Friday, April 10, 2015
ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కోసం... సాహిత్య సృజన
ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కోసం...
సాహిత్య సృజన
నిన్ను నువ్వు తెలుసుకో అనేది వేల ఏండ్ల నాటి తాత్విక ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రతితరం, ప్రతి మనిషి సమాధానాలు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటడు. నీ చరిత్ర నువ్వు రాసుకో అని మనం ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పినప్పటినుండి చెప్పుకుంట వస్తున్నం. అందుకని నా చరిత్ర నేను రాసుకుంటున్న. సామాజిక చరిత్రతో ముడిపడిన నా చరిత్రకు, అవగాహనకు పరిమితమై ఇది రాస్తున్న.
నా జీవితంలో 'అడవిలో వెన్నెల' కథల సంపుటిలోని కథలు, ఈ కథల కాలం చాలా ప్రాధాన్యత కలిగినది. ఉత్తర తెలంగాణా చరిత్రలో, సామాజిక పరిణామాల్లో కూడా ఈ కాలం చారిత్రక మలుపులకు సంబంధించిన కాలం. ఆ థలో నేను కథలు రాయడంతోపాటు ప్రజల జీవితాలు మెరుగుపడాలని, జీవన ప్రమాణాలు పెరగాలని కృషి చేయడం జరిగింది. అలా ఏ జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ పని చేసిన్నో, ఆ జీవితాల గురించి రాసినవే ఈ కథలు. నా 28వ ఏటనుండి 40 ఏళ్ళ వయస్సు మధ్య రాసిన కథలు ఇవి.
1977-1989 మధ్య రాసిన కథలివి
1977-1989 మధ్య చాలా కథలే రాసిన. కొన్ని రాత ప్రతులు పోయినయి. కొన్ని అచ్చయిన కథల పత్రికలు దొరకలేదు. రాత ప్రతులు పోవడానికి, అచ్చయిన పత్రికలు దొరకకపోవడానికి అప్పుడప్పుడు కొందరు ఇల్లు సోదా చేసి తీసుకుపోవడం, ఆ క్రమంలో చాలా రాత ప్రతులు కొందరు కాల్చివేయడం, పడేయడం జరిగిపోయింది. కుదురుగా ఇంటిపట్టున ఉండే అవకాశం ఉన్నవాల్లు వందల కథలు, నవలలు రాసిన్రు. సభలు, సమావేశాలు పేరిట, ఉద్యమంలో నిరంతరం పర్యటనలు, ప్రభుత్వం వెంటాడే నిర్బంధాలు కారణంగా, సామాజిక పరిణామాలను వేగవంతం చేయాలని ప్రజల కోసం పూర్తికాలం పనిచేస్తూ ఒకచోట స్థిరంగా భౌతికంగా గానీ, కుదురుగా గాని లేని ఈ థాబ్ది కాలంలో రాయగలిగినవాటిలో మిగిలినవి ఇంతే. కొన్ని కథలు, నవలలు ప్రచురించేవారు లేక తుదిరూపం సంతరించుకోలేక అలాగే ఉండిపోయాయి. కొన్ని ఇటీవల లభ్యమైనవి. వాటిని ఇపుడున్న ఓపికను బట్టి ఫెయిర్ కాపీ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అలా 1977-79 మధ్య రాసిన కొన్ని నవలలు, కథలు ఇంకా వెలువడాల్సినవి లేకపోలేదు.
1977-1984 మధ్య రాసిన 'ఎవరికి వారే', 'పాలమూరు లేబర్ తిరుగుబాటు', 'అసమర్ధుని జీవయాత్ర' మొదలైన కథలు ఇటీవల వెలువరించిన 'కాలం తెచ్చిన మార్పు' కథల సంపుటిలో చేర్చడం జరిగింది. అందువల్ల ఈ సంపుటిలో చేర్చడం లేదు. 'చంద్రం మామయ్య కథలు', 'రాజీ', 'విద్యార్ధుల గురించిన కథలు' మొదలైన కథలు అచ్చువేసిన పత్రికలు దొరికే అవకాశం లేదు. ఇలా కాలం పెట్టిన పరీక్షలో పోయినవి పోగా మిగిలినవి 'అడవిలో వెన్నెల' కథల సంపుటి చేర్చబడినవి.
1977-90 మధ్య రాసిన నా కథలను ఇలా వర్గీకరించవచ్చు
1. తొలి కథలు - ఉద్యమ ప్రారంభ థ కథలు
2. ఉద్యమ కథలు
3. 'కాలం' కథనాలు
4. ఉద్యమ మలిథ కథలు
5. విద్యార్థి యువజనుల కథలు
6. ఉద్యమంలో మహిళల గురించిన కథలు
7. దళాలు - దళాల నిర్మాణం, పని విధానం గురించిన కథలు.
ఇలా సామాజిక ఉద్యమాల థలు మలుపులు సాగినై. నేను రాయడం కూడా వెంటవెంట ఉద్యమాల క్రమంలోనే రాయడం జరిగింది. అలా ఏడు థలను, పరిణామాలను 'అడవిలో వెన్నెల' సంపుటిలో గమనించవచ్చు. 1970 నుండి 1978 దాకా సాగిన ఉద్యమ ప్రారంభ థల కథలను నేను రాయలె. ఉదాహరణకు దొరలను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం, దొరల పీడన అణచివేత ఎలా ఉండేదో నేను రాయలె. ఎందుకంటే నేను ఉద్యమ కథలు రాయడం మొదలుపెట్టేటప్పటికి అల్లం రాజయ్య, ముప్పాళ్ళ లక్ష్మణరావు మొదలైన వాల్లు ఆ తొలిథ కథలను రాసిన్రు. వాటిని అనేక సంపుటాల్లో, సంకలనాల్లో చూడవచ్చు.
ఈ కథలపై నందిగామ నిర్మలకుమారి ఎం.ఫిల్.
ఈ కథలు 1974 నుండి 1989 చివరి దాకా ఒక ప్రాంతపు సామాజిక పరిణామాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతయి. ఆ కాలంలో రాసిన ఈ కథలపై నందిగామ నిర్మల కుమారి 2010లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ఎం.ఫిల్ తీసుకున్నరు. సుప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య కథలకు, నవలలకు వరవరరావు ఒక్కొక్క సంపుటికి ఒక్కొక్క పుస్తకమంత విపులంగా రాసిన పీఠికల్లో ఉద్యమం గురించి చాలా వివరంగా రాసిండు. నా కథల పుస్తకానికి కూడా అట్ల మంచి ముందుమాట రాయిమని వి.వి.ని అడిగిన. ఇప్పటికే చాలా పుస్తకాలు ముందుమాట కోసం అచ్చుకాకుండ పెండింగ్లో వున్నయి. నీ పుస్తకానికి రాయాలంటే కనీసం ఏడాది తర్వాత రాస్త అన్నడు. అట్ల సమస్త కోణాలను చెప్పకపోతే, విశ్లేషించకపోతే అర్ధసత్యమే సత్యమై కూర్చుంటది. లెనిన్కూడా సమస్త పార్శ్వాల, కోణాల, సమస్త ఉద్యమాల, సమస్త ఆచరణల యొక్క ఒక ఉజ్జాయింపుగానే సమాజం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డడు. లెనిన్ ఫిలాసఫికల్ నోట్బుక్స్లో ఈ విషయంపై విస్తారంగా చర్చించిండు. ఇది బుద్ధుడు చెప్పిన ప్రతీత్య సముత్పాద అనే సూత్రీకరణే. అనేక కారణాలు కలిసి ఒక కార్యం సిద్ధిస్తుంది అని దీని అర్థం. కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో....! అన్నట్టుగా ప్రతిదానికీ అనేక కారణాలు, కోణాలు, ఆచరణలు, ఉద్యమాలు, దర్శనాలు ఉంటయి. ఈ పుస్తకమేమో తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో ప్రచురిస్తున్న. జనవరి 2015లో వాల్లకు కాపీలు ఇయ్యాలె అని చెప్పిన. అట్లయితే రాయలేను అన్నడు. దాంతో అల్లం రాజయ్య పుస్తకాలకు రాసిన ముందుమాటల్లో, ఇతర వ్యాసాల్లో వి.వి. చెప్పిన అంశాలు కాకుండా నేను మరికొన్ని అంశాలను, మరికొన్ని కోణాలను వివరించడానికి ఇక్కడ పరిమితం అవుత.
అంతకుముందు వరవరరావు చాలాసార్లు 'బి.ఎస్.! నేను రాయలేనివి, నువ్వు రాయగలిగేవి చాలా ఉన్నై. నేను సాంస్కృతిక సంస్థ నిర్మాణంలో ఉన్న గనుక అనేక విషయాలు చెప్పలేను. నువ్వు బయటపడ్డవు గనుక రాయచ్చు' అన్నడు. గద్దర్ కూడ ఇట్లనే అన్నా నువ్వు పార్టీలో చేసిన చర్చలను, ఇంకెన్నడు రికార్డు చేస్తవు అని చాలాసార్లు అడిగిండు. సుమారు ముప్ఫై ఏండ్ల తర్వాత విప్లవోద్యమం గురించి చెప్పాల్సినవి ఇంతదాక బయట చెప్పలేకపోయినవి ఇపుడు రాస్తున్న. వరవరరావే తాను ముందుమాట రాయక నాకీ అవకాశం ఇచ్చినట్టు లెక్క. నేను ఇవన్ని ఇంతదాక ఎందుకు రాయలేదంటే... సినిమా చూసినవాండ్లు సినిమా చూడనివాల్లతోటి సినిమా గురించి చర్చించినట్టు ఉంటదని రాయలే. ఉద్యమంలో పని చేయనివాల్లతోటి ఎందుకు చర్చించాలె అని రాయలే. ఇపుడు చరిత్ర మలుపు తిరిగింది. మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది. చరిత్రను మనకోణంలో రికార్డు చేసే, పునరధ్యయనం చేయడం అవసరం.
Subscribe to:
Posts (Atom)