Friday, October 7, 2016

వయసు పిలుపు ''నిన్ను ప్రేమించవచ్చా?'' ఎవరో తనవైపే అడుగులు వేసి సమీపంగా వచ్చారు. హారిక మరోసారి సన్నగా నవ్వుతూ చిలిపిగా చూస్తూ అదే ప్రశ్న అడిగింది. అశోక్‌ అదేదో తనని కాదు అనుకున్నాడు. ఆమె తన పక్కనే వచ్చి కూర్చుంది. మళ్లీ తన కళ్లల్లోకి చూస్తూ అదే ప్రశ్న. ఆమెకేసి చూశాడు అశోక్‌. ఏదో చెప్పరాని అనుభూతి. చల్లని సాయంత్రం. పచ్చని లాన్‌. నిటారైన చెట్లు. లాండ్‌స్కేప్‌ గార్డెన్‌ చల్లగా, హాయిగా వుంది. ఆర్ట్స్‌ కాలేజి భవనం నీరెండలో అద్భుతమైన చారిత్రక కట్టడంలా బంగారం పూత పూసినట్టు మెరుస్తోంది. పడమటి దిక్కున ఎత్తుగడ్డ మీద కట్టిన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ భవనం విజ్ఞాన శిఖరంలా నిటారుగా నిలిచి రా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది. అశోక్‌ ఆమెకేసి చూశాడు. చుట్టూరా చెట్ల మధ్య వెలసిన వనదేవతలా మెరుస్తోంది. అకస్మాత్తుగా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి. శరీరంలో ఏదో విద్యుత్తు షాక్‌ కొట్టినట్టయింది. అశోక్‌ తల వంచుకున్నాడు. నేలకేసి చూస్తూ వుండిపోయాడు. హారిక కాస్త దూరం జరిగింది. ''నా పేరు హారిక. నువ్వు నాకు తెలుసు. బహుశా నన్ను కూడా చూసే వుంటావు. ఎక్కడో చెప్పు.'' అంటూ చిలిపిగా నవ్వింది హారిక. అశోక్‌ ఆమెకేసి మరోసారి ఆసక్తిగా చూశాడు. పరిచయమైన ముఖమే. చాలాసార్లు చూసినట్టే వుంది. ఎక్కడ చూశాననుకుంటూ గుర్తు చేసుకున్నాడు. లీలగా గుర్తుకొచ్చింది. ఆమె, తాను చాలాసార్లు మీటింగ్‌ల్లో, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. ఆమె ఒకటి రెండుసార్లు నినాదాలు కూడా ఇచ్చినట్టుంది. చిన్న చిన్న ప్రసంగాలు కూడా చేసినట్టు గుర్తు. ఒకటొకటిగా గుర్తుకొచ్చాయి... ... ఓహో! ఈమె పేరు హారికా! తాను చాలాసార్లు ఈమె పేరు తెలుసుకోవాలనుకున్నాడు. ఏం చదువుతుందో అడగాలనుకున్నాడు. అడగలేకపోయాడు. హారిక ఇలా ప్రత్యక్షం కావడం విచిత్రంగా వుంది. ఈ డ్రెస్సు ప్రత్యేకంగా పెళ్లి చూపులకు తయారై వచ్చినట్టుగా వుంది. ఊరేగింపుల్లో కనపడే హారిక వేరు. ఆవేశంతో, ఉద్రేకంతో నినాదాలిస్తూ పిడికిలి బిగించిన ఆ రూపం విగ్రహ స్వరూపం వేరు. ఎప్పుడు చూసినా ప్యాంటు, షర్టుతో, పంజాబీ డ్రస్సుతో హీరోయిక్‌గా కనిపించే హారికేనా ఈమె! పోల్చుకోడానికి వీల్లేనంత సుకుమారంగా, అందంగా తయారై వచ్చినట్టుందే హారిక. ఆడవాళ్లు చక్కగా తయారైతే ఎంత అందంగా వుంటారో! అశోక్‌ మనసులోని నవ్వు పెదవులపైకి, చెంపలపైకి పిల్ల గాలిలా తారాడింది. ''ఈ డ్రెస్సులో ఎంత అందంగా వుంటావో'' ''హమ్మయ్య ఇప్పటికి నన్ను గుర్తు పట్టావన్నమాట. అయితే నేను ప్యాంటు, షర్టులో అందంగా వుండననా నీ ఉద్దేశ్యం?'' సూటిగా ప్రశ్నించింది హారిక. ''సారీ! నా ఉద్దేశం అది కాదు. ఆ డ్రెస్సులో ఇంకా అందంగా వుంటావు. కానీ ఆ వ్యక్తిత్వం, ఆ స్టయిల్‌ వేరు... ఈ స్టయిల్‌ వేరు...'' ''సరే.. ఇప్పుడు మీలాంటి మగవాళ్లు మెచ్చే స్టయిల్‌కు వచ్చాను కదా! ఇప్పుడైనా సూటిగా చెప్పు... నిన్ను ప్రేమించవచ్చా?'' అంటూ సుతారంగా నవ్వింది హారిక. ''అదేంటి? ఎవరైనా అడిగి ప్రేమిస్తారా? ఇదేదో సినిమాలో డైలాగులా వుంది. అసలా ప్రశ్న ఏంది? మనమెప్పుడు కలుసుకున్నాం? మన మధ్య పరిచయం లేదు. స్నేహం లేదు. డైరెక్ట్‌గా నిన్ను ప్రేమించవచ్చా అని అడిగితే ఎట్లా?'' అంటూ నవ్వాడు అశోక్‌. ''అదికాదు మహానుభావా! నువ్వేదో దీర్ఘాలోచనలో వున్నావు. నిన్ను డిస్ట్రబ్‌ చేయదల్చుకున్నాను. ఎలా పలకరించాలో తోచలేదు. ఏ వయసుకు ఆ ముచ్చట. మనదిప్పుడు ప్రేమించుకునే వయస్సు. ఈ వయసుకు అది తప్ప వేరే విషయాలు అంత ఆకర్షణీయంగా వుంటాయా? అందుకని మూడు రోజుల నుంచి ఆలోచించి ఈ డైలాగ్‌ను కాయిన్‌ చేసి నువ్వన్నట్టు నాటకంలో రిహార్సల్‌ లాగా మననం చేసుకున్నాను. నువ్విచ్చే జవాబులు ఎలా వుంటాయో ఊహించుకుంటూ వాటికి నేనెలా స్పందించాలో కూడా మనసులో రెడీ చేసుకున్నాను.'' ''అయితే నువూహించిన జవాబులే చెప్పానా?'' నవ్వుతూ అడిగాడు అశోక్‌. ''అలా ఏం జరగలేదు. నువ్వు భగ్న ప్రేమికుడిలాగా, దేవదాసులా రోజూ కూర్చుంటే నిన్ను చూసి నీ మూడ్‌ నుండి బయటకు తీసుకు రావాలనిపించింది. కానీ నీ మూడేంటో నాకు తెలియకపోయె. అందుకని నేను ఊహించిన డైలాగులేవీ నీ నోటి నుంచి రాలేదు.'' ఎవరో చెట్టు నీడన సమీపంలో వచ్చి కూర్చున్నారు. తమ మాటలు వాళ్లకు వినపడుతున్నాయోమోనని గొంతు తగ్గించి అంది హారిక. ''నువ్వు దయచేసి నన్ను డిస్ట్రబ్‌ చేయకు. ఎవరు నువ్వు? అని అడుగుతావనుకున్నాను. కానీ మేనకను చూసి విశ్వామిత్రుడు తపోభంగమై తపస్సు వదిలేసి మేనక ప్రేమలో పడ్డట్టుగా నువ్వు వెంటనే స్పందించావు. థాంక్యూ.'' ''అయితే ఇదంతా నాటకమేనా? నిజంగా అడగలేదా?'' అశోక్‌ ఆశ్చర్యపోతూ కాస్త దిగాలుగా అడిగినట్టనిపించింది హారికకు. ''అశోక్‌! నిన్ను నిజంగానే అడిగాను. నిన్ను నిజంగానే ప్రేమించాలని అన్పిస్తున్నది. కానీ నీ పర్మిషన్‌ లేకుండా ప్రేమిస్తే అది ఏక పక్ష ప్రేమ అవుతుంది కదా అని అన్పించింది. ఏకపక్ష ప్రేమ వేస్ట్‌. జీవితం పట్ల అవగాహన పెరుగుతున్నది. ఉద్యమాల్లో పని చేస్తున్నాం. ఇంకా మొహమాటాలు దేనికి? ప్రేమ కూడా ఒక సదవగాహన కలిగిన వ్యవహారమే. మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవడానికి సంబంధించిన సీరియస్‌ నిర్ణయం కూడా. అందువల్ల లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనే దానిపట్ల నాకు నమ్మకం లేదు. కలిసి పని చేసే క్రమంలో కలిసి మాట్లాడుకునే క్రమంలో పెరిగే అవగాహన, పరిచయం, స్నేహం నుండి క్రమంగా ఇష్టం పెరగవచ్చు. ఇష్టం క్రమంగా ప్రేమగా మారవచ్చు. ఇదే నిజమైన వ్యక్తిత్వం గల ప్రేమనుకుంటాను. నువ్వేమంటావ్‌.'' ఏదో ప్రేమ, దోమ అనే మాటలు విన్పించి చెట్ల కింద మాట్లాడుకుంటున్న వాళ్లు కాస్త తలతిప్పి ఇటుకేసి చూసినట్టనిపించి హారిక సిగ్గుపడిపోయింది. ''హాయ్‌ హారికా!'' అంటూ సౌమ్య హారికకేసి చెయ్యూపుతూ దగ్గరకు వచ్చింది. ''నీ డైలాగ్‌ బాగుందే. మళ్లొకసారి చెప్పే. ఆధునిక ప్రేమకు అద్భుతమైన నిర్వచనమిచ్చినవే.'' అంటూ సౌమ్య అభినందిస్తూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది. హారిక కాస్త బిత్తరపోయినట్టు నటించింది. అశోక్‌ ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూశాడు. చూపు మరల్చి ఎత్తయిన లైబ్రరీ బిల్డింగ్‌ శిఖరం కేసి చూపు సారించాడు. ఆర్ట్స్‌ కాలేజీ బిల్డింగ్‌ తనను కొండంత నవ్వుతో వెక్కిరిస్తున్నట్టన్పించింది. వాళ్లిద్దరూ ముందే అనుకొని ఇలా తనను ఆటపట్టిస్తున్నారా అని సందేహం కలిగింది. ముఖం ముడుచుకుపోయింది. నిజంగానే ప్లాన్‌ ప్రకారం అడిగినట్టుగానే సౌమ్య అశోక్‌కేసి చూస్తూ అడిగింది. ''అశోక్‌! హారిక నిన్ను ప్రేమిద్దామనుకుంటోంది. నీ అభిప్రాయం ఇంకా చెప్పినట్టు లేవు. ఏమంటవే హారికా?'' ''ప్రేమించాలని లేకపోతే ఎందుడుగుతనే? కానీ ఈ ప్రవరాఖ్యుడు, శ్రీరామచంద్రుడు ఆ మాట తప్ప అన్నీ మాట్లాడుతున్నడే'' ''అంటే ప్రేమించవచ్చు అని చెప్పలేదా?'' అంటూ చిలిపిగా అశోక్‌ కేసి చూసింది సౌమ్య ఇప్పటికైనా జవాబు చెప్పు అన్నట్టుగా. ''మీరిద్దరు ఇట్లా అడుగుడు ఏం మంచిగలేదు. ఎవరైనా అడిగి ప్రేమిస్తరా? ప్రేమించడానికి పర్మిషన్‌ ఇచ్చుడంటే ముందు నేను ప్రేమిస్తున్నానని చెప్పడమే కదా!'' అంటూ అశోక్‌ తన సంకోచాన్ని బయటపెట్టాడు. ''అదీ అసలు విషయం. సరిగ్గా దారిలోకి వచ్చావు. నేను అడుగుతున్నది కూడా అదే. నువ్వు నన్ను ప్రేమిచదగిందే అనుకుంటే ఆ అభిప్రాయం నాకు చెబితే నేను నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాను.'' అంటూ స్నేహపూరితంగా నవ్వుతూ అశోక్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది హారిక. చల్లగా హారిక చెయ్యి తాకి ఏదోలా అయ్యింది అశోక్‌కి. ''నేను పేదింటి నుంచి వచ్చిన. మా అమ్మానాన్నలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నరు.'' నేలకేసి చూస్తూ అన్నాడు అశోక్‌. ''అంటే మాది రిచ్‌ఫ్యామిలీ అని మీకెవరు చెప్పారు? మీ అమ్మనాన్నలేమో నీ మీద ఆశలు పెట్టుకుంటే... మా అమ్మానాన్నలు నన్ను గాలికొదిలేస్తరనా నీ ఉద్దేశ్యం? మాది రిచ్‌ ఫ్యామిలీ అయితే ఈ యూనివర్సిటీ క్యాంపస్‌లో, హాస్టల్‌లో ఎందుకుంటాను. ఎక్కడో బీటెకో, మెడిసినో చదువుకునే దాన్ని.'' నిష్టూరంగా అంది హారిక. ''ఏ కాస్త డబ్బున్న వాళ్లయినా సాఫ్ట్‌వేర్‌ సైడ్‌కో, మెడికో సైడుకో వెళ్లిపోతున్నారు. మిగిలినదంతా మనలాంటి వాళ్లే కదా!'' అంటూ నవ్వింది సౌమ్య. ''మొత్తానికి ఇన్నాళ్లకు ఉస్మానియా యూనివర్సిటీ మనలాంటి పేదోళ్ల నాయకత్వంలోకి వచ్చింది.'' అంటూ హారిక కాసేపు అవే విషయాలు చర్చించింది. సౌమ్య అసలు విషయం పక్కదారి పడుతోందని గమనించింది. ''అది సరే గానీ అశోక్‌! ఈ కాలంలో ఇలా అడిగి ప్రేమించడమే కరెక్ట్‌ అనేది నా అభిప్రాయం కూడా'' అంటూ సౌమ్య అశోక్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది. ముగ్గురూ కాసేపు సన్నగా నవ్వుకున్నారు. ''హారికా! అశోక్‌కి చాలా సిగ్గు. వెంటనే అడగడం బాగుండదు. కొద్ది రోజులు ఆలోచించుకోనీ. నిన్ను ప్రేమించాలనుకుంటే తనను ప్రేమించవచ్చని ఆలోచించుకొని చెపుతాడు. ఏమంటావ్‌ అశోక్‌'' అంటూ సౌమ్య మధ్యవర్తిత్వం చేసింది. అవునన్నట్టు తలూపాడు అశోక్‌. ''సరే, వారం రోజులు టైమిస్తున్నాను. ఆలోచించుకో. అప్పుడే చెప్పు. నిన్ను ప్రేమించవచ్చని. సౌమ్యకు చెప్పినా ఫర్వాలేదు. సౌమ్యను ప్రేమించినా సంతోషిస్తా. ఏమంటవే?'' అంటూ సౌమ్యకేసి నవ్వుతూ చూసింది హారిక. ''పిల్లవాడు మంచివాడు. చక్కగా చదువుకుంటున్నాడు. తొందర్లోనే ఉద్యోగం సంపాదించుకుంటాడు. వినయ, విధేయతలు బాగున్నాయి. బాడీ లాంగ్వేజ్‌ కూడా ఆడపిల్లల్లాగా వినయంగా బాగుంది. అందుకని నన్ను ప్రేమించవచ్చు. అని నీతో అన్నా, నాతో అన్నా, ఎవరితో అన్నా సంతోషమే. కనీసం తనకు తాను ప్రేమించలేకపోయినా, ప్రేమించాలనుకునే వాళ్లకు ప్రేమించవచ్చు అని చెప్పడం కూడా రాకపోతే వాళ్లేం మగవాళ్లే'' అంటూ సౌమ్య నవ్వుతూనే అశోక్‌కు చురక అంటించింది. అశోక్‌కు వెన్నుపూసలో ఏదో జలజలా విద్యుత్తు పాకినట్టయింది. నిజమే! ప్రేమిస్తున్నానని వెంటపడాల్సింది మగవాళ్లే అనుకుంటారు ఆడవాళ్లు. అయితే తనను ఇద్దరు కలిసి ఆటపటిస్తున్నారని అనిపించింది. ఆ భావం గమనించినట్టుగా నవ్వుతూ అంది హారిక. ''నిజం అశోక్‌. నేను నిజంగానే నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను. కానీ మూడీగా వుంటున్నావు. నీ మనసులో ఇంకెవరైనా ప్రేయసి లేదా ఊహా ప్రేయసి కదలాడుతుందేమో! నాకేం తెలుసు? అందుకని డైరెక్ట్‌గా అడగడమే మంచిదని అడుగుతున్నాను తప్ప నిన్ను ఆటపట్టించడం కోసం కాదు. మనకు టీనేజ్‌ దాటిపోయింది. ప్రేమించుకునే వయస్సు వచ్చేసి చాలాకాలం అయ్యింది. ఎన్నో వసంతాలు గడిచిపోయాయి. చదువు పేరిట, ఉద్యమాల పేరిట, ఉద్యోగాల పేరిట, కులాల పేరిట అమ్మానాన్నలు ఒప్పుకుంటారో లేదో అనే పేరిట మనం ప్రేమించుకోవడం పట్ల సంకోచంగా వ్యహరిస్తున్నాం. అంతే కదనే సౌమ్యా!'' అంటూ సౌమ్యకేసి చూసింది. ''యా! కరెక్ట్‌. ఈ కాలంలో కట్నాలు, కులాలు కూడా ప్రేమలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. కులం కూడా తెలిసిన తర్వాతే ప్రేమించుకుంటున్నారనేది కూడా వాస్తవం. ఎందుకొచ్చిన గొడవ అని అన్ని విషయాలు ముందే తెలుసుకొని ప్రేమించాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ సమస్య ఏ దేశంలో లేదు. యూరోప్‌లో గానీ, జపాన్‌లోగానీ, అమెరికాలోగానీ, రష్యాలోగానీ, చైనాలోగానీ హాయిగా ప్రేమ వ్యక్తం చేసుకుంటారు. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇద్దరూ ప్రేమించు కోవాలనుకుంటేనే ప్రేమించుకుంటారు. లేదా స్నేహాన్ని కొనసాగిస్తూ ప్రేమ విషయం వదిలేస్తారు. అలా డేటింగ్‌లతో, మీటింగ్‌లతో పరస్పరం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటారు. అక్కడ తల్లిదండ్రులు పెళ్లి చేయరు. ఎవరికి వారే సంబంధాలు వెతుక్కోవాలి. ప్రేమించుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. ఫలానా వారిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటామని చెబితే తల్లిదండ్రులు, బంధుమిత్రులు తమ పిల్లలను చాలా వినయం, గౌరవం గల పిల్లలు అని ఆశీర్వదిస్తారు. పెళ్లి చేస్తారు. చాలామంది తల్లిదండ్రులుక్కూడా చెప్పకుండానే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత తీరిగ్గా తల్లిదండ్రులకు చెబుతుంటారు. కట్న, కానుకల ప్రసక్తి లేదు. మ్యారేజ్‌బ్యూరోల్లో వెతుకులాడుకోవడం అనే దుస్థితి లేదు. హాయిగా అన్ని విషయాలు చక్కగా కలిసి మాట్లాడుకొని సెటిల్‌ చేసుకుంటారు.'' అంటూ సౌమ్య చిన్న ఉపన్యాసం ఇచ్చింది. ''నీ ఉపన్యాసం మస్తున్నదే. నేను మొదట్నుంచి చెప్తూనే వున్నా. నువ్వు మంచి వక్తవు అవుతావని, మంచి లెక్చరర్‌ అవుతావని.'' అంటూ కితాబిచ్చింది హారిక. ''అంతేగానీ మంచి లీడర్‌గా ఎదగలేనంటావ్‌. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పనికిరానంటావ్‌. అంతేనా?'' అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో ప్రశ్నించింది సౌమ్య. ''నీకు టిక్కెట్‌ ఎవ్వరిస్తారే? తెలివి కలోళ్లను చూస్తే ఎవరికైనా నన్ను మించిపోతారని భయం. అన్నీ తెలిసి కూడా ఏం తెలవనట్టు వినయంగా, అమాయకురాల్లాగా వుండడం నేర్చుకుంటేనే నీకు టిక్కెట్టిస్తారు. అప్పటిదాకా నువ్వు ఉద్యమాలకు లీడరవవుతావుగానీ రాజకీయంగా నాయకురాలిగా ఎదగడం, ఇతరులు ప్రమోట్‌ చేయడం కష్టమేనే!'' అంటూ హారిక తన అభిప్రాయం విప్పి చెప్పింది. ''అయితే మీరిద్దరూ రాజకీయ జీవులన్నమాట. ఉద్యమాల కోసం త్యాగం చేయడం కాకుండా ఉద్యమాల ద్వారా నాయకులుగా ఎదగాలనుకుంటున్న సరుకన్నమాట.'' అంటూ అశోక్‌ వారిద్దరినీ తక్కువ చేసి మాట్లాడాడు. ఒక్కసారిగా ఇద్దరూ విరుచుకుపడ్డారు. మన త్యాగాలను, మన పోరాటాలను ఇతరులు నాయకులుగా గెలవడానికి కాదు. మనమే రాజకీయ నాయకులుగా కూడా ఎదగాలి అంటూ సుడిగాలిలా వాదనకు దిగారు. ఆ వాదనకు మరికొందరు అక్కడికి వచ్చి చేరారు. హారిక, సౌమ్య అన్నది చాలా కరెక్ట్‌. పోరాటాలు మనవి, ఉద్యమాలు మనవి, నాయకత్వం మనది. రేపు రాజకీయాల్లో వేరే వాళ్లు నాయకులుగా గెలవాలా? మనమే ఎందుకు నాయకులుగా గెలవకూడదు.? 1969లో జై తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఎవరు ఉద్యమం చేశారో ఆ ఉద్యమం నుంచే నాయకులు ఎదిగారు. వాళ్లే రాజకీయ నాయకులయ్యారు. ఎమ్మెల్యేలయ్యారు. మంత్రులయ్యారు. ఎంపీలయ్యారు. అనేక రంగాల్లో ఇప్పుడున్న నాయకత్వమంతా ఆనాడు జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్లే. ఇప్పుడు ఆ క్రమం ఎందుకు సాగడం లేదు. ప్రతిసారీ ఇంకెవర్నో ఎన్నుకునే దుస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? ఈ తప్పుడు విధానం మారాలి. విద్యార్థులు, యువకులే రాజకీయ నాయకులుగా కూడా అన్ని రంగాల్లో ఎదగాలి. మనకేం తక్కువని? డబ్బులొక్కటే తక్కువ. వాళ్లు మాత్రం డబ్బులు ఇళ్లు అమ్మి పెడుతున్నారా? ఎవర్నో ఒకర్ని అడిగి సేకరించే విరాళాలే కదా? ఆ పని మనం చేయలేమా? ఎందుకు మనం నాయకులుగా ఎదగకూడదు?'' అంటూ చర్చ సాగుతూనే వుంది. చీకటి పడింది. హైమాక్స్‌ లైట్లు వెలిగాయి. గడ్డి దోమలు చుట్టూ ముసురుకుంటున్నా ఎవరూ గమనించడం లేదు. చర్చ వేడివేడిగా సాగి చివరకు మెస్‌లు మూసేస్తారని అంటూ మెల్లిగా లేచారు. పరస్పరం పరిచయాలు చేసుకొని సెలవు తీసుకున్నారు. మెస్‌లో భోంచేసి వచ్చాక రాత్రంతా అశోక్‌కు అదే డైలాగ్‌ పదేపదే విన్పించింది. 'నిన్ను ప్రేమించవచ్చా' అని హారిక కళ్లల్లో కళ్లు పెట్టి చేతిలో చేయి కలిపి నొక్కుతూ అడిగిన ఆత్మీయ స్పర్శ ఎంతో హాయిగా, తియ్యగా వుంది. గుర్తు చేసుకున్న కొద్దీ ఆ హాయి రెట్టింపవుతూ వస్తున్నది. ఎప్పుడో రాత్రికి నిద్రపోయాడు. హారిక, సౌమ్య లేడీస్‌ హాస్టల్‌లో ఎవరి రూములో వారు పడుకున్నారు. ఎవరికి వారు ఆలోచిస్తున్నారు. అర్ధరాత్రి దాకా నిద్రపోలేదు. అడిగేటప్పుడు చాలా ఈజీ అన్పించింది. అడిగింతర్వాత ఏదో బరువన్పిస్తోంది. అశోక్‌ జవాబు నెగెటివ్‌గా వస్తే ఎలా? ఆ అవమానం తట్టుకోవడం సాధ్యమా? ఎందుకు అలా అన్నాం? ఈ మధ్య అశోక్‌ ఒంటరిగా, మూడీగా వుంటున్నాడు. ఇలాంటి వారు ఆత్మహత్యకు పాల్పడతారేమోనని భయం. ఆత్మహత్యలు ఆపాలి. తనను ప్రేమించే వారు ఒకరున్నారని అనుకుంటే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు అని లక్ష్మీప్రియ పదేపదే వాదించింది. అది అలా ప్రేమలో పడ్డతర్వాతే ఆత్మహత్యా ప్రయత్నం మానుకుందట. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయంచుకున్నారని దాని బడాయి. అది నిజమా కాదా అని తెలుసుకోవాలని ఈ ప్రయోగం. ఇది ఎవరికీ తెలియదు. ఏదో చేయబోయి మరొక దాంట్లో ఇరుక్కున్నామా అని మొదటిసారిగా ఫీలయ్యారు. అయినా అశోక్‌ను ప్రేమించడానికి అతనిలో ఏం తక్కువయిందని! అలా తాము చేసింది తప్పు కాదని తమకు తాము సర్దిచెప్పుకున్నారు. ఉదయం స్నానం ముగించుకొని టిఫిన్‌ సెక్షన్‌కు మెస్‌లోకి వచ్చి హారిక సౌమ్య కోసం చూసింది. సౌమ్య కూడా హారిక కోసమే చూస్తున్నట్టుంది. హాయ్‌ అంటూ పరస్పరం పలకరించుకొని ఒక మూలకు వెళ్లారు. నిన్న మనం చేసింది సరైందేనా అని తర్కించుకున్నారు. ''చాలా కరెక్ట్‌ మనం ఏ తప్పు చేయలేదు. ప్రేమించ లేని వాళ్లు, ప్రేమించే అవకాశం లేని వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. తమను ప్రేమించే వారు కనీసం ఒకరున్నారని అనుకున్నప్పుడు ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఉత్సాహంగా వుంటారు. ఈ మాట తప్పయితే మన లక్ష్మణ్‌ ప్రొఫెసర్‌ను అడుగుదాం.'' అంటూ సౌమ్య హారికను సమర్థించింది. ''అదిగాదే! ఆ మాటకొస్తే ప్రేమించే వాళ్లు ప్రేమ విఫలమైతే కూడా ఆత్మహత్య చేసుకుంటారు. కాదంటావా?'' అంది హారిక. ''సరే! మధ్యాహ్నం సార్‌ను కలిసి డిస్కస్‌ చేద్దాం.'' అని చర్చను ముగించి సౌమ్య హారికను తీసుకొని టిఫిన్‌ సెక్షన్‌ కేసి నడిచింది. మధ్యాహ్నం ఆర్ట్స్‌ కాలేజీలో తమకు ఉద్యమంలో నిత్యం సలహాలిచ్చే లక్ష్మణ్‌ ప్రొఫెసర్‌ ఆఫీస్‌ గదికేసి నడిచారు. తమ భావాలను, జరిగిన విషయాన్ని వివరించారు. ''యూ ఆర్‌ టూ లేట్‌!'' అంటూ నవ్వి లక్ష్మణ్‌ తన అనుభవాలను కలబోసుకున్నారు. అప్పుడే ఆయన భార్య అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సృజన నవ్వుతూ లోపలికొచ్చి కూర్చుంది. హారిక, సౌమ్యలను సృజనకు పరిచయం చేశాడు లక్ష్మణ్‌. ''అవును. లక్ష్మణ్‌ అన్నట్టు మీరు చాలా లేట్‌. మేము ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాం. అప్పుడు ఇలాగే విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాం. కొన్ని వందల మంది విద్యార్థులు ఆ ఉద్యమంలో భాగంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా పెళ్లి కూడా అలానే జరిగింది. మీలాగే అప్పుడు కూడా నేనే చొరవ తీసుకున్నాను. ఈయన అప్పుడూ ఇప్పుడూ ఇంతే'' అంటూ నవ్వింది సృజన. ''హారికా! ఈమె అప్పర్‌ క్యాస్ట్‌. నేనేమో లోయర్‌ క్యాస్ట్‌. ఇంట్రావర్టిని. నేను ప్రేమించానని చెప్పడానికి ఎంతో భయం. ఆమెకేంటి? అప్పర్‌క్యాస్ట్‌ననే గర్వం. దాన్ని ఆత్మవిశ్వాసంగా భావించి చొరవ తీసుకుంది. అంతేగానీ ఆమె ముందే ప్రేమించిందని, నేను ప్రేమించలేదని కాదు.'' ''హారికా! పెళ్లయి ఇన్నేళ్లయినా మా పిల్లలు మీలాగా కాలేజీ చదువుతున్నా ఇంకా నన్ను అప్పర్‌ క్యాస్ట్‌ అహంకారని హేళన చేయడం మానలేదు చూడు. ఈ మగవాళ్లకు చెప్పిందల్లా చేయకపోతే వాళ్ల అహంకారం దెబ్బతిని దానికి కుల అహంకారమని పేరు పెట్టి తిడుతుంటారు. అంతేగానీ, ఫెమినిజం వచ్చింతర్వాత స్త్రీ పురుషులు సమానమని మేం భావిస్తూ సమానంగా పురుషులు కూడా పనిచేయాలని ప్రతిసారీ నేనే నీకు చాయ్‌ చేసి ఎందుకివ్వాలని, నువ్వెందుకు చేసివ్వవని అడిగితే నాలో కుల అహంకారం వుందనే పేరిట తన మగపెత్తనం సాగించుకుంటాడు. సందు దొరికితే చాలు నేను పుట్టిన కులాన్ని తిట్టడమే ఈయన పని.'' అంటూ నవ్వింది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సృజన. ''అసలు హారికా! వీళ్లు ఆ కాలంలో ఉద్యమాల్లోకి వచ్చి మాకన్నా ఎక్కువ ముందు ఉరికేవాళ్లు. అదంతా గొప్ప సాహసం అనుకున్నాం. కానీ కట్నం లేకుండా నచ్చినవాన్ని, మెచ్చిన వాన్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా ఆడవాళ్లు ఉద్యమాల్లోకి వస్తున్నారని అప్పుడు ఎవరో అనే దాకా తెలియదు.'' అంటూ నిజమా కాదా అన్నట్టు నవ్వుతూ సృజనచేసి చూశాడు లక్ష్మణ్‌ ప్రొఫెసర్‌. ''అలా భావించి ఉద్యమాల్లోకి రావడం ఏమైనా పొరపాటా? అదేమన్నా తప్పా? సమాజం పట్ల గొప్ప అవగాహనతో ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని ఉత్తేజంగా జీవితాలను అందుకు అంకితం చేయాలని ముందుకు వస్తున్న యువకులను చూస్తే ఎవరికి ప్రేమించాలనిపించదు?'' సృజన మాటకు మాట జవాబిచ్చింది. ''అంత కోపానికి రాకు. ఏదో జోక్‌గా అన్నాను. లైట్‌గా తీసుకో. నిజానికి రష్యా, చైనాలోగానీ, ఏ దేశంలోగానీ ఉద్యమాలు జరిగినప్పుడు వేలాది మంది కలిసి పనిచేసే క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చివరకు క్షణక్షణం అప్రమత్తంగా వుండే యుద్ధాల్లో కూడా ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే సహజ క్రమం కూడా. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంతకాలం నుంచి ఇప్పుడు ఈ కొత్త ఉద్యమం సాగుతున్నప్పటికీ సార్‌ మేం ఇష్టపడ్డాం. మా పెళ్లికి సహకరించండని అన్న వాళ్లు ఎవరు లేరు. మీరు తప్ప. అది కూడా ప్రేమించవచ్చా సార్‌ అని అడగడానికి? అసలు ఇంతకూ సమాజం ముందుకు పోతుందా... వెనక్కి వస్తుందా అర్థం కావడం లేదు. మేము మీరు పుట్టకముందు హాయిగా ప్రేమించుకున్నాం. ఉద్యమాలను నిర్మించినం. ఏదీ పరస్పర విరుద్ధం అనుకోలేదు. మీదంతా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టయింది. అయినా గుడ్డిలో మెల్ల. అయితే ఇంతకూ మీరు అశోక్‌ను నిజంగా ప్రేమించడానికి సిద్ధంగా వున్నారా?'' అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తూ వారి కళ్లల్లోకి సూటిగా చూశాడు లక్ష్మణ్‌ ప్రొఫెసర్‌. ''ఆడపిల్లలు ఇంతకన్నా స్పష్టంగా ఎలా చెపుతారు? మీరు భలే వున్నారు?'' అంటూ సృజన వారికి మద్దతు పలికింది. ''నిజం మేడం! నాకు అశోక్‌ను నిజంగానే ప్రేమించాలని వుంది. కానీ మా వూర్లో మేం పెరిగిన వాతావరణంలో మాకు ప్రేమించడం అనేది మా జీవితంలో భాగం కాలేదు. ఇంకా సమాజం ఎంతో మారితే తప్ప ప్రేమించడమనేది మన ప్రాంత జీవితంలో భాగం అయ్యేటట్టు లేదు. కులం, మతం, తల్లిదండ్రులు, కులం, అన్నలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ కలిపి చూసి పెళ్ళి చేసుకుంటున్న వ్యవస్థ ఇది. ప్రేమించాను అంటే బలహీనతగా తీసుకొని చిన్నచూపు చూసే పురుషాధిపత్య వ్యవస్థ ఇది. అందుకని నేను ప్రేమించాలని వున్నప్పటికీ ప్రేమించలేకపోతున్నాను. బాయ్స్‌ ఎవరన్నా మమ్మల్ని ప్రేమించానని వెంటపడితే నమ్మాలనిపించడం లేదు. ఇది ఒక సందిగ్ధ స్థితి సార్‌.'' అంటూ హారిక సృజన, లక్ష్మణ్‌ దంపతులతో మనసు విప్పి మాట్లాడింది. సౌమ్య కూడా ఇలాగే తన అనుభవాలను వివరించింది. ''అయితే ఇవన్నీ మేము మా కాలంలో ఎదుర్కోలేదా? అప్పుడేమైనా సమసమాజం వుండేదనుకుంటున్నారా? ఇంతకన్నా ఎంతో ఘోరంగా వుండేది వ్యవస్థ.ఇప్పుడు ఎంతో మారింది. ప్రేమించుకున్నాం అంటే తల్లిదండ్రులే కులాంతరమైనా ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ వచ్చాక ఒకరిదద్దరే సంతానం కావడంతో వారిని వదులుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మా అప్పుడైతే పెళ్ళయిన తర్వాత రెండేళ్ల దాకా అటు మా వాళ్లు ఇటు వీళ్ల వాళ్లు ఎవరూ సరిగా మాట్లాడలేదు. వాళ్లకు మనవడ్ని కని ఇచ్చినంక మాటలు కలిశాయి.'' అంటూ ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది సృజన. తన బెస్ట్‌ఫ్రెండ్‌ స్వర్ణలత ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలని సమసమాజం నిర్మించాలని, నూతన ప్రజాస్వామిక విప్లవం తీసుకురావాలని ఉద్యమంలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత మళ్లీ కలవలేదు. చివరకు ఆమె శవాన్ని కూడా తనకు చూడ్డం వీలుపడలేదు. స్వర్ణలతని చూడాలని తాను ఎన్నిసార్లు అనుకుందో! స్వర్ణలతలా తాను కూడా ఉద్యమంలోకి వెళ్లాలనుకొని ఎంత ఉత్సాహపడిందో. ఆనాటి యువతరం మహోన్నత లక్ష్యాలు, ఆవేశాలు, త్యాగాలు ఈనాడు ఏమైపోయాయి... ఆనాటి ఉద్యమ మిత్రులంతా ఎక్కడెక్కడో... చెల్లా చెదురైపోయారు. సృజన కళ్లల్లో కన్నీటి పొర. ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ సృజన ఆలోచనలను, ఉద్వేగాన్ని గమనించినట్టుగా అన్నాడు. ''సృజనా! కొన్ని విషయాల్లో సమాజం వెనక్కిపోతున్నట్టనిపిస్తుంది. త్యాగమే ఆనాటి వయసు పిలుపు. వ్యక్తిగత ఉజ్వల భవిష్యత్తు గురించి కాకుండా సామాజిక పరిణామంలో తమ వంతు కృషి కోసం త్యాగాలు చేయాలని ఎంతగానో ఉవ్విళ్లూరిన కాలం. నేడు మునుపు లేని ఆస్తి, అంతస్తుల గొడవ, కులాల గొడవ ఇప్పుడు బాగా పెరిగింది. కాదంటావా?'' అంటూ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ హారిక, సౌమ్యల కేసి తిరిగి ఇలా అన్నాడు. ''అయితే ఇది మీ ఇద్దరి సమస్య మాత్రమే కాదు. మీకే పరిమితం కాదు. మన ప్రాంతానికే పరిమితం కాదు. మన దేశంలో కోట్లాది మంది యువతరం ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీన్ని పరిష్కరించడం దానికదే విడిగా వున్న సమస్య కాదు. మొత్తం సమాజం, సంస్కృతి విలువలతో కుటుంబ వ్యవస్థతో, కుల వ్యవస్థతో ముడివడి వున్న అంశం యిది.'' అంటూ చాలాసేపు వివరించాడు. వారికి తమ ఇద్దరి నైతిక మద్దతు వుంటుందని, ముందుకు సాగమని మీరు చేసింది సరైందేనని అభయ హస్తం ఇచ్చారు. అశోక్‌ కూడా ఇలాంటి సందేహమే కలిగింది. అతడు మరో ఇద్దరు స్నేహితులను కలిసి ముచ్చటించాడు. వాళ్లిద్దరూ తమకు కూడా తోచక దయాసాగర్‌ ప్రొఫెసర్‌ను కలిశారు. అది తమ సమస్యగా కాకుండా ఏదో సిద్ధాంత చర్చ చేస్తున్నట్టుగా అడిగారు. అంతా విని దయాసాగర్‌ ప్రొఫెసర్‌ సానుభూతిగా చక్కగా వివరించాడు. ''వయస్సు పిలుస్తుంది ఎవరినైనా ప్రేమించాలని. సామాజిక ఉద్యమాలు ఉత్తేజ పరుస్తాయి. సమాజం కోసం... దేశం కోసం... ఎంతైనా త్యాగం చేయాలని. చివరకు ప్రాణం కూడా అందుకు అర్పించాలని...'' అంటూ మా క్లాస్‌మేట్‌ ఒకాయన అందరికీ కవితలాగా వినిపిస్తుండేవాడు. నిజంగానే ఆ మాట చాలామందిని ఇన్‌స్పయిర్‌ చేసింది. ఎంతోమంది ఉద్యమిస్తూనే ప్రేమించారు... పెళ్ళి చేసుకున్నారు... మాదీ ప్రేమ పెళ్ళే. వయసు పిలుపు రెండు రకాలు. ఒకటి ప్రేమ. రెండు త్యాగం. ఏ తరంలోనైనా నవ యవ్వన తరం తాను సమాజం కోసం త్యాగాలు చేయాలని ఉవ్విళ్లూరుతుంది. అలాంటి వాతావరణం లేనప్పుడు పరస్పరం ప్రేమించుకోవాలని వయసు పిలుస్తుంది... ... అయితే ఉద్యమాలు త్యాగంతో పాటు ప్రేమించుకోవడాన్ని కూడా సహజం చేస్తాయి. కానీ వర్తమానం దీనికి భిన్నంగా సాగుతున్నది. ఇదే ఇందులో వున్న విషాదం. ఉద్యమం సాధారణంగా ధైర్యాన్ని, సమిష్టి చైతన్యాన్ని పెంచుతుంది. అదే నిజమైన ఉద్యమం. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈ ఉద్యమంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఒక దశకు ఎదిగిన ఆవేశం, ఉద్రేకం, సమాజం కోసం, సామాజిక మార్పు కోసం ఏదో చేయాలని లక్ష్యం, త్యాగం చేయాలనే భావన మనిషిని నిలువెల్లా ఆవేశించినప్పుడు నాయకత్వం అందుకు సరైన కార్యక్రమం ఇవ్వలేకపోతే ఆ ఆవేశం, ఆ త్యాగం రివర్స్‌లో నిరాశలోకి ప్రవహిస్తుంది. ఈ దశలో ఉద్యమాన్ని ఆరిపోకుండా ముందుకు తీసుకెళ్లేందుకు తన ప్రాణత్యాగం ఉపయోగపడుతుందనే ఆలోచనలోకి మళ్లుతారు. ఇదంతా సామాజిక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశం. ఇది మాస్‌ హిస్టిరియా అని కొందరు శాడిస్టులు అంటున్నారు. వాళ్లు మూర్ఖులు. ఉద్యమ వ్యతిరేకులు. ప్రాణ త్యాగం చేసిన వాళ్లు పిరికివాళ్లు అనే వాళ్లకు బుద్ధి లేదు. వాళ్లే నిజంగా పిరికిపందలు. దమ్ముంటే వాళ్లు ఉద్యమం కోసం రొమ్ము విరిచి మిలిటెంట్‌ ఉద్యమాలు చేస్తారు తప్ప ఇతరుల ప్రాణత్యాగాలను తేలికగా మాట్లాడరు. మీరు మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అని అనేక విషయాలు విశ్లేషించి చెప్పాడు దయాసాగర్‌. హారిక అశోక్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అశోక్‌ హారిక నిర్ణయం కోసం, పలకరింపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు ముందు పలకరించాలో తేల్చుకోలేక రోజులు గడిచిపోయాయి. సౌమ్యకు కోపంగా వుంది. ''ఈసారి నేను మధ్యవర్తిగా రాను. చచ్చుదద్దమ్మల్లాగా, పిరికిపందల్లాగా ప్రేమను కూడా వ్యక్తం చేయలేని మీరేం మనుషులే!'' అంటూ అంతెత్తున ఎగిరింది సౌమ్య. ''మీ చావు మీరు చావండి. మీ ప్రేమను మీరు ఎలా వ్యక్తం చేసుకుంటారో మీ ఇష్టం. మళ్లొకసారి నన్నుఅడగవద్దు'' అంటూ టాటా, బైబై'' చెప్పేసి నవ్వుతూ వెళ్లిపోయింది సౌమ్య. అప్పటినుండి సౌమ్య హారికను తప్పించుకొని తిరుగుతోంది. ఆ రోజు ఆర్ట్స్‌ కాలేజీ ముందున్న చెట్ల కింద విద్యార్థులు గుంపులు గుంపులుగా ఏదో చర్చిస్తున్నారు. కొందరు లక్ష్మిప్రియ పెళ్లికి అందరం కలిసి వెళ్ళాలని, గ్రాండ్‌గా పెళ్లి జరపాలని ముచ్చటిస్తున్నట్టున్నారు. ఆర్ట్స్‌ కాలేజీ మెట్ల వద్ద టెంట్‌ కింద విద్యార్థుల రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. మరికొందరు పిడికిలెత్తి నినాదాలిస్తున్నారు. యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్‌ కాలేజీ వైపు వస్తూ చెట్ల కింద వున్న హారికను చూసి, కలిసి చాలా రోజులైందని సౌమ్య అటు వైపు నడిచింది. హారిక నిరాహారదీక్ష టెంట్‌ వైపు చూస్తోంది. హారిక చూస్తున్న వైపు సౌమ్య దృష్టి సారించింది. అశోక్‌ అక్కడ నినాదాలిస్తూ మందిలో కన్పించాడు. హారికను సమీపించింది సౌమ్య. ''హాయ్‌ హారికా! ఏమైందే నీ ప్రేమ. ఎంతకాలం ఈ ఎదురు చూపులు?'' అంటూ ప్రశ్నించింది. ''ఇవాళ నిరాహార దీక్ష శిబిరంలో దీక్ష విరమించాక మన దగ్గరికే వస్తాడు చూడు.'' అంటూ విశ్వాసంతో పలికింది హారిక. ''ఏమైనా మంత్రం వేసినవా? హిప్నాటిజం ప్రయోగించినవా? ఎట్లా ఖచ్చితంగా చెబుతున్నావ్‌?'' ''నాకు తెలుసు'' అంటూ బెట్టుపోయింది హారిక. సాయంసంధ్య ముసురుకుంటుంది. చెట్ల క్రింద చీకటి పరుచుకుంటోంది. చాలామంది చెట్ల కింద నుంచి వెళ్ళిపోతున్నారు. కొందరే మిగిలారు. హారిక, సౌమ్య నిరీక్షిస్తున్నారు. నిరాశతో వెళ్లిపోదామని చూస్తున్నారు. అనుకున్నట్టుగానే ''హాయ్‌ హారికా! నిన్ను ప్రేమించవచ్చా!'' అని అశోక్‌ నవ్వుతూ పలకరించాడు. ''ఈ రివర్స్‌ డైలాగ్‌ భలే మస్తుగుంది. కంగ్రాట్యులేషన్స్‌!'' అంటూ సౌమ్య అశోక్‌ను, హారికను విష్‌ చేసింది. ''అయితే సౌమ్యా! ఈ విషయం మేం చెప్పేదాకా ఎవరికీ చెప్పొద్దు. లక్ష్మిప్రియ పెళ్లిలో నువ్వే డిక్లేర్‌ చేయాలి.'' అంది హారిక. - వార్త దినపత్రిక, ఆదివారం సంచిక, 2011