Friday, October 7, 2016
కృతజ్ఞతలు...
ఇందులోని కథల్లో కొన్ని 1978-1980 రాసినవి. అవి ఇటీవలే పత్రికలనుండి సేకరించడం జరిగింది. అందుకు ఎందరో సహకరించారు. శ్రీకాకుళంలోని కథా నిలయం నుండి ఓబులేశు కొన్ని కథలు సేకరించి యిచ్చారు. కథలను సేకరించడంలో ఎందరో సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు.
ఈ కథల్లో కొన్ని ఆయా కథా సంకలనాలలో చేర్చబడ్డాయి. ఆయా సంకలనాల సంపాదకులకు, తొలుత ప్రచురించిన పత్రికలకు, వాటి సంపాదకులకు, అచ్చైన తర్వాత అనేక సూచనలు చేసిన పాఠకులకు, మిత్రులకు అభినందించిన సాహిత్య అభిమానులకు కృతజ్ఞతలు.
జ 1991లో వెలువడిన 'పాలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ కథకులు, చిత్రకారులు చంద్రగారికి...
జ 1997లో వెలువడిన 'స్మృతి' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ గారికి...
జ 2000లో వెలువడిన 'మమతలు - మానవ సంబంధాలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన శ్రీ డిజైన్స్ కరుణాకర్‌గారికి...
జ 2003లో వెలువడిన 'వేపచెట్టు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన కాస్మిక్ గ్రాఫిక్స్ అయిల సైదాచారి గారికి...
జ 2004లో వెలువడిన 'తేనెటీగలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ గారికి...
జ 2004లో వెలువడిన 'పాలు' - 'సదువు' ఇతర కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన అంకుష్ గ్రాఫిక్స్‌వారికి...
జ 2005లో వెలువడిన 'బతుకుపయనం' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ గారికి...
జ 'కాలం తెచ్చిన మార్పు' కథల సంపుటి బ్యాక్ కవర్ ఫోటోతోపాటు షష్ఠిపూర్తి సందర్భంగా అనేక ఫోటోలు అందంగా తీసి అందించిన సుధాకర్‌గారికి...
అనేక పుస్తకాల ముఖచిత్రాలను తీర్చిదిద్దిన ఏలె లక్ష్మణ్‌గారికి... సుప్రసిద్ధ రచయితలు, చిత్రకారులు శీలా వీర్రాజుగారికి... రమణ జీవి గారికి... భరత్ భూషణ్ గారికి... జుగాష్‌విలి గారికి... రెండు దశాబ్దాలుగా అనేక విషయాలు కలిసి పంచుకుంటున్న డా. కత్తి పద్మారావుగారికి... సకాలంలో అందంగా ముద్రిస్తూ అందిస్తున్న కర్షక్ ప్రింటర్స్ వారికి, ఆయా పత్రికల్లో కథలకు చక్కని బొమ్మలు వేసిన బాలి, కరుణాకర్ తదితర చిత్రకారులకు కృతజ్ఞతలు.
ఆయా కథా సంపుటాలకు ముందుమాటలు రాసిన కీ.శే. మధురాంతకం
రాజారాం, జయధీర్ తిరుమలరావు, డా. కేతు విశ్వనాథరెడ్డి, సదానంద శారద,
డా. బోయ జంగయ్య, డా. కాలువ మల్లయ్య, డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి,
డా. సి. నారాయణరెడ్డి, చలసాని ప్రసాదరావు, జి. గంగాధర్, డా. పత్తిపాక మోహన్, గూడూరి సీతారాం, కొక్కుల భాస్కర్, డా. ఎస్.వి. సత్యనారాయణ, డా. అంబటి సురేందర్‌రాజు. డా. జైశెట్టి రమణయ్య, ఎన్. వేణుగోపాల్, సారథి శ్రీనివాస్ గారలకు... ఆయా పుస్తకాలను పత్రికల్లో సమీక్షించిన సమీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
పై కథా సంపుటాలలోని కథలను ప్రచురించిన పత్రికల సంపాదకులకు... ముఖ్యంగా... ఆయా పత్రికలలో ప్రచురించుటకు సహకరించిన వార్త సంపాదకులు కె. రామచంద్రమూర్తి, టంకశాల అశోక్, కల్లూరి భాస్కరం, గుడిపాటి, జి. శ్రీరామమూర్తి ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్. శాస్త్రి, సాక్షి ఫన్ డే సంపాదకులు పూడూరు రాజిరెడ్డి, 'దట్స్ తెలుగు డాట్ కాం' ఇంటర్‌నెట్ పత్రిక సంపాదకులు కాసుల ప్రతాపరెడ్డి, 'దళిత జ్యోతి' పత్రిక సంపాదకులు వర్ల రామయ్య, ఆంధ్రజ్యోతి వీక్లీ సంపాదకులు కీ.శే. పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 'స్వాతి' మాస పత్రిక సంపాదకులు వేమూరి బలరాం, సృజన సాహితీమిత్రులు, వరవరరావు, కె. రామ్మోహన్‌రాజు, ఎన్.కె. తదితరులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, వేమన వసంతలక్ష్మి, 'మాభూమి' పత్రిక సంపాదకులు ఎబికె ప్రసాద్, 'జనధర్మ' - 'వరంగల్‌వాణి' సంపాదకులు కీ.శే. ఎం.ఎస్. ఆచార్య, 'బతుకునేర్పిన పాఠం' కథ తొలి ప్రతిని 'నూతన మాసపత్రిక'లో ప్రచురించిన సంపాదకులు ఎం. రత్నమాల, 'నవ్య' వీక్లీ సంపాదకులు ఎ.ఎన్. జగన్నాథ శర్మ. 'సలాం హైదరాబాద్' సంపాదకులు ఆర్. సత్యనారాయణ, కేతు విశ్వనాథరెడ్డి గారలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కథల రూపకల్పనల్లో అనేక స్థాయిల్లో చర్చలు చేసి తమ అభిప్రాయాలు తెలిపిన మిత్రులు, కథకులు ఎందరో... కీ.శే. గూడూరు సీతారాం... మా ఆవిడ శ్యామల... భీమనాతి ప్రభాకర్... సిహెచ్.వి. ప్రభాకర్‌రావు... స్మితారావు, శాతవాహన హైస్కూల్, జగిత్యాల... కొక్కుల పద్మావతి... వొడ్నాల సూర్య... నల్లాల లక్ష్మీరాజం... దేవరశెట్టి జనార్ధన్... కీ.శే. రామలక్ష్మణ్ ... కె. పోచయ్య... కనికరం లచ్చన్న... వనమాల సత్యనారాయణ... పి. చంద్ యాదగిరి... కాలువ మల్లయ్య... ఆడెపు లక్ష్మీపతి... నేరెళ్ళ శ్రీనివాస్‌గౌడ్... అల్లం రాజయ్య... వరవరరావు... గాజుల నారాయణ... వడ్డేపల్లి వెంకటేశ్వర్లు... వైకుంఠం... రిటైర్డ్ డి.ఆర్.ఓ. రామచంద్రం... గారలకు కృతజ్ఞతలు.
ఇందులోని కొన్ని కథలను ఆయా కథా సంకలనాల్లో చేర్చారు. 'పాలమూర్ లేబర్ తిరుగుబాటు' కథను 'తిరుగుబాటు' పేరుతో 'భూమిక' కథా సంకలనంలో ఎస్. రాములు పేరిట సంకలనంలో చేర్చిన తుమ్మేటి రఘోత్తంరెడ్డి, 'నాగశాల' కథను 'భారతీయ సాహిత్యం - తెలుగు కథలు' సంకలనంలో, 'మలియవ్వనం' కథను 'కరీంనగర్ జిల్లా కథలు' 4వ సంపుటిలో చేర్చిన వనమాల చంద్రశేఖర్ గారలకు... కృతజ్ఞతలు.
ఈ కథల్లో పాత్రదారులైన వ్యక్తులు ఎందరో...
ఎన్నో సజీవమైన పాత్రలు...
సంఘటనలు, సన్నివేశాలు...
ఈ కథల్లోకి నడిచి వచ్చాయి.
జీవిత నాటక రంగంలో ఎవరి పాత్ర వారు...
పోషిస్తున్న క్రమాన్ని గమనించి...
వాటిని సాహిత్యీకరించడం జరిగింది.
ఇందులోని కథల మూల పాత్రధారులకు...
ఆయా కథలకు ప్రేరణ, స్ఫూర్తి అయిన మిత్రులకు... ప్రజలకు... కృతజ్ఞతలు.
- బి.ఎస్. రాములు
జిజ్ఞాస
ఒక సభ, సమావేశం ఎంతోమందిని పరిచయం చేస్తుంది. కొందరు సన్నిహితు లౌతారు. పరిచయం స్నేహంగా మారుతుంది. ఒక పరిచయం అనేక పరిచయాలకు దారి తీస్తుంది. అందుకే నాకు సభలు, సమావేశాలంటే చాలా ఇష్టం. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా పిలవగానే వెళ్ళాలనిపిస్తుంది.
తెలుసుకోవాలనేవారికి చెప్పిన విషయాలన్నీ అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. శ్రద్ధలేనివారు ఒక చెవిలో విని మరో చెవిలోనుండి వదిలేస్తారు. జిజ్ఞాస మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతుంది. జిజ్ఞాసే మనిషి వికాసానికి మూలం.
ఆ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ శ్రద్ధగా విన్నారు. ఆర్గనైజర్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలాకాలం తర్వాత ఒక చక్కని మీటింగ్ జరపగలిగామని ఆనందంగా ఉన్నారు. నేను వారి అభినందనలను స్వీకరిస్తూ మీటింగ్ హాలునుండి బయటకు నడిచాను. ఎవరో నా వెనుకనుండి పిలిచినట్లు అనిపించింది.
''నమస్కారం సార్! నా పేరు కరుణాకర్... టీచర్‌గా పని చేస్తున్నాను.'' అంటూ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. క్షణమాగి అతనివైపు చూసి, ప్రతి నమస్కారం చేశాను.
''మీ ప్రసంగం చాలా బాగుంది సార్!'' అని చొరవగా దగ్గరికి వచ్చాడు. ఆయన మీటింగ్ స్టార్ట్ కాకముందు కలిసిన ఆర్గనైజర్లలో చూసినట్లులేదు. ''థాంక్స్'' అని చెప్పి ముందుకు కదిలాను. మీటింగ్ వాలంటీర్స్ కరుణాకర్‌కేసి కొరకొర చూశారు. నన్ను తొందరగా తీసుకువెళ్ళాలని వారి ఆలోచన.
''మీరు కథలు ఎందుకు రాస్తుంటారు సార్?''
ఆర్గనైజర్స్ వెంట వడివడిగా నడుస్తూనే కరుణాకర్‌తో సంభాషిస్తున్నాను.
''స్వేచ్ఛా సమానత్వం, సమసమాజం కోసం, మానవీయ విలువల అభివృద్ధికోసం, కులరహిత, వర్గరహిత, నూతన సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం... సామాజిక మార్పు కోసం... సామాజిక మార్పులను చిత్రించడం కోసం... ప్రజలు జీవితాలను అర్థం చేసుకోవడం కోసం... సామాజిక పరిణామాల్ని విశ్లేషించడం కోసం... అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం కోసం...కథలు, నవలలు, వ్యాసాలు రాస్తుంటాను. ప్రసంగాలు కూడా ఇస్తుంటాను''.
''ఇన్ని పుస్తకాలు ఎప్పుడు రాసిండ్రు? ఇన్ని ఎలా రాసిండ్రు సార్'' అడిగాడు కరుణాకర్.
''రాత్రి రోజు మూడు గంటలు పుస్తకాలు చదువుతాను. ఉదయం నుండి రాస్తుంటాను.'' అని చెప్పాను.
''రోజు మూడు గంటలు చదువుతుంటారా సార్?'' అని ఆశ్చర్యపోయాడు కరుణాకర్.
''అవును. చదవకపోతే ప్రపంచం ఎలా తెలుస్తుంది? ప్రతి పుస్తకం సామాజిక శాస్త్రవేత్తలు, రచయితలు ఎంతో అధ్యయనం చేసి అనుభవాల సారంతో రాస్తుంటారు. కేవలం చదవడం ద్వారా అదంతా మన సొంతం అవుతుంది. అవి చదివాక మన జ్ఞాన నేత్రం వికసిస్తుంది. మన ఆలోచనలకు స్పష్టత ఏర్పడుతుంది. కొత్త ఆలోచనలు కలుగుతాయి. కొత్త ఆలోచనలను ఉదయం కాగితం మీద పెడుతుంటాను.''
నడక మందగించడంతో ముందుకు సాగిన వాలంటీర్స్ నాకోసం వచ్చారు. తొందరగా బయలుదేరాలని వారి ఆరాటం.
''రండి సార్. భోం చేశాక గెస్ట్‌హౌస్‌కు వెళదాం.''
''నేను ఉంటాను సార్.''
''కరుణాకర్! మీరు కూడా భోజనానికి రండి.'' అని ఆహ్వానించాను. ఇక అంతకన్న ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేకపోయింది. మీటింగ్‌కన్నా ముందు కలిసి ఉంటే కాస్త ఓపికగా మాట్లాడే అవకాశం ఉండేది. ఎవరితొందరలో వారున్నప్పుడు ఏవేవో అడుగుతుంటే అసహనంగా ఉంటుంది. అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. కానీ అవేవీ కన్పించనీయకూడదు. సహనాన్ని తెచ్చిపెట్టుకోవాలి. మనిషి కలిసినప్పుడే అన్నీ అడగాలనుకోవడం, చెప్పాలని ఆశించడం సరైందికాదు. మీటింగ్ పెట్టినవాళ్ళకు టైం ఇవ్వాలి. ఎవరెవరితోనో మాట్లాడితే ఆర్గనైజర్స్‌తో సంబంధాలు, సాన్నిహిత్యం ఎలా పెరుగుతుంది. ఆర్గనైజర్స్ బాగా సంతోషంగా ఉన్నారు.
హోటల్‌లో అందరం సర్దుకొని కూర్చున్నాం. కరుణాకర్‌ను నా పక్కకకు రమ్మని పిలిచాను. ముఖ్య కార్యకర్తలు నాతోపాటు కూర్చున్నారు.
''ఇవాళ సభ చాలా బాగా జరిగింది. మేము ఇంతమంది వస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా వాళ్లు ఇంకా చాలామందికి కమ్యూనికేట్ చేయనే లేదు.'' అన్నారు ప్రశంసాత్మకంగా.
''ఆ ప్రాబ్లమ్ ఎప్పటికీ ఉంటుంది. పెళ్ళి పత్రికలు ఎన్ని కొట్టించినా, ఎంతమందికి ఇచ్చినా ఇంకా కొందరిని మర్చిపోతూనే వుంటాము.'' అని అనేక అనుభవాలను కలిసి పంచుకున్నాము.
''ఈ హోటల్ చాలా బాగుంది.'' అన్నాను టాపిక్ మార్చాలని.
''ఈ టౌన్‌లో ఇదే మంచి హోటల్ సార్.'' ఉత్సాహంగా అన్నాడు అధ్యక్షుడు.
''ఈ రాత్రి ఇక్కడే వుండండి. రేపు ఉదయం వెళ్ళండి. రాత్రి మీతో చాలా మాట్లాడాలి. మావాళ్లు మీ సమయం అడిగారు.'' అన్నారు అధ్యక్షుడు.
ఇలా మర్యాదకు అడగడం పరిపాటి. ఒక మీటింగ్‌కు అటెండ్ కావడం, చూడ్డానికి ఒక్కపూటలాగ కనపడుతుంది. కానీ మీటింగ్‌కన్నా మూడు రోజులు ముందు, మీటింగ్ తర్వాత మూడు రోజులు మొత్తం ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఆమాట పిలిచినవారితో చెప్పడం బాగుండదు.
''నాకు వీలు కాదు. ఉదయమే హైదరాబాద్‌లో వుండాలి. వేరే ప్రోగ్రామ్ వుంది.'' అని నా ఇబ్బందులను చెప్పాను.
''అయితే లాస్ట్ బస్‌కు పంపిస్తాం. అంతదాకా మాకు టైమ్ ఇవ్వాలి సార్.'' అన్నారు.
''అలాగే.'' అని అన్నాను.
భోజనాలు పూర్తయ్యాయి. గెస్ట్ హౌస్‌కు బయలుదేరాము. కరుణాకర్ కూడా వెంట వచ్చాడు. మీటింగ్ గురించి దాని ఏర్పాట్ల గురించి ఎవరెవరు ఎలా సహకరించారో, ఎవరెవరు ఎలా చెయ్యిచ్చారో చెప్తూ వస్తున్నాడు అధ్యక్షుడు. తర్వాత మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారో చర్చిస్తున్నారు. ఏ టాపిక్ మీద పెట్టుకుంటే బాగుంటుందో అని చర్చలు సాగిస్తున్నారు. ఈ టాపిక్‌లమీద కరుణాకర్‌కు ఇంట్రస్ట్ ఉన్నట్టులేదు.
''నేను వెళతాను సార్.'' అన్నాడు కరుణాకర్.
''ఏం? ఈ యిష్టాగోష్టిలో వుండరా? ఇది మీకు అక్కర్లేదా? అనేక విషయాలు చర్చిస్తారు. కథలు రాయడానికి అవి కూడా ఉపయోగపడతాయి కదా?''
''అది కాదు సార్. ఇంటికాడ...''
''ఇంతదాకా టైమ్ ఇమ్మన్నావు. ఇప్పుడేమో ఇంటికాడ... అని అంటున్నావు. నీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. కరుణాకర్! కొత్త విషయాలు తెలుసుకోకపోతే సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? కేవలం పుస్తకాలే సరిపోవు. చుట్టూ వున్న సమాజం ఎలా నడుస్తోంది? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఎవరి వ్యక్తిత్వం ఎలా వుంది? ఎవరి చైతన్య స్థాయి ఏమిటి? అనే విషయాలు నీవు ఏమి మాట్లాడకపోయినా కూర్చుని తెలుసుకునే గొప్ప అవకాశం మిస్సవుతావు.''
''అలాగే సార్.''
జ జ జ జ
''చాలా విషయాలు తెలుసుకున్నాను సార్! గోష్టి మిస్సయి వుంటే ఎన్నో విషయాలు మిస్సయి వుండే వాణ్ణి. ఇవన్నీ సభలో ప్రసంగంలో చెప్తే ఇంకా బాగుండేది సార్.''
''అందుకే నిన్ను వుండమన్నాను. సభలో అన్ని విషయాలు చెప్పడం కుదరదు. అందరి స్థాయి ఒకటి కాదు. అందరికి అర్థం కావు. అందువల్ల జనరలైజ్ చేసి చెప్తుంటాము. ఆర్గనైజర్లు ఒక స్థాయికి ఎదిగిన వాళ్లు కనుక మీటింగ్ అయిపోయాక ఇష్టాగోష్టిలో అనేక విషయాలు లోతుగా చర్చకు వస్తాయి. దాంతో పాటు ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుందో, ఎలా విస్తరించాలో కూడా తెలుస్తుంది.''
''సార్, కథలు ఎలా రాయాలో ఫోన్‌లో అప్పుడప్పుడు అడుగుతుంటాను సార్. మీరు విసుగు అనుకోకుండా కొంత సమయం నాకు కేటాయించాలి సార్.''
''అలా కుదరదు. సెల్‌ఫోన్లు వచ్చాక ఫోన్లు కష్టమైపోయాయి. ఎక్కడ వుంటామో ఫోన్ చేసే వారికి తెలియదు. ట్రాఫిక్‌లో వుండవచ్చు. వేరే పనిమీద వుండవచ్చు. అందువల్ల ఫోన్ ద్వారా అడగడం, చెప్పడం కుదరదు. మూడ్ కూడా వుండక పోవచ్చు. అందుకని మరో పద్ధతి వుంది.''
''చెప్పండి సార్.''
''నీ లాంటి యువకులను, విద్యార్ధులను, సాహిత్యాభిమానులను కొంతమందిని కలిసి చర్చించి కథా వర్క్‌షాప్ పెట్టండి. అప్పుడు అనేక విషయాలు చెపుతాను. తద్వారా చాలా మందికి విషయాలు తెలుస్తాయి. దీనివల్ల నీక్కూడా ఒక సౌకర్యం వుంది. నీ చుట్టూ సాహిత్యాభిమానులు, కథలు రాయాలనుకునే వాళ్లు ఒక బృందంగా వుంటారు. తద్వారా ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతారు. పోటీ పడతారు. సూచనలు చేసుకుంటారు. తద్వారా మీ అవగాహన పెరుగుతుంది. ఒక సాహిత్య వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్య వాతావరణం వున్న చోటే సాహిత్య రచన సుళువుగా వుంటుంది. నేను కూడా ఎక్కడ వున్నా నా చుట్టూ ఒక సాహిత్య వాతావరణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంటాను.''
అందరు కలిసి లాస్ట్ బస్‌కు ఎక్కించి వీడ్కోలు తీసుకున్నారు. అందరితోపాటు కరుణాకర్ కూడా చివరిదాకా వారితోనే ఉన్నట్టున్నాడు.
జ జ జ జ
ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. 'ఇండియానాపొలిస్' అనే నగరంలో మా పెద్ద కొడుకు, కోడలు, మనవలతో ఉంటున్నారు. కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. పిల్లలను చూసుకోవడానికి నేను, మా శ్యామల వెళ్ళాము. అమెరికా ఎలా ఉంటుందో మొత్తం అంతా చూడాలని ఆరాటం. పిల్లలకు వీలు కావడంలేదు. శనివారం, ఆదివారం సెలవు వున్నప్పటికీ ఇంటిపనికి, షాపింగ్‌కు రెండు రోజులు కూడా చాలవు. నా అంచనాలు తప్పాయి. ఇంట్లోనే పొద్దంతా ఉండాల్సి రావడం కొద్దిరోజులకే విసుగు వచ్చింది. సొంతంగా నడిచి తిరుగుదామంటే వీలుకాదు. చివరకు పాణిగ్రాహిని నోరు విడిచి అడిగాను.
''అరె పాణీ!... బయటకు పోతే చలి. మంచుకురుస్తున్నది. శరీరం గడ్డకట్టేట్టు వుంది. నడిచి ఎక్కడికి పోరాదు. ఎటు చూసినా అయిదు కిలోమీటర్లు పోతే తప్ప సిటీలోకి పోలేము. నాకు కంప్యూర్ రాకపోయె... ఇక్కడ లైబ్రరీ దగ్గర లేకపాయె. కనీసం లైబ్రరీకి పోదామన్నా అయిదు కిలోమీటర్లు నడవాలె. ఆటోలు లేవాయె, బస్సులు లేవాయె, నువ్వు కార్లో తీసుకుపోతేనే పోయినట్టు. నీ కారు ఇక్కడ నేను నడపరాదాయె. నా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చెల్లదాయె. ఇండియానా పోలీసు సిటీలో ఫిషర్స్ ఏరియాలో ఇల్లు కట్టుకుంటివి. అంతా ప్రశాంతంగా చాలా బాగుంది గాని, నాకు ఇక్కడ టైం పాసయితలేదు. ఎట్ల? ఏం చేయాలె, తోస్తలేదు.''
పాణిగ్రాహి అలసిపోయినట్టున్నాడు. అలాంటి ప్రశ్నలు ఎప్పుడో వేస్తానని ముందే జవాబులు రడీ చేసుకున్నట్టున్నాడు. అందుకే శ్యామల ఎక్కడికీ తీసుకుపొమ్మని అడిగినట్లు లేదు. మనవలు ఏదో ఆడుకుంటున్నారు. పెద్ద మనవడు సుశాంత్ టీవీలో 'బార్నీ' అనే పిల్లల ప్రోగ్రామ్ చూస్తున్నాడు. కోడలు, శ్యామల వంట పనిలో పడ్డట్టున్నారు.
''అయితే నేనేం చేయాలె నాన్నా?... ఉద్యోగానికి లీవు పెట్టి ఇంట్లో వుండాల్నా? శనివారం, ఆదివారం మిమ్మల్ని సిటీ తిప్పుతునే వున్నాను కదా! రోజూ తిప్పడం కుదరది. టీవీ చూసుకుంటు కూర్చోండి. కొన్ని డివిడిలు తెస్తాను. సినిమాలు చూస్తుండండి. ఇండియాకు ఫోన్లు చేసుకోండి. కంప్యూటర్ నేర్చుకొని ఇంటర్‌నెట్‌లో పత్రికలు చూడండి.''
పాణిగ్రాహి చెప్పిన మాటలు కోడలు సులేఖ విన్నట్టుంది. టైంపాస్ కాకపోవడం, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వెల్లినప్పుడే గమనించినట్లుంది.
''మామయ్యా! కంప్యూటర్లో ఇంటర్‌నెట్ ద్వారా మీరు తెలుగు డైలీ పేపర్లు, అమెరికన్ డైలీ పేపర్లు కూడా చూడవచ్చు. నేను మీకు వాటిని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను... ఈ నాలుగు స్విచ్‌లు జ్ఞాపకం వుంచుకుంటే మీరు ఇంటర్‌నెట్‌లో అన్నీ వెతుక్కోవచ్చు.''
సులేఖ కొద్దిరోజులు క్రితమే కంప్యూటర్‌లో ఎలా చూడవచ్చో కొన్ని నేర్పింది. నాకు కొన్ని స్విచ్‌లే అర్థమయ్యాయి. వాటితోనే అటూ ఇటూ గెలుగుతూ కాలక్షేపం చేస్తున్నాను. చూసిచూసి కళ్ళు గుంజడం తప్పడంలేదు. అదే మాట అన్నాను.
''కొద్దికొద్దిగా నేర్చుకుంటున్నా మున్నీ...! కానీ గంటల తరబడి ఇంటర్‌నెట్ చూస్తే కండ్లు గుంజుతున్నయి. మాట్లాడ్డానికి మనిషి లేకపోతే ఎంత కష్టం? అత్తమ్మతోటి ఏం మాట్లాడతాం? ఫోన్లు ఎంతకని చేస్తాం? ఇక్కడ పొద్దెక్కితే ఇండియాలో రాత్రయితది. ఇక్కడ రాత్రయితే అక్కడ పొద్దెక్కుతది. ఫోన్ చేయడానికి టైమ్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. రాత్రి ఫోన్లు చేస్తుంటే అమ్మ ఈ రాత్రి ఏందంటది? ఇక్కడ రాత్రికి అక్కడ పగలాయె. అమెరికాలో పుస్తకాలు ఎలా వున్నాయో? ఎలాంటివి రాస్తున్నారో కథలు, నవలలు, ఫిలాసఫీ, సోషియాలజీ, అమెరికా సమాజం ఎలా వుందో తెలుసుకోవాలని వుంది. పుస్తకాల షాపుకు తీసుకపోతే కొన్ని తెలుస్తాయి కదా! మీ ఏరియా లైబ్రెరీలు చూడాలని వుంది.''
''ఇక్కడ ఫిలాసఫీ పుస్తకాలు, సోషియాలజీ పుస్తకాలు తక్కువ. మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ పుస్తకాలు, సబ్జెక్టు పుస్తకాలు ఎక్కువ. ఇక్కడి పుస్తకాలు కొని ఏం చేస్తావ్? మళ్లీ పుస్తకాలు రాస్తావా? నాన్నా'' అన్నాడు.
''ఔను... ఇక్కడివాళ్ళు ఏం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలుసుకోవడం అవసరం. వారికి ఇ-మెయిల్ చేసి మాట్లాడతాను''. ఆ మాటతో పాణిగ్రాహి అదోరకంగా నవ్వాడు. నన్ను బాగా అమాయకుడిగా జమకట్టాడు.
''నాన్నా! నీ అమాయకత్వానికి నవ్వొస్తున్నది. నువ్వు వాళ్ళకు నేర్పుతావా?'' అని ఆశ్చర్యపోయాడు. పాణికి అంత ఆశ్చర్యం కలగాల్సింది ఏముందో నాకర్థం కాలేదు. అమెరికావాళ్ళు ఏం రాస్తున్నారో ఎంతో కొంత చూస్తూనే ఉన్నాను. వారి పరిమితి ఏమిటో నాకు తెలియంది కాదు. అయినా పాణి మనస్సు నొప్పించదలచుకోలేదు.
''పాణీ! జ్ఞానం నీరు వంటిది. అది పల్లానికి ప్రవహిస్తుంది. వారి దగ్గర ఎక్కువుంటే నా వైపుకు, నా వద్ద వుంటే వారి వైపుకి ప్రవహిస్తుంది. ఏదైనా నీరు సమతలం చేస్తుంది కదా!'' అని వివరించాను. నాన్నతో మాట్లాడితే ఉపన్యాసాలు ఇస్తాడని వాడి అభిప్రాయం.
అంతలో శ్యామల, కోడలు సులేఖ భోజనానికి రమ్మని పిలిచారు.
ఆ తర్వాత శనివారం పాణి వాళ్ళ ఏరియాలోని మున్సిపల్ లైబ్రరీకి తీసుకువెళ్ళాడు. పాణికి లైబ్రరీలో మెంబర్‌షిప్ ఉండటం సంతోషం వేసింది. పుస్తకాలపట్ల పాణికి ఇంకా ఆసక్తి ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగించింది.
పాణి చిన్నప్పుడు పిల్లల కథలు, కవితలు, జోక్స్ చాలా రాసేవాడు. పత్రికల్లో బహుమతులు కూడా వచ్చాయి. ఇంజనీరింగ్‌లో చేరాక నేనే వద్దన్నాను... చదువు పాడైపోతుందని!. ఆ తర్వాత బెంగుళూరు, ఆ తర్వాత అమెరికా ఉద్యోగ వేటలో పడ్డాడు. ఇప్పుడు రాయవచ్చుగదా అంటే ఎప్పుడంటే అప్పుడు రాయడం వస్తుందా! అని అన్నాడు. నేను రాయడం మాన్పించినందుకు కోపంగా ఉన్నట్టున్నాడు. దాంతో మాటమార్చాను.
''ఈ లైబ్రెరీ చాలా బాగుందిరా! లైబ్రెరీలో కంప్యూటర్లు, డివిడిలు, ఇంటర్‌నెట్ చూసుకోవడానికి టేబుళ్లు వుండడం, జిరాక్స్ కూడా లైబ్రెరీలో వుండడం బాగుంది.''
''మన ఇండియా ఇలా ఎదగాలంటే ఎంతకాలం పడుతుంది నాన్నా...''
''నేను ప్రధానమంత్రినైతే... పదేళ్ళలో అమెరికాతో సమానంగా అభివృద్ధి పరుస్తాన్రా... ఇప్పుడు బడ్జెట్ అంతా చెత్త చెత్తగా ఖర్చు చేస్తున్నారు... కేరళలోలాగా, మిజోరంలోలాగా బడ్జెట్‌ను అందరూ కనీసం పదహారు సంవత్సరాలు చదివి డిగ్రీ పుచ్చుకునే విధంగా విద్యకోసం బడ్జెట్ కేటాయిస్తాను... మీరు కొంతమంది ఎదిగి అమెరికాకు వస్తేనే అమెరికా బెంబేలెత్తుతున్నది... 'వికినమిక్స్...' 'ద వరల్డ్ ఈజ్ ఫ్లాట్...' పుస్తకాలు చదివితే తెలుస్తుంది నీకు... మొత్తం భారతదేశ ప్రజలను నీలాగే ఎదిగిస్తాను... అప్పుడు ప్రపంచంలో అందరూ ఇండియాతో పోటీపడాల్సి వస్తుంది...'' ''నీతో వచ్చిన చిక్కే ఇది నాన్నా... మొత్తం ప్రపంచం అంతా నా చేతుల్లో వుందన్నట్టు... నేను మార్చగలనన్నట్టు... మాట్లాడుతుంటావు... భ్రమల్లో బతుకుతుంటావు... ''
''ఇవి భ్రమలు కాదురా... భవిష్యత్ స్వప్నాలు...అవకాశాలు...'' అని చెప్పాను.
లైబ్రరీలోని ర్యాక్‌లన్నిటిని ఒకసారి కలియ తిరిగాను. సోషియాలజీ, ఫిలాసఫీ పుస్తకాలు ఎక్కడో ఒక మూలకు పాతపుస్తకాలు పెట్టినట్టు పెట్టారు. అందులో ఎంత వెతికినా నేననుకున్న పుస్తకాలు కనిపించలేదు. ఎన్నో కొత్త పుస్తకాలు కనపడ్డాయి. వాటి ఇండెక్స్‌లు చూస్తూ ఏమేం రాశారో గమనిస్తూ ఉండిపోయాను. వాటిలోంచి ఏయే పుస్తకాలు కొనుక్కుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నాను.
కొన్ని పుస్తకాలు తీసుకొని ఇంటికి వెళ్ళాము. అలా వారం వారం కొన్ని పుస్తకాలు తేవడం, చదవడం ఇచ్చేయడం.... అరవై పుస్తకాల దాకా చదివేశాను. ఇంగ్లీషు రాదనుకున్న నాకు ఇంగ్లీషులో చదవడం బాగానే వచ్చు అని అన్పించింది. ఇంగ్లీషులోనే నోట్స్ రాసుకున్నాను.
మూడు వారాల తర్వాత పుస్తకాల షాపుకు తీసుకువెళ్ళాడు పాణిగ్రాహి. అటూ ఇటూ తిరిగి చాలా పుస్తకాలు సెలెక్ట్ చేశాను. వాటన్నిటినీ చూసి, పాణి ఆశ్చర్యపోయాడు. అవన్నీ కొనాల్సిందేనా అన్నట్టు చూశాడు.
''మళ్ళీ ఇన్ని పుస్తకాలు కొంటావా? ఒక్కొక్కటి ధర ఎంతుందో తెలుసా నాన్నా?'' అని అడిగాడు.
''ఈ పుస్తకాలు ఇండియాలో చాలా అవసరం రా! కథలు, నవలలు రాయడం ఎలా అని వివరంగా చెప్పే ఈ పుస్తకాలు నాకు రిఫరెన్స్‌గా ఎంతో అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ గురించి, అమెరికా అభివృద్ధి చెందిన తీరుగురించి, ఇటీవల వచ్చిన డెవలప్‌మెంట్స్ తెలుసుకోవడం చాలా అవసరం''. అని అన్నాను.
''నాన్నా! నీ ఆలోచనలు చాలా మారాల్సిన అవసరం వుంది. నీ దృక్పథం మిలియనీర్ మైండ్‌గా మారకుండా నువ్వు ఇండియాను ఎలా డెవలప్ చేయగలవు? మిలియనీర్, బిలియనీర్‌ల యుఎస్‌ఏతో ఎలా పోటీపడగలవు? హౌటు బికమ్ మిలియనీర్ పుస్తకాలు చదువు. ఇండియాలోపేదరికం మైండ్ నుండి బైట పడేసి మిలియనీర్ మైండ్‌గా ఎదిగించడానికి పుస్తకాలు రాయి. అందుకోసం ఈ పుస్తకాలు నా వంతుగా నువ్వు అడగకముందే కొనిస్తున్నాను.'' అని కొనిచ్చాడు పాణి.
''నేను మిలియనీర్ కావాలా? ప్రపంచంలో రచయితలు మిలియనీర్ కావాలని కోరుకోరు. అలా కోరుకున్న వాళ్లు మీ అమెరికాలోనైనా ఎవరైనా వుంటే చెప్పు వారి జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తాను.''
''నాన్నా! ఇండియాను అమెరికాతో సమానంగా ఎదిగించాలంటే అమెరికాలో ఎలా ఎదుగుతున్నారో, ఎలా ఎదిగారో అధ్యయనం చేసి అనుసరించకపోతే ఎలా సాధ్యం?'' అని ప్రశ్నించాడు పాణి.
ఆశ్చర్యపోవడం నావంతయింది. ఇండియానుండి అమెరికా వచ్చే ప్రతి ఒక్కరూ మిలియనీర్ కావాలని అనుకుంటారేమో. ఉద్యోగం చేస్తూ, మిలియనీర్ కావడం, ఎక్కడా సాధ్యం కాదు అనే విషయం పాణిలాంటి యువతరానికి తెలిసినట్టు లేదు.
అమెరికాను, యూరప్‌ను అనుసరించకుండా ఇండియా తన పద్ధతిలో సంపన్న దేశంగా ఎదగడం సాధ్యంకాదా? అని ఆలోచనలో పడ్డాను.
పాణి చెప్పిన మాట పదే పదే మనస్సులో తిరుగుతోంది. నా అనుభవాలు, ఉద్యమాల అనుభవాలు, బతుకు నేర్పిన పాఠాలు, నా భావాలు అన్నింటిని పాణి ప్రశ్నిస్తున్నట్లుగా అన్పించింది. మీ అనుభవాలు, భావాలు ఏవీ ఇండియాను అగ్రరాజ్యంగా మార్చలేవు. అని పాణి బలంగా నమ్ముతున్నట్లున్నాడు. అప్పుడప్పుడు అదే విషయం మా ఇద్దరి మధ్య సంభాషణ, సంఘర్షణ దాకా సాగేది.
కొద్దిరోజుల తర్వాత పెద్దకొడుకు పాణి దగ్గరనుంచి రెండవ కొడుకు శ్రీకాంత్ దగ్గరకు బయలుదేరాము. శ్రీకాంత్ న్యూజెర్సిలో ఉంటాడు. హైదరాబాద్‌లోని ఏలె లక్ష్మణ్‌కు ఫోన్ చేశాను. న్యూజెర్సీలో నారాయణస్వామి ఉన్నాడని చెప్పాడు. నారాయణస్వామి కొన్ని మీటింగ్‌లు ఏర్పాటు చేశాడు.
శ్రీకాంత్ ఎంతో కష్టమైనప్పటికీ నన్ను నేను కోరినచోటుకల్లా తీసుకొనివెళ్ళాడు. మా వియ్యంకుడు శ్రీకాంత్ మామ చంద్రమౌళీశ్వర్ కూడా మాతోపాటు వచ్చాడు. అలా ఫిలడెల్ఫియాలో మీటింగ్ చక్కగా జరిగింది. నేను తెచ్చిన ఏడు కొత్త పుస్తకాలను అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఇరవై మంది దాకా వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ప్రసంగం తర్వాత చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. అసలు మీటింగే హోటల్‌లో జరిగింది. ఆ హోటల్ తెలుగువారిదే. ఆయన కూడా ఒక ఆర్గనైజర్.
అందరితో ఆత్మీయంగా సెలవు తీసుకొని ఫిలడెల్ఫియానుండి న్యూజెర్సీకి బయలుదేరేసరికి రాత్రి పదయ్యింది. కారు వేగంగా పోనిచ్చాడు శ్రీకాంత్. డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్‌కు నిద్ర రాకుండా ఉండడం కోసం అదీ ఇదీ మాట్లాడిస్తూ వచ్చాను.
''శ్రీకాంత్! ఫిలడెల్ఫియాలో మీటింగ్ చాలా బాగా జరిగింది కదా!'' అని ఉత్సాహంగా అన్నాను.
''అవును నాన్నా!''
''బావా... మీ డిస్కషన్స్ చాలా బాగా జరిగినయి. నేను నా జీవితంలో ఇంత గొప్ప విషయాలు ఎన్నడూ వినలేదు... వాళ్ళు ఎంత ఆసక్తిగా విన్నారో.. వారిలో 1969 నుండి అమెరికాలో వుంటున్న వాళ్లు కూడా వున్నారు. మీరు చెప్పిన విషయాలు అమెరికాలో వున్న మాక్కూడా తెలియవు. మా పనేదో మేం చేసుకొని బతుకుతున్నాం. ఇన్ని విషయాలు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి పుస్తకాలు చదివి మళ్లీ మాకు వాటిని చెప్పడం చాలా ఆనందంగా వుందని అన్నారు. నర్సంపేటలో ఏదో షాపు నడుపుకుంట గిరాకీ చూసుకుంట వుండే నాకు ఇంత గొప్ప అవకాశం దొరికింది... అల్లుడు శ్రీకాంత్, బిడ్డ ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంత గొప్ప అనుభవం... థాంక్స్ బావా...'' అన్నాడు వియ్యంకుడు చంద్రమౌళీశ్వర్.
'ఇండియానాపొలిస్'లో పాణి అన్నమాటలు గుర్తుచేశాను.
''అరె శ్రీకాంత్... పాణి నన్ను నోరు తెరవద్దు అన్నాడు... నీ అమాయకత్వం బైట పడుతుంది అని అన్నాడు...'' అన్నాను.
''నిజమే నాన్నా! అయితే మీదంతా ప్రపంచాన్ని మీరే మార్చేస్తున్నట్టు సోది నాన్నా... వాళ్ళకు అదే కావాలె... మీకు అదే కావాలె... అందుకని మీరు చెప్పింది విన్నారు... అయితే నాన్నా... నీ ఏడు పుస్తకాలు అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఆవిష్కరించడం నాకు చాలా ఆనందం వేసింది...'' అన్నాడు శ్రీకాంత్.
పిల్లలు ఉపాధి వెతుక్కుంటూ అమెరికా రావడంవల్ల మాకు ఈ అవకాశం దొరికింది. జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండలేదు. అదేమాట అన్నాను.
''మీరు అమెరికాకు వస్తే నాకు ఈ అవకాశం దొరికింది రా... న్యూజెర్సీలో కూడా మీటింగ్ చాలా బాగా జరిగింది. నువ్వు చివరిదాకా వుండమంటే వుండకపోతివి.''
''వాళ్ళంతా చాలా పెద్ద వయస్సు వాళ్లు.... బోస్టన్ టెలికాన్ఫరెన్స్ కూడా బాగానే జరిగింది కదా!''
''పాణి నన్ను ఇక్కడ నువ్వు మాట్లాడితే నవ్వుతారు అని అన్నాడు. నేను మాట్లాడింది వాళ్లు ఎలా విన్నారో చూసినవు కదా!''
''అవును నాన్నా! రేపు వాషింగ్టన్ డిసి చూడ్డానికి పోదాం. అమ్మ, నువ్వు రెడీగా వుండండి.''
''న్యూజెర్సీ, న్యూయార్క్ ఎప్పుడు చూపిస్తావు.''
''అవి లోకలే కదా నాన్నా! ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు గాని ముందు దూర ప్రదేశాలు చూపిస్తా.'' అన్నాడు శ్రీకాంత్.
మేము వచ్చింతర్వాతనే అందరికి కలిపి ఒకేసారి చూపిద్దామని మా వియ్యంకుడికి కూడా అంతదాకా ఏమీ చూపించినట్లు లేదు. అందరం కలిసి లిబర్టీ స్టాచ్యు, న్యూయార్క్ సిటీ, ఇంకా ఎన్నో చూశాము. ప్రతిచోటా ఫోటోలు దిగాము. వాషింగ్టన్ డి.సి.లో ఒబామా మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశాన్ని చూశాము. అక్కడి మ్యూజియంలన్నిటిని కలియతిరిగాము. అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్ ముందు నిలబడి చాలాసేపు గడిపాము. న్యూయార్క్‌లోని టైంస్క్వేర్‌లో రోజుకు 120 దేశాల ప్రజలు వస్తుంటారు అని శ్రీకాంత్ చెప్తే ఆశ్చర్యపోయాము. షేర్‌మార్కెట్‌కు చిహ్నంగా వేసే బుల్ బొమ్మవద్ద నిలబడి ఫోటోలు దిగాము.
జ జ జ జ
అలా మూడు నెలలు గడిచాయి. ఇండియాకు బయలుదేరాము. ఇండియాకు వచ్చి కూడా మూడు నెలలు అయిపోయింది. ఆరోజు ఉదయమే కాలింగ్ బెల్ మోగింది.
''నన్ను గుర్తు పట్టారా సార్?.... మీటింగులో మిమ్మల్ని కలిశాను. మీతో మాట్లాడాను. నా పేరు కరుణాకర్ సార్! టీచర్‌గా పని చేస్తున్నాను.''
''గుర్తు లేదు. దా! కూర్చో. రోజూ ఎంతోమంది కలుస్తుంటారు. మూడు నెలలు దాటితే మళ్లీ కలవకపోతే గుర్తుండటం కష్టం. అందువల్ల ఏమనుకోకు. సారీ!''
''నేను కథలు రాద్దామని మీ సూచనలు కావాలని అడిగాను. గుర్తుందా సార్. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు.''
''కొడుకు అమెరికా రమ్మంటే పోయి వచ్చిన. అక్కడ ఇండియా ఫోన్లు పని చేయవు. అయినా ఆ మీటింగ్ జరిగిన తరువాత ఆరు నెలలకు స్టేట్స్‌కు పోయిన. వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు?''
''.............''
''కరుణాకర్! కాలం తిరిగి రాదు. సంవత్సరం తరువాత మళ్ళీ కథలు రాయాలని అడగడం కోసం వస్తే ఎలా? ఏమైనా కథలు చదివావా?''
''కొన్ని చదివాను. ఒక కథ రాశాను. చూస్తారని తెచ్చాను. చూస్తారా సార్.''
''సరేగానీ! ఈ చాయ్ తీసుకో. ఈమె మా ఆవిడ శ్యామల. బీడీలు చేసి పిల్లలను పెంచి పోషించింది. నేను అప్పుడు ఇంట్లో లేను. పదేళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి వనవాసం చేశాను. సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం దేశం తిరిగాను. పిల్లలు ఇప్పుడు అమెరికాలో వున్నారంటే ఆమె కృషే.'' అని గతాన్ని వివరించాను.
''నమస్కారం మేడమ్. చాయ్ చాలా బాగుంది.'' అన్నాడు కరుణాకర్.
కొన్ని పుస్తకాలు ఇచ్చాను. అదీ ఇదీ మాట్లాడి ''థాంక్స్ సార్. నా కథ తప్పక చదవండి సార్. పది రోజుల తరువాత ఫోన్ చేస్తా సార్.'' అంటూ వెళ్ళిపోయాడు కరుణాకర్. నెల తర్వాత కరుణాకర్ ఫోన్ చేశాడు.
''కథా వర్క్‌షాపు పెడుతున్నాము. మీరు తప్పక రావాలి సార్''. అని అడిగాడు.
''కథా వర్క్‌షాపుకు రావడానికి నాకు ఫీజు వుంటుంది'' అన్నాను.
''ఫీజా? ఎంత సార్?'' అని ఆశ్చర్యపోయాడు కరుణాకర్.
''నా ప్రసంగాన్ని క్యాసెట్లో, సి.డి.లో రికార్డు చెయ్యాలి. దాన్ని సి.డి. నుండి రాసి రాత ప్రతి ఇవ్వాలి. నేను కరెక్షన్స్ చేస్తాను. వాటిని కూడా సరిచేసి ఫేర్ కాపీ ఇవ్వాలి. ఇదే నా ఫీజు. దాన్ని నేను పత్రికలకు పంపిస్తాను. పుస్తకంలో చేర్చుతాను.''
''అలాగే సార్. తప్పకుండా రావాలి సార్. డేట్ ఫిక్స్ చేసే ముందు మీ అపాయింట్‌మెంట్ తీసుకుంటాను. పది రోజుల్లో ఫోన్ చేస్తాను సార్.''
కరుణాకర్ మళ్ళీ కలవలేదు. అక్కడనుండి ఫోన్‌లేదు.
నేను ఫోన్ చేస్తే ఈ నెంబరుతో ఏ ఫోన్ పనిచేయుటలేదు అని పలికింది.
జ జ జ జ
యేడాది తర్వాత కరుణాకర్ మళ్ళీ ఫోన్ చేశాడు. కథా వర్క్‌షాప్ బాగా జరిగింది. ఆయన ప్రసంగ పాఠాన్ని రాసిస్తానని మాటిచ్చి మరిచిపోయాడు. నేను కొంతకాలం చూసి ఆ విషయమే మరిచిపోయాను. ఒకరోజు ఉదయాన్నే కరుణాకర్, జోత్స్న దంపతులు ఇంటికి వచ్చారు.
''ఇదుగోండి సార్ మీ ఫీజు'' అంటూ ప్రసంగ పాఠం, రాతప్రతి చేతికిచ్చాడు.
''థాంక్యూ... కరుణాకర్! అరె... ఇది నీ హ్యాండ్ రైటింగ్ లాగా లేదు.''
''ఈమె మా ఆవిడ జోత్స్న! ఈమే ఫెయిర్ చేసింది సార్. స్కూల్లో వర్క్‌లోడు ఎక్కువుంది. ఈ మధ్య తెలంగాణ ఉద్యమం కూడా విస్తరించింది. పాల్గొంటున్నాను. సమయం దొరకలేదు. జోత్స్నను రాసిపెట్టమంటే రాసిపెట్టింది.''
''జోత్స్నా! మీ ఆయన ఫీజు నువ్వు కడుతున్నావా? ఒకటికి రెండు సార్లు సి.డి. వినుకుంటు రాస్తుంటే ప్రసంగం విన్న వాళ్లకన్నా ఎక్కువ విషయాలు అర్థమవుతుంటాయి.''
''అవును సార్. ఈ ప్రసంగం పాఠం ఫెయిర్‌కాపీ రాశాక నాకు కూడా కథలు రాయాలని అనిపిస్తున్నది సార్.''
''చాలా మంచి ఆలోచన. కథలు నీలాంటి వాళ్లు బాగారాయగలరు జ్యోత్స్నా!...'' అని అన్నాను.
అలా ఒక సభ అయిపోవడంతో దానిపని అయిపోలేదు. సభ అయిపోయాకే కొత్త సంబంధాలు, అనుబంధాలు ప్రారంభమయ్యాయి. అది సభలో కలిసిన ఆర్గనైజర్స్‌తోనే ఆగిపోలేదు. కరుణాకర్‌తోనే ఆగిపోలేదు. కరుణాకర్ ద్వారా జ్యోత్స్న కూడా పరిచయం అయ్యింది. జ్యోత్స్న ద్వారా ఆమె ఆడపడుచు కరుణాకర్ చెల్లెలు తాను కూడా కథలు రాస్తానని ఇద్దరు కలిసి వచ్చారు.
ఆ తర్వాత ఈ కథ రాసి తెచ్చింది జోత్స్న. సూచనలు అడిగింది. బాగానే ఉందనిపించింది. మీకెలా అనిపించిందో చెప్పండి. జోత్స్నకు చెప్తాను.
''దట్స్ తెలుగు డాట్ కామ్'', వన్ ఇండియా తెలుగు, జూన్ 2013.
వయసు పిలుపు
''నిన్ను ప్రేమించవచ్చా?''
ఎవరో తనవైపే అడుగులు వేసి సమీపంగా వచ్చారు. హారిక మరోసారి సన్నగా నవ్వుతూ చిలిపిగా చూస్తూ అదే ప్రశ్న అడిగింది. అశోక్ అదేదో తనని కాదు అనుకున్నాడు. ఆమె తన పక్కనే వచ్చి కూర్చుంది. మళ్లీ తన కళ్లల్లోకి చూస్తూ అదే ప్రశ్న. ఆమెకేసి చూశాడు అశోక్. ఏదో చెప్పరాని అనుభూతి.
చల్లని సాయంత్రం. పచ్చని లాన్. నిటారైన చెట్లు. లాండ్‌స్కేప్ గార్డెన్ చల్లగా, హాయిగా వుంది. ఆర్ట్స్ కాలేజి భవనం నీరెండలో అద్భుతమైన చారిత్రక కట్టడంలా బంగారం పూత పూసినట్టు మెరుస్తోంది. పడమటి దిక్కున ఎత్తుగడ్డ మీద కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ భవనం విజ్ఞాన శిఖరంలా నిటారుగా నిలిచి రా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది.
అశోక్ ఆమెకేసి చూశాడు. చుట్టూరా చెట్ల మధ్య వెలసిన వనదేవతలా మెరుస్తోంది. అకస్మాత్తుగా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి. శరీరంలో ఏదో విద్యుత్తు షాక్ కొట్టినట్టయింది. అశోక్ తల వంచుకున్నాడు. నేలకేసి చూస్తూ వుండిపోయాడు. హారిక కాస్త దూరం జరిగింది.
''నా పేరు హారిక. నువ్వు నాకు తెలుసు. బహుశా నన్ను కూడా చూసే వుంటావు. ఎక్కడో చెప్పు.'' అంటూ చిలిపిగా నవ్వింది హారిక.
అశోక్ ఆమెకేసి మరోసారి ఆసక్తిగా చూశాడు. పరిచయమైన ముఖమే. చాలాసార్లు చూసినట్టే వుంది. ఎక్కడ చూశాననుకుంటూ గుర్తు చేసుకున్నాడు. లీలగా గుర్తుకొచ్చింది. ఆమె, తాను చాలాసార్లు మీటింగ్‌ల్లో, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. ఆమె ఒకటి రెండుసార్లు నినాదాలు కూడా ఇచ్చినట్టుంది. చిన్న చిన్న ప్రసంగాలు కూడా చేసినట్టు గుర్తు. ఒకటొకటిగా గుర్తుకొచ్చాయి...
... ఓహో! ఈమె పేరు హారికా! తాను చాలాసార్లు ఈమె పేరు తెలుసుకోవాలనుకున్నాడు. ఏం చదువుతుందో అడగాలనుకున్నాడు. అడగలేకపోయాడు. హారిక ఇలా ప్రత్యక్షం కావడం విచిత్రంగా వుంది. ఈ డ్రెస్సు ప్రత్యేకంగా పెళ్లి చూపులకు తయారై వచ్చినట్టుగా వుంది.
ఊరేగింపుల్లో కనపడే హారిక వేరు. ఆవేశంతో, ఉద్రేకంతో నినాదాలిస్తూ పిడికిలి బిగించిన ఆ రూపం విగ్రహ స్వరూపం వేరు. ఎప్పుడు చూసినా ప్యాంటు, షర్టుతో, పంజాబీ డ్రస్సుతో హీరోయిక్‌గా కనిపించే హారికేనా ఈమె! పోల్చుకోడానికి వీల్లేనంత సుకుమారంగా, అందంగా తయారై వచ్చినట్టుందే హారిక. ఆడవాళ్లు చక్కగా తయారైతే ఎంత అందంగా వుంటారో! అశోక్ మనసులోని నవ్వు పెదవులపైకి, చెంపలపైకి పిల్ల గాలిలా తారాడింది.
''ఈ డ్రెస్సులో ఎంత అందంగా వుంటావో''
''హమ్మయ్య ఇప్పటికి నన్ను గుర్తు పట్టావన్నమాట. అయితే నేను ప్యాంటు, షర్టులో అందంగా వుండననా నీ ఉద్దేశ్యం?'' సూటిగా ప్రశ్నించింది హారిక.
''సారీ! నా ఉద్దేశం అది కాదు. ఆ డ్రెస్సులో ఇంకా అందంగా వుంటావు. కానీ ఆ వ్యక్తిత్వం, ఆ స్టయిల్ వేరు... ఈ స్టయిల్ వేరు...''
''సరే.. ఇప్పుడు మీలాంటి మగవాళ్లు మెచ్చే స్టయిల్‌కు వచ్చాను కదా! ఇప్పుడైనా సూటిగా చెప్పు... నిన్ను ప్రేమించవచ్చా?'' అంటూ సుతారంగా నవ్వింది హారిక.
''అదేంటి? ఎవరైనా అడిగి ప్రేమిస్తారా? ఇదేదో సినిమాలో డైలాగులా వుంది. అసలా ప్రశ్న ఏంది? మనమెప్పుడు కలుసుకున్నాం? మన మధ్య పరిచయం లేదు. స్నేహం లేదు. డైరెక్ట్‌గా నిన్ను ప్రేమించవచ్చా అని అడిగితే ఎట్లా?'' అంటూ నవ్వాడు అశోక్.
''అదికాదు మహానుభావా! నువ్వేదో దీర్ఘాలోచనలో వున్నావు. నిన్ను డిస్ట్రబ్ చేయదల్చుకున్నాను. ఎలా పలకరించాలో తోచలేదు. ఏ వయసుకు ఆ ముచ్చట.
మనదిప్పుడు ప్రేమించుకునే వయస్సు. ఈ వయసుకు అది తప్ప వేరే విషయాలు అంత ఆకర్షణీయంగా వుంటాయా? అందుకని మూడు రోజుల నుంచి ఆలోచించి ఈ డైలాగ్‌ను కాయిన్ చేసి నువ్వన్నట్టు నాటకంలో రిహార్సల్ లాగా మననం చేసుకున్నాను. నువ్విచ్చే జవాబులు ఎలా వుంటాయో ఊహించుకుంటూ వాటికి నేనెలా స్పందించాలో కూడా మనసులో రెడీ చేసుకున్నాను.''
''అయితే నువూహించిన జవాబులే చెప్పానా?'' నవ్వుతూ అడిగాడు అశోక్.
''అలా ఏం జరగలేదు. నువ్వు భగ్న ప్రేమికుడిలాగా, దేవదాసులా రోజూ కూర్చుంటే నిన్ను చూసి నీ మూడ్ నుండి బయటకు తీసుకు రావాలనిపించింది. కానీ నీ మూడేంటో నాకు తెలియకపోయె. అందుకని నేను ఊహించిన డైలాగులేవీ నీ నోటి నుంచి రాలేదు.''
ఎవరో చెట్టు నీడన సమీపంలో వచ్చి కూర్చున్నారు. తమ మాటలు వాళ్లకు వినపడుతున్నాయోమోనని గొంతు తగ్గించి అంది హారిక.
''నువ్వు దయచేసి నన్ను డిస్ట్రబ్ చేయకు. ఎవరు నువ్వు? అని అడుగుతావనుకున్నాను. కానీ మేనకను చూసి విశ్వామిత్రుడు తపోభంగమై తపస్సు వదిలేసి మేనక ప్రేమలో పడ్డట్టుగా నువ్వు వెంటనే స్పందించావు. థాంక్యూ.''
''అయితే ఇదంతా నాటకమేనా? నిజంగా అడగలేదా?''
అశోక్ ఆశ్చర్యపోతూ కాస్త దిగాలుగా అడిగినట్టనిపించింది హారికకు.
''అశోక్! నిన్ను నిజంగానే అడిగాను. నిన్ను నిజంగానే ప్రేమించాలని అన్పిస్తున్నది. కానీ నీ పర్మిషన్ లేకుండా ప్రేమిస్తే అది ఏక పక్ష ప్రేమ అవుతుంది కదా అని అన్పించింది. ఏకపక్ష ప్రేమ వేస్ట్. జీవితం పట్ల అవగాహన పెరుగుతున్నది. ఉద్యమాల్లో పని చేస్తున్నాం. ఇంకా మొహమాటాలు దేనికి? ప్రేమ కూడా ఒక సదవగాహన కలిగిన వ్యవహారమే. మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవడానికి సంబంధించిన సీరియస్ నిర్ణయం కూడా. అందువల్ల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే దానిపట్ల నాకు నమ్మకం లేదు. కలిసి పని చేసే క్రమంలో కలిసి మాట్లాడుకునే క్రమంలో పెరిగే అవగాహన, పరిచయం, స్నేహం నుండి క్రమంగా ఇష్టం పెరగవచ్చు. ఇష్టం క్రమంగా ప్రేమగా మారవచ్చు. ఇదే నిజమైన వ్యక్తిత్వం గల ప్రేమనుకుంటాను. నువ్వేమంటావ్.''
ఏదో ప్రేమ, దోమ అనే మాటలు విన్పించి చెట్ల కింద మాట్లాడుకుంటున్న వాళ్లు కాస్త తలతిప్పి ఇటుకేసి చూసినట్టనిపించి హారిక సిగ్గుపడిపోయింది.
''హాయ్ హారికా!'' అంటూ సౌమ్య హారికకేసి చెయ్యూపుతూ దగ్గరకు వచ్చింది.
''నీ డైలాగ్ బాగుందే. మళ్లొకసారి చెప్పే. ఆధునిక ప్రేమకు అద్భుతమైన నిర్వచనమిచ్చినవే.'' అంటూ సౌమ్య అభినందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చింది. హారిక కాస్త బిత్తరపోయినట్టు నటించింది.
అశోక్ ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూశాడు. చూపు మరల్చి ఎత్తయిన లైబ్రరీ బిల్డింగ్ శిఖరం కేసి చూపు సారించాడు. ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ తనను కొండంత నవ్వుతో వెక్కిరిస్తున్నట్టన్పించింది. వాళ్లిద్దరూ ముందే అనుకొని ఇలా తనను ఆటపట్టిస్తున్నారా అని సందేహం కలిగింది. ముఖం ముడుచుకుపోయింది.
నిజంగానే ప్లాన్ ప్రకారం అడిగినట్టుగానే సౌమ్య అశోక్‌కేసి చూస్తూ అడిగింది.
''అశోక్! హారిక నిన్ను ప్రేమిద్దామనుకుంటోంది. నీ అభిప్రాయం ఇంకా చెప్పినట్టు లేవు. ఏమంటవే హారికా?''
''ప్రేమించాలని లేకపోతే ఎందుడుగుతనే? కానీ ఈ ప్రవరాఖ్యుడు, శ్రీరామచంద్రుడు ఆ మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నడే''
''అంటే ప్రేమించవచ్చు అని చెప్పలేదా?'' అంటూ చిలిపిగా అశోక్ కేసి చూసింది సౌమ్య ఇప్పటికైనా జవాబు చెప్పు అన్నట్టుగా.
''మీరిద్దరు ఇట్లా అడుగుడు ఏం మంచిగలేదు. ఎవరైనా అడిగి ప్రేమిస్తరా? ప్రేమించడానికి పర్మిషన్ ఇచ్చుడంటే ముందు నేను ప్రేమిస్తున్నానని చెప్పడమే కదా!'' అంటూ అశోక్ తన సంకోచాన్ని బయటపెట్టాడు.
''అదీ అసలు విషయం. సరిగ్గా దారిలోకి వచ్చావు. నేను అడుగుతున్నది కూడా అదే. నువ్వు నన్ను ప్రేమిచదగిందే అనుకుంటే ఆ అభిప్రాయం నాకు చెబితే నేను నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాను.'' అంటూ స్నేహపూరితంగా నవ్వుతూ అశోక్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చింది హారిక.
చల్లగా హారిక చెయ్యి తాకి ఏదోలా అయ్యింది అశోక్‌కి.
''నేను పేదింటి నుంచి వచ్చిన. మా అమ్మానాన్నలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నరు.'' నేలకేసి చూస్తూ అన్నాడు అశోక్.
''అంటే మాది రిచ్‌ఫ్యామిలీ అని మీకెవరు చెప్పారు? మీ అమ్మనాన్నలేమో నీ మీద ఆశలు పెట్టుకుంటే... మా అమ్మానాన్నలు నన్ను గాలికొదిలేస్తరనా నీ ఉద్దేశ్యం? మాది రిచ్ ఫ్యామిలీ అయితే ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో, హాస్టల్‌లో ఎందుకుంటాను. ఎక్కడో బీటెకో, మెడిసినో చదువుకునే దాన్ని.'' నిష్టూరంగా అంది హారిక.
''ఏ కాస్త డబ్బున్న వాళ్లయినా సాఫ్ట్‌వేర్ సైడ్‌కో, మెడికో సైడుకో వెళ్లిపోతున్నారు. మిగిలినదంతా మనలాంటి వాళ్లే కదా!'' అంటూ నవ్వింది సౌమ్య.
''మొత్తానికి ఇన్నాళ్లకు ఉస్మానియా యూనివర్సిటీ మనలాంటి పేదోళ్ల నాయకత్వంలోకి వచ్చింది.'' అంటూ హారిక కాసేపు అవే విషయాలు చర్చించింది.
సౌమ్య అసలు విషయం పక్కదారి పడుతోందని గమనించింది.
''అది సరే గానీ అశోక్! ఈ కాలంలో ఇలా అడిగి ప్రేమించడమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం కూడా'' అంటూ సౌమ్య అశోక్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చింది. ముగ్గురూ కాసేపు సన్నగా నవ్వుకున్నారు.
''హారికా! అశోక్‌కి చాలా సిగ్గు. వెంటనే అడగడం బాగుండదు. కొద్ది రోజులు ఆలోచించుకోనీ. నిన్ను ప్రేమించాలనుకుంటే తనను ప్రేమించవచ్చని ఆలోచించుకొని చెపుతాడు. ఏమంటావ్ అశోక్'' అంటూ సౌమ్య మధ్యవర్తిత్వం చేసింది.
అవునన్నట్టు తలూపాడు అశోక్.
''సరే, వారం రోజులు టైమిస్తున్నాను. ఆలోచించుకో. అప్పుడే చెప్పు. నిన్ను ప్రేమించవచ్చని. సౌమ్యకు చెప్పినా ఫర్వాలేదు. సౌమ్యను ప్రేమించినా సంతోషిస్తా. ఏమంటవే?'' అంటూ సౌమ్యకేసి నవ్వుతూ చూసింది హారిక.
''పిల్లవాడు మంచివాడు. చక్కగా చదువుకుంటున్నాడు. తొందర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటాడు. వినయ, విధేయతలు బాగున్నాయి. బాడీ లాంగ్వేజ్ కూడా ఆడపిల్లల్లాగా వినయంగా బాగుంది. అందుకని నన్ను ప్రేమించవచ్చు. అని నీతో అన్నా, నాతో అన్నా, ఎవరితో అన్నా సంతోషమే. కనీసం తనకు తాను ప్రేమించలేకపోయినా, ప్రేమించాలనుకునే వాళ్లకు ప్రేమించవచ్చు అని చెప్పడం కూడా రాకపోతే వాళ్లేం మగవాళ్లే'' అంటూ సౌమ్య నవ్వుతూనే అశోక్‌కు చురక అంటించింది.
అశోక్‌కు వెన్నుపూసలో ఏదో జలజలా విద్యుత్తు పాకినట్టయింది. నిజమే! ప్రేమిస్తున్నానని వెంటపడాల్సింది మగవాళ్లే అనుకుంటారు ఆడవాళ్లు. అయితే తనను ఇద్దరు కలిసి ఆటపటిస్తున్నారని అనిపించింది. ఆ భావం గమనించినట్టుగా నవ్వుతూ అంది హారిక.
''నిజం అశోక్. నేను నిజంగానే నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. కానీ మూడీగా వుంటున్నావు. నీ మనసులో ఇంకెవరైనా ప్రేయసి లేదా ఊహా ప్రేయసి కదలాడుతుందేమో! నాకేం తెలుసు? అందుకని డైరెక్ట్‌గా అడగడమే మంచిదని అడుగుతున్నాను తప్ప నిన్ను ఆటపట్టించడం కోసం కాదు. మనకు టీనేజ్ దాటిపోయింది. ప్రేమించుకునే వయస్సు వచ్చేసి చాలాకాలం అయ్యింది. ఎన్నో వసంతాలు గడిచిపోయాయి. చదువు పేరిట, ఉద్యమాల పేరిట, ఉద్యోగాల పేరిట, కులాల పేరిట అమ్మానాన్నలు ఒప్పుకుంటారో లేదో అనే పేరిట మనం ప్రేమించుకోవడం పట్ల సంకోచంగా వ్యహరిస్తున్నాం. అంతే కదనే సౌమ్యా!'' అంటూ సౌమ్యకేసి చూసింది.
''యా! కరెక్ట్. ఈ కాలంలో కట్నాలు, కులాలు కూడా ప్రేమలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. కులం కూడా తెలిసిన తర్వాతే ప్రేమించుకుంటున్నారనేది కూడా వాస్తవం. ఎందుకొచ్చిన గొడవ అని అన్ని విషయాలు ముందే తెలుసుకొని ప్రేమించాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ సమస్య ఏ దేశంలో లేదు. యూరోప్‌లో గానీ, జపాన్‌లోగానీ, అమెరికాలోగానీ, రష్యాలోగానీ, చైనాలోగానీ హాయిగా ప్రేమ వ్యక్తం చేసుకుంటారు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇద్దరూ ప్రేమించు కోవాలనుకుంటేనే ప్రేమించుకుంటారు. లేదా స్నేహాన్ని కొనసాగిస్తూ ప్రేమ విషయం వదిలేస్తారు. అలా డేటింగ్‌లతో, మీటింగ్‌లతో పరస్పరం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటారు. అక్కడ తల్లిదండ్రులు పెళ్లి చేయరు. ఎవరికి వారే సంబంధాలు వెతుక్కోవాలి. ప్రేమించుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. ఫలానా వారిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటామని చెబితే తల్లిదండ్రులు, బంధుమిత్రులు తమ పిల్లలను చాలా వినయం, గౌరవం గల పిల్లలు అని ఆశీర్వదిస్తారు. పెళ్లి చేస్తారు. చాలామంది తల్లిదండ్రులుక్కూడా చెప్పకుండానే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తీరిగ్గా తల్లిదండ్రులకు చెబుతుంటారు. కట్న, కానుకల ప్రసక్తి లేదు. మ్యారేజ్‌బ్యూరోల్లో వెతుకులాడుకోవడం అనే దుస్థితి లేదు. హాయిగా అన్ని విషయాలు చక్కగా కలిసి మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు.'' అంటూ సౌమ్య చిన్న ఉపన్యాసం ఇచ్చింది.
''నీ ఉపన్యాసం మస్తున్నదే. నేను మొదట్నుంచి చెప్తూనే వున్నా. నువ్వు మంచి వక్తవు అవుతావని, మంచి లెక్చరర్ అవుతావని.'' అంటూ కితాబిచ్చింది హారిక.
''అంతేగానీ మంచి లీడర్‌గా ఎదగలేనంటావ్. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పనికిరానంటావ్. అంతేనా?'' అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో ప్రశ్నించింది సౌమ్య.
''నీకు టిక్కెట్ ఎవ్వరిస్తారే? తెలివి కలోళ్లను చూస్తే ఎవరికైనా నన్ను మించిపోతారని భయం. అన్నీ తెలిసి కూడా ఏం తెలవనట్టు వినయంగా, అమాయకురాల్లాగా వుండడం నేర్చుకుంటేనే నీకు టిక్కెట్టిస్తారు. అప్పటిదాకా నువ్వు ఉద్యమాలకు లీడరవవుతావుగానీ రాజకీయంగా నాయకురాలిగా ఎదగడం, ఇతరులు ప్రమోట్ చేయడం కష్టమేనే!'' అంటూ హారిక తన అభిప్రాయం విప్పి చెప్పింది.
''అయితే మీరిద్దరూ రాజకీయ జీవులన్నమాట. ఉద్యమాల కోసం త్యాగం చేయడం కాకుండా ఉద్యమాల ద్వారా నాయకులుగా ఎదగాలనుకుంటున్న సరుకన్నమాట.'' అంటూ అశోక్ వారిద్దరినీ తక్కువ చేసి మాట్లాడాడు.
ఒక్కసారిగా ఇద్దరూ విరుచుకుపడ్డారు. మన త్యాగాలను, మన పోరాటాలను ఇతరులు నాయకులుగా గెలవడానికి కాదు. మనమే రాజకీయ నాయకులుగా కూడా ఎదగాలి అంటూ సుడిగాలిలా వాదనకు దిగారు. ఆ వాదనకు మరికొందరు అక్కడికి వచ్చి చేరారు. హారిక, సౌమ్య అన్నది చాలా కరెక్ట్. పోరాటాలు మనవి, ఉద్యమాలు మనవి, నాయకత్వం మనది. రేపు రాజకీయాల్లో వేరే వాళ్లు నాయకులుగా గెలవాలా? మనమే ఎందుకు నాయకులుగా గెలవకూడదు.? 1969లో జై తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఎవరు ఉద్యమం చేశారో ఆ ఉద్యమం నుంచే నాయకులు ఎదిగారు. వాళ్లే రాజకీయ నాయకులయ్యారు. ఎమ్మెల్యేలయ్యారు. మంత్రులయ్యారు. ఎంపీలయ్యారు. అనేక రంగాల్లో ఇప్పుడున్న నాయకత్వమంతా ఆనాడు జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్లే. ఇప్పుడు ఆ క్రమం ఎందుకు సాగడం లేదు. ప్రతిసారీ ఇంకెవర్నో ఎన్నుకునే దుస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? ఈ తప్పుడు విధానం మారాలి. విద్యార్థులు, యువకులే రాజకీయ నాయకులుగా కూడా అన్ని రంగాల్లో ఎదగాలి. మనకేం తక్కువని? డబ్బులొక్కటే తక్కువ. వాళ్లు మాత్రం డబ్బులు ఇళ్లు అమ్మి పెడుతున్నారా? ఎవర్నో ఒకర్ని అడిగి సేకరించే విరాళాలే కదా? ఆ పని మనం చేయలేమా? ఎందుకు మనం నాయకులుగా ఎదగకూడదు?'' అంటూ చర్చ సాగుతూనే వుంది. చీకటి పడింది. హైమాక్స్ లైట్లు వెలిగాయి. గడ్డి దోమలు చుట్టూ ముసురుకుంటున్నా ఎవరూ గమనించడం లేదు. చర్చ వేడివేడిగా సాగి చివరకు మెస్‌లు మూసేస్తారని అంటూ మెల్లిగా లేచారు. పరస్పరం పరిచయాలు చేసుకొని సెలవు తీసుకున్నారు.
మెస్‌లో భోంచేసి వచ్చాక రాత్రంతా అశోక్‌కు అదే డైలాగ్ పదేపదే విన్పించింది.
'నిన్ను ప్రేమించవచ్చా' అని హారిక కళ్లల్లో కళ్లు పెట్టి చేతిలో చేయి కలిపి నొక్కుతూ అడిగిన ఆత్మీయ స్పర్శ ఎంతో హాయిగా, తియ్యగా వుంది. గుర్తు చేసుకున్న కొద్దీ ఆ హాయి రెట్టింపవుతూ వస్తున్నది. ఎప్పుడో రాత్రికి నిద్రపోయాడు.
హారిక, సౌమ్య లేడీస్ హాస్టల్‌లో ఎవరి రూములో వారు పడుకున్నారు. ఎవరికి వారు ఆలోచిస్తున్నారు. అర్ధరాత్రి దాకా నిద్రపోలేదు. అడిగేటప్పుడు చాలా ఈజీ అన్పించింది. అడిగింతర్వాత ఏదో బరువన్పిస్తోంది. అశోక్ జవాబు నెగెటివ్‌గా వస్తే ఎలా? ఆ అవమానం తట్టుకోవడం సాధ్యమా? ఎందుకు అలా అన్నాం?
ఈ మధ్య అశోక్ ఒంటరిగా, మూడీగా వుంటున్నాడు. ఇలాంటి వారు ఆత్మహత్యకు పాల్పడతారేమోనని భయం. ఆత్మహత్యలు ఆపాలి. తనను ప్రేమించే వారు ఒకరున్నారని అనుకుంటే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు అని లక్ష్మీప్రియ పదేపదే వాదించింది. అది అలా ప్రేమలో పడ్డతర్వాతే ఆత్మహత్యా ప్రయత్నం మానుకుందట. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయంచుకున్నారని దాని బడాయి.
అది నిజమా కాదా అని తెలుసుకోవాలని ఈ ప్రయోగం. ఇది ఎవరికీ తెలియదు. ఏదో చేయబోయి మరొక దాంట్లో ఇరుక్కున్నామా అని మొదటిసారిగా ఫీలయ్యారు. అయినా అశోక్‌ను ప్రేమించడానికి అతనిలో ఏం తక్కువయిందని! అలా తాము చేసింది తప్పు కాదని తమకు తాము సర్దిచెప్పుకున్నారు.
ఉదయం స్నానం ముగించుకొని టిఫిన్ సెక్షన్‌కు మెస్‌లోకి వచ్చి హారిక సౌమ్య కోసం చూసింది. సౌమ్య కూడా హారిక కోసమే చూస్తున్నట్టుంది. హాయ్ అంటూ పరస్పరం పలకరించుకొని ఒక మూలకు వెళ్లారు. నిన్న మనం చేసింది సరైందేనా అని తర్కించుకున్నారు.
''చాలా కరెక్ట్ మనం ఏ తప్పు చేయలేదు. ప్రేమించ లేని వాళ్లు, ప్రేమించే అవకాశం లేని వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు.
తమను ప్రేమించే వారు కనీసం ఒకరున్నారని అనుకున్నప్పుడు ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఉత్సాహంగా వుంటారు. ఈ మాట తప్పయితే మన లక్ష్మణ్ ప్రొఫెసర్‌ను అడుగుదాం.'' అంటూ సౌమ్య హారికను సమర్థించింది.
''అదిగాదే! ఆ మాటకొస్తే ప్రేమించే వాళ్లు ప్రేమ విఫలమైతే కూడా ఆత్మహత్య చేసుకుంటారు. కాదంటావా?'' అంది హారిక.
''సరే! మధ్యాహ్నం సార్‌ను కలిసి డిస్కస్ చేద్దాం.'' అని చర్చను ముగించి సౌమ్య హారికను తీసుకొని టిఫిన్ సెక్షన్ కేసి నడిచింది.
మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీలో తమకు ఉద్యమంలో నిత్యం సలహాలిచ్చే లక్ష్మణ్ ప్రొఫెసర్ ఆఫీస్ గదికేసి నడిచారు. తమ భావాలను, జరిగిన విషయాన్ని వివరించారు.
''యూ ఆర్ టూ లేట్!'' అంటూ నవ్వి లక్ష్మణ్ తన అనుభవాలను కలబోసుకున్నారు. అప్పుడే ఆయన భార్య అసిస్టెంట్ ప్రొఫెసర్ సృజన నవ్వుతూ లోపలికొచ్చి కూర్చుంది. హారిక, సౌమ్యలను సృజనకు పరిచయం చేశాడు లక్ష్మణ్.
''అవును. లక్ష్మణ్ అన్నట్టు మీరు చాలా లేట్. మేము ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాం. అప్పుడు ఇలాగే విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాం. కొన్ని వందల మంది విద్యార్థులు ఆ ఉద్యమంలో భాగంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా పెళ్లి కూడా అలానే జరిగింది. మీలాగే అప్పుడు కూడా నేనే చొరవ తీసుకున్నాను. ఈయన అప్పుడూ ఇప్పుడూ ఇంతే'' అంటూ నవ్వింది సృజన.
''హారికా! ఈమె అప్పర్ క్యాస్ట్. నేనేమో లోయర్ క్యాస్ట్. ఇంట్రావర్టిని. నేను ప్రేమించానని చెప్పడానికి ఎంతో భయం. ఆమెకేంటి? అప్పర్‌క్యాస్ట్‌ననే గర్వం. దాన్ని ఆత్మవిశ్వాసంగా భావించి చొరవ తీసుకుంది. అంతేగానీ ఆమె ముందే ప్రేమించిందని, నేను ప్రేమించలేదని కాదు.''
''హారికా! పెళ్లయి ఇన్నేళ్లయినా మా పిల్లలు మీలాగా కాలేజీ చదువుతున్నా ఇంకా నన్ను అప్పర్ క్యాస్ట్ అహంకారని హేళన చేయడం మానలేదు చూడు. ఈ మగవాళ్లకు చెప్పిందల్లా చేయకపోతే వాళ్ల అహంకారం దెబ్బతిని దానికి కుల అహంకారమని పేరు పెట్టి తిడుతుంటారు. అంతేగానీ, ఫెమినిజం వచ్చింతర్వాత స్త్రీ పురుషులు సమానమని మేం భావిస్తూ సమానంగా పురుషులు కూడా పనిచేయాలని ప్రతిసారీ నేనే నీకు చాయ్ చేసి ఎందుకివ్వాలని, నువ్వెందుకు చేసివ్వవని అడిగితే నాలో కుల అహంకారం వుందనే పేరిట తన మగపెత్తనం సాగించుకుంటాడు. సందు దొరికితే చాలు నేను పుట్టిన కులాన్ని తిట్టడమే ఈయన పని.'' అంటూ నవ్వింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సృజన.
''అసలు హారికా! వీళ్లు ఆ కాలంలో ఉద్యమాల్లోకి వచ్చి మాకన్నా ఎక్కువ ముందు ఉరికేవాళ్లు. అదంతా గొప్ప సాహసం అనుకున్నాం. కానీ కట్నం లేకుండా నచ్చినవాన్ని, మెచ్చిన వాన్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా ఆడవాళ్లు ఉద్యమాల్లోకి వస్తున్నారని అప్పుడు ఎవరో అనే దాకా తెలియదు.'' అంటూ నిజమా కాదా అన్నట్టు నవ్వుతూ సృజనచేసి చూశాడు లక్ష్మణ్ ప్రొఫెసర్.
''అలా భావించి ఉద్యమాల్లోకి రావడం ఏమైనా పొరపాటా? అదేమన్నా తప్పా? సమాజం పట్ల గొప్ప అవగాహనతో ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని ఉత్తేజంగా జీవితాలను అందుకు అంకితం చేయాలని ముందుకు వస్తున్న యువకులను చూస్తే ఎవరికి ప్రేమించాలనిపించదు?'' సృజన మాటకు మాట జవాబిచ్చింది.
''అంత కోపానికి రాకు. ఏదో జోక్‌గా అన్నాను. లైట్‌గా తీసుకో. నిజానికి రష్యా, చైనాలోగానీ, ఏ దేశంలోగానీ ఉద్యమాలు జరిగినప్పుడు వేలాది మంది కలిసి పనిచేసే క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చివరకు క్షణక్షణం అప్రమత్తంగా వుండే యుద్ధాల్లో కూడా ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే సహజ క్రమం కూడా. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంతకాలం నుంచి ఇప్పుడు ఈ కొత్త ఉద్యమం సాగుతున్నప్పటికీ సార్ మేం ఇష్టపడ్డాం. మా పెళ్లికి సహకరించండని అన్న వాళ్లు ఎవరు లేరు. మీరు తప్ప. అది కూడా ప్రేమించవచ్చా సార్ అని అడగడానికి? అసలు ఇంతకూ సమాజం ముందుకు పోతుందా... వెనక్కి వస్తుందా అర్థం కావడం లేదు. మేము మీరు పుట్టకముందు హాయిగా ప్రేమించుకున్నాం. ఉద్యమాలను నిర్మించినం. ఏదీ పరస్పర విరుద్ధం అనుకోలేదు. మీదంతా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టయింది. అయినా గుడ్డిలో మెల్ల. అయితే ఇంతకూ మీరు అశోక్‌ను నిజంగా ప్రేమించడానికి సిద్ధంగా వున్నారా?'' అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తూ వారి కళ్లల్లోకి సూటిగా చూశాడు లక్ష్మణ్ ప్రొఫెసర్.
''ఆడపిల్లలు ఇంతకన్నా స్పష్టంగా ఎలా చెపుతారు? మీరు భలే వున్నారు?'' అంటూ సృజన వారికి మద్దతు పలికింది.
''నిజం మేడం! నాకు అశోక్‌ను నిజంగానే ప్రేమించాలని వుంది. కానీ మా వూర్లో మేం పెరిగిన వాతావరణంలో మాకు ప్రేమించడం అనేది మా జీవితంలో భాగం కాలేదు. ఇంకా సమాజం ఎంతో మారితే తప్ప ప్రేమించడమనేది మన ప్రాంత జీవితంలో భాగం అయ్యేటట్టు లేదు. కులం, మతం, తల్లిదండ్రులు, కులం, అన్నలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ కలిపి చూసి పెళ్ళి చేసుకుంటున్న వ్యవస్థ ఇది. ప్రేమించాను అంటే బలహీనతగా తీసుకొని చిన్నచూపు చూసే పురుషాధిపత్య వ్యవస్థ ఇది. అందుకని నేను ప్రేమించాలని వున్నప్పటికీ ప్రేమించలేకపోతున్నాను. బాయ్స్ ఎవరన్నా మమ్మల్ని ప్రేమించానని వెంటపడితే నమ్మాలనిపించడం లేదు. ఇది ఒక సందిగ్ధ స్థితి సార్.'' అంటూ హారిక సృజన, లక్ష్మణ్ దంపతులతో మనసు విప్పి మాట్లాడింది. సౌమ్య కూడా ఇలాగే తన అనుభవాలను వివరించింది.
''అయితే ఇవన్నీ మేము మా కాలంలో ఎదుర్కోలేదా? అప్పుడేమైనా సమసమాజం వుండేదనుకుంటున్నారా? ఇంతకన్నా ఎంతో ఘోరంగా వుండేది వ్యవస్థ.ఇప్పుడు ఎంతో మారింది. ప్రేమించుకున్నాం అంటే తల్లిదండ్రులే కులాంతరమైనా ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చాక ఒకరిదద్దరే సంతానం కావడంతో వారిని వదులుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మా అప్పుడైతే పెళ్ళయిన తర్వాత రెండేళ్ల దాకా అటు మా వాళ్లు ఇటు వీళ్ల వాళ్లు ఎవరూ సరిగా మాట్లాడలేదు. వాళ్లకు మనవడ్ని కని ఇచ్చినంక మాటలు కలిశాయి.'' అంటూ ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది సృజన. తన బెస్ట్‌ఫ్రెండ్ స్వర్ణలత ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని సమసమాజం నిర్మించాలని, నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావాలని ఉద్యమంలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత మళ్లీ కలవలేదు. చివరకు ఆమె శవాన్ని కూడా తనకు చూడ్డం వీలుపడలేదు. స్వర్ణలతని చూడాలని తాను ఎన్నిసార్లు అనుకుందో! స్వర్ణలతలా తాను కూడా ఉద్యమంలోకి వెళ్లాలనుకొని ఎంత ఉత్సాహపడిందో. ఆనాటి యువతరం మహోన్నత లక్ష్యాలు, ఆవేశాలు, త్యాగాలు ఈనాడు ఏమైపోయాయి... ఆనాటి ఉద్యమ మిత్రులంతా ఎక్కడెక్కడో... చెల్లా చెదురైపోయారు. సృజన కళ్లల్లో కన్నీటి పొర.
ప్రొఫెసర్ లక్ష్మణ్ సృజన ఆలోచనలను, ఉద్వేగాన్ని గమనించినట్టుగా అన్నాడు. ''సృజనా! కొన్ని విషయాల్లో సమాజం వెనక్కిపోతున్నట్టనిపిస్తుంది. త్యాగమే ఆనాటి వయసు పిలుపు. వ్యక్తిగత ఉజ్వల భవిష్యత్తు గురించి కాకుండా సామాజిక పరిణామంలో తమ వంతు కృషి కోసం త్యాగాలు చేయాలని ఎంతగానో ఉవ్విళ్లూరిన కాలం. నేడు మునుపు లేని ఆస్తి, అంతస్తుల గొడవ, కులాల గొడవ ఇప్పుడు బాగా పెరిగింది. కాదంటావా?'' అంటూ ప్రొఫెసర్ లక్ష్మణ్ హారిక, సౌమ్యల కేసి తిరిగి ఇలా అన్నాడు.
''అయితే ఇది మీ ఇద్దరి సమస్య మాత్రమే కాదు. మీకే పరిమితం కాదు. మన ప్రాంతానికే పరిమితం కాదు. మన దేశంలో కోట్లాది మంది యువతరం ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీన్ని పరిష్కరించడం దానికదే విడిగా వున్న సమస్య కాదు. మొత్తం సమాజం, సంస్కృతి విలువలతో కుటుంబ వ్యవస్థతో, కుల వ్యవస్థతో ముడివడి వున్న అంశం యిది.'' అంటూ చాలాసేపు వివరించాడు. వారికి తమ ఇద్దరి నైతిక మద్దతు వుంటుందని, ముందుకు సాగమని మీరు చేసింది సరైందేనని అభయ హస్తం ఇచ్చారు.
అశోక్ కూడా ఇలాంటి సందేహమే కలిగింది. అతడు మరో ఇద్దరు స్నేహితులను కలిసి ముచ్చటించాడు. వాళ్లిద్దరూ తమకు కూడా తోచక దయాసాగర్ ప్రొఫెసర్‌ను కలిశారు. అది తమ సమస్యగా కాకుండా ఏదో సిద్ధాంత చర్చ చేస్తున్నట్టుగా అడిగారు. అంతా విని దయాసాగర్ ప్రొఫెసర్ సానుభూతిగా చక్కగా వివరించాడు.
''వయస్సు పిలుస్తుంది ఎవరినైనా ప్రేమించాలని. సామాజిక ఉద్యమాలు ఉత్తేజ పరుస్తాయి. సమాజం కోసం... దేశం కోసం... ఎంతైనా త్యాగం చేయాలని. చివరకు ప్రాణం కూడా అందుకు అర్పించాలని...'' అంటూ మా క్లాస్‌మేట్ ఒకాయన అందరికీ కవితలాగా వినిపిస్తుండేవాడు. నిజంగానే ఆ మాట చాలామందిని ఇన్‌స్పయిర్ చేసింది. ఎంతోమంది ఉద్యమిస్తూనే ప్రేమించారు... పెళ్ళి చేసుకున్నారు... మాదీ ప్రేమ పెళ్ళే. వయసు పిలుపు రెండు రకాలు. ఒకటి ప్రేమ. రెండు త్యాగం. ఏ తరంలోనైనా నవ యవ్వన తరం తాను సమాజం కోసం త్యాగాలు చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అలాంటి వాతావరణం లేనప్పుడు పరస్పరం ప్రేమించుకోవాలని వయసు పిలుస్తుంది...
... అయితే ఉద్యమాలు త్యాగంతో పాటు ప్రేమించుకోవడాన్ని కూడా సహజం చేస్తాయి. కానీ వర్తమానం దీనికి భిన్నంగా సాగుతున్నది. ఇదే ఇందులో వున్న విషాదం. ఉద్యమం సాధారణంగా ధైర్యాన్ని, సమిష్టి చైతన్యాన్ని పెంచుతుంది. అదే నిజమైన ఉద్యమం. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈ ఉద్యమంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఒక దశకు ఎదిగిన ఆవేశం, ఉద్రేకం, సమాజం కోసం, సామాజిక మార్పు కోసం ఏదో చేయాలని లక్ష్యం, త్యాగం చేయాలనే భావన మనిషిని నిలువెల్లా ఆవేశించినప్పుడు నాయకత్వం అందుకు సరైన కార్యక్రమం ఇవ్వలేకపోతే ఆ ఆవేశం, ఆ త్యాగం రివర్స్‌లో నిరాశలోకి ప్రవహిస్తుంది. ఈ దశలో ఉద్యమాన్ని ఆరిపోకుండా ముందుకు తీసుకెళ్లేందుకు తన ప్రాణత్యాగం ఉపయోగపడుతుందనే ఆలోచనలోకి మళ్లుతారు. ఇదంతా సామాజిక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశం. ఇది మాస్ హిస్టిరియా అని కొందరు శాడిస్టులు అంటున్నారు. వాళ్లు మూర్ఖులు. ఉద్యమ వ్యతిరేకులు. ప్రాణ త్యాగం చేసిన వాళ్లు పిరికివాళ్లు అనే వాళ్లకు బుద్ధి లేదు. వాళ్లే నిజంగా పిరికిపందలు. దమ్ముంటే వాళ్లు ఉద్యమం కోసం రొమ్ము విరిచి మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు తప్ప ఇతరుల ప్రాణత్యాగాలను తేలికగా మాట్లాడరు. మీరు మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అని అనేక విషయాలు విశ్లేషించి చెప్పాడు దయాసాగర్.
హారిక అశోక్ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అశోక్ హారిక నిర్ణయం కోసం, పలకరింపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు ముందు పలకరించాలో తేల్చుకోలేక రోజులు గడిచిపోయాయి. సౌమ్యకు కోపంగా వుంది.
''ఈసారి నేను మధ్యవర్తిగా రాను. చచ్చుదద్దమ్మల్లాగా, పిరికిపందల్లాగా ప్రేమను కూడా వ్యక్తం చేయలేని మీరేం మనుషులే!'' అంటూ అంతెత్తున ఎగిరింది సౌమ్య. ''మీ చావు మీరు చావండి. మీ ప్రేమను మీరు ఎలా వ్యక్తం చేసుకుంటారో మీ ఇష్టం. మళ్లొకసారి నన్నుఅడగవద్దు'' అంటూ టాటా, బైబై'' చెప్పేసి నవ్వుతూ వెళ్లిపోయింది సౌమ్య. అప్పటినుండి సౌమ్య హారికను తప్పించుకొని తిరుగుతోంది.
ఆ రోజు ఆర్ట్స్ కాలేజీ ముందున్న చెట్ల కింద విద్యార్థులు గుంపులు గుంపులుగా ఏదో చర్చిస్తున్నారు. కొందరు లక్ష్మిప్రియ పెళ్లికి అందరం కలిసి వెళ్ళాలని, గ్రాండ్‌గా పెళ్లి జరపాలని ముచ్చటిస్తున్నట్టున్నారు.
ఆర్ట్స్ కాలేజీ మెట్ల వద్ద టెంట్ కింద విద్యార్థుల రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. మరికొందరు పిడికిలెత్తి నినాదాలిస్తున్నారు.
యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజీ వైపు వస్తూ చెట్ల కింద వున్న హారికను చూసి, కలిసి చాలా రోజులైందని సౌమ్య అటు వైపు నడిచింది. హారిక నిరాహారదీక్ష టెంట్ వైపు చూస్తోంది. హారిక చూస్తున్న వైపు సౌమ్య దృష్టి సారించింది. అశోక్ అక్కడ నినాదాలిస్తూ మందిలో కన్పించాడు.
హారికను సమీపించింది సౌమ్య.
''హాయ్ హారికా! ఏమైందే నీ ప్రేమ. ఎంతకాలం ఈ ఎదురు చూపులు?'' అంటూ ప్రశ్నించింది.
''ఇవాళ నిరాహార దీక్ష శిబిరంలో దీక్ష విరమించాక మన దగ్గరికే వస్తాడు చూడు.'' అంటూ విశ్వాసంతో పలికింది హారిక.
''ఏమైనా మంత్రం వేసినవా? హిప్నాటిజం ప్రయోగించినవా? ఎట్లా ఖచ్చితంగా చెబుతున్నావ్?''
''నాకు తెలుసు'' అంటూ బెట్టుపోయింది హారిక.
సాయంసంధ్య ముసురుకుంటుంది. చెట్ల క్రింద చీకటి పరుచుకుంటోంది. చాలామంది చెట్ల కింద నుంచి వెళ్ళిపోతున్నారు. కొందరే మిగిలారు. హారిక, సౌమ్య నిరీక్షిస్తున్నారు. నిరాశతో వెళ్లిపోదామని చూస్తున్నారు.
అనుకున్నట్టుగానే ''హాయ్ హారికా! నిన్ను ప్రేమించవచ్చా!'' అని అశోక్ నవ్వుతూ పలకరించాడు.
''ఈ రివర్స్ డైలాగ్ భలే మస్తుగుంది. కంగ్రాట్యులేషన్స్!'' అంటూ సౌమ్య అశోక్‌ను, హారికను విష్ చేసింది.
''అయితే సౌమ్యా! ఈ విషయం మేం చెప్పేదాకా ఎవరికీ చెప్పొద్దు. లక్ష్మిప్రియ పెళ్లిలో నువ్వే డిక్లేర్ చేయాలి.'' అంది హారిక.
- వార్త దినపత్రిక, ఆదివారం సంచిక, 2011
మలి యవ్వనం
జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మర్చిపోలేం... ఎన్నటికీ మర్చిపోలేని విషయాలు విశ్వనాథం జీవితంలో ఎన్నో... రిటైరయ్యాక అప్పుడప్పుడు అవన్నీ తీరికగా గుర్తుకొస్తుంటాయి. విశ్వనాథం రిటైరయ్యాక పావని అడిగిన మాటలు, ఏడ్చిన విషయం... తన బాల్యం... తన పెళ్ళి... తన కాలేజీ జీవితం... ఉద్యోగ జీవితం... తొలి సంతానం కలిగిన నాటి ఆనందం... ఆత్మీయ స్నేహాలు, బంధుత్వాలు... అన్నీ అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి... రిటైరయ్యాక మిగిలేవి మధురమైన జ్ఞాపకాలే కదా!
జ జ జ జ
చూస్తుండగానే విశ్వనాథం రిటైరై నాలుగేళ్లవుతోంది. ఇప్పుడు ఏ పనీ లేదు. ముందే ముభావి... చిన్నప్పుడు హుషారుగా అందరితో కలిసి ఆడిపాడిన స్వభావమే... ఉన్నత ఉద్యోగంలో తక్కువ మాట్లాడాలని అనుభవం మీద అలవాటు చేసుకున్నాడు. అలా ఉద్యోగం ఎన్నో అలవాట్లను మార్చింది. కొత్త అలవాట్లను నేర్పింది. వ్యక్తిత్వంలోనే ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పనులు చేయగలిగి వున్నా చిన్నతనంగా ఫీలై చేయడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు. పొద్దస్తమానం ఇంట్లో కూర్చోవడం, టీవీ ఛానళ్లు మార్చడం, ఫోన్లు చేయడం, ఎప్పుడు టిఫిన్ టైమ్ అవుతుందో అని ఎదురు చూడ్డం. ఎవరైనా ఫోన్ చేస్తారేమోనని ఆశ. భోజనవేళ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ సోఫాలో ఒరిగి గోడ గడియారం కేసి చూడ్డం. పావనికి తనలా బోరుకొడుతున్నట్టు ఏమీ లేదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ వుంటుంది.
విశ్వనాథం సగటు సీనియర్ సిటిజన్స్‌లో ఒకడు. ప్రభుత్వోద్యోగంలో చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది పెద్ద పదవితో రిటైరయ్యాడు. ముగ్గురు పిల్లలను కనిపెంచి పోషించి ఒక ఇంటివారిని చేశాడు. ఎవరి బతుకు వాళ్లదై పోయింది. బడిపంతులు సినిమాలో ఎన్టీరామారావు, అంజలీదేవి రిటైరయ్యాక ఇంట్లో ఇద్దరే మిగిలిపోయినట్టు ఒంటరి జంటగా మిగిలిపోయారు. అంతదాకా కొడుకులు, కోడళ్లతో, మనవళ్లతో కళకళలాడిన ఇళ్లు బోసిపోయింది. ''నీ నగుమోమూ కనులారా కననిండు... రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయారు... రెక్కలుడిగి దిక్కులేని పక్షిలాగా వున్నాము...'' అన్న పాటను అంజలీదేవిలాగే పావని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటుంది.
రిటైరయ్యాక జీవితం ఎంత హాయిగా వుందో! ముప్పైయారేళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసీ చేసీ అలసిపోయాడు విశ్వనాథం. రిటైర్‌మెంట్ లైఫ్ ఇంత హాయిగా వుంటుందని ఎప్పుడూ ఊహించలేదు. తాను ఉద్యోగానికి ఎక్కినప్పుడు 1974లో 150 రూపాయలే జీతం. సైకిల్ మీద పల్లెటూరికి పోయి రావడం. ఇప్పుడు అయిదంకెల పెన్షన్ టంచన్‌గా అందుకుంటున్నాడు. మునపటిలా సబ్‌ట్రెజరీ ఆఫీసు దగ్గర లైను కట్టాల్సిన పని లేదు. బ్యాంకులో ఒకటో తారీకుకల్లా పెన్షన్ జమైపోతుంది. అవసరమైనప్పుడు ఏటీఎంకు వెళ్లి అవసరమైనంత విత్‌డ్రా చేసుకొని తెచ్చుకోవడమే.
ఇప్పుడు ఎక్కడెక్కడనో కిరాయికుండాల్సిన పని లేదు. సొంతింట్లో వుంటున్నాడు. కిరాయి కూడా మిగులుతోంది. పిల్లలందరూ ఎక్కడివాళ్లక్కడ బతుకుతుండడంతో తన పెన్షన్ తనకే మిగులుతోంది. ఏ రోగం రాకపోతే తానే పిల్లలకు ఏదైనా బర్త్‌డే సందర్భంగా ప్రెజంటేషన్స్ ఇవ్వవచ్చు. మొన్నీమధ్య మనవరాలికి పది గ్రాముల గోల్డ్‌చైన్ చేయించిపెట్టాడు.
పావనికి ఇరుగుపొరుగుతో ఎంతోకొంత కాలక్షేపం జరుగుతుంది. విశ్వనాథానికి కాలక్షేపం కోసం కాలనిర్ణయ పట్టికను మార్చుకున్నాడు. తనకన్నా ముందు రిటైరైన వారిని కలిసి అనేక విషయాలు తెలుసుకున్నాడు. విశ్వనాథం రిటైరయ్యాక ఎంత ఒంటరినవుతానోనని భయపడ్డాడు. కానీ అందుకు భిన్నంగా కొత్త స్నేహాలు పెరుగుతున్నాయి. పెన్షనర్లతో, వాకర్లతో డబ్బుల గొడవ లేదు. అంతస్తుల, అధికారాల గొడవ లేదు. ఎవరికైనా జబ్బు చేస్తే ఆదుకోవడానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా చనిపోతే వారి భార్యకు నామినీగా పెన్షన్ శాంక్షన్ చేయించడం కోసం చురుకుగా పని చేస్తారు. ఇదంతా ఉత్సాహాన్ని నింపే జీవితం. ఎనభైలో పడ్డ సూర్యనారాయణకు అమ్ముకున్న పెన్షన్ కూడా తిరిగి జమవుతున్నది. రిటైరయ్యాక అమ్ముకున్న పెన్షన్ పదిహేనేళ్లు నిండిన తర్వాత తిరిగి కలిపి పూర్తి పెన్షన్ ఇస్తారు.
అయినా తనకు ఇంకా పొద్దుపోవడం లేదనిపిస్తోంది. ఆనాటి స్నేహితులు, కొలీగ్స్ అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నారు. ఈసారి రాజేశం ఇరవై రోజుల తీర్థయాత్రల టూర్‌ప్రోగ్రాం పెట్టాడట. వెళ్ళాలనిపిస్తోంది. పావని ఏమంటుందో! చాలామంది తీర్ధయాత్రలు చేస్తూ పుణ్యానికి పుణ్యం, ప్రశాంతతకు ప్రశాంతత సంపాదించు కుంటున్నారు.
అన్ని బాధ్యతలనుంచి విముక్తమైన స్వేచ్ఛాయుత జీవితం నిజంగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం ఆయుష్షు తక్కువ. యాభై, అరవై దాటి బతకడమే గగనం. ఇప్పుడు ఎనభై దాకా ఆరోగ్యంగా బతుకుతున్నారు. జీవన ప్రమాణాలు పెరిగాయి. వైద్య సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వం మేజర్ రోగాలకు రీయింబర్స్‌మెంట్ కూడా కొంత ఇస్తోంది. అప్పుడప్పుడు పిల్లలు, మనవళ్లు పలకరిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా సమాజం ఎలా ముందుకు సాగుతున్నదో స్వేచ్ఛగా, హాయిగా గమనిస్తూ వుండవచ్చు. తాము అవసరమైన సలహాలు ఇవ్వవచ్చు.
రిటైర్డ్ లెక్చరర్ గాజుల నారాయణ అన్నట్టు పెన్షన్ అనేది నిజంగానే ఒక గొప్ప వరం. పెన్షన్ లేని జీవితం ఒక నరకం. అమెరికాలో పెన్షనే వుండదట! ఎనభై దాటినా పని చేస్తూనే ఉంటారట. నిజంగా భారతదేశం ఎంత గొప్ప దేశం! ఇంత పేదరికంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. పెన్షనర్లకు ఎంతో చేస్తోంది. అలాంటిది అమెరికా ఎంతో సంపన్న దేశమని అంటారు. కానీ పెన్షన్‌లేని జీవితాలు ఎలా బతుకుతారో పెన్షన్ ఇవ్వలేని ప్రభుత్వం, ప్రైవేటు రంగం అది ఎంత సంపాదిస్తేనేమి? వాళ్లు ఎంత ధనవంతులైతేనేమి? అది ఎంత అగ్రరాజ్యం అయితేనేమి? పిసినారి దగ్గర వున్న బంగారం కథ లాగా... చూసుకొని మురవడానికా? తమ కోసం సేవ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని కఠిన హృదయాలు వారివి. అమెరికా ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు జీవితమంతా ఇంత కఠినంగా వుంటే ఉద్యోగ సంఘాలు అక్కడ ఏం చేస్తున్నట్టు? మనను చూసైనా నేర్చుకోవచ్చుగా అనిపిస్తుంది...
... ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇండియాలో వున్నన్ని సదుపాయాలు, గౌరవాలు ఏ దేశంలో లేవంటారు. అందుకే పెన్షన్ అనేది ఒక వరం. ప్రభుత్వ ఉద్యోగం కోసం అందరూ వెంపర్లాడేది కూడా అందుకోసమే. అయితే ఈ మధ్య పెన్షన్ ఇవ్వం అని ప్రభుత్వం ముందే చెప్పి ఉద్యోగంలోకి తీసుకుంటోంది. తన కొడుకు ఉద్యోగానికెక్కి అయిదేళ్లయింది. సెల్ఫ్ పెన్షన్ స్కీంలో తన జీతమే జమ చేసుకోవాలని అంటుంటాడు. వాళ్లు రిటైరయ్యే నాటికి ఏ ప్రభుత్వం వుంటుందో! మళ్లీ ఎలక్షన్లు రావా! అప్పుడు ఎవరు పెన్షన్ ఇవ్వడానికి హామీ ఇస్తారో వారినే గెలిపిస్తారు. పెన్షన్ నిరాకరించిన ప్రభుత్వాలు ఓడిపోక తప్పదు. చంద్రబాబు కరువు భత్యం ఇవ్వకపోతేనే ఏమైపోయాడో అందరికీ తెలిసిపోయింది గదా! తమకు హాప్ ఏ మిలియన్ జాబ్ స్కీమ్‌లో 1973-74లో ఇలాగే కేవలం కన్సాలిడేటెడ్ జీతం ఇస్తే ఆ తర్వాత అన్నీ ముక్కుపిండి వసూలు చేసుకోలేదా? సర్వీసు సీనియార్టీ కూడా తీసుకోలేదా? అంటూ తాను కొడుకును సముదాయిస్తుంటాడు.
పెన్షన్ లేని డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి రిటైరైతే ఎంత కష్టం. పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ కాకుండా తండ్రి మీద ఆధారపడతుంటారు. ఈ కాలంలో ఉద్యోగాలు దొరక్క లక్షలాది మంది తండ్రి సంపాదన మీద ఆధారపడి చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు తమ పెన్షన్‌లో సగంకన్నా తక్కువగా జీతాలు ఇచ్చి పొద్దంతా వెట్టిచాకిరిలా పని తీసుకుంటున్నారు.
సుధాకర్ పెన్షన్‌లేని ఆర్టీసీలో చేరాడు. పెన్షన్ ఉండదని తెలియదు... పెన్షన్ ప్రాధాన్యత తెలియదు. ఏవో ప్రమోషన్లు వస్తాయని ఆశపడ్డాడు. రాకపోయినా బాధపడలేదు. కానీ రిటైరయ్యాక పెన్షన్ లేకపోవడంతో ఎంత క్షోభకు గురయ్యాడో...! సెల్ఫ్ పెన్షన్ స్కీం కింద రెండు వేలు కూడా సరిగ్గా రావు. పెన్షన్ స్కీం పెట్టకుండా ఒకేసారి పెద్దమొత్తం ఇచ్చి పంపించిన వారి బతుకులు ఆగమైపోయాయి.
సింగరేణిలో చేరి వీఆర్‌ఎస్ తీసుకుని రిటైరైన లక్ష్మయ్య బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వడ్డీతో బతకాలనుకుంటే కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలని యాగీ చేసి.. చివరకు నువ్వు ఛస్తే శవం చూడ్డానికి కూడా రాం అని బెదిరించి వున్నదంతా వూడ్చుకు పోయారు. ఇప్పుడు ఎవరూ పెట్టడంలేదు. ఎంత దయనీయమైన బతుకో... రామాచారి బ్యాంకులో రిటైరయ్యాక వచ్చిన డబ్బుతో సినిమా రంగంలో పడ్డ కొడుకు ఇంకా కొట్టుమిట్టాడుతూనే వున్నాడు. ఒక్కొక్కరి బతుకు ఒక్కొక్క తీరు... అనంతం, రాధాకిషన్ ప్రిన్సిపాల్స్‌గా రిటైరై హాయిగా నిజంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు... తనకే ఎందుకో తోచడం లేదు... ఏ పనీ చేయాలనిపించడం లేదు...
పావనికి మనవలు, మనవరాండ్లు, కొడుకులు, కోడళ్లు మూడు రోజులకొకసారైనా ఫోన్ చేయకపోతే తోచదు. బుధవారం ఒకరు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు తప్పకుండా ఫోన్ చేయాలని తాఖీదులిస్తుంటుంది. గురువారం షిర్డీ సాయిబాబా గుడికి వెళ్తుంది కనుక ఆ రోజు చేయవద్దంటుంది. ఫోన్ గంట ఆలస్యమైతే చాలు అన్నం మానేసి ఎవరికో ఆరోగ్యం బాగాలేనట్టు రంధిగా ఫోన్ కోసం ఎదురు చూస్తూనే వుంటుంది. తనతో నిమిషం కూడా మాట్లాడరు. తాను ఫోన్ ఎత్తగానే బాగున్నావా నాన్నా అంటూ అమ్మ ఏం చేస్తోంది అని అడుగుతారు. తాను పావనికి ఫోన్ ఇచ్చేస్తాడు. ఎంతసేపు మాట్లాడుతుందో! పావుగంట మాట్లాడినా ఇవ్వాళ తొందరగా పెట్టేశాడు. కోడలు మాట్లాడనే లేదు అని అంటుంది పావని. పాపం పావని వాళ్ల కోసమే తన జీవితమంతా అర్పించింది. వారి మీదే తన ఆశలు. వారి నుంచి ఏమీ కోరదు పలకరింపు తప్ప. వాళ్లు పలకరిస్తే అన్నం తిన్నంత ఆనందం. వాళ్లు ఫోన్ చేయకపోతే జ్వరం వచ్చినంత నీరసం. ఒక్క రోజు ఆలస్యమైతే వాళ్లు ఎందుకు ఆలస్యమైందో వివరంగా చెప్పేదాకా విడిచిపెట్టదు పావని.
నిజంగా కొత్త జీవితం ఇప్పుడే మొదలైనట్టు అన్పిస్తున్నది. చిన్నప్పుడు తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో చదువులు... తర్వాత కాలేజీ లైఫ్... ఆ తర్వాత ఉద్యోగ వేట... ఆ తర్వాత పెళ్లి... పెళ్లి తర్వాత ఏడాది తిరగకముందే సంతానం... సుఖమెక్కడ? తీరిక ఎక్కడ? ఒకరి వెంట ఒకరు తొమ్మిదేళ్ల దాకా ముగ్గుర్ని కనిపెంచడంతోనే పదేళ్లు గడిచిపోయాయి. పిల్లల్ని పట్టుకొని ఎక్కడికీ రాలేనని పావని ఎప్పుడూ రుసరుసలాడేది. మీ ఆవిడను తీసుకురాలేదేమని చుట్టాలు గుచ్చిగుచ్చి అడగే వాళ్లు. ఎంతైనా కోడలు పరాయిది గదా అని విమర్శించే వాళ్లు. ముగ్గురు పిల్లలు బడికి పోవడం ప్రారంభించాక పావనికి కాస్త తేలికైంది. కానీ పిల్లలు స్కూలుకు పోయేదాకా స్నానాలు, వంట అంటూ యంత్రంలా పని చేసేది. ఆ తర్వాత తన కోసం ప్రత్యేకంగా టిఫిన్. తాను ఆఫీసుకు వెళ్ళాక నడుం వాల్చి ఆ తర్వాత ఇళ్లంతా సర్దుకొని గిన్నెలు కడుక్కోవడం... బట్టలు ఉతుక్కోవడం... పన్నెండింటికే మళ్లీ పిల్లలు ఒకరొకరు పరుగెత్తుకొంటూ రావడం...
పదవ తరగతి దాకా చిన్న పిల్లలతో హాయిగానే గడిచిపోయింది. ఆ తర్వాత కాలేజీ ఫీజులు అంటూ భారం మొదలైంది. అనుకొన్న కోర్సులు చదవాలని ఆరాటం. పిల్లలదొక మాట... తనదొక మాట... పావనిదొకమాట... ఎప్పుడూ గొడవే. కూరగాయల కాడ కూడా నిత్యం గొడవే. ఒకటి వండితే మరొకటి కావాలంటారు. అందరికీ ఏదీ నచ్చదు. ప్రతి ఒక్కడూ తనకిష్టమైంది వండాలని అమ్మను డిమాండ్ చేస్తారు. వంట చేసీచేసీ పావని అలసిపోయేది. పిల్లలు ఆనందంగా తింటుంటే అలసటలోనే ఆనందం అన్నట్టు పావని మొఖం సంతోషంతో విప్పారేది...
గాజుల నారాయణ ఆ మధ్య చక్కని సలహా ఇచ్చాడు. రోజుకు కనీసం మూడు గంటలు ఏదైనా పని చేస్తే పొద్దంతా హాయిగా గడిచిపోతుందన్నాడు. అది కూడా బరువైన పని కాకూడదు. మనకిష్టమైన పనే చేయాలి. జీతం ఎంత వస్తుందనేది ముఖ్యం కాదు. జీతం రాకపోయినా మంచిదే. కానీ మూడు గంటలు మాత్రం ఏదో ఒక పనిలో పడాలి. బట్టల షాపులోనో, కిరాణా షాపులోనో, షోరూంలోనో కూర్చోవచ్చు. ప్రైవేట్ స్కూల్లో మేనేజర్‌గానో, టీచర్‌గానో, హెచ్‌ఎంగానో పార్ట్‌టైమ్‌గా పని చేయవచ్చు. కంప్యూటర్ సెంటర్లో కౌంటర్ కాడ హాయిగా టైం పాసవుతుంది.
కూరగాయలు ఇంటికొచ్చినప్పుడు కొనవద్దంటాడు నారాయణ. సంచి తీసుకొని కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలి. హాయిగా వాకింగ్ చేసినట్టుగా వుంటుంది. ఎవరైనా శిష్యులో, మిత్రులో కలుస్తారు. పలుకరిస్తారు. అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. టైం పాసవుతుంది. ఉదయం ఆరేంటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉచిత యోగా శిక్షణకు వెళ్లవచ్చు. వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ అయ్యాక ఇంటికిపోయి చక్కగా స్నానం చేసి కూరగాయలకు పోవచ్చు. కూరగాయలకు పోయివచ్చే సరికి మేడం చక్కగా టిఫిన్ చేసి పెడుతుంది. ఇలా తొమ్మిది తొమ్మిదిన్నర దాకా గడపవచ్చు. ఆ తర్వాత ఒంటిగంట దాకా పని కల్పించుకోవాలి. ఆ మూడు గంటలే ఏదైనా పని చేస్తే మంచిది. మధ్యాహ్నం రెండు లోపు అన్నం తిని కాస్త ఒరగవచ్చు. మధ్యాహ్నం ఏదైనా పని చేయాలను కుంటే కాస్త ముందే తిని పనికి పోవచ్చు. ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే అక్కడికి పోయి చూసి రావచ్చు. సాయంత్రం ఒక రెండు గంటలు పెన్షనర్స్ భవన్‌లోనో, ఎన్జీవోల భవనంలోనో క్యారమ్స్ ఆడుకోవచ్చు. క్లబ్‌కు పోయి లేదా ఎవరింటి వద్దనైనా హాయిగా పేకాడుకోవచ్చు. ఆరున్నర ఏడు గంటలకు మళ్లీ ఇంటిదారి పట్టవచ్చు. ఇలా టైంటేబుల్ మార్చుకుంటే చక్కగా వుంటుంది అంటాడు నారాయణ. అలవాటుంటే ఒక పెగ్గు విస్కీ కూడా మంచిదే అంటాడు. సీనియర్ సిటిజన్స్‌కు రైళ్లల్లో మూడోవంతు కన్సెషన్స్ ఇస్తున్నారు. పది మంది గ్రూపుగా నార్త్‌ఇండియా ఒకసారి, సౌతిండియా ఒకసారి చూసిరావాలి. తాను హరిద్వార్, ఋషికేష్, మానససరోవరం కూడా చూసి వచ్చానని ఉత్సాహంగా తన అనుభవాలను వివరిస్తుంటాడు.
నారాయణ వాకర్స్ అసోసియేషన్ అంటూ ప్రత్యేకంగా పని కల్పించుకున్నాడు. ఆ మధ్య ఏడాదికి పైగా స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు ఉచితంగా నిర్వహించాడు. ఎంతోమంది విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా ఆ క్లాసుల వల్ల ఎంతో లాభపడ్డారు. కంప్యూటర్ బేసిక్స్ కొంత కాలం ఉచిత శిక్షణ ఇచ్చినట్టున్నాడు. ఈ మధ్య వాకర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊరేగింపు తీశాడు. పెన్షనర్ల సంఘంలో ఆనందం చురుకుగా పని చేస్తూ ఆనందంగా వుంటాడు. అక్కడికి ఎంతో మంది ఏదో పని మీద ఎప్పుడూ వస్తూనే వుంటారు. పెన్షనర్లు అనేక విధాలుగా వారికి సాయం చేస్తుంటారు. అలా వారికి మంచి కాలక్షేపం. సమాజ సేవ.
అన్ని నదులు, ఉపనదులు సముద్రంలో కలిసినట్టుగా విభిన్న డిపార్టమెంట్లలో, వ్యాపార రంగాల్లో, రాజకీయాల్లో పని చేసినవాళ్లంతా పెన్షనర్లుగా, వాకర్లుగా కలిసి నడుస్తుంటారు. అలా వయసులకతీతంగా, గతించిన హోదాలకు అతీతంగా స్నేహితులుగా పరస్పరం పలకరించుకుంటారు. రోగాలకు ఆయుర్వేదం, యోగా, హోమియో, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్, నాటు వైద్యం, వనమూలికల వైద్యం, ఎన్నో రకాల వైద్యాల గురించి, టెస్ట్‌ల గురించి, డాక్టర్ల గురించి అనేక విషయాలు ముచ్చటిస్తుంటారు. అలా అందరూ కలిసి కలబోసుకోవడం చిన్ననాటి క్లాస్‌మేట్ల ఆత్మీయతను గుర్తుకు తెస్తోంది. ఎన్ని అధికారాలు చెలాయించినా, వ్యాపారంలో ఎంత సంపాదించినా పెన్షనర్‌గా, వాకర్‌గా అందరితో హాయిగా ద్వేషాలను వదిలేసి కలిసి నడవడం, ముచ్చటించుకోవడం ఎంత హాయిగా వుందో! ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందడం. ఒకరు మరొకరి సలహాలు తీసుకోవడం. సమాచారం అందించడం...
అన్నట్టు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు... వైకుంఠం 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' ప్రతిపాదన గుర్తు చేశారు. ఆ ఆలోచనే ఎంత బాగుందో! ఎప్పుడో నలభయ్యేళ్ల క్రితం కాలేజీలో చదువుకున్న మొదటి మూడు బ్యాచ్‌ల క్లాస్‌మేట్స్, బ్యాచ్‌మేట్స్‌తో ఇప్పుడు 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' ఆలోచన నిజంగా ఎంత గొప్పది. అందర్నీ నలభయ్యేళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం ఎంత ఆనందం! ఎవరికీ ఊహకందని ప్రతిపాదన తొలుత ఎవరు చేశారో! వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలి...
ఆనాటి మిత్రులంతా ఎక్కడెక్కడ చెల్లా చెదురై వున్నారో! వారంతా ఒకసారి కలుసుకోవడం ఎంత గొప్ప ఆలోచన. ఆనాడు అందరూ విద్యార్థులే. ఈ రోజు అందరూ సుమారుగా రిటైరైన వాళ్లే. అన్ని బాధ్యతలు తీరిన వాళ్లే హెచ్చు. అత్యున్నత పదవుల్లో వున్న వాళ్లు కొందరు. సాదాగా, టీచర్‌గా, వ్యాపారస్తుడిగా గడిపిన వాళ్లు కొందరు. కొందరు మంత్రులయ్యారు. ప్రజాప్రతినిధులయ్యారు. జడ్జీలయ్యారు. కాలేజీ ప్రిన్సిపాళ్లయ్యారు. లెక్చరర్లయ్యారు. వైస్‌ఛాన్సలర్‌లయ్యారు. ఉన్నత విద్యాధికారులయ్యారు. చిన్న కిరాణా షాపులతో జీవితం గడిపిన వారున్నారు. వ్యవసాయంలో, ఫైనాన్సుల్లో నష్టపోయి దివాళా తీసిన వారున్నారు.
ఈనాటి యువతరంలో, విద్యార్థుల్లో తమను తాము చూసుకుంటున్న సీనియర్ సిటిజన్లకు ప్రతీకగా ఎంతమంది మలి యవ్వన వంటి రెండో జన్మ రావాలని కోరుకుంటున్నారో... తమ కొడుకులు, మనవలు ఉద్యమిస్తుంటే వారిలో తమ నూతన యవ్వనాన్ని చూసుకుంటూ తాము కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో... 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం'లో అవన్నీ కలబోసుకోవాలి...
ఉత్సాహంగా విశ్వనాథం అందరికీ ఫోన్లు చేస్తున్నాడు. తనకు అప్పగించిన పనులు వెంటదివెంట చేస్తూ కమిటీకి రిపోర్ట్ ఇస్తున్నాడు. తన వయస్సు మర్చిపోయాడు. యువకుడిలా ఆ మీటింగ్ కోసం రాత్రీ పగలూ తిరుగుతున్నాడు. అందర్నీ కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
చక్కని భోజనాలు పెట్టాలని అందరికీ జ్ఞాపికలు ఇవ్వాలని, ఆ మీట్ కార్యక్రమం వీడియో తీసి సీడీలు తలా ఒకటి ఇవ్వాలని, తమ పిల్లలకు చూపించుకోవాలని అందరికీ ఆరాటం. నలభయ్యేళ్ల స్నేహాలు, పరిణామాలు, ఆనందాలు కలబోసుకొనే రోజు కోసం విశ్వనాథం లాగే చాలామంది ఎదురు చూస్తున్నారు. విశ్వనాథానికి ఇప్పుడు మళ్లీ యవ్వనం వచ్చినట్టుగా హుషారుగా తిరుగుతున్నాడు. ఆ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.
సైలెన్స్ ఈజ్ అన్ నేచర్ టు మ్యాన్. నిశ్శబ్దం, మౌనం మానవ ప్రకృతికి విరుద్ధం అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం గుర్తుకొచ్చింది. మనిషి సంఘ జీవి. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే సూక్తి వున్నప్పటికీ మౌనం ఎప్పటికీ మంచిదని చెప్పలేం. మంచో, చెడో అందరూ కలిసి మాట్లాడుకోవడమే మానవ స్వభావం అనుకున్నాడు విశ్వనాథం. ఎప్పుడూ తక్కువ మాట్లాడే విశ్వనాథం ఇప్పుడు గలగలా మాట్లాడుతున్నాడు.
రిసెప్షన్ కమిటీ సమావేశంలో ''ఇది పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మాత్రమే కాదు. అది 'పూర్వ జ్ఞాపకాల, అనుభవాల, అనుభూతుల సమ్మేళనం' కూడా'' అంటూ ఆనందాతిరేకాలతో అరిచినంత పని చేశాడు విశ్వనాథం.
''పావనీ! పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పిల్లలతో సహా మనం పాల్గొనాలని నిర్ణయించారు. పిల్లలకు ఫోన్లు చేసి చెప్పు. మా క్లాస్‌మేట్స్, కాలేజీమేట్స్ అందర్నీ చూడొచ్చు. అందర్నీ పరిచయం చేస్తాను.'' అన్నాడు ఉత్సాహంగా విశ్వనాథం.
పావనికి కూడా ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం. తనకు తెలిసిన వాళ్లు ఎందరో కలిసే అవకాశం కోసం ఆ రోజు ఎప్పుడు వస్తుందా ఎదరు చూస్తోంది. ''పిల్లలను, మనవలను ఇలాగైనా చూడొచ్చు. రెండు రోజులు ఇల్లంతా సందడి.'' అనుకుంటూ రాబోయే సందడిని ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతోంది పావని.
పని చేస్తే నిరంతరం యవ్వనమే. పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. విశ్రాంతిలో ఉండేది ఆనందం కాదు, బోర్‌డమ్ మాత్రమే అన్న ఆనాటి ప్రిన్సిపాల్ మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి. ఆ మాట ఎంత నిజమో! ఈ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అయిపోయాక తప్పకుండా రోజూ కనీసం మూడు గంటలు నారాయణ అన్నట్టు ఏదైనా పని చేయాలి. సమాజం కోసం, ఇరుగు పొరుగు కోసం తనకు తోచినంత డబ్బు, సమయం కేటాయించాలి అని నిర్ణయించుకోవడంతో విశ్వనాథం హృదయం యువరక్తంతో ఉరుకులు పరుగులు పెట్టింది. 'పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం' పనుల బిజీలో విశ్వనాథం లాగే ఎందరిలోనో మలి యవ్వనం అను రెండో జన్మ ప్రారంభమయ్యింది.
- నవ్య వార పత్రిక, 2011
ఆధునిక కథా సరిత్సాగరం కరీంగనర్ జిల్లా కథలు నాలుగవ సంపుటి
భీమన్న
భీమన్న ఒక పల్లెటూరి రైతు.
ఆ పల్లె పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది.
భీమన్న చిన్నప్పటినుండి సాహసవంతుడు.
భీమన్నకు ఏ పని చేయాలన్నా భలే యిష్టం.
ఎవరూ చేయలేని పని చేయడం అంటే మరీ ఇష్టం.
అలా అతనిపేరు మంచివాడుగా, సాహస భీమన్నగా మారుమోగి పోయింది.
ఒకసారి ఆ ఊళ్లో గంగవ్వ అనే అమ్మాయి...
పెళ్ళయ్యాక అత్త మామల బాధలు భరించలేక బావిలో దూకింది.
అది లోతయిన పాడుబట్ట వ్యవసాయ బావి.
పాకుడుపట్టి పాములు తిరుగుతాయని పేరుబడ్డ బావి.
ఎవరు అందులోకి దూకడానికి సిద్దపడలేదు.
భీమన్న ఆ బావిలోకి దూకి రెండు పాములను కూడా చంపి ఆ అమ్మాయిని ప్రాణంతో రక్షించాడు.
మరోసారి అదే బావిలో ఒక బర్రె పడిపోయింది.
బర్రె తాలూకువాళ్ళు బతిమాలితే ఆ బర్రెను బయటకు తీయడానికి అందులోకి దూకాడు.
బర్రెకు తాళ్లు కట్టి పైకి తీశారు.
ఆ తరువాత బావిలో బంగారు గొలుసు పడిందని తీయమని కోరారు.
నీళ్లు చేదుతుంటే తెగి బావిలో పడిపోయింది.
బోలాభీమన్న కష్టపడి వెతికి బంగారు గొలుసు తీసిచ్చాడు.
ఆ తరువాత పాములు కనపడ్డప్పుడల్లా బోలాభీమన్నను సాహస భీమన్న అని పిలుచుకుని వెళ్ళేవాళ్లు.
ఒక చిల్లా, బల్లెంతో ఉత్సాహంగా బయలుదేరేవాడు భలే భీమన్న.
అలా ఇళ్ళల్లోకి వచ్చిన పాములని చంపడంలో పేరుమోసాడు.
దాంతో క్రమంగా అతనికి బోలా భీమన్న, భలే భీమన్న సాహస భీమన్న అనే పేరు బదులుగా..
పాముల భీమన్న అనే పేరుతో పిలవడం పెరిగింది.
జ జ జ జ
పాముల భీమన్నకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు.
ఎప్పుడు ఏ పాము కుట్టి చచ్చిపోతాడేమో అని భయపడ్డారు.
బావిలోపడ్డ గంగవ్వ...
అత్తగారింటికి ఇకపోను అని తల్లిగారి ఇంటిలోనే ఉండిపోయింది.
దాంతో పాముల భీమన్నకు ఆమె అలవాటు అని అత్తగారి తరఫువాళ్లు నిందలు వేశారు.
గంగవ్వకు తనను కాపాడిన పాముల భీమన్న అంటే అభిమానం పెరిగింది.
ఆ నిందలు విన్నాక అతనికి పిల్లనెవరు ఇవ్వటం లేదని తెలిసింది.
అతనికి ఇలాంటి గతికి రావటానికి తాను బావిలో పడడమే కారణం కదా అని బాధ పడింది గంగవ్వ.
తాను బావిలో పడకపోతే అతను బావిలో దూకి పాములను చంపి తనను కాపాడే అవసరం ఏర్పడేదికాదు. పాములను చంపుతూ ఉండడంవల్ల ఇప్పుడు ఎవరు పిల్లనివ్వకుండా అయ్యారు. ఇదంతా తనవల్ల జరిగిందని బాధ పడింది గంగవ్వ.
గంగవ్వ తల్లి దండ్రులు బతిమాలితే కొన్నాళ్ళకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పాముల భీమన్న.
జ జ జ జ
పల్లెల్లో జరిగే చిన్న చిన్న పండగల్లో పెద్ద వంటలు చేయడం కష్టంగా వుండేది.
అదెంతపాటి పని అని పాముల భీమన్న గంగవ్వను వెంటేసుకుని వంటలు చేసి చూపించాడు. అందరూ మెచ్చుకున్నారు.
ఎప్పుడు ఎక్కడ వంటలు అవసరమైనా వరసకలిపి వారిద్దర్ని పిలుచుకుని వెళ్లేవాళ్లు.
అలా పాముల భీమన్న, సాహస భీమన్న, బలే భీమన్న పేరు పోయి కొంతకాలానికి వంటల భీమన్న అనే పేరు స్థిరపడింది.
వంటల భీమన్న ఏదో సంస్థలో చేరాడు.
ఆ సంస్థ మీటింగ్ జరిగినప్పుడు వంట చేసేవాళ్లు కరువు.
దాంతో వంటల భీమన్న నేను వంట చేస్తానని ముందుకు వచ్చాడు. గంగవ్వ అప్పుడప్పుడు వంటలో సహకరించేది.
అతని వంటలను నలభీమపాకం అని మెచ్చుకునేవాళ్లు.
మెచ్చుకుంటుంటే భీమన్నకు ఎంతో సంతోషం అయ్యేది.
అందరూ తృప్తిగా కొసరి కొసరి వేసుకొని తింటుంటే తానే తిన్నంత తృప్తి పడిపోయేవాడు భీమన్న.
కొంతకాలానికి మీటింగ్‌లలో ఏమీ వినడానికి వీలుకావడంలేదని గమనించాడు భీమన్న.
తనకన్నా వెనక వచ్చినవాళ్లు సంస్థకు అధ్యక్షులయ్యారు. జిల్లా నాయకులయ్యారు.
తనను వంటల కాన్నించి తప్పించుమని సంస్థను కోరాడు.
సంస్థకు వంటలు చేసేవాళ్లు ఎంతో అవసరం. ఇదికూడా ఎంతో ముఖ్య కార్యం.
వంట చేసేవాళ్లు అమ్మతో సమానం అని బుజ్జగించారు.
అయితే మరి నన్నెందుకు జిల్లా కమిటీకి పంపలేదని అడిగాడు.
అలా అడిగేసరికి...
నీకు అవగాహన పెరగాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి.
అప్పుడే నాయకుడవుతావు అన్నారు.
తనను వంటకాన్నే ఉంచడాన్ని భీమన్న భరించలేకపోయాడు.
తనకు కూడా అవగాహన పెరగడానికి క్లాసులు కావాలని అడిగాడు.
అప్పుడు మళ్లీ మొదటినుండి నేర్చుకోవడం మొదలైంది.
తరువాత జిల్లా కమిటీకి పంపారు.
జిల్లా కమిటీ కార్యాలయంలో లెట్రిన్స్‌ని అందరూ వాడుకునేవారు.
ఎవరూ కడిగేవారు కాదు.
భీమన్న అది సహించలేక వారానికోసారి వాటిని కడిగేవాడు.
కొద్దికాలం తర్వాత భీమన్నను లెట్రిన్స్ కడగడం...
అతనిదే బాధ్యత అన్నట్టు డిమాండ్ చేసేవాళ్లు.
టాయిలెట్స్ బాగులేనందుకు అతన్నే అడిగేవారు.
అయినా సహిస్తూ ఆ పని కూడా చేసేవాడు.
జిల్లా కార్యాలయంలో వంటలు అవసరమైనప్పుడు వంటలు కూడా భీమన్ననే చేసేవాడు.
ఒకరోజు ఒకాయన టాయిలెట్ కడిగిన చేతులతో వడ్డించొద్దని భీమన్నను ఆక్షేపించాడు.
అతడు తినను అని సగం వదిలేసాడు.
భీమన్నకు తల కొట్టేసినట్టయింది.
వండింది తాను, అన్ని పనులు చేసేది తాను.
చివరకు కార్యాలయంలో ఊడ్చేది కూడా తానే.
ఇలా అన్ని పనులు చేసేవాడిని...
ఏ పనీ చేయకుండా నాలుగు ముచ్చట్లు చెప్పి...
దానికి మీటింగ్ అని పేరు పెట్టి ఫోజులు కొట్టేవారిని...
చూసేసరికి భీమన్నకు అంతదాకా లేని పౌరుషం వచ్చింది.
నేను ఏ పనీ చేయను అని ఖరాఖండిగా చెప్పాడు భీమన్న.
దీన్ని జిల్లా కమిటీ తీవ్రంగా చర్చించింది.
భీమన్న చేత వడ్డిస్తే తినను అన్న నాయకునిచేత క్షమాపణ చెప్పించారు.
అయినాసరే నేను ఏ పని పడితే ఆ పని చేయను.
మీరెందుకు అన్ని పనులు చేయడంలేదు.
నేను కూడా మీటింగుల్లో మాట్లాడతాను. రాస్తాను.
నన్ను అలాంటి పనుల్లోనే పెట్టండి అని అడిగాడు.
భీమన్న మాట కమిటీ అనుకూలంగా చర్చించింది.
కానీ అక్కడే వుంచింది.
భీమన్న భార్య గంగవ్వ కూడా జిల్లా కార్యాలయానికి వచ్చింది.
ఇద్దరూ కలిసి అన్ని పనులు చూసుకునేవారు.
వారికి కొద్దిగా జీతం లాగా ఇచ్చారు.
జ జ జ జ
కొంతకాలానికి భీమన్నను, గంగవ్వను కేవలం జీతగాళ్లుగా లెక్కించారు.
అన్ని పనులు పనిమనుషులకు చెప్పినట్టు చెప్పేవారు.
కొందరు వారి విడిచిన బట్టల్ని గంగవ్వను ఉతుకుమని కోరేవారు.
గంగవ్వ ఉతికి పెట్టేది.
చివరకు గంగవ్వ వాళ్ల బట్టలు ఉతికే పనిమనిషిలా...
స్నానానికి నీళ్లు పెట్టే మనిషిగా పేరుపడింది.
వాళ్లిద్దరూ సీనియర్ కార్యకర్తలు అని చాలామంది మరిచిపోయారు.
విసిగిపోయి గంగవ్వ భీమన్నలు ఆ సంస్థను వదిలేసారు.
భీమన్న కార్యాలయంలో తప్ప ఎవరికి తెలియడు.
భీమన్నకు బయటెక్కడా నాయకుడుగా గుర్తింపు లేదు.
భీమన్న పేదరికం వల్ల, ఇంటిపనులు వదిలేసి జిల్లా కార్యాలయానికి రావడం వల్ల ఊళ్లో ఏమీ లేదు.
భీమన్న గంగవ్వలు కూలి పనులకు వెళ్లాల్సివచ్చింది.
పెద్ద పెద్ద బరువు పనులు భీమన్న అవలీలగా చేసేవాడు.
కూలి అందరిలాగే ఇచ్చేవారు.
ఒకసారి బరువైన బండ కాలుమీద పడి వేళ్లు నలిగిపోయాయి.
సరిగ్గా నడవరాకుండ అయింది.
అప్పుడు కుంటి భీమన్న అని పిలవడం ప్రారంభించారు.
భీమన్నను ఎవరూ పనికి పిలిచేవారు కాదు.
గంగవ్వ పనికిపోయి ఇంత తెచ్చి తనకింత పిల్లలకింత పెట్టేది.
భీమన్న పని లేనప్పుడు పిల్లలను ఆడించేది.
అలా భీమన్న క్రమంగా ఇంటికి పరిమితమయ్యాడు.
ఒక తెలిసినాయన ఒక బిల్డింగ్ పనికాడ వాచ్‌మెన్‌గా ఉండుమని కోరాడు.
సరేనని గంగవ్వను పిల్లలను తీసుకొని బయలుదేరాడు.
ఆ బిల్డింగు తనకన్నా వెనకవచ్చి తమ సంస్థలో పనిచేసి పెద్ద నాయకుడిగా పేరుపొందిన అతనిదని భీమన్నకు తెలిసింది.
తన బతుకు ఇలా ఎందుకైంది?
అతని బతుకు ఇలా ఎందుకు ఎదిగింది? అని ఆలోచించాడు.
అప్పటికి జీవితం చాలా గడిచిపోయింది.
ఏం చేయడానికి లేదు.
వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉండిపోయాడు భీమన్న. వాచ్‌మెన్ భీమన్నగా పిలిచారు.
గంగవ్వ పిల్లలను సర్కారు బడిలో వేసింది.
ఇలా ఎంతో పరాక్రమం గల భీమన్న పాముల భీమన్నగా...
వంటల భీమన్నగా, కుంటి భీమన్నగా...
చివరకు వాచ్‌మెన్ భీమన్నగా మారిపోయాడు.
అన్ని పనులు రావడంవల్ల ప్రతిదీ ఛాలెంజ్‌గా చేసి చూపిస్తానని చూపడంవల్ల చివరకు అవే అతని పనులయ్యాయి. అన్ని పనులు రావడం అవసరమే.
''అన్ని పనులు చేసేవాడు అందరికీ లోకువ. ఎన్ని పనులు వచ్చినా అన్ని పనులు చేయకూడదు. ఎంత అవసరమైనా కొన్ని పనులు చేయకూడదు''. అని గంగవ్వ భీమన్నకు గీతోపదేశం చేసింది.
సంస్థ నుంచి బయటికి వచ్చాక భీమన్నకు నాయకుడు అనే పేరు దక్కలేదు.
మమ్ములను సంస్థ వాడుకొని వదిలేసిందని వాపోయాడు భీమన్న.
దాంతో ఏదో ఇంత వంటలు చేసేవాడు, ఊడ్చేవాడు అని...
సంస్థ నాయకులు ప్రచారం చేసారు.
అన్ని పనులు సమానమే. వాటి విలువ సమానమే.
అయినప్పటికీ, కొన్ని పనులే నాయకులుగా ఎదగడానికి పనికివస్తాయి.
సంస్థలో ఏం పని చేసావు అంటే...
కార్యకర్తల్ని, యువ నాయకత్వాన్ని తయారుచేసాను అనే వారికి ఎక్కువ గౌరవం.
వంట వండేవాళ్లకి తక్కువ గౌరవం.
భీమన్న నాయకత్వం తయారుచేసే పనిలో ఉండివుంటే సంస్థ బయటికి వచ్చాక తిరిగి యువకుల నుండి కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తూ ఎదిగించేవాడు.
తద్వారా తాను నాయకుడుగా మరింత ఎదిగి వుండేవాడు.
కాంగ్రెస్ మొదలుకొని కమ్యూనిస్ట్ నక్సలైట్ పార్టీలదాకా అనేక సంస్థల్లో, పార్టీల్లో పేదలకు, చిన్న చిన్న పనులు, విలువలేని పనులు, గౌరవంలేని పనులు అప్పగించాయి.
కొందరే నాయకులుగా ఎదుగుతూ...
తమలాంటి వారినే నాయకులుగా ఎదిగించారు.
కొన్నాళ్లకు ఆ ఇల్లు కట్టుకున్నాయన దాన్ని పార్టీ కోసం సంస్థ కోసం ఉచితంగా ఇచ్చేశాడు. అతను ఎంతో త్యాగం చేసాడని వాళ్లు ప్రశంసించారు. భీమన్న త్యాగం లెక్కలోకి రాలేదు.
అందువల్ల త్యాగాల్లో కూడా తరతమ భేదాలున్నాయి.
గొప్ప త్యాగాలు చేయడానికి గొప్పగా ఎదగాల్సి వుంటుంది.
గొప్పగా ''సంపాదించాల్సి'' వుంటుంది.
అప్పుడే గొప్ప నాయకులుగా గొప్ప త్యాగశీలురుగా ఎదగడం సాధ్యపడుతుంది.
అనుకున్నాడు భీమన్న.
పట్టణంలో చిన్న హోటల్ ప్రారంభించాడు భీమన్న.
గంగవ్వే హోటల్ నడిపించేది.
పిల్లలు బడికి పోయి వచ్చి హోటల్ పనిలో సాయం చేసేవారు.
అలా అతన్ని తెలిసినవారు భలే భీమన్నను...
పాపం భీమన్న అని జాలిపడుతుంటారు.
అలా కొన్నాళ్ళకి కుంటి భీమన్న అనే పేరు పోయి...
హోటల్ భీమన్నగా పేరు పడిపోయింది.
అయితే హోటల్‌కు 'గంగవ్వ హోటల్' అనే పేరు స్థిరపడింది.
'వ్యక్తిత్వ వికాసం - సామాజిక నాయకత్వం'
గ్రంథం నుండి 2006.
రాజయోగి చెప్పులస్వామి
స్వామి దయానంద రాజయోగి ఒక ఊళ్లో ఊరిపక్కన ఆశ్రమంలో ఉండేవారు.
అతను ఎక్కడినుంచి వచ్చాడో ఆ ఊరివారికి తెలియదు.
ఆ ఊరి ప్రజలు అతను తినడానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి తెస్తుండేవారు.
రాజయోగి ఎవరిని ఇది కావాలని అడిగేవారు కాదు.
ఆ ఊరి ప్రజలు స్వామి దయానంద రాజయోగికి తమ కష్ఠాలు చెప్పుకొని సేద తీరుతుండేవారు.
ఆయన వారికి చిక్కులున్నప్పుడు తనకు తోచినవి చెప్తుండేవాడు.
అలా గడచిపోతున్నది.
అతని ఖ్యాతి ఇరుగు పొరుగు గ్రామాలకు పాకింది.
ప్రజల రాకపోకలు పెరిగాయి.
అందరు తమ కష్ఠాలను బాధలను చెప్పుకొనేవారు.
స్వామికి విశ్రాంతి కరువైంది.
ధ్యాన సమయం కూడా మిగిలేదికాదు.
పొద్దున లేచేసరికి ఆశ్రమం ముందు ఎందరో తనకోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉండేవాళ్ళు.
ఏమి చేయాలో తోచక ఆశీర్వదిస్తూ ఈశ్వరార్పణం, భగవదేచ్ఛ అని అంటూ ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడు.
అయినా ఉదయం నుండి రాత్రిదాకా రకరకాల బాధలు, గాధలు, పంచాయితీలు వినేసరికి అలా విన్నవన్నీ తన మెదడుచుట్టూ తిరిగేవి.
స్వామికి రాత్రి నిదురపోయే సమయానికి నిదుర రాక బుర్ర తిరిగినట్టయ్యేది.
ఆ క్రమంలో ఆశ్రమం సమీపంలోని నారయ్య అనే రైతు పది మందిని పిలిచి ఒక కమిటీగా ఏర్పడి ఆశ్రమం ముందు పెద్ద పందిరి వేశారు.
మంచినీళ్ళు ఏర్పాటు చేశారు.
వచ్చిన ప్రజలను క్రమశిక్షణలో పెట్టేవారు.
స్వామి తనకు నిద్ర కరువవుతున్నదని నారయ్య కమిటీకి చెప్పుకున్నాడు.
దాంతో స్వామి దర్శనానికి టైమింగ్స్ పెట్టారు.
స్వామికి కాస్త విశ్రాంతి దొరికింది.
నారయ్య ఆ కమిటీ అధ్యక్షుడయ్యాడు.
నారయ్యకు ఇంటిలో భార్యపోరు.
భర్త లేనప్పుడు భార్య, భార్య లేనప్పుడు భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసేవారు.
ఇలాంటి భార్యా భర్తల కీచులాటలు ఎన్ని విన్నా అవి తరిగేవి కావు.
స్వామి దయానంద అలా విని ఇలా వదిలేసినా తిరిగి అవి పట్టి వెంటాడేవి.
అసలు ఇంత కీచులాడుతూ కలసి ఎలా ఉంటున్నారో అని స్వామికి ఆశ్చర్యం కలిగేది.
అపుడప్పుడు ఊళ్లోకి, పొలాల్లోకి నిశ్శబ్దంగా వెళ్ళేవారు. వాళ్ళు చక్కగా కలసి పనిచేసుకుంటూనే ఉండేవారు.
స్వామి దయానంద ఒక విషయం గమనించారు.
మళ్ళీ వాళ్లు కీచులాటలు తనకు పంచేవాళ్ళు.
ఆనంద సన్నివేశాలు తనకు ఎందుకు చెప్పటం లేదు? కష్టాలు, కీచులాటలే ఎందుకు చెప్తున్నారు. అని ఆలోచనలో పడ్డారు.
తనకు వారి సంతోషాలు ఆనందాలు చెప్పుకుంటే తానుకూడా సంతోషించేవాడు కదా అనుకున్నారు.
అడిగితే సంసార వాసనలు అంటుకున్నాయని మరేదయినా అనుకుంటారని అడగలేదు రాజయోగి.
ఆ ఆశ్రమంకెదురుగా కాస్త దూరంలో ఒక బొంద ఉంది.
అందులో ఆ వీధివాళ్లు రోజు పెంట తీసుకొచ్చి పోస్తుంటారు.
ఒక రోజు స్వామి దయానంద తీక్షణంగా ఆ పెంట బొందనే పరిశీలించారు.
ఏదో సత్యం బోదపడినట్టు అనిపించింది.
పనికిరాని వన్నీ ప్రజలు తమ మనస్సు అనే ఇంటినుంచి తెచ్చి తన మనస్సు అనే పెంట బొందలో పోస్తున్నారని అనిపించింది.
ఆ పెంట బొందలాగే తన మనస్సును ఒక పెంటబొందగా వీళ్లు మార్చేసారని అనిపించింది.
ఆ ఊరు వదలి పారిపోవాలనుకున్నారు స్వామి దయానంద.
మరో ఊళ్లోను ఇలా జరగదని ఏమిటి అనుకున్నారు.
పరిష్కారం తనకే తోచింది.
రోజు రోజుకు మౌనం యొక్క, ధ్యానం యొక్క సమయాన్ని పెంచుకుంటూ పోయారు.
ప్రజలు స్వామివారికోసం ఎదురుచూసి ఎదురుచూసి బయటకు రాక పోవడంతో దండంపెట్టి లేచి వెళ్లిపోయేవారు.
చివరకు స్వామి పూర్తిగా మౌన స్వామి అయ్యారు. మౌన స్వామి పేరు చుట్టుప్రక్కల వ్యాపించింది.
ఇంకా జనం రాక పెరిగింది.
స్వామి దయానందవారికి, కమిటీవారికి ఏమి చేయాలో తోచలేదు.
కమిటీ అధ్యక్షుడైన నారయ్య కూతురు సరస్వతి స్వామికి సేవలు చేసి చేసి దగ్గరైపోయింది.
ఒక రోజు నారయ్య కూతురు సరస్వతిని లేవదీసుకొని రాత్రికి రాత్రే ఆఊరి నుండి వెళ్ళిపోయారు స్వామి దయానంద.
స్వామి దయానంద తన తొలి గురువును కలిసి జరిగిన సంగతి మొర పెట్టుకున్నారు.
ఆ గురువు కొన్ని సూచనలు చేశారు.
కొంత కాలం స్వామి దయానంద సరస్వతితో కలిసి అక్కడే ఉన్నారు.
కొన్నాళ్లు వెతికి వెతికి నారయ్య కూతురుజాడ తెలుసుకున్నాడు.
స్వామిని, పెద్దగురువును బతిమాలి తిరిగి తమ ఊరికి రమ్మన్నాడు.
నారయ్య కూతురుకూడా తమ ఊరికి పోదామని పోరుపెట్టింది.
స్వామి దయానంద రాకతో ఆశ్రమం మళ్లీ చిగురించింది.
కమిటీవారు, ప్రజలు కలిసి ఆదరంగా కొత్త పందిరి వేశారు.
అలా స్వామి దయానంద రాజయోగి వారికి విశ్రాంతి దొరికింది.
సరస్వతి స్వామివారికి సమస్త సపర్యలు ఎలా జరగాలో చూసుకుంటూ వుంది.
పందిరి బయట చెట్టుకింద కమిటీ సభ్యులు డ్యూటీలు వేసుకున్నారు.
ఇది చెప్పులు విడిచే స్థలం అని స్వాగత ద్వారం ప్రక్కన చెట్టు ప్రక్కన రాశారు.
వచ్చినవాళ్లకల్లా చెప్పారు.
చెప్పులతోపాటు నీ గతాన్నికూడా ఇక్కడే వదిలేసి లోపలికి రండి అని బోర్డు పెట్టారు.
గతం వదిలేశాక ఈ మండపంలో ధ్యానం చేయండి అని చెప్పారు.
గతం వదిలేశాక ప్రజలకు స్వామికి చెప్పుకోవడానికి ఏమి మిగలలేదు.
కష్టాలు, బాధలు, కీచులాటలు, పంచాయితీలు అన్నీ చెప్పులవద్దే వదిలేసి రమ్మని చెప్పడంతో ఇంకేమడగాలో వాళ్ళకి తోచలేదు.
హంస పాలల్లోంచి నీళ్ళను వేరు చేసి పాలే తాగుతుంది. బాతు మురిక్కాలువలో ముక్కు పెట్టి మురికిలో పెరిగే పురుగులనే తింటుంది. అందుకని బాతు ఎప్పుడూ మురికినే వాసన చూస్తుంది. మీరు హంసలా బతుకుతారో, బాతులా ఉంటారో మీ ఇష్టం.
చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు. ఇతరులకు మంచి చేయకపోయినా చెడు చేయవద్దు.
అని చెప్తూ అందర్నీ చిరునవ్వుతో ఆశీర్వదించి పంపించేవారు స్వామీ దయానంద.
అలా ఆ ఆశ్రమం చెప్పుల ఆశ్రమం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.
ఆ రాజయోగిని చెప్పుల స్వామి అని ప్రజలు పిలవ సాగారు.
కొంతకాలానికి చెప్పులు విడిచినచోట గతాన్ని వదిలేస్తే చెప్పులు వేసుకున్నాక చెప్పులలాగే గతం మళ్ళీ వెంటపడదా? అని కొందరు భక్తులు ప్రశ్నించారు.
అవును! వెంటపడే అవకాశం ఉంది. గతాన్ని పట్టుకొని వేలాడేవాళ్ళు గతంలోనే జీవిస్తారు. నేటి జీవితాన్ని గతానికి బలి చేస్తారు. ముందుకు నడిచేబదులుగా బతుకును వెనక్కి నడిపిస్తారు. తమకు తామే ఓడించుకుంటారు. అందుకు ఇతరులు కారణమని నిందిస్తారు. అని ఎరుక పరిచారు.
దాంతో అక్కడ వదిలేసిన చెప్పులను వెళ్ళిపోయేటప్పుడు మరచిపోయినట్టుగా అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం ప్రారంబించారు భక్తులు.
కమిటీ తరఫున అక్కడ మరో బోర్డు వెలిసింది.
''మీ గతం మీకు కావాలనుకున్నప్పుడు మీ చెప్పులు మీరు తీసుకువెళ్ళండి'' అని బోర్డు పెట్టారు.
గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించాలని బుద్ధుడు చెప్పాడని స్వామీజీ పదేపదే గుర్తుచేసేవారు. స్వామీజీ అలా ప్రజలకు మౌనాన్ని, మనశ్శాంతిని అందించారు.
అలా స్వామీజీలాగే రిషికేష్ స్వామి శివానంద, జిడ్డుకృష్ణమూర్తి, ఓషో రజనీష్, ధ్యానయోగ స్వామీజీలు మౌనంలోని శక్తిని ప్రజలకు చూపించారు.
గతాన్ని వదిలించుకుంటే మంచిదన్నారు. మౌనంలో శక్తి ఉందన్నారు. ధ్యానంలో ఉండాలన్నారు. యోగంలో ఉండాలన్నారు. ఈ క్షణంలో జీవించు అన్నారు. శరీరానికి మనస్సుకు మధ్య సంబంధం కుదర్చాలన్నారు. రోజుకు డెభ్బైఐదువేల ఆలోచనలు, భావాలు వస్తుంటాయి. పోతుంటాయి. శరీరం అన్ని ఆలోచనలను, భావాలను భరించలేదు. ఆచరించలేదు. నిత్యజీవిత ఆచరణతో సంబంధంలేని భావాలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. భావాతీతంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. భావాతీత ధ్యానం అవసరం అన్నారు.
దయానందస్వామి వదిలేసిన పని ఇవాళ చాలామందిని పట్టుకుంది.
పార్లమెంటులు, శాసన సభలు, కోర్టులు, పత్రికలు, సినిమాలు, టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ నాయకులు, బహిరంగ సభలు, బహిరంగ చర్చలు మొదలైన వాళ్ళంతా స్వామీజీ వదిలేసిన కర్తవ్యాన్ని స్వీకరించారు. హంసలాంటివాళ్ళు తగ్గిపోతున్నారు. బాతుల్లా ఎప్పుడూ మురికిలో ముక్కుపెట్టి గెలికించే వాళ్ళే పెరుగుతున్నారు.
తమ మెదళ్ళను పెంటబొందలుగా మార్చుకుంటున్నారు.
టీవీలు చూసి ప్రజలు తమ మెదళ్ళను పెంటబొందలుగా మార్చు కుంటున్నారు.
పత్రికలు చదివే పాఠకుల మెదళ్ళను మురికినీళ్ళ ప్రవాహాలుగా మార్చుతున్నారు.
అవన్నీ విని, చూసి బాధలు, కీచులాటలు, నేరాలు, ఘోరాలు, పంచాయితీలు, సమస్యలు, కష్టాలు వినివిని నాయకుల మెదళ్ళు, ప్రజల మెదళ్ళు, హృదయాలు పెంట బొందలుగా మారిపోతున్నాయి.
అలా లోకం, సమాచార వ్యవస్థతో, గతంతో పెంటబొందలుగా మార్చబడుతోంది. ప్రజలు చెడు విని, చెడు చూసి, చెడు గురించి మాట్లాడుకుంటూ చెడ్డవారుగా మారిపోతున్నారు. పెద్దవాళ్ళే చెడ్డవాళ్లైతే తమకేమి తప్పు అనుకున్నారు.
దాంతో స్వామి దయానంద శిష్యుల అవసరం చాలా పెరిగింది.
అలా స్వామి దయానంద శిష్యులు వేలాదిగా ప్రపంచమంతటా విస్తరించారు.
జ జ జ జ
అలా గుళ్ళల్లో చెప్పులు పోతే చాలా మంచిది అనే సామెత మిగిలింది.
గుళ్ళవద్ద చెప్పులతోపాటు మీ గతాన్ని వదిలేసి గుళ్లోకి వెళ్లండి అన్నారు.
చెప్పులుపోతే దరిద్రం పోవడమంటే ఇదే. కానీ అసలు విషయం అందరు మర్చిపోయారు.
'వ్యక్తిత్వ వికాసం - సామాజిక నాయకత్వం'
గ్రంథం నుండి 2006.
నాగశాల
దట్టమైన అడవి, ఏదో పిల్లబాట. దూరంగా వాగు ప్రవహిస్తున్న చప్పుడు, కనుచూపు మేరలో ఏదో గూడెం. రెండు గుర్రాలను జువ్విచెట్టు నీడలో కట్టేసి రావి చెట్టు కింద సేదదీరుతున్న 'నాగశాల'కు అమ్మ, ఇల్లు, ఊరు, తమ రాజ్యం గుర్తొచ్చాయి. అతని సహచరుడు మేనబావ 'ఇలానాగ' రెండు రోజులుగా విరేచనాలతో వడలిపోయి చెట్టు మొదలులో నిస్సత్తువగా నిద్రిస్తున్నాడు. అతని తెల్లబట్టలు కాషాయ రంగులోకి మారి జిడ్డుగా ఉన్నాయి.
వాళ్లు ఇల్లు వదిలి దేశాటనకు బయల్దేరి ఏడాదిన్నర దాటింది. ఇంకో ఏడాది రెండేళ్లు దేశాటన చేయాలని ఆరాటం. రాజకుమారుల్లాగే తాము కూడా విద్యలన్నీ నేర్చుకున్నాక దేశాటన చేసి లోకరీతిని, కళలను తెల్సుకోవాలని బయల్దేరారు. రాజపుత్రి అయిన నాగశాల తల్లి నాగపుత్రి చిన్నప్పట్నుంచి అతనికి దేశాటన పట్ల యుద్ధ విద్యల పట్ల ఉత్తేజం కలిగించింది. తండ్రి నాగపాల గొప్ప కళల పట్ల, శాస్త్రాల పట్ల ఆసక్తి పెంచాడు. నాగపాల చెల్లెలి కొడుకైన ఇలానాగకు చెట్లన్నా వ్యవసాయమన్నా ఎనలేని అనురాగం. ఇద్దరిదీ విడదీయరాని మైత్రి.
దేశాటనలో ఎదురయ్యే కష్టాల గురించి ముందే ధైర్యం చెప్పాడు తండ్రి నాగపాల. పెద్దవాళ్లు వీడ్కోలిస్తూ చెప్పిన జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. పద్దెనిమిది నెలల దేశాటనలో ఇరవై ఏళ్ల జీవితానుభవాలు జతపడ్డాయి. కాలినడకతో బయల్దేరిన వాళ్లు ఇప్పుడు గుర్రాలను సంపాదించుకున్నారు.
విస్తారమైన అడవుల గుండా ఎన్నో జంతువులు, వాగులు, నదులు, ఎన్నో తెగలు, జాతుల ప్రజల మధ్య నుండి ప్రయాణం చేశారు. ఇంకా ఎందరో సంచార జీవితంలో ఎడ్లబండ్లతో గమ్యం తెలియని ప్రయాణం సాగిస్తున్నారు. కష్టాల్లో వారికి సంతోషం కలిగించినవి రెండే. ఆనందబుద్ధ పరిచయం ఒకటి. ఎక్కడో ఒక చోట శాతవాహన రాజధాని అయిన 'కోటి లింగాల (కోటిలింగాలు)' నుండి వలస వెళ్లిన వాళ్లు తెలాంగులు, ఎదురై తమ భాషలో మాట్లాడుతూ అక్కడి విశేషాలడగడం చెప్పడం రెండోది. మహా గోదావరి వరదల్లో 'కోటిలింగాల' రాజధాని ఎన్నిసార్లు కొట్టుకపోయిందో! వరదల వల్ల అక్కన్నించి ఎక్కడిక్కడికో వలస పోయి స్థిరపడ్డ తెలాంగులు తమ భాషవారు ఎదురవడం తమ వాళ్లనే కల్సినంత సంతోషం. వారి వద్ద భద్రంగా ఉన్న గ్రీకు రోమన్ మగధ గాంధార చైనా శాతవాహన రాజ్యాల నాణాలు వారి గతకీర్తికి సాక్ష్యాలుగా ఉన్నాయి. తమ తల్లీదండ్రి దాచి ఎంతో అక్కర వస్తే తప్ప చూపకూడదు, అమ్మకూడదు అని ఇచ్చిన నాణాలు అవి ఒకే పోలిక.
అలసటతో నాగశాల నిర్వేదంగా నిట్టూర్పు విడిచాడు. నిజంగా ఈ లోకం ఎంత విచిత్రమైనది. ఈ మనస్సును అర్థం చేసుకోవడం ఎంత కష్టం! జంతువులో, దొంగలదాడో, ఇతర తెగల యుద్ధమో, విషజ్వరాలో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అయినా సంపదపై, గతంపై సంస్కృతిపై ఇంత పట్టుదల, ఆశ ఎందుకో.
భాష తెలియదు. మనుషులు తెలియరు. ఎదురైతే పరస్పరం జంతువుల్లా వేటాడి చంపుతారని భయం. పళ్లు, కాయలు గడ్డలు ఏది తింటే మంచిదో ఏది కడుపునొప్పో తెలియదు. ప్రయోగాల మీద వ్యామోహంతో ఇలానాగ ఏదో తిని ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.
ఏ దారి ఎటుపోయి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. దారి చూపినట్టే నమ్మించి ఎవరు ఎక్కడ నరబలి ఇస్తారో తెలియదు. నిత్య సంచారం చేసే బౌద్దులొక్కరే బాసట. స్థిర గ్రామాలు తక్కువ. ఇంత మంచి బౌద్దుల పట్ల తన తండ్రికి అంత ద్వేషం ఎందుకో. తన తండ్రి నాగపాల చేసిన హితబోధలు గుర్తుకొచ్చాయి. ఆయన కోరుకున్నదొకటి. తమకు జరిగిందొకటి.
''అరే నాగసా! మనది పేరెన్నిక గన్న వంశం. ఎందరో రాజులు, రాణులు, వర్తక శ్రేష్ఠులు, బౌద్ధ బిక్షులు, బ్రాహ్మణులు మన పనితనం మెచ్చుకున్నారు. నీ దేశాటనలో ప్రజలతో పాటు వీళ్లను కూడా కలుస్తూ ఉండు. వారి అభిమానం కూడా చూరగొనాలి. అయితే నాగసా! ఎంత గౌరవప్రదమైన ఉన్నతోద్యోగం అయినాసరే రాజాస్థానాల్లో చేరవద్దు. కళాకారులకు స్వేచ్ఛే ప్రాణం. తుచ్చమైన ఆ సుఖాలు ప్రజల్ని పీడించిన సొమ్ముతోనే గదా! అందుకే ఆ రాజభోగాలు, రాజస్థానం వదిలి యువరాణి మీ అమ్మ నన్ను ప్రేమించి మారువేషంలో నాతో వచ్చేసింది. అప్పట్నుంచి మేం ఆ రాజ్యం వదిలి ఎన్నో రాజ్యాలు తిరిగి యిపుడీ వూళ్లో వుంటున్నాం. నీ చిన్నతనంలో అసకరాజు వేటదారిలో ఎదురైన మీ అక్కను ఎత్తుకెళ్లి తన రాణుల్లో ఒక రాణిగా మార్చుకున్నాడు. అప్పుడు ఆ అవమానంతో ఆ రాజ్యం వదిలివేశాం. అసకరాజు మీద ప్రతీకారం తీర్చుకోవాలని మూడేళ్ల క్రితమే మీ అమ్మ ఎటో వెళ్లిపోయింది. నీ దేశాటనలో అమ్మ జాడ కూడా వెతుకుతూ ఉండు. ఎక్కడ స్త్రీ రాజ్యం ఉంటుందో అక్కడ మీ అమ్మ ఉండే అవకాశం ఉంది. అమ్మ వెళ్లిపోయాక నిన్ను తీసుకొని ఈ ఊరు వచ్చాను. నా ఆశలన్నీ నీ మీదనే''
''నాగసా! మీ అమ్మలా పంతాలకు పోవద్దు. రాజులతో, జ్ఞానులతో తెలియని చోట వాదాలకు, పంతాలకు దిగవద్దు. వాళ్లు ఓడినా గెలిచినా నీ పట్ల అక్కసుగా ఉంటారు. పగపట్టి ప్రాణాలు తీయిస్తారు. సరినేతలో నాడెలాగా ఎక్కడా చిక్కుపడకుండా ముందుకు సాగు.
నాగసా! బౌద్ధులకు దూరంగా ఉండు. వాళ్లు ఏవో మాయమాటలు చెప్పి నీ మనసు విరిచేస్తారు. నిన్ను కూడా బౌద్దభిక్షువుగా మారుస్తారు. మాకు పుట్టిన ఎనిమిది మందిలో మీ అక్క అలా అయిపోగా మిగిలింది నీ వొక్కడివే. నీవు బౌద్ధ భిక్షుల్లో కలిస్తే మన వంశం నిర్వంశం అవుతుంది. నేనది ఊహించలేను. నీవు భిక్షువుగా మారితే మనం తరతరాలుగా వృద్ధి చేసిన ఈ కళలు కూడా నీతోనే నశించిపోతాయి. అందుకని బౌద్ధులు కనపడితే తప్పుకొనిపో. మహిమలు, మంత్రాలున్నాయని సిద్ధులు నీకు నేర్పుతామని శిష్యరికం చేయమని మోసం చేస్తారు జాగ్రత్త''.
''నాగసా! ఏ వూరు ఎటువంటిదో! ఆడవాళ్లను తల్లిగా గౌరవించు. మా తాత చనిపోతూ దాచి ఉంచి యిచ్చిన సిముక మహారాజు బంగారు నాణాలు, అమ్మ తెచ్చిన హాలుని నాణాలు, గ్రీకు రోము నాణాలు ఆపదల్లో మాత్రమే బయటకు తీయి''.
తన తండ్రి చెప్పినదంతా బాగానే ఉంది గానీ బౌద్ధుల్ని, బౌద్ధాన్ని ఎందుకంత ద్వేషిస్తున్నాడో తెలియదు. పరస్పరం చంపుకునే తెగలు దారుల మధ్య వాళ్లు జ్ఞానాన్నీ వైద్యాన్ని అందిస్తూ తిరగడం ఎంత గొప్ప విషయం. శాంతి ఉంటే ప్రజలు, కళలు ఎంత సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయి! అలాంటి బౌద్ధుల్ని తన తండ్రి ఎందుకు ద్వేషిస్తున్నాడో నాగశాలకు బోధపడలేదు. అదేదో ముందే తేల్చుకుందామని మహా విద్యాలయంగా వెలుగొందుతున్న శ్రీపర్వతం (నాగార్జునకొండ)కేసి దారి తీశారు.
అక్కడికి పోవడంతోనే జ్ఞాననేత్రం విప్పారింది. అక్కడ 'ఆనందబుద్ధ' గురువు లభించడం తమ అదృష్టం అనుకున్నారు. ఆనందబుద్ధ వారికి ఎన్నో భాషలను, భావాలను, సంస్కృతులను, స్వభావాలను, కళలను పరిచయం చేశారు. పది నెలలుండి మళ్లీ నాలుగు నెలలు దేశాటన చేసి మరో నాలుగు నెలలు ఆనందబుద్ధ గురువు వద్దే ఉన్నారు. ఆనందబుద్ధ, బుద్ధ భగవానుని బోధనలను, ఆచార్య నాగార్జునుని గొప్పతనాన్ని వివరించాడు. దాంతో ఉత్తేజితుడై నాగశాల బౌద్ధబిక్షు దీక్ష యిమ్మని కోరాడు. ఇలానాగకు ఇంటికెళ్లి తాను తెల్సుకున్నదంతా తనవాళ్లకు అందించాలని కోరిక. ఆనందబుద్ధ నాగశాలను సున్నితంగా వారించాడు.
''నాగశాలా! నీవు ముందుగా మీ తండ్రి నాగపాల చెప్పినట్టుగా నీ దేశాటన పూర్తి చేసి తండ్రి ఆశీస్సులు తీసుకో! కొన్నాళ్లు యింటనే ఉండు. అపుడు నీ నిర్ణయం మీ తండ్రికి చెప్పు. అప్పటికీ బిక్షువు కావాలనిపిస్తే మీ నాన్నను ఒప్పించు. నీ దేశాటనలో బౌద్ధులెక్కడ కనపడ్డా వారితో కల్సి నడువు. నీకు మేలు జరుగుతుంది''
ప్రాకృతం, పాళీ, సంస్కృతం, పైశాచీ, చైనా భాషల్తో పాటు కొన్ని స్థానిక భాషాపదాలను వారు నేర్చుకున్నారు. ముందే శ్రీపర్వతం రావడం ఎంతో మంచిదైంది అనుకున్నారు. రెండవసారి ఉత్తరాది దిశగా ప్రయాణమయ్యారు.
జ జ జ జ
ఎవరో స్త్రీ నడచి వెళ్తున్న సవ్వడి వినిపించి కళ్లు విప్పాడు నాగశాల, మట్టికుండ తీసికొని ఆమె వాగుకేసి పొతున్నట్టుంది. మళ్లీ కళ్లు మూసుకున్నాడు. రాత్రి దోమల బాధకు నిద్ర లేకపోవడంతో కన్నంటుకుంది. ఏదో అలికిడి విన్పించి లేచి కూర్చున్నాడు నాగశాల. ఇందాకటి స్త్రీ స్నానం చేసి నీళ్లకుండ తీసుకుని వచ్చి ఇలానాగ నోట్లో నీళ్లు పోస్తోంది. ఆమెకు అభివాదం చేశాడు నాగశాల. ఆమె ఏదో అడిగింది. అతనికది అర్థం కాలేదు. కాసేపటికి ఆమె మాట్లాడుతున్నది పైశాచి భాష అని అర్థం కాసాగింది. తమ తాతకు పైశాచీ బాగా వచ్చేదట! తండ్రి చెప్పేవాడు. తండ్రి ఊళ్లు మారడంతో తన భాష మారింది. తమ తల్లికి పైశాచీ భాషతో పరిచయమే లేదు.
గుణాఢ్యుడు పైశాచీ భాషలో సమాజ పరిణామాల్ని మానవ సంబందాల్ని కథలు కథలుగా సేకరించి బృహత్కథగా రాసి ఆ భాషకు సాహిత్య గౌరవం కలిగించాడు. అతను వందనీయుడు అన్న ఆనందబుద్ధ మాటలు గుర్తొచ్చి నాగశాల మరోసారి కృతజ్ఞతలు తెలిపాడామెకు.
ఆమె తన పేరు ఇలాంగ అని ముద్దుగా ఇలూచి అని పిలుస్తారని తమ యిల్లు దగ్గరే అని తమ యింటికి రమ్మని ఆహ్వానించింది. నాగశాల ఇలనాగను భుజం మీద మోసుకొని ఆమె వెనుక నడిచాడు. తర్వాత వచ్చి గుర్రాలను తీసుకొని వెళ్లాడు. మూడు రోజుల్లో ఇలనాగ కాస్త తేరుకున్నాడు. ఇలూచికి కాస్త చెట్ల వైద్యం కూడా వచ్చు.
ఇలూచి మాతాంగ అయిదో సంతానం. ఇలూచి ఒక్కతే మిగిలింది. కళలంటే ఇలూచికి కూడా ఎంతో ఆసక్తి. వాళ్ల అమ్మ, నాన్న గొప్ప కళాకారులని ఆమెకు కాస్త గర్వం కూడా. సహజంగానే వారి చర్చ కళలపైకి మళ్లేది.
''మా అమ్మ చెప్పేది మా నాన్న గొప్ప కళాకారుడట. చర్మాలను చదును చేయడంలో పసర్లతో కళాకృతులు వేయడంలో దిట్టనట. మా తండ్రి వజ్రాలు, బంగారం పొదిగి తయారు చేసే చర్మవస్త్రాల కోసం రాజులు, రాణులు వణిక్ ప్రముఖులు పోటీ పడేవారు. తమకు చేసి యిచ్చిన నమూనా మరెవరికి చేయకూడదని చెప్పి ఎంతో డబ్బు యిచ్చేవారు. మా తాత ముత్తాత ఇంకా గొప్ప కళాకారుడు. అజంతా, ఎల్లోరా గుహల్లో వేసిన రంగులు, అలంకరణలు, కళాకృతులు కొన్ని మా ముత్తాత చర్మం మీద నమూనాలు వేసి యిస్తే వేసినవేనట. అందుకే మా ముత్తాత తాను చనిపోయినప్పుడు ఆ గుహల దగ్గరనే సమాధి చేయాలన్నాడట. యిప్పటికీ ఆ సమాధి ఉంది'' అంది ఇలూచి. తల్లి కూడా అదే సమర్థించింది.
''అక్కడికి నడిచిపోతే ఒకరోజు కూడా ఉండదు దూరం'' అంది ఇలూచి తల్లి. నాగశాలతో పాటు ఇలనాగకు ఆ సుందర గుహలు చూడాలనే ఉత్సుకత పెరిగిపోయింది.
''మా నాన్న కూడా మా ముత్తాత వద్ద శిక్షణ తీసుకున్నారని చెప్పేవాడు. అజంతా, ఎల్లోరా గుహల్లో కొన్నిటికి మా ముత్తాత బట్టపై నమూనా వేసి యిస్తే చెక్కారట'' అన్నాడు నాగశాల.
వారం రోజుల తర్వాత ఇలూచి, ఆమె తల్లి ఒక గుర్రం మీద, ఇలానాగ, నాగశాల మరో గుర్రం మీద అజంతా గుహల సందర్శనం కోసం బయలుదేరారు. వర్షాలు, చిమ్మ చీకటి వల్ల వారం రోజులు అక్కడే ఆగారు. పదిహేను రోజుల పరిచయంలో ఇలూచికి నాగశాలకు మధ్య స్నేహంతో పాటు ప్రేమ వంటి ఇష్టం ఏర్పడి సన్నిహితం అయ్యారు.
''వీళ్ల నాన్న జంతు చర్మాల కోసం మాటేస్తే నక్కల గుంపు అకస్మాత్తుగా మీద పడి చీరేసింది ఇక్కడే'' అంటూ ఇలూచి తల్లి ఏదో వాగు పక్కనున్న చెట్లపొదను చూపింది. అందులోంచి అలికిడి విని చిరుతపులి ఒల్లు విరుచుకుంది. దాన్ని పసికట్టి ఇలూచి తల్లి సైగ చేసి మా గుర్రాన్ని అదిలించమంది, రెండు గుర్రాలు దౌడు తీశాయి. లేళ్లు కంటపడ్డంతో చిరుత అటుకేసి దారి మళ్లింది.
''ఈ లేళ్ల చర్మం కోసమే మా బావ చిరుతపులి వాతపడ్డాడు'' అంది ఒగరుస్తూ ఇలూచి. ఆమె ముఖంలో విచారం కమ్ముకుంది. కొద్ది రోజులైతే పెళ్లి అవుతుందనుకున్న బావ ''నల్ల జింక చర్మంతో పెళ్లి కానుకగా చక్కని చర్మవస్త్రాలు నాకు ఇస్తాననుకుని ఇలా అయిపోయిండు'' అంది.
జ జ జ జ
ఎంతో దగ్గరవుతారనుకున్న ఇలూచి నాగశాల వాదాలతో విడిపోవడం తల్లికి బాధనిపించింది.
''మీ తోలు బట్టలు పాత సంస్కృతి, పత్తితో నేసిన నూలు బట్టలు వెచ్చగా ఉండటంతో పాటు ఎంత చెమటైనా పీల్చుకుని గాలి ఆడుతూ హాయినిస్తాయి'' అన్నాడు నాగశాల.
''నూలు బట్టలు వానకు తడుస్తాయి. బట్టసంచిలో నీళ్లు ఆగవు. తొందరగా చిరుగుతుంది. చెదలు పడుతుంది. తోలు వానకు తడువనీయదు. తోలు దుప్పటి కప్పుకుంటే దోమలు కుట్టలేవు. తోలు సంచిలో నీళ్లు పట్టుకోవచ్చు. ఎక్కువ కాలం ఆగుతాయి. వేటాడటం చేతగాని వాళ్లు, చర్మాలు చదును చేయటం రానివాళ్లు నూలు బట్టలు మంచివి అంటారు. అసలు నిన్ను కాదు ఈ బౌద్ధులను, జైనులను అనాలి. అహింస అంటారు మా చర్మవస్త్రాలకు విలువ, గౌరవం లేకుండా చేశారు. వాళ్లు వేసే పట్టుబట్టలు పట్టు పురుగుల హింస కాదా...!'' అంది ఇలూచి.
ఇలానాగకు ఇలూచి చెప్పిందే సరైనది అనిపించి సమర్థించాడు. నాగశాల వాళ్లిద్దరూ ఒకటి కావటంతో రెచ్చిపోయాడు. బౌద్ధాన్ని తప్పుపట్టడంతో కోపం తారాస్థాయికి చేరింది.
నూలుబట్టలు నాగరికతకు చిహ్నం, రాజులు, రాణులు, వణిక్ ప్రముఖులు, బ్రాహ్మణులు, భిక్షులు, శ్రమణులు పత్తిబట్టలు వాడుతారు'' అంటూ ఆమెను కించపరిచాడు నాగశాల.
''మీ బౌద్ధ గ్రంథాలను కాపాడుతున్నది మా తోలుబట్టలే! చర్మం కన్నా బట్ట శ్రేష్టమైనదని నిరూపిస్తే మేం ఈ వృత్తిని, కళల్నే వదిలేస్తాం'' అని ఇలూచి సవాలు చేసింది.
''మా వెంట దేశాటనకు రా! ఏ రాజ్యంలోనైనా నిరూపిస్తా'' అన్నాడు నాగశాల. ఇలూచి సరే అంది. తల్లి కన్నీరుతో వీడ్కోలు పలికింది. గుర్రంపై ఇలూచి ఇలానాగ వెనక కూర్చోవడంతో నాగశాల జీవితంలో మొదటిసారిగా ఓడిపోయినట్టుగా డీలాపడిపోయాడు.
జ జ జ జ
గాంధార, సప్తసింథు, కాశ్మీరం, హిమాలయ ప్రాంతాల్లో వారికి ఎన్నో కొత్త అనుభవాలు కలిగాయి. చలికి తోలుబట్టలు, ఉన్ని బట్టలు తప్ప నూలు బట్టలు ఎందుకూ పనికిరావని నాగశాలకు ఏ వాదన లేకుండానే అర్థమైపోయింది. గాంధార మహారణ్య కనుమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు గుర్రాలు నడవలేక పోయాయి. ఒకటి అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఒక్కదాన్ని పులి కొట్టేసింది. కాలి నడకలో ఉన్న బాటసారులను, బౌద్ధులను గుర్రాలపై వచ్చి ఉన్నవన్నీ లాక్కొని చావబాది వదిలేసిపోయారు అడవి దొంగలు. గాయాలతో జీర్ణ వస్త్రాలతో రక్తం ఓడుతున్న వారిని బిక్షులు తమ వెంట తక్షశిలకు తీసుకుపోయారు.
కాషాయ వస్త్రధారి 'అదీర తెలాంగ' వాళ్లందరిని ఆదరించింది. కొద్ది రోజుల్లో తక్షశిల వదిలి బౌద్ధ బిక్షులు సెలవు తీసుకున్నారు. ఇలూచి నాగశాల మిత్రులక్కడే కొంతకాలం ఆగిపోయారు. కాషాయ వస్త్రాల్లో అదీర తామెర పూవులా మెరిసిపోతుంటే నాగశాల మనసు చెదిరింది.
అదీరలో ఎపుడూ చెదిరిపోని చిరునవ్వు. అదంటే నాగశాలకెంతో ఇష్టం. అదీర ఎన్నెన్నో చెప్పింది. తమ పూర్వీకులు తెలాంగులు మీ ప్రాంతం వారేనన్నది. చైనాను ఒకసారైనా చూసి రావాలన్నది. వారిలో ఉత్సాహం పెరిగింది. వారితో పాటు అదీర కూడా ప్రయాణమైంది.
జ జ జ జ
టిబెట్టు దారిలో పన్నెండు గాడిదల మీద గ్రంథాలు తీసుకొని శిష్యులతో ప్రయాణమై పోతున్న 'ఆనందబుద్ధ' గురువును నాగశాల గుర్తుపట్టాడు. ఇంతలోనే ఎంతో వృద్ధాప్యం పైబడ్డట్టుగా శరీరం ముడుతలు పడి, మనస్సు అలసిపోయినట్టు కనపడ్డాడు. పలకరింపులయ్యాక ఆనందబుద్ధ వారిని గుర్తు పట్టాడు.
''నాగశాలా! శ్రీపర్వత రాజ్యం ఇప్పుడు కళ కోల్పోయింది. అన్యులు ఆక్రమించారు. మహా విద్యాలయాలు మూగపోయాయి. ఎందరో శిష్యులు, బిక్షులు హతులయ్యారు. మీ బావ అస్సక మహారాజుగారి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఫలితమిది. మొత్తం రాజ్యాలన్నీ పరస్పర యుద్ధాలతో ఆక్రమణలతో దోపిడీలతో అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మీరు అటు వెళ్లడం మంచిది కాదు. మాతో పాటు చైనాకు రండి దమ్మపాల భిక్షు మనకాశ్రయమిస్తాడు. ఈ విలువైన గ్రంథాలను కాపాడడం భవిష్యత్తు కోసం ఎంతో అవసరం. దమ్మపాల వీటిని చైనా భాషలోకి అనువదించాలనుకుంటున్నారు''
ఆనందబుద్ధ బిక్షుతో కల్సి అందరు చైనా ప్రయాణమయ్యారు.
జ జ జ జ
ఆనందబుద్ధ వల్ల తెలాంగుల పట్ల చైనీయులకు అపారమైన గౌరవం కలిగింది.
ఆనందబుద్ధ తెచ్చిన గ్రంథాల్లో తమ పైశాచీ భాషలో రాసిన గుణాఢ్యుడి బృహత్కథ కూడా ఉండటం చూసి ఇలూచికి ఎనలేని సంతోషం కలిగింది. చైనా భాష నేర్చుకొని దాన్ని చైనాలోకి అనువదించమని ఆనందబుద్ధ ఇలూచిని కోరాడు. ఇలూచి కన్నా బౌద్ధ భిక్షు అదీర చైనా భాషను తొందరగా నేర్చుకుంది. అదీర నాగశాలకు సన్నిహితమవుతున్న తీరు గమనించి బిక్షు శిష్యులు ఆనందబుద్ధ చెవిలో వేశారు. ఆనందబుద్ధ నాగశాలను ఏకాంతంలో పిలిచి అడిగాడు.
''నాగశాలా! బౌద్ధ బిక్షుగా మారాలనే నీ నిర్ణయం దేశాటనతో మరింత బలపడిందనుకొంటాను. గాంధార తక్షశిల మగధ పాటలీపుత్ర నలంద శ్రీపర్వతం మళ్లీ బౌద్ధంతో కళకళలాడాలి. బౌద్ధాన్ని రక్షించుకొని తిరిగి విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో నీ వంటి బిక్షులు ఎంతో అవసరమిపుడు''
''భంతే! మీరానాడే నన్ను బౌద్ధ బిక్షువుగా స్వీకరించి వుంటే నా జీవితం వేరుగా ఉండేది. మీరు మన రాజ్యాల అస్థిరత, యుద్ధాల గురించి చెప్పింది విన్నాక ఆనాటి అవగాహనకు దూరం జరగాలనిపిస్తోంది. దేశాటన నాకు ఇతర అనుభవాలనిచ్చింది'' అన్నాడు నాగశాల. అతని మనస్సులో అదీర మెరుస్తోంది. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలు ఆశయాలు కళ్ల ముందు కదలాడాయి. వెంటనే తన రాజ్యం వెళ్లిపోతే బాగుండు అని కోరిక జనించింది.
చల్లని గాలి రివ్వున వీస్తోంది. కాషాయ వస్త్రం ఆనందబుద్ధను చలి నుంచి రక్షించలేకపోతోంది. చీకటి వ్యాపిస్తోంది. ఉన్ని, చర్మవస్త్రాలు ఎంత అవసరమో అనిపిస్తుంది.
''నాగశాలా! కోరికలు అనంతం. దేశాటన వల్ల బుద్ధ భగవానుని లాగే నీకు లోకరీతి అర్థమై బౌద్ధ బిక్షువు కావాలనే నీ నిర్ణయం మరింత గట్టిపడుతుందని ఆ రోజు అలా అన్నాను. నీవు మళ్లీ కోరికల ఉచ్చులో పడుతున్నావా!''
నిర్మలంగా సూటిగా నాగశాల కళ్లలోకి చూశాడు ఆనందబుద్ధ. ఆ కళ్లలో ఏదో వెలుగు తనలో ప్రవేశించి అణువణువు ఉత్తేజమైపోయింది. నీవు బిక్షువు కాకపోగా అదీర బిక్షును సంసారంలోకి లాగుతావా అని ప్రశ్నించినట్టనిపించింది. తప్పు చేసినవాడిలా తలవంచుకున్నాడు నాగశాల. కొంత సేపటికి తేరుకొని తన సందేహ నివృత్తి చేయమని ఆనందబుద్ధని కోరాడు.
''భంతే! ప్రజల కోసం, బౌద్ధం కోసం రాజ్యంలో శాంతి సుస్థిరత కోసం భిక్షులకు మీరిచ్చే కర్తవ్యం ఏమిటి? ఇతర దేశాలకు వలసపోవడమా! ఇది పరిష్కారమా!''
నాగశాల ప్రశ్నలకు ఆనందబుద్ధ విశ్వాసాలు కదిలిపోయాయి. తుఫానుకు మహావృక్షం ఊగిపోతున్నట్టుగా మనస్సులో కల్లోలం. అదీర అటుకేసి వచ్చింది.
''చలిగాలి వీస్తోంది. మంట రాజుకుంది. రండి'' అని ఆనందబుద్ధను కోరింది.
ఆ గోష్టి అంతటితో ముగిసింది. మరోసారి మాట్లాడుకుందాం అంటూ నడిచాడు ఆనందబుద్ధ. నాగశాల గురువును అనుసరించాడు.
జ జ జ జ
నాగశాలకు ఆనందబుద్ధ నుండి ఎలాంటి జవాబు లభించలేదు. అదీరతో నాగశాల పెళ్లి జరిపి ఆశీస్సులందించాడు ఆనందబుద్ధ. భిక్షువుల మధ్య కాపురం. కొంతకాలానికి నాగశాల ఆనందబుద్ధ వద్ద సెలవు తీసుకున్నాడు. అదీర, ఇలానాగ, ఇలూచి అతన్ని అనుసరించారు.
''నీపై నమ్మకం ఉంది. ఎంతో ఆశ ఉంది. నా ఆశీస్సులెపుడూ ఉంటాయి'' అంటూ ఆనందబుద్ధ వీడ్కోలు యిచ్చాడు. భిక్షులు కొంత దూరం దాకా వెంట నడిచి భారంగా సెలవు తీసుకున్నారు.
ఏడాదిలోపే నాగశాల అదీర, ఇలూచి ఇలానాగ కల్సి మహారణ్యంలో ఒక నది సమీపాన ఇల్లు నిర్మించుకున్నారు. ఇలానాగ వ్యవసాయంలో తెల్సుకున్నవన్నీ చుట్టూ గూడెల్లో, పల్లెల్లో చెప్తూ తనొక వ్యవసాయ క్షేత్రం నిర్మించాడు. కొద్ది కాలంలోనే అక్కడ ఊరైపోయింది. రాజుల, దోపిడీమూకల దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో నాగశాల రాజుగా గుర్తింపు పొందాడు.
పొరుగున ఉన్న స్త్రీ రాజ్యాన్ని ఏలుతున్నది తన తల్లే అని తెల్సి నాగశాలకు ఆశ్చర్యం... సంతోషం కలిగాయి. తల్లి నాగపుత్రికి నాగశాల తన కొడుకే అని అర్థమైనప్పటికీ స్త్రీల రాజ్యంగా రూపొందించిన తన రాజ్యాన్ని అతనికప్పగించడం ఇష్టం లేకపోయింది. యుద్ధం అనివార్యమని తేలిపోయింది. అల్లుడు అస్సక మహారాజు రాజ్య విస్తరణ కాంక్షతో ముంచుకొస్తున్నాడు. అతడు బౌద్ధులను, బౌద్ధ గ్రంథాలను, కళలను, కళాకారులను ప్రథమ శత్రువులుగా సంహరిస్తూ, దహనం చేస్తూ వస్తున్నాడు. దాంతో నాగపుత్రి తన కొడుకు నాగశాలతో సంధి చేసుకొంది.
మొదట సైన్యాన్ని మారువేషాల్లో అస్సక రాజ్యంలో దించాడు నాగశాల. వర్షాకాలంలో యుద్ధం మొదలైంది. వర్షాకాలం ముగియక ముందే అస్సక మహారాజు హతుడయ్యాడు. రాజ్యం నాగశాల వశమైంది. ఇలానాగను తన ప్రతినిధిగా నియమించి అస్సక రాజ్యాన్ని అప్పగించాడు నాగశాల. ఇలూచి పట్టపురాణి అయింది. భర్తను కోల్పోయిన నాగశాల అక్క తల్లిని చేరింది.
ఏళ్లు గడిచిపోయాయి. యుద్ధాలు కాస్త సద్దుమణిగాయి. నాగశాల ఆనందబుద్ధను రావించి విద్యాలయాలు నెలకొల్పాడు. దేశదేశాల కళాకారులను రావించి సత్కరించి భూములిచ్చి రక్షణ ఇచ్చి తన రాజ్యంలో స్థిరపడుమని కోరాడు. అచిర కాలంలో నాగశాల రాజ్యం దేశదేశాల్ని ఆకర్షించింది. నాగశాల అదీరలకు కలిగిన కొడుక్కు తండ్రి గుర్తుగా 'నాగపాల' అని పేరు పెట్టుకున్నాడు.
అదేమిటో గానీ నాగపాలకు తాతలాగే కళల పట్ల ఆసక్తి పెరిగి రాజ్యం పట్ల విముఖత ఏర్పడింది. తండ్రి నాగశాల మనోవ్యధతో కృంగిపోయాడు. యువరాజు పట్టాభిషేకాన్నైనా చేసుకోవాలని అదీర కొడుకును బతిమాలింది. నానమ్మ నాగపుత్రి మనవడికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పింది. నాగపాల విన్పించుకోలేదు. దేశాటనకు బయలుదేరాడు. నాగశాల అవసాన దశలోకొచ్చాడు. అదను చూసి మగధ ప్రాంతం నుండి వచ్చిన శత్రువులు యుద్ధం ప్రకటించారు.
యుద్ధంలో క్షతగాత్రుడైన నాగశాలను రాజభవనానికి తరలించారు. బాగా రక్తస్రావం అయిపోయింది. బంధుమిత్ర గణమంతా చుట్టూ చేరారు. ఇలానాగ యుద్ధానికి నాయకత్వం వహించడానికి వెళ్లిపోయాడు.
అందరూ కన్నీరు పెట్టారు. ఇలూచి ప్రతిజ్ఞాపూర్వకంగా ఏడుస్తోంది. ఇలూచిని దగ్గరకు పిలిచాడు. నాగశాల ఏదో చెప్పాడు. కళ్లు తుడుచుకొని వెళ్లి కాసేపటికి మళ్లీ వచ్చింది. ఆమె చేతిలో మెత్తని నల్లని జింక చర్మం, పక్షి ఈక, వెండిగిన్నెల్లో పసర్లు. ఏదో రాయమని చెప్పాలనుకున్నాడు నాగశాల.
ఎన్నాళ్లుగానో అడగాలనుకుంటూ అడగలేకపోయిన తల్లి నాగపుత్రి నాగశాలను అప్పుడైనా అడగాలనుకుంది.
''కుమారా! నాగసా! మీ నాన్నలా గొప్ప కళాకారుడివి అవ్వాలనుకొని దేశాటనకు బయల్దేరిన నువ్వు రాజ్యాధినేతవయ్యావేమిటి?''
నాగశాల కళ్లలో ఏదో వెలుగు. ఆనందబుద్ధ కళ్లలో మెదిలాడు.
''అమ్మా! ఈ ప్రపంచం గుర్తించాలనే కోరిక ఉన్నప్పుడు అలా అనుకున్నాను. ఆనందబుద్ధ బోధనలతో ఎవరో గుర్తించాలనే కోరికను జయించాను. కాదు అదే అదృశ్యమై పోయింది. గొప్ప కళాకారుడినవ్వాలనే కోరిక కూడా అలాగే అదృశ్యమైపోయింది. నాన్నా నువ్వూ పెళ్లి చేసుకున్నాక రాజ్యాలు మారింది రాజ్యభీతి వల్లనే కదా! అస్సక బావ అక్కని జ్ఞానాన్ని కళల్ని చెరపట్టాడు. అందుకని నేను రాజ్యాన్ని చేపట్టాలనుకున్నాను. అమ్మా! నీకన్నీ తెలుసు ఎక్కడ రాజ్యం శాంతి సుస్థిరత పంటల సమృద్ధితో సుభిక్షంగా ఉంటుందో అక్కడ సమస్త విద్యలు కళలు వికసిస్తాయి. నేను కళాకారుడిని కావడం వల్లే బౌద్ధ బిక్షువును కాకుండా రాజ్యాధినేతను కావాలనుకున్నాను. నేనొక్కడిని ఎదగడం కన్నా ఎంతో మందికి నీడనీయడం నాకు తృప్తినిచ్చింది. నాగపాల కూడా దేశాటనతో రేపెప్పుడో ఇదే నిర్ణయానికొస్తాడనుకుంటానమ్మా!''
ఏదో దగ్గు తెర పొరలు పొరలుగా కమ్మింది. అరగంట పోయాక నాగశాల కళ్లు అలాగే తెరుచుకొని ఉండిపోయాయి. తల్లి నాగపుత్రి, భార్య అదీర అతనిపై వాలిపోయారు.
నాగశాల చివరి సంభాషణ తెలంగ పైశాచీ మిశ్రమ భాషలో ఇలూచి చేతిలో నల్లజింక చర్మంపై లిపిబద్దమై నిలిచి మెరుస్తోంది. రాజగృహం శోక సముద్రమైపోయింది.
జ జ జ జ జ
ఎన్నో అనుభవాలతో దేశాటన నుండి తిరిగి వచ్చిన నాగపాలకు ఇలానాగ రాజ్య బాధ్యతలను అప్పగించాడు. తన తాత నాగపాల పేరిట నాగపాల వంశంగా ప్రసిద్ధికెక్కిన చరిత్ర తూర్పు కనుమల దాడుల్తో అంతరించిపోయింది. అదీర తల్లి వారసులు, గాంధారంలో నాగపాల వంశం గురించి తెలాంగుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆనందబుద్ధ శిష్యులు చైనా భాషలో రాసిన నాగపాల చరిత్ర టిబెట్‌లో మిగిలిపోయిందని కాలక్రమంలో పేర్లు మారి కాశ్మీరు రాజతరంగిణి చరిత్రలో కలిసిపోయిందంటారు.
దళిత జ్యోతి మాసపత్రిక, డిసెంబరు 2001
భారతీయ సాహిత్యం తెలుగు కథలు, 2003
అసమర్ధుని జీవయాత్ర
ఆకలిగా వుంది. యింకా లంచ్ అవర్ కాలేదు. ఫైళ్ళు సర్దుతూనే వున్నా వాటి మీదికి మనసు పోవడం లేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. నిమిషాల ముల్లు అసలు కదుతున్నట్టే లేదు.
ఎదుటి సీట్లో అతను ఎవరితోనో సంభాషణ సాగదీస్తున్నట్టున్నాడు. అంటే లంచ్ ఖర్చు ఆ ఆగంతుకుని మీద రుద్దే వాతావరణం క్రియేట్ చేయబడుతోందన్న మాట. వెధవ ఆకలి.
అలా అనుకోవడం ఈ రోజుకు ఇది పదోసారి. ఒంటె ఒకసారి నీళ్ళు తాగితే ఆర్నెల్ల దాకా సంచీలో ఆపుకోగలదట. మనుషులు మాసానికోసారి వారానికోసారి తిన్నా ఆకలి కాకుండా వుండేట్టుంటే ఎంత బాగుండేది?
అలా అయితే ఈ హోటళ్ళూ, ఈ పెళ్లాలూ ఏం కావాలి? అసలు అలా జరిగితే మానవ చరిత్ర ఎలా వుండేదో! అప్పుడు ఆ స్థితిలో మళ్ళీ ఏం కోరిక పుట్టేదో?
వెధవది మూడు పూటలా తిండి తినాల్సిందేనాయె! తిండి తినాలంటే ముప్పొద్దులా యిల్లూ, సంసారమూ, వంట చేయడానికి పెళ్ళామూ, పిల్లలూ, బోళ్ళూ, బోకెలు, స్టవ్వూ, గ్యాసూ, బియ్యమూ, కూరగాయలూ, పప్పులు, ఉప్పులూ, వుద్దెర కాతాలు వడ్డికి పావుసేరు ధరలూ - వెధవ తిండి యిరవై నాలుగ్గంటల్లో ఎంత కాలాన్ని మింగేస్తోందీ!
గ్యాసుక్యూ, చక్కెర క్యూ, బియ్యం క్యూ సైకిల్ మీద కూరగాయలకు పరుగు. బోల్లు తోమడం, యిల్లు వూడ్వడం, నీళ్ళు చేదడం, ప్లేట్లు కడగడం, వంట చేయడం. అబ్బ! ఎంత పనీ!
ఇంత చేస్తూ వెధవది యింకా ఆఫీసు డ్యూటీ చేయాలి!
మళ్ళీ ఆకలి గోకేస్తుంది. ఎవడేనా పార్టీ వస్తే బావుండు.
అసలు ఎదుటి వ్యక్తి గూర్చి పట్టించుకోవడమే తక్కువైపోయింది. (అలా పట్టించుకొనే వాడికి యిలాంటి ఆలోచనలు వస్తాయా!) ఛ ఛ యింతమందిలో కనీసం ఒక్కడు మీల్సుకు రమ్మని పిలువడు.
అసలు యింట్లో పెళ్ళానికి లేనపుడు బయటోళ్ళనంటే ఏమొస్తది? చెల్లెకు సీరియస్‌గా వుందని తెలియంగానే ఆదరబాదర బట్టలు సర్దుకొని ఉరికినంక యిక ఎవరు పట్టించుకొంటారు.
కరువులో అధికమాసం అన్నట్టు అక్కరకురాని చుట్టాలు ఎన్నడు పెండ్లికి పేరంటానికి పిలువని బాపతుగా వచ్చి మూడు రోజులు మెక్కి తినిపోయేసరికి చేసిన బియ్యం గ్లాసెన్నర మిగిలినై.
అవిగూడ తినే పాటిగాల్లే. పూర్తిగా అయిపోతే మల్ల కొనుక్కురావల్సి వత్తదనుకొని అడ్డా వుడాయించినట్టున్నారు. ఆ ఆగంతకుడూ, ఎదుటి సీట్ల అతనూ...
ఛీ ఛీ! వెధవ బుద్ధి! (ఎదుటివానిది) ఎపుడు వాడికి మందికి టోపీ వేయాలనే ధ్యాస. ఆ బతుకు అసలు బతక్కపోతేనేం (ఎవలు?)
వాడి గుణం ఇంతకుముందు తెలియందా? సంస్కారం లేని బ్రూట్! వెళ్తూ వెళ్తూ పిలవనన్నా పిలవడు. వాడి సొమ్మేం పోయిందీ కంపెనీ కోసం రమ్మని పిలిస్తే.
వెధవకి వద్దన్నా వెంట వచ్చి మెక్కి తిని తన పార్టీ పది యివ్వాల్సిన చోట హోటల్ బిల్ మనసులో వుంచుకుని అయిదు యిచ్చేట్టు యితరుల యిన్‌కం మీద దాడి చేయడం మాత్రం తెల్సు.
ఆకలి - ఈర్ష్య - అసూయ - నీరసం - ద్వేషం - కాళ్ళు పీకడం -
''నమస్తే సార్''
వెధవ నమస్తే ఎందుకోసం పెడ్తున్నారో తెల్సులే అన్నట్లుగా ''నమస్తే''.
''రైతు కూలీ సంగం రాష్ట్ర స్థాయి రెండవ మహాసభలు మే నెలలో కరీంనగర్‌లో జరుగుతున్నాయి. విరాళాల కోసం వచ్చాం సార్.''
'ప్రతి వెధవా విరాళాల కోసం వచ్చేవాడే! మీదు మిక్కిలి ఎంతో ప్రజాసేవ చేస్తున్నట్లు పెద్ద ఫోజొకటి!' అని లోపలా.
''హి! హి! ఉద్యోగం కదండీ, మేమేం యివ్వగలం? పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళను, కాంట్రాక్టర్లను అడిగితే బావుంటుంది.'' పైకి మాట్లాడింది మాత్రం యిది.
''వాళ్ళ దేముంది సార్! మనల్ని దోచి మనకిస్తారు. మీరైతే కష్టపడి సంపాదిస్తున్న డబ్బు కాబట్టి మీరెంతిచ్చినా దాని విలువ గొప్పది సార్! ఎందుకంటే రైతు కూలీల గూర్చి మీరు ఆలోచించడం ముఖ్యం సార్. మీ ఉద్యోగ సంఘాల్లాగే వాళ్ళూ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నందుకు చేయూత నివ్వాలి మనం.''
''వెధవ సభలనెవడు పెట్టుకోమన్నాడు? సభలతో ఏం సాధిద్దామనీ! ఊరుమీద పడి దోచుకోవడానికి కాకపోతే!'' మనస్సు.
''ఫస్టు దాటితే మా జేబులు ఖాళీ, మా బతుకే కాలీ! అంతే కదండీ!''
''నిజమేననుకోండి కాదనం. కాని మీరివ్వాలనుకుంటే ఎట్లైన యివ్వగలరుసార్. మీ బాబుకు జ్వరమొస్తే పైసల్లేవని మందులు కొనరా? మనసుంటే మార్గముంటది సార్.''
''వెధవలు వదిలేట్లు లేరే!''
''గీతా యజ్ఞం కోసం తలా యిరవైయైదూ, సీతారామ స్వాముల వారి కళ్యాణం కర్చూ ఈ నెల్లోనే మీద పడ్డాయండి. అదేదో స్విమ్మింగ్ ఫూల్ కట్టించడానికి బెనిఫిట్ షో పెట్టారు. దాని బాపతుకింద ఓ యిరవైయైదు లాక్కుపోయారండీ! ఈ నెలలో లోటు బడ్జటైంది సార్! సారీ''
''సారీ'' యింగ్లీషు పదంలో కొసనాలుక మీంచి ఎంత సారీ చూపించొచ్చూ!
''మనం తినే తిండి గింజలు వాళ్ళ శ్రమ ఫలితం సార్. మీలాంటోల్లు మాలాంటోల్లు లోకంలో అందరు పని చేయడం బందు చేసినా ఏం కాదుగాని వాళ్ళు పని చేయడం బందుజేస్తే మనం ఎంతపని చేసినా మూతి కాడికి మూడు మెతుకులన్నరావు. మనం కాగితాల మీద ఎంత రాసినా ఒక్క గింజను సృష్టించలేం సార్... వాళ్ళు ఎండనక వాననక....'' వెధవలు గీతోపదేశం చేసేట్టున్నారు.
''ఆఫీసుకొచ్చేప్పుడు పైసలు వెంట ఎందుకు తెచ్చుకుంటారు సార్. ఏమనుకోకపోతే గీ పావులా వున్నది.''
పీడా విరగడైంది. ఎవడేనా పార్టీవస్తాడేమో అని చూస్తే ఎదురు పార్టీ వచ్చింది.
ఆకలి దంచేస్తోంది.
లోపలనించి పిలుపు వినబడింది.
''ఏమయ్యా? యిది ఇలాగేనా ఏడ్చేది? పైనించి ఛార్జిమెమో యిచ్చారు. శాంక్షన్ చేసేప్పుడు అన్నీ సరిగ్గా వున్నాయో, లేదో చూసుకోవద్దా? మెమోకు మూడ్రోజుల్లో జవాబు రాసియ్యి. తొందరగా పంపాలి.''
'దొంగవేషాలు వెయ్యకురా! జేబులు నింపుకొని శాంక్షన్ చెయ్యమని చెప్పింది నువ్వు కాదా! పైసలు నీవంతు! మెమోలు నా వంతా' అని మనసంతా వుడుకుతోంది.
'అలాగే సర్' ముఖం జేపురించింది.
ఆ సాయంత్రం మనసేం బావులేదు. మెమో సూటిగా వుంది. జవాబు ఏ కొంచెం ఆ జాగ్రత్తగా ఇచ్చినా మొదటికే ప్రమాదం.
బార్లో యిరవైయైదు రూపాయల చమురు విడిస్తేగాని మెమో మూడ్ వదల్లేదు.
''ధైర్యం వుంటే ఆ మెమోకు సూటి జవాబుగా అధికారి ఆదేశాల మేరకు శాంక్షన్ చేయబడింది అని రాయగలిగితే?''
వాయమ్మో!
అలా అయితే బార్లో ఖర్చయిన పాతికా, అధికార్లు మొహమాట పెట్టి వసూలు చేసిన గీతాయజ్ఞం, సీతారామకల్యాణం, స్విమ్మింగ్‌పూల్ కిచ్చిన విరాళాలు కూడా మిగిలేవి కావూ!
''వెధవ యజ్ఞాలూ, కళ్యాణాలూ స్విమ్మింగ్ పూల్సు ఎవడిక్కావాలీ! ఉన్నొక్క పెళ్ళానికీ మంచి చీర కొందామంటే పైసలు గతిలేవుగానీ!
నిద్దర్లో కలవరింతలు - తెల్లవారి తాగింది కక్కులింతలు, ఆఫీసుకు లీవు పంపడం, మెమో భయానికి జ్వరం అందుకున్నదన్నారు అందరు.
అన్నం తినబోతే పావులబిల్ల గొంతులో అడ్డం తట్టుకున్నట్టుంది. వారం రోజులు మరి లేవలేదు.
ధైర్యం లేని మనిషికి దండుగులెక్కువ.
రచనా కాలం, 1983, మే.
ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, 26-10-1984,
Subscribe to:
Posts (Atom)