇక్కడ్నుంచి బయటపడితే అదే సాలనుకున్నరు. ఎట్లనన్న తమ ఊరికి పోవచ్చనుకున్నరు. ఏదోతోవల వడి నడుత్తున్నరు... అది ఎవరో చూసినట్టున్నరు. కొద్దిసేపట్లనే ఎననుంచి జావా సైకిల్‌ మోటర్‌ సప్పుడు బర్‌బర్‌మని వినపడింది. వాళ్ళకు భయంబుచ్చుకున్నది... ''అరేయి ! ఎటువోతున్నర్రా !'' అని కుశలమడిగిండు సూపర్‌వైజర్‌ సుధాకర్‌రావు సైకిలు మోటరు మీదనుంచి దిగకుంటనే. ''అయ్య ! ఏదో అడిపోరగాండ్ల సీనిమ్మకోదామని రోజు మొత్తుకుంటె కొంచెం తీరిందని రెండో ఆటకు పోదామని బయలెల్లినం సారు.'' మనిషికింతమూట గట్టిన ధైర్యంతో మంచిగనే జవాబిచ్చిన్రు. ''ఇపుడేం సిన్మానయా ! రాత్రి పదకొండున్నరైంది. మీరు ఆడికివోయెటాల్లకే ఒంటిగంటైతది. మరి యీ ముచ్చట మందే జెప్తె మిమ్ముల్నందర్ని టిప్పర్ల పంపకపోదునా! రాత్రి బాగైంది గుడిసెలకోన్రి.'' ఏదో పని ఉన్నవానితీర్గ సైకిలుమోటరు మీద బంట్లతో పదిగజాలు దూసుకు పోయి సీకట్ల యింజన్‌ బందుచేసి దారికాసి నిలబడ్డట్టున్నడు సుధాకర్‌రావు. సైకిలుమోటరు నప్పుడు ఒకటేసారి బందయ్యేసరికి ఏజెంటు, బంట్లు ఎక్కడున్నరో ఊహించినట్టున్నరు. ఎనుకకు మర్లిన్రు. సాతగాని పానాలతో ఏంజేయలేక ఉసూరుమన్నట్టున్నరు. తెల్లవారింది. గోడ పర్రెల్లోంచి ఎలుగు అలా అలా దూరం పాకినట్టు ఈ వార్త సైటంతా పాకింది. అన్ని యూనిట్ల లేబరు ఎవలకు వాల్లు గుసగుసలు వెడుతున్నరు. సైటంత ప్రశాంతంగా ఉంది, రేపు పేలే అగ్నిపర్వతంలా. జ జ జ జ టిప్పరు స్పీడు పెంచిండు సురేందరు. రోజులు గడుస్తున్నయి. వాల్ల జీవితాల్లాగనె బరువుగ. ''ఇదిగో నర్సన్నా! ఇగమీకు ఈడ ఉండబుద్దిగానపుడు మీకు పంచ బచ్చ పరమాన్నాలు వెట్టినా సయిపది. ఎట్లైనారు మీరంత పీనుగులోలె'' ''ఏం జెయ్యాలె సారు ! మీరే ఏదన్న ఉపాయం చెప్పున్రి. ఏదో ఉపాయం జెయ్యవోతె మాది పారకపాయె. ఇక మీరే ఎట్లన్నజేసి మేమందరం అవుతలపడే ఉపాయం జెప్పున్రి. ఈన్నుంచవుతలపడ్తె అవుతల ఎట్లనన్నజేసి యింటికివోతం! ఆఖరికి బిచ్చమడుక్కోని తినుకుంటనైన ఇంటికి జేర్తం. ఈడమాత్రం బతికెటట్టులేం'' కలుగుతున్న బాధను లోపల్లోపలే కుక్కుకొంటున్న వాల్లను చూస్తే కండ్లకు నీరచ్చింది సురేందరుకు. ''మీరు జిల్లా కలక్టరుకు మీ పరిస్థితి ఉన్నదున్నట్టురాసి, ఇంటికి వోతమంటె పోనిస్తలేరని, జ్వరాలస్తె మందులిస్తలేరని.... అన్ని వివరంగ రాసి దరకాస్తు దీసికొనిపోయి కలువున్రి.'' ''ఆల్లకు దెలిత్తె మమ్ములనరికి కాల్వకట్టకు పాతరవెట్టరా.'' ''అట్లేం జరగది మీరు దరకాస్తు రాసినట్టు ఎవరికి తెలువనీయకపోతె ఏంగాదు.'' ''మరి మావోల్లందర్ని యిసారిచ్చు కోవాల ! ఏమంటరో మరి!'' జ జ జ జ వాళ్లకు టిప్పర్‌ డ్రైవర్‌ సురేందర్‌ మా గురించి, మా సంఘాల గురించి చెప్పినట్టున్నడు. వాళ్ళు మమ్ముల్ని కలిసి గోడు వెల్లబోసుకున్నరు. మూడు నాలుగు సంస్థల తరఫున నేను, సముద్రాల భూమయ్య, చెల్పూరు దేవయ్య, రుద్రవరం ఎల్లయ్య, గోవిందరెడ్డి తదితరులం కలిసి సైట్‌మీదికి పోయినం. సుధాకర్‌ రావు మామీదిమీదికి లేసిండు. తానే కాంట్రాక్టర్‌ అన్నట్టు, పోలీసు అధికారి ఐనట్టు బెదిరించిండు. కూలీలను తెచ్చిన మేస్త్రీలు, గూండాలు మా చుట్టూ దడి గట్టిన్రు. లొల్లిపెంచి మమ్మల్ని తందామని చూస్తున్నరు. వాళ్ళంత సుధాకర్‌రావు సైగకోసం చూస్తున్నరు. మేం అన్ని విషయాలు అక్కడ చర్చించడం అనవసరం అనిపించింది. సాయంత్రం అదేరోజు జిల్లా కలెక్టర్‌ కె. ఎస్‌. శర్మను కలిసినం. ఆయన రేపే ఉదయం ఈ విషయంపై చర్య తీసుకుంటానని హామీ ఇచ్చిండు. తెల్లారే కరీంనగర్‌ కలెక్టర్‌ కె. ఎస్‌. శర్మ, జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ను పిలిపించిండు. భయపడుకుంటూ కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చిండు లేబర్‌ ఆఫీసర్‌. కలెక్టర్‌ చెప్తుంటే లేబరాఫీసరు ఆ అన్యాయాల గురించి అపుడే వింటున్నట్టు బాధపడి పోయిండు!. లేబర్‌ ఆఫీసర్‌ పోయినంక కరీంనగర్‌ కలెక్టర్‌, అనంతపూర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసిండు. అనంతపూర్‌ కలెక్టర్‌ సరే అంటూ చర్యలు తీసుకుంటానన్నడు. జ జ జ జ అది పట్టపగలు. అనంతపూరు లేబరు, కరీంనగర్‌ లేబరాఫీసరు కలిసి ఒకే జీపు నుంచి దిగుతుండడం చూసిన సుధాకర్‌రావుకు పట్టపగలే సూర్యుడు చుక్కలు కలిసి కలిపించిన్నట్లైంది. ''నమస్తే సార్‌'' అంటు పలుకరించిండు సుధాకర్‌రావు. ''నేనేదో మనసులో పెట్టుకొని యిలా చేశాననుకోకుండ్రి నా ప్రమేయం చాలా తక్కువ. ఇది కొత్త కలక్టరు చేసిండు. దీని మీద యాక్షన్‌ తీసికొమ్మని నాకు రాసిండు యిదిగో చూడు'' అంటూ చూపించిండు లేబర్‌ ఆఫీసర్‌. ''ఈ కలెక్టరుకు మీ గుత్తెదారు విషయం యింకా తెలియనట్టున్నది. 'సీయం' మనిషిని ముట్టుకొనేంత ధైర్యం ఈ కలెక్టరుగారి కెక్కడిది. ఏదో యింకా తెలియనట్టుంది.'' ఇంగ్లీషు యితరులెవరికి అర్థంగాకుండ వాళ్ళిద్దరు స్వేచ్ఛగ మాట్లాడుకోవడానికి అవకాశం యిచ్చినందుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నరు. రెండ్రోజుల క్రితం వచ్చిన సంఘాలవాళ్లను బెదిరించడం ఎంత పొరపాటయింది అనుకున్నడు. దరకాస్తులోని వివరాలు చూసి దూరంగ నిలబడ్డ సురేందర్‌వేపు ఎందుకో అదోరకంగా చూసిండు సుధాకర్‌రావు. వానికి రోజులు దగ్గరబడ్డయి అనుకున్నడు. ''రాయలసీమ వాళ్ళను రమ్మంటె అందరచ్చిన్రేంది. ఇదేమన్న చోద్యమా? పనిచేసుకో పోండ్రి'' అన్నడు సుధాకర్‌రావు. అందరు కలిస్తే కొంప మునుగుతదని భయం. అందరు ఇట్లనే నేర్చుకుంటరని భయం. లేబర్‌ ఆఫీసర్‌ కూడా సుధాకర్‌రావు చెప్పిన ఇషార అర్థం చేసుకున్నడు. ''అవును ! మిగతా వాళ్ళంతా ఎవరి పని వాళ్ళు చూసుకోండ్రి.'' అన్నడు లేబరాఫీసరు. పాలమూరోల్లు, ఒరిస్సోల్లు ఎల్లిపోయినంక అనంతపూరోల్లను దగ్గరకు పిలిసి... ''ఈ దరఖాస్తు ఇచ్చింది మీరేనా'' అడిగిండు ఆఫీసరు. ''అవునయ్య'' అన్నరు అందరు ఒకేసారి. ''మంచినీళ్ళు తెద్దాం రాన్రి'' అన్నడు మేస్త్రీ ఎల్లయ్య ఆడోల్లను ఉద్దేశించి. వాల్లు తటపటాయిస్తున్నరు. ''ఫర్లేదు! మీరెళ్ళండి మీరందరు వచ్చేవరకు యిక్కడే ఉంటాను'' నమ్మబలికిండు ఆఫీసరు. అయిష్టంగానే కదిలిన్రు ఆడోల్లు. ''మీకు మందులు, సెలవులు ఇస్త్తలేరని మంచి తిండిపెట్టడం లేదని మీకోసం వేసిన తడుక షెడ్డులు బాగాలేవని రేకుషెడ్డులు అసలే వేయించలేదని రాశారు మీరిందులో ! నిజమేనా?'' ''అయ్య! మీరు జూస్తలేర! మేం ఎట్లున్నమో! మా గుడిసెట్లున్నయో! కనవడ్తలేవ!'' ''అయితే యికనుండి మీరు కోరిన సౌకర్యాలన్నీ కల్పిస్తే పని చేసుకొంటు ఇక్కడే ఉంటరా!'' అడిగిండు ఆఫీసరు. ''మీరేమన్న జెయ్యిన్రి గని మాత్రం యింటికే వోతం'' అరగంటసేపు ఎందుకు అని, ఉండమని యక్షప్రశ్నలతో గుచ్చిగుచ్చి అడిగి కాంట్రాక్టరు తరపు పకాల్తాలో ఓడిపోయినట్టు మొకం బెట్టిండు లేబర్‌ ఆఫీసరు. ''మాకు తిండివద్దు! తిప్పలువద్దు! అయ్యా! లేబరాఫీసరు సారూ! మీరు కొంచెం ఆగున్రి. మీరు ఎనుక ఉండున్రి మేం ముంగట నడుత్తం'' అన్నరు. ''వీళ్ళని టిప్పర్లో వరంగల్‌ దాక పంపించండి.'' ''ఈ జీపులో కూడా కొందరు ఎక్కండి టిప్పర్లో పట్టకపోతే'' కొరకరాని కొయ్యలైన ఆ లేబర్ను ఏం చేయాలో తెల్వక అన్నడు లేబరాఫీసరు. టిప్పరు క్యాబిన్లో నర్సయ్య, సాయిలు కూర్చున్నరు. పేరుపేరున కృతజ్ఞతలు చెప్పుకున్నరు సురేందరుకు. టిప్పరు ముందు నడిచింది. జీపు వెనక వచ్చింది. వరంగల్‌ రైల్వేస్టేషన్ల దించి వచ్చిండు సురేందర్‌. మరుసటి రోజు ఏదో చెప్పి, సురేందర్‌ను ఉద్యోగంలోంచి తీసేసిండు సుధాకర్‌రావు. ఆర్టీసీలో డ్రైవర్‌ పని దొరకకపోతదా అని సురసుర సూసుకుంట ఎల్లిపోయిండు సురేందర్‌. ఆ చూపులకు సుధాకర్‌రావుకు భయం పట్టుకున్నది ఎక్కడన్న కనబడితే దొరకబట్టి కొడతడేమోనని.! అనంతపురం లేబర్‌ కరీంనగర్‌ కలెక్టర్‌కు చెప్పుకొని ఎవరింటికి వాల్లు వెల్లిపోవుడు చూసి కెనాల్‌ లేబర్‌కు ఎంతో ధైర్యం వచ్చింది. వాల్లది తమ విజయమే అన్నట్టు చాటుకున్నరు. అంతవరకు కనుసైగల సంభాషణ గుసగుసల భాషగా ఉన్న వాల్ల బాధల భాష గులక రాల్ల భాషగ గలగల లాడింది. అయినా పాలమూరు, ఒరియా లేబరు మాత్రం పనిచేసుకుంట కాల్వమీదనే ఉన్నరు. జ జ జ జ టిప్పర్‌ డ్రైవర్‌ సురేందర్‌ను ఎల్లగొట్టినంక సుధాకర్‌రావుకు అన్నిటికి కష్టమైతంది. సురేందర్‌ అన్నిపనులు సక్కగ చేసేటోడు. చదువుకున్నోడు అందర్నీ ఎట్ల మర్యాద జేయాల్నో బాగా తెలిసినోడు. ఇప్పుడచ్చిన డ్రైవరు టిప్పర్‌ పని తప్ప ఏపని చేయనని మొండికేసిండు. ఉండుమంటే ఉంట, పొమ్మంటే పోత. అని బెదిరించిండు. దాంతోటి అన్ని పనులు సుధాకర్‌రావుమీదనే పడ్డయి. ఆఫీసర్లకు మర్యాదలు సరిగ్గా జరగకపోతే కాంట్రాక్టరుకు చెప్పుకుంటరు. కాంట్రాక్టరుతోటి తిట్లు పడాలె. సుధాకర్‌రావుకు పనిజెప్తే వినోటేడు లేకుండైండు. ఎవరికి చెప్పినా ఆ పని నాకు రాదు సార్‌ అని తప్పించుకుంటున్నరు. సుధాకర్‌రావుకు చిరచిర మంటున్నది. ఎవరచ్చినా అన్నిటికీ తనే ఉరుకుడైతున్నది. ఎవరినో పిలిచి... ''ఇదిగో! ఈ సైకిల్‌ మోటర్‌మీద వోయి ఒక పెట్టె బీర్లు, రెండు విస్కీ బాటిల్సు తీసుకరా ఫో'' అన్నడు ఏజెంటు సుధాకర్‌రావు. ''వెనుక బీర్లు గట్టుకొని నాకు తేరాదు. నారాయనను నాతోటి తోలియ్యిన్రి. వెనుక కూర్చుండి పట్టుకొంటడు.'' ''ఛ! ఛ! నీకు ఏ పని జెప్పినా యింతే. నీకు జెప్తే నీతోకకు జెప్తవు. నాకు సురెందరే మంచిగుండె. అంత చదువు చదివినా గర్వం లేకుండె. ఏ పనంటె ఆ పని సక్కగ జేస్తుండె. రాత్రంటె రాత్రి, పగలంటె పగలు ఎప్పుడైనా పని చేస్తుండె. నీ తీర్గ ఎన్నడు వంకలు పెట్టకపోవు. గుత్తెదారుకు జెప్పివాన్ని దీసేయించుడు తప్పైంది..... ఇగ దోల్కపో! వంటాలస్యమైతే కానీ. ఏం జెయ్యాలె'' సనుగుతూ అన్నడు సుధాకర్‌రావు. ''మల్లయ్యా! నువు పక్క పల్లెలకోయి రెండు కోల్లుజాడ దీస్కరా'' అక్కడ వున్న ఒక బంటుతో అన్నడు సుధాకర్‌రావు. ''నారిగాన్ని అటు తోలెయ్యవడ్తిరి. నేను కోల్లకు వోతె ఇగ మసాల ఎప్పుడు నూర్తరు. బగారెప్పుడైతది? ఇల్లిల్లు ఎవడు దిరుగాలె?'' అనుకున్నడో ఏమో. ''అయితే చినరాజయ్య మేస్త్రిని ఇక్కడికి రమ్మను'' చినరాజం వచ్చినంక ''ఇదిగో రాజం! ఈ పక్క పల్లెలకోయి రెండు కోల్ల జాడ దీస్కరా'' అన్నడు ఏజెంటు. ''నేను కోల్లకు దిరుగ వోతె సైటు మీద ఎవడు పని జెయ్యడు. కావాలంటె యిద్దరు లేబర్ను దోల్త. గాలికి బోయే కంప తనకెందుకనుకున్నాడో ఏమో. ''తొందరగ పంపించు'' అసహనంతో అన్నడు సుధాకర్‌రావు. పది నిమిషాలు గడిసినయి. మేస్త్రి చెప్తే గాలన్న వచ్చి షెడ్డు దగ్గరున్న డిజెల్‌ డ్రమ్ముకానుకొని నిలబడ్డడు. పందిరి గుంజ సాటుకు వీరయ్య నిలబడ్డడు. అచ్చిన పని అల్లే చెప్తరనుకున్నట్టున్నరు. పైసలు దీసుకునుటానికి ఎవలు ముందుకు కదల్లేదు. అంతవరకున్న అసహనం కోపంగ మారినట్టుంది సుధాకర్‌రావుకు. ''అరేయి లంజకొడుక చెప్పేది మీక్కాదుర! చెప్తె చెవులినపడ్తలేవుర!..... ...ఎవడు కదలడేంర!'' అంటూ నోట్లు పట్టుకొన్న చెయ్యితో గాలన్నను పిలిచిండు రమ్మని. ''నా పేరు లంజకొడుకుగాదు, గాలన్న'' కోపాన్ని బిగవట్టినా అయినా మాట గట్టిగనే వచ్చింది. సుధాకర్‌రావు అవాక్కయిపోయిండు అనుకోని జవాబుకు. అటుయిటు చూసిండు బీర్ల కోయిన టిప్పరు డ్రైవరు, బంటుగాడు ఇంకా రాలేదు. ఉన్న ఒక్కడు షెడ్డులోపల ఏదో నూరుతున్నట్టున్నడు. లోపల నూరుతున్నట్టె పండ్లు నూరినట్టున్నడు ఏజెంటు. అంత మాట అన్నంక గాలన్నకు పైసలిచ్చి పని చెప్పటానికి మనుసొప్పలేదు. 'అని పేరేంది' అన్నడు సుధాకర్‌రావు. 'ఆయన పేరు వీరయ్య' అన్నడు గాలన్న. సుధాకర్‌రావుకు అహం దెబ్బ తిన్నది. ''వీరయ్యా మీరిద్దరు గల్సి, పల్లెకువోయి తొందరగ కోల్లు జాడదీస్కరాన్రి'' అని నోట్లు చేతిల బెట్టిండు. వాల్లు ఎల్లిపోయిన్రు. ''లేబరు పూర్వంలా లేనట్టున్నరు. బాగ తెలివి మీరిపోయినట్టున్నరు అరేయి అంటే పడుతలేరు.'' అన్నడు సూపర్‌వైజర్‌ సుధాకర్‌రావు. సూపర్‌విజన్‌కి వచ్చిన సైట్‌ ఇంజనీర్‌ సుధాకర్‌రావుతో మాట కలిపిండు. ''నేను నాగార్జునసాగర్‌ డాంలో జేయీగా అపాయింటయినపుడు యిలా ఎవడైనా మాట్లాడితే మరుసటిరోజు వాడు కన్పించకపోవు. ఇపుడు ఎవర్ని ఏమీ అనొచ్చేట్టు లేదు. బుజ్జగించి పని చెప్పాల్సి వస్తాంది.'' అన్నాడు యింజనీరు. ఈఈగా ప్రమోషన్‌ రావాల్సినా ఎవనికి వెట్టకుంట ఉన్నదంత తనే దోసుకు తినే తత్వంగలవాడు కావడంవల్ల పై అధికార్లకు ఏమి ముట్టజెప్పక పోయేసరికి 'కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టు' సరిగ్గాలేక ప్రమోషన్‌ ఆగిపోయి ఏఈగానే ఉండిపోయిండు. ''సరే.... మేం ఈ ప్రక్కనున్న సైటుకూడా చూసొస్తాం'' అని లేసిన్రు. జ జ జ జ ఎర్రజెండాలు పట్టుకొని అటుయిటూ ఊపుతున్నారు. నీటి పాయలో పలుగు పారతో ఎవరూ పని చెయ్యడం లేదు. అల్లంత దూరంల చెట్లకింద అందరు జమైన్రు. అట్ల అందరు ఒక కాడ జమగావడం అరుదైన సంగతి. వాల్లంత కాలుటానికి తయారు అన్నట్టున్న నల్ల బంగారం ఓలె ఉన్నరు. ముడ్డి పంచెతప్ప ఎవరి పెయిమీద అంగీలు లేవు. మాసి పోయిన తలలు, లేసిపోయిన వెంట్రుకలు, చెమటలు కారిన శరీరాలు, చిరిగిపోయిన చీరలు, అన్నీ కలిసిపోయి 'ఒకే రంగులో' కన్పిస్తున్నరు. పొలికేక.... రాజయ్య, పెంటయ్య, వీరయ్య, గాలన్న మొదలైనవాళ్ళు ఏడెనిమిది మంది దాక నీటి పాయలోకి నడిసిన్రు. మరో పొలికేక.... ఆ కేక విని గబగబా దబదబా దూరంగ ఉరికిన్రు. అలా క్షణం గడిచిందో లేదో భూమి దద్దరిల్లినట్లు ధ్వని వినిపించింది వాల్లకు. ప్రాణాలు పోయినట్టే ననుకొని పరిగెత్తిన్రు. అయినా లాభం లేకపోయింది పట్టున పగిలి ఆకాశంలకు ఎగిరిన బండలు రాజయ్య, పెంటయ్య లిద్దరి మీద బడ్డయి. బిగ్గరగా ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకుంటనే పడిపోయిన్రు. అంతవరకు విశ్రాంతిగా వున్న వాతావరణంలో కలకలం మొదలైంది. ముందుగా ముందుకు ఉరికిన వీరయ్య, గాలన్న మొదలయిన వాల్లు ఆర్తనాదం విని ప్రాణాలు పోయినాసరే ననుకున్నట్టున్నరు. వడివడిగా వెనుదిరిగి పడిపోయినోల్లను మోసుకొచ్చిన్రు. అయ్యో! అయ్యో! అంటున్నరు. ఏమవుతుందోనని ప్రాణాలు బిగపట్టి చూస్తున్నారంత. రాల్లకు వెట్టిన బత్తీలు రెండు ప్రమాదవశాత్తు తొందరగ పేలి క్షణాలమీద ప్రమాదం జర్గిపోయింది. జ జ జ జ డాక్టరు కన్సల్టింగు రూంల కూర్చున్నడు. డాక్టరు ఎదురుగనే గాలన్న వీరయ్య ఏంజెస్తడో అన్నట్టు ఎదురుసూసుకుంట వంగి నిలబడ్డరు. ఏడుపులు గట్టిగ వినపడుతున్నయి డాక్టరుకు. ''ఆ ఏడుపులు ఆపమనండి. బయటకు పంపించండి లేకపోతే'' అన్నడు డాక్టరు. ''రాజయ్య తల పగిలింది. వెన్నుపూస కదిలింది. ఇంకా చిన్న చిన్న గాయాలు చాల అయ్యాయి. పెంటయ్య కండలన్నీ దెబ్బదిన్నయి. వెన్నుపూస విరిగింది. దెబ్బలుకూడా బాగానే తాకాయి. చాలా రక్తం కారిపోయింది. యిపుడు శరీరంలో రక్తం చాలా తక్కువగా ఉంది. గ్లూకోజులు యింకా రెండు మూడు రోజులవరకూ ప్రతి గంటకూ ఎక్కించాల్సి ఉంటుంది. వీరికి రెండు మాసాలు విశ్రాంతి అవసరం. ఒక నెల మాత్రం ఈ హాస్పిటల్లోనే వుండాల్సి వుంటుంది. మీరెవరూ అలా వూరికే మాట్లాడించకండి. మాట్లాడిస్తే తల కండరాలన్నీ కదులుతాయి కుట్లు కుదురుకోవు మరి. మీరు వెళ్తె వెళ్ళండి. వీళ్ళని కనిపెట్టుకు ఉండడానికి వీళ్ళ భార్యల్ని వెంట ఉండమనండి. కాని ఆ ఏడ్పులు పెడబొబ్బలు మాత్రం వద్దని చెప్పండి. వాళ్ళని ఊరికే మందలించొద్దని చెప్పండి.'' ఎర్రని రక్తం మరలున్న ప్రతిచోట తెల్ల పట్టిలు వడ్డయి. ఇద్దరికి పెయి నిండా తెల్లపట్టీలే అయినయి. నల్లని మనుషులను తెల్లపట్టీల్తో చూస్తే కడుపులో పేగులు దేవుకువచ్చి నట్టయినయి ఎల్లయ్యకు, లచ్చవ్వకు. భోరుమన్నరు. డాక్టరు కోప్పడితే కుంపటోలే బాధను కడుపులనే కుక్కు కున్నరు. జ జ జ జ ''ఆల్లను నెలరోజులు దాక దావకాన్లనే ఉంచుమన్నడు డాక్టరు. మరి కర్సులకు పైసలియ్యిన్రి'' అడిగిండు గాలన్న. ''యిపుడు పైసలు ఎక్కువలేవు. వారం రోజులకోసం యీ పైసలు యిచ్చి రాపోన్రి. ఆ లోపలనేను అటువోయే పనిగూడ వున్నది. అటువోయినపుడు నేను రాంగ అక్కన్నే పైసలు యిచ్చివస్త. అట్లనే ఒకసారి చూసినట్టుగూడ ఉంటది.'' అని సుధాకర్‌రావు కొంత పైకం చేతిలపెట్టిండు గాలన్నకు. జ జ జ జ సుధాకర్‌రావు పైసలు యిచ్చి పరామర్శించి వచ్చే బదులు, ఎందుకోగాని, డాక్టర్ను కలిసి, ఏదో మాట్లాడి వాళ్ళను టిప్పర్లో వేయించుకొని, సైటుకు తెచ్చిండు. 'వాయ్యో! అంటు విలవిలాలాడిన్రు' టిప్పర్లో నుడుములు ఎత్తేసి. రెండుమూడ్రోజులు విశ్రాంతి దొరికింది. పనిచేసిన పానానికి అందరిని చూస్తూ కూలిపోతున్నదని విలవిలలాడిండ్రు. తిండి సయిపక కొట్టుకున్నడు. పనిజేత్తె ఏదన్న కొనుక్కొని తినవచ్చని ఆశపడ్డరు. జ జ జ జ విశ్రాంతి తీసుకొమ్మన్నా తీసుకోక ఆరోజు మెల్లమెల్లగ పనిచేసిండు రాజయ్య. మూడోరోజు ఉదయం రాజయ్య లేవకుంటయ్యిండు. దావకాన్నుంచి తోలుకచ్చిన కాన్నుంచి బిక్కుబిక్కుమంటనే ఉన్నది లచ్చవ్వ. ఆరోజు రాజయ్య నిడిచి పనికి పోబుద్దిగాలేదు. ''అంత ఎట్లనో అయితాంది'' అన్నడు రాజయ్య. లచ్చవ్వ మరింత భయపడ్డది. అందరు పనిమీదికి వోయిన్రు. అడివిల ఉన్నట్లనిపించింది లచ్చవ్వకు. కాల్లు చేతులు విలవిల తన్నుకున్నడు రాజయ్య. మెడ వంకర పెట్టిండు. నాలుక కొరుక్కున్నడు. ఏం చెయ్యాల్నో తెల్వక లచ్చవ్వ నెత్తంత కొట్టుకుంటు సైటుకెయిగావు కేకలు పెట్టింది. తల్లితో పిల్లలు ఏడుపు అందుకొన్నరు. గాలయ్య, వీరయ్య ఉరికి వచ్చిన్రు. 'అయ్యో! అయ్యో!' అని దవాకాన్లకు తోల్కపోదామని తయారవుతున్నరు గాలన్న, వీరయ్యలు. వాల్లు చూస్తుండంగనే కాల్లు సేతులు బిగపట్టి, వనుకుతుండగ, మెడలు వంకర తిరుగంగ, నాలుక్కరుచుకొని, కండ్లు తేలేసి వాళ్ళనే చూస్తూ ప్రాణం యిడిసిండు రాజయ్య. టెటానస్‌ రాజయ్య ప్రాణం తీసింది. 'డాక్టరు వద్దనంగ ఏజెంటు తోలుకచ్చిండు.' లచ్చవ్వ భోరుమంది. పిల్లలు గొల్లుమన్నరు. లచ్చవ్వ ఏడుస్తుంటే వాల్ల కండ్లల నీళ్ళు తిరిగినాయి. దుక్కంతో వాళ్ళ హృదయాలు బరువెక్కినై. నల్లనిరాల్లోలె నిలబడిపోయిన్రు. వాల్లకండ్లల్ల తమవైపే చూస్తూ ప్రాణాలు విడుస్తున్న రాజయ్యనే కన్పిస్తున్నడు యింకా........ బరువైన నిశ్శబ్దంలో లచ్చవ్వ, పిల్లల ఏడుపు తప్ప ఏమీ లేదు. ఆ ఏడుపు సైటంతా యినపడుతున్నది. అందరూ సుధాకర్‌రావుండే గుడిసె షెడ్డుకెసి చూసిన్రు. సుడిగుండం లాంటి ఆ చూపులు తప్పించుకొనేటందుకే అన్నట్టు సుధాకర్‌రావు ఆరోజు ఉదయమే పని పేరుమీద ఎటో పోయిండు. జ జ జ జ రాత్రి పొద్దువోయేదాక ఎవ్వరు నిద్ర వోలేదు. సుధాకర్‌రావు వత్తడేమోనని ఎదురు చూసిన్రు. ఆ చీకటిరాత్రి ఆ ఎదిరి చూసుడుతోనే గడిచిపోయింది. వాల్ల కండ్లల్ల కాలేసిన రాజయ్యనే మెదులుతాండు. 'అగో! ఆడే నన్ను జంపింది' అని రాజయ్య చూపులు వాల్లకు చెబుతున్నట్టని పించింది. లచ్చవ్వ ఏడ్పు వాల్లకు చెవులల్ల యింకా యినిపిత్తున్నట్టే ఉన్నది. తల్లి వెంట పిల్లలు యింకా బావురుమని ఏడుస్తున్నట్టే వాల్లమనుసుల్లో కనిపిస్తాంది. ఏం జెయ్యాలనేది అలోచించుకుంటనే మాగన్ను నిద్రవోయిన్రు. చీకటి వోలేదు. ఇంకా తెల్లరలేదు. ఉలికిపడి లేసిండు గాలన్న మాగన్ను నిద్ర నుంచి ఏదో మర్సిపోయినట్టు. అందర్ని లేపిండు. 'ఎన్ని రోజులే ఈ పాడుబడ్డ బతుకులు? నిన్న రాజన్న జచ్చిండు, యియ్యాల నేను జత్త. రేపు నువ్వు జత్తవు. దీనికి యిరుగుడు మందు జూడాలె.' ''పుట్టిందోనాడు, నచ్చినందోనాడు, గద్దప్పుతాది ఎన్ని దప్పినా సత్తెసత్తిమి. పోంగ ఏం గొంచవోతన్నం తియి! నచ్చెదాక కడుపు తిప్పలేనాయె. ఇగ సుకపడే దెన్నడు. గీ పాడువడ్డ బతుకులకు అపుడు సత్తేంది ఇపుడు జత్తేంది?'' ''మనయి మొండి జీవాలు గాదె. గట్ల జచ్చేదుంటె ఎన్నడో సద్దుం గీ కట్టాలకు, ''మరి ఏమంటవె గాలన్న ?'' ''నేననేదేందె ? మీరన్నయే నేనంటన్న.'' ''కూలీలు పెంచాలె. మందులిప్పియ్యాలె. దెబ్బలు దాకుతె మంచిగయ్యేదాక దావకాన్లనే ఉంచాలె. ఆ కర్సు ఆల్లే పెట్టుకోవాలె. పెంటన్ని మల్ల దావకానకు దోల్క పోవాలె. ఆడ ఉన్నన్ని రోజులు, కూలి సతెం గట్టియ్యాలె.'' ''మంచి షెడ్లు ఏపియ్యాలె. ఆరానికో సీనిమ్మ జూపియ్యాలె.'' ''యిపుడు రాజన్న పిల్లగాండ్లకు ముప్పయి వేలు యియ్యాలె. ఆధారం జూపియ్యాలె.'' ''రేపెవలన్న జత్తె గూడ ఆని పెండ్లాం పిల్లలకు ముప్పయి వేలిచ్చి ఆదారం జూపియ్యాలె.'' ''ఎవలదాల్లను సొంతం అండుకోనియ్యాలె'' ''ఎవల పైసలు ఆల్లకు ఆంగడి రేపనంగ బట్వాడ వంచాలె.'' ''దేనిగ్గూడ పైసలు పట్టుకోవద్దు.'' ''జరమచ్చి పంటె కూలి గట్టియ్యాలె.'' ''గుత్తెదారుగాడు దెబ్బకు దిగిరావాలె మన దగ్గరికి మనం పని బందువెడ్తె.'' ఒరిస్సోల్లు గూడ పని బందువెడ్తనన్నరు. ఇగ గట్లయితె మొత్తం పనే వంటది. పక్క పల్లెలోల్లు గూడ డబలు కూలిత్తనన్నా 'మీరు పని బందువెడ్తె గిట్ట పన్కిరమ్మంటె పోం' అని మాటిచ్చిన్రు.'' ''ఇగ గుత్తెదారుగాడు, యింజనీరుగాల్లు గాదు ఆల్ల తాతలుగూడ దిగివత్తరు మనకాడికి.'' ''ఎవడచ్చినా మనను యిగ ఎవడేం జేయలేడు.'' ''అడిగినయన్ని యిచ్చెదాక పన్జేసేది లేదు. యింకోల్లను జెయ్యనిచ్చేది లేదు.'' ''కాల్వమీది లేబరు సంగం.'' ''వర్దిల్లాలె'' ''గుత్తెదార్ల యింజనీర్ల దవురుజెన్నం, దోసుడు'' ''నశించాలె.'' ''గడ్డపారలే బెదురుతాయిరా! ఈ పాలమూరు లేబరంటే మొండిరాల్లే పగులుతాయిరా!'' కాల్వమీది పాలమూరు లేబరు జీవితాల్లో తొలిసారిగ తొంగిచూసినట్టు ఆల్ల గుడిసెల మీది ఆకాశం ఎర్రవడ్డది. కాంట్రాక్టర్‌కు, కరీంనగర్‌ కలెక్టర్‌కు, లేబర్‌ ఆఫీసర్‌కు, సైట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు, మెల్లమెల్లగ విషయాలు తెలిసినయి. పరుగుపరుగున కలెక్టర్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ను పిలిపించిండు. కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడుమన్నడు. హైదరాబాదులో ఉన్న కాంట్రాక్టర్‌ ఫోన్‌లు కలిపిండు. 'తిరుగుబాటు' పేరుతో సృజన మాసపత్రిక, 1980 భూమిక కథా సంకలనం, 1990కు సవరించిన ప్రతి.