Friday, October 7, 2016

భీమన్న భీమన్న ఒక పల్లెటూరి రైతు. ఆ పల్లె పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటుంది. భీమన్న చిన్నప్పటినుండి సాహసవంతుడు. భీమన్నకు ఏ పని చేయాలన్నా భలే యిష్టం. ఎవరూ చేయలేని పని చేయడం అంటే మరీ ఇష్టం. అలా అతనిపేరు మంచివాడుగా, సాహస భీమన్నగా మారుమోగి పోయింది. ఒకసారి ఆ ఊళ్లో గంగవ్వ అనే అమ్మాయి... పెళ్ళయ్యాక అత్త మామల బాధలు భరించలేక బావిలో దూకింది. అది లోతయిన పాడుబట్ట వ్యవసాయ బావి. పాకుడుపట్టి పాములు తిరుగుతాయని పేరుబడ్డ బావి. ఎవరు అందులోకి దూకడానికి సిద్దపడలేదు. భీమన్న ఆ బావిలోకి దూకి రెండు పాములను కూడా చంపి ఆ అమ్మాయిని ప్రాణంతో రక్షించాడు. మరోసారి అదే బావిలో ఒక బర్రె పడిపోయింది. బర్రె తాలూకువాళ్ళు బతిమాలితే ఆ బర్రెను బయటకు తీయడానికి అందులోకి దూకాడు. బర్రెకు తాళ్లు కట్టి పైకి తీశారు. ఆ తరువాత బావిలో బంగారు గొలుసు పడిందని తీయమని కోరారు. నీళ్లు చేదుతుంటే తెగి బావిలో పడిపోయింది. బోలాభీమన్న కష్టపడి వెతికి బంగారు గొలుసు తీసిచ్చాడు. ఆ తరువాత పాములు కనపడ్డప్పుడల్లా బోలాభీమన్నను సాహస భీమన్న అని పిలుచుకుని వెళ్ళేవాళ్లు. ఒక చిల్లా, బల్లెంతో ఉత్సాహంగా బయలుదేరేవాడు భలే భీమన్న. అలా ఇళ్ళల్లోకి వచ్చిన పాములని చంపడంలో పేరుమోసాడు. దాంతో క్రమంగా అతనికి బోలా భీమన్న, భలే భీమన్న సాహస భీమన్న అనే పేరు బదులుగా.. పాముల భీమన్న అనే పేరుతో పిలవడం పెరిగింది. జ జ జ జ పాముల భీమన్నకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎప్పుడు ఏ పాము కుట్టి చచ్చిపోతాడేమో అని భయపడ్డారు. బావిలోపడ్డ గంగవ్వ... అత్తగారింటికి ఇకపోను అని తల్లిగారి ఇంటిలోనే ఉండిపోయింది. దాంతో పాముల భీమన్నకు ఆమె అలవాటు అని అత్తగారి తరఫువాళ్లు నిందలు వేశారు. గంగవ్వకు తనను కాపాడిన పాముల భీమన్న అంటే అభిమానం పెరిగింది. ఆ నిందలు విన్నాక అతనికి పిల్లనెవరు ఇవ్వటం లేదని తెలిసింది. అతనికి ఇలాంటి గతికి రావటానికి తాను బావిలో పడడమే కారణం కదా అని బాధ పడింది గంగవ్వ. తాను బావిలో పడకపోతే అతను బావిలో దూకి పాములను చంపి తనను కాపాడే అవసరం ఏర్పడేదికాదు. పాములను చంపుతూ ఉండడంవల్ల ఇప్పుడు ఎవరు పిల్లనివ్వకుండా అయ్యారు. ఇదంతా తనవల్ల జరిగిందని బాధ పడింది గంగవ్వ. గంగవ్వ తల్లి దండ్రులు బతిమాలితే కొన్నాళ్ళకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పాముల భీమన్న. జ జ జ జ పల్లెల్లో జరిగే చిన్న చిన్న పండగల్లో పెద్ద వంటలు చేయడం కష్టంగా వుండేది. అదెంతపాటి పని అని పాముల భీమన్న గంగవ్వను వెంటేసుకుని వంటలు చేసి చూపించాడు. అందరూ మెచ్చుకున్నారు. ఎప్పుడు ఎక్కడ వంటలు అవసరమైనా వరసకలిపి వారిద్దర్ని పిలుచుకుని వెళ్లేవాళ్లు. అలా పాముల భీమన్న, సాహస భీమన్న, బలే భీమన్న పేరు పోయి కొంతకాలానికి వంటల భీమన్న అనే పేరు స్థిరపడింది. వంటల భీమన్న ఏదో సంస్థలో చేరాడు. ఆ సంస్థ మీటింగ్‌ జరిగినప్పుడు వంట చేసేవాళ్లు కరువు. దాంతో వంటల భీమన్న నేను వంట చేస్తానని ముందుకు వచ్చాడు. గంగవ్వ అప్పుడప్పుడు వంటలో సహకరించేది. అతని వంటలను నలభీమపాకం అని మెచ్చుకునేవాళ్లు. మెచ్చుకుంటుంటే భీమన్నకు ఎంతో సంతోషం అయ్యేది. అందరూ తృప్తిగా కొసరి కొసరి వేసుకొని తింటుంటే తానే తిన్నంత తృప్తి పడిపోయేవాడు భీమన్న. కొంతకాలానికి మీటింగ్‌లలో ఏమీ వినడానికి వీలుకావడంలేదని గమనించాడు భీమన్న. తనకన్నా వెనక వచ్చినవాళ్లు సంస్థకు అధ్యక్షులయ్యారు. జిల్లా నాయకులయ్యారు. తనను వంటల కాన్నించి తప్పించుమని సంస్థను కోరాడు. సంస్థకు వంటలు చేసేవాళ్లు ఎంతో అవసరం. ఇదికూడా ఎంతో ముఖ్య కార్యం. వంట చేసేవాళ్లు అమ్మతో సమానం అని బుజ్జగించారు. అయితే మరి నన్నెందుకు జిల్లా కమిటీకి పంపలేదని అడిగాడు. అలా అడిగేసరికి... నీకు అవగాహన పెరగాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. అప్పుడే నాయకుడవుతావు అన్నారు. తనను వంటకాన్నే ఉంచడాన్ని భీమన్న భరించలేకపోయాడు. తనకు కూడా అవగాహన పెరగడానికి క్లాసులు కావాలని అడిగాడు. అప్పుడు మళ్లీ మొదటినుండి నేర్చుకోవడం మొదలైంది. తరువాత జిల్లా కమిటీకి పంపారు. జిల్లా కమిటీ కార్యాలయంలో లెట్రిన్స్‌ని అందరూ వాడుకునేవారు. ఎవరూ కడిగేవారు కాదు. భీమన్న అది సహించలేక వారానికోసారి వాటిని కడిగేవాడు. కొద్దికాలం తర్వాత భీమన్నను లెట్రిన్స్‌ కడగడం... అతనిదే బాధ్యత అన్నట్టు డిమాండ్‌ చేసేవాళ్లు. టాయిలెట్స్‌ బాగులేనందుకు అతన్నే అడిగేవారు. అయినా సహిస్తూ ఆ పని కూడా చేసేవాడు. జిల్లా కార్యాలయంలో వంటలు అవసరమైనప్పుడు వంటలు కూడా భీమన్ననే చేసేవాడు. ఒకరోజు ఒకాయన టాయిలెట్‌ కడిగిన చేతులతో వడ్డించొద్దని భీమన్నను ఆక్షేపించాడు. అతడు తినను అని సగం వదిలేసాడు. భీమన్నకు తల కొట్టేసినట్టయింది. వండింది తాను, అన్ని పనులు చేసేది తాను. చివరకు కార్యాలయంలో ఊడ్చేది కూడా తానే. ఇలా అన్ని పనులు చేసేవాడిని... ఏ పనీ చేయకుండా నాలుగు ముచ్చట్లు చెప్పి... దానికి మీటింగ్‌ అని పేరు పెట్టి ఫోజులు కొట్టేవారిని... చూసేసరికి భీమన్నకు అంతదాకా లేని పౌరుషం వచ్చింది. నేను ఏ పనీ చేయను అని ఖరాఖండిగా చెప్పాడు భీమన్న. దీన్ని జిల్లా కమిటీ తీవ్రంగా చర్చించింది. భీమన్న చేత వడ్డిస్తే తినను అన్న నాయకునిచేత క్షమాపణ చెప్పించారు. అయినాసరే నేను ఏ పని పడితే ఆ పని చేయను. మీరెందుకు అన్ని పనులు చేయడంలేదు. నేను కూడా మీటింగుల్లో మాట్లాడతాను. రాస్తాను. నన్ను అలాంటి పనుల్లోనే పెట్టండి అని అడిగాడు. భీమన్న మాట కమిటీ అనుకూలంగా చర్చించింది. కానీ అక్కడే వుంచింది. భీమన్న భార్య గంగవ్వ కూడా జిల్లా కార్యాలయానికి వచ్చింది. ఇద్దరూ కలిసి అన్ని పనులు చూసుకునేవారు. వారికి కొద్దిగా జీతం లాగా ఇచ్చారు. జ జ జ జ కొంతకాలానికి భీమన్నను, గంగవ్వను కేవలం జీతగాళ్లుగా లెక్కించారు. అన్ని పనులు పనిమనుషులకు చెప్పినట్టు చెప్పేవారు. కొందరు వారి విడిచిన బట్టల్ని గంగవ్వను ఉతుకుమని కోరేవారు. గంగవ్వ ఉతికి పెట్టేది. చివరకు గంగవ్వ వాళ్ల బట్టలు ఉతికే పనిమనిషిలా... స్నానానికి నీళ్లు పెట్టే మనిషిగా పేరుపడింది. వాళ్లిద్దరూ సీనియర్‌ కార్యకర్తలు అని చాలామంది మరిచిపోయారు. విసిగిపోయి గంగవ్వ భీమన్నలు ఆ సంస్థను వదిలేసారు. భీమన్న కార్యాలయంలో తప్ప ఎవరికి తెలియడు. భీమన్నకు బయటెక్కడా నాయకుడుగా గుర్తింపు లేదు. భీమన్న పేదరికం వల్ల, ఇంటిపనులు వదిలేసి జిల్లా కార్యాలయానికి రావడం వల్ల ఊళ్లో ఏమీ లేదు. భీమన్న గంగవ్వలు కూలి పనులకు వెళ్లాల్సివచ్చింది. పెద్ద పెద్ద బరువు పనులు భీమన్న అవలీలగా చేసేవాడు. కూలి అందరిలాగే ఇచ్చేవారు. ఒకసారి బరువైన బండ కాలుమీద పడి వేళ్లు నలిగిపోయాయి. సరిగ్గా నడవరాకుండ అయింది. అప్పుడు కుంటి భీమన్న అని పిలవడం ప్రారంభించారు. భీమన్నను ఎవరూ పనికి పిలిచేవారు కాదు. గంగవ్వ పనికిపోయి ఇంత తెచ్చి తనకింత పిల్లలకింత పెట్టేది. భీమన్న పని లేనప్పుడు పిల్లలను ఆడించేది. అలా భీమన్న క్రమంగా ఇంటికి పరిమితమయ్యాడు. ఒక తెలిసినాయన ఒక బిల్డింగ్‌ పనికాడ వాచ్‌మెన్‌గా ఉండుమని కోరాడు. సరేనని గంగవ్వను పిల్లలను తీసుకొని బయలుదేరాడు. ఆ బిల్డింగు తనకన్నా వెనకవచ్చి తమ సంస్థలో పనిచేసి పెద్ద నాయకుడిగా పేరుపొందిన అతనిదని భీమన్నకు తెలిసింది. తన బతుకు ఇలా ఎందుకైంది? అతని బతుకు ఇలా ఎందుకు ఎదిగింది? అని ఆలోచించాడు. అప్పటికి జీవితం చాలా గడిచిపోయింది. ఏం చేయడానికి లేదు. వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉండిపోయాడు భీమన్న. వాచ్‌మెన్‌ భీమన్నగా పిలిచారు. గంగవ్వ పిల్లలను సర్కారు బడిలో వేసింది. ఇలా ఎంతో పరాక్రమం గల భీమన్న పాముల భీమన్నగా... వంటల భీమన్నగా, కుంటి భీమన్నగా... చివరకు వాచ్‌మెన్‌ భీమన్నగా మారిపోయాడు. అన్ని పనులు రావడంవల్ల ప్రతిదీ ఛాలెంజ్‌గా చేసి చూపిస్తానని చూపడంవల్ల చివరకు అవే అతని పనులయ్యాయి. అన్ని పనులు రావడం అవసరమే. ''అన్ని పనులు చేసేవాడు అందరికీ లోకువ. ఎన్ని పనులు వచ్చినా అన్ని పనులు చేయకూడదు. ఎంత అవసరమైనా కొన్ని పనులు చేయకూడదు''. అని గంగవ్వ భీమన్నకు గీతోపదేశం చేసింది. సంస్థ నుంచి బయటికి వచ్చాక భీమన్నకు నాయకుడు అనే పేరు దక్కలేదు. మమ్ములను సంస్థ వాడుకొని వదిలేసిందని వాపోయాడు భీమన్న. దాంతో ఏదో ఇంత వంటలు చేసేవాడు, ఊడ్చేవాడు అని... సంస్థ నాయకులు ప్రచారం చేసారు. అన్ని పనులు సమానమే. వాటి విలువ సమానమే. అయినప్పటికీ, కొన్ని పనులే నాయకులుగా ఎదగడానికి పనికివస్తాయి. సంస్థలో ఏం పని చేసావు అంటే... కార్యకర్తల్ని, యువ నాయకత్వాన్ని తయారుచేసాను అనే వారికి ఎక్కువ గౌరవం. వంట వండేవాళ్లకి తక్కువ గౌరవం. భీమన్న నాయకత్వం తయారుచేసే పనిలో ఉండివుంటే సంస్థ బయటికి వచ్చాక తిరిగి యువకుల నుండి కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తూ ఎదిగించేవాడు. తద్వారా తాను నాయకుడుగా మరింత ఎదిగి వుండేవాడు. కాంగ్రెస్‌ మొదలుకొని కమ్యూనిస్ట్‌ నక్సలైట్‌ పార్టీలదాకా అనేక సంస్థల్లో, పార్టీల్లో పేదలకు, చిన్న చిన్న పనులు, విలువలేని పనులు, గౌరవంలేని పనులు అప్పగించాయి. కొందరే నాయకులుగా ఎదుగుతూ... తమలాంటి వారినే నాయకులుగా ఎదిగించారు. కొన్నాళ్లకు ఆ ఇల్లు కట్టుకున్నాయన దాన్ని పార్టీ కోసం సంస్థ కోసం ఉచితంగా ఇచ్చేశాడు. అతను ఎంతో త్యాగం చేసాడని వాళ్లు ప్రశంసించారు. భీమన్న త్యాగం లెక్కలోకి రాలేదు. అందువల్ల త్యాగాల్లో కూడా తరతమ భేదాలున్నాయి. గొప్ప త్యాగాలు చేయడానికి గొప్పగా ఎదగాల్సి వుంటుంది. గొప్పగా ''సంపాదించాల్సి'' వుంటుంది. అప్పుడే గొప్ప నాయకులుగా గొప్ప త్యాగశీలురుగా ఎదగడం సాధ్యపడుతుంది. అనుకున్నాడు భీమన్న. పట్టణంలో చిన్న హోటల్‌ ప్రారంభించాడు భీమన్న. గంగవ్వే హోటల్‌ నడిపించేది. పిల్లలు బడికి పోయి వచ్చి హోటల్‌ పనిలో సాయం చేసేవారు. అలా అతన్ని తెలిసినవారు భలే భీమన్నను... పాపం భీమన్న అని జాలిపడుతుంటారు. అలా కొన్నాళ్ళకి కుంటి భీమన్న అనే పేరు పోయి... హోటల్‌ భీమన్నగా పేరు పడిపోయింది. అయితే హోటల్‌కు 'గంగవ్వ హోటల్‌' అనే పేరు స్థిరపడింది. 'వ్యక్తిత్వ వికాసం - సామాజిక నాయకత్వం' గ్రంథం నుండి 2006.